నలందా విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం | Nalanda University to start classes | Sakshi
Sakshi News home page

నలందా విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం

Published Thu, Sep 4 2014 5:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

నలందా విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం

నలందా విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభం

క్రీడలు
 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ
 ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల టైటిల్‌ను చైనాకు చెందిన చెన్‌లాంగ్ గెలుచుకున్నాడు. ఆగస్టు 31న కోపెన్‌హెగెన్‌లో జరిగిన ఫైనల్లో మలేషియాకు చెందిన లీచోంగ్‌వీ నిచెన్‌లాంగ్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కరోలినా మారిన్ (స్పెయిన్) గెలుచుకుంది. ఫైన ల్లో జురుయ్ లీ (చైనా)ను ఓడించింది. స్పెయిన్ క్రీడాకారిణి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ గెలుచుకోవడం ఇదే తొలిసారి. భారత్‌కు చెందిన పి.వి. సింధు వరుసగా రెండో ఏడాదీ కాంస్యం నెగ్గింది. తద్వారా ఈ ఘనత సాధించిన భారత తొలి క్రీడాకారిణిగా నిలిచింది.
 
 యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకం
 చైనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో ఆగస్టు 26న అతుల్‌వర్మ భారత్‌కు రెండో పతకం అందించాడు. వ్యక్తిగత రికర్వ్ ఆర్చరీ ఈవెంట్‌లో అతుల్ కాంస్యం గెలుచుకున్నాడు.
 
 క్రీడా పురస్కారాల ప్రదానం

 జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 29న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ క్రీడా అవార్డులను ప్రదానం చేశారు. వివరాలు.. 15 మందికి 2014 అర్జున అవార్డులను అందజేశారు. ఇందులో రవిచంద్రన్ అశ్విన్ (క్రికెట్), పూజారి మమత (కబడ్డీ), సునీల్‌కుమార్ రాణా (రెజ్లింగ్) ఉన్నారు. ద్రోణాచార్యగ్రహీతలు: గురుచరణ్ సింగ్ గోగి (జూడో), మనోహరన్ (బాక్సింగ్), జోసె జాకబ్ (రోయింగ్), లింగప్ప (అథ్లెటిక్స్), మహావీర్ ప్రసాద్ (రెజ్లింగ్). ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీతలు: గుర్మిల్ సింగ్ (హాకీ), కేపీ ఠక్కర్ (స్విమ్మింగ్-డైవింగ్), జీషణ్ అలీ (టెన్నిస్). హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్ జన్మదినోత్సవాన్ని (ఆగస్టు 29) జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహిస్తారు.
 
 జైపూర్ పాంథర్స్‌కు ప్రొ కబడ్డీ టైటిల్
 ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్‌ను జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు గెలుచుకుంది. బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్‌కు చెందిన ఈ జట్టు ఆగస్టు 31న జరిగిన ఫైనల్లో యు ముంబై జట్టును ఓడించింది. పాట్నా పైరేట్స్ మూడో స్థానంలో నిలిచింది.
 
 జాతీయం
 జన్-ధన్ యోజన ప్రారంభం

 దేశంలో అందరికీ బ్యాంకు ఖాతా ఉండాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రధానమంత్రి జన్-ధన్ యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 28న న్యూఢిల్లీలో ప్రారంభించారు. కార్యక్రమం కింద తొలిరోజే 1.5 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు కల్పించారు. ఈ పథకం కింద 2015 జనవరి 26లోగా 7.5 కోట్ల మందికి బ్యాంకు ఖాతా సౌకర్యాలు కల్పిస్తారు.
 
 కనీస పెన్షన్ రూ. 1000
 ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పరిధిలోని పెన్షన్ పథకం కింద కనీస పెన్షన్ రూ. 1,000గా నిర్ణయిస్తూ కేంద్రం ఆగస్టు 29న నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే సామాజిక భద్రత పథకాల కింద ఈపీఎఫ్ చందాదారుల వేతన పరిమితిని రూ. 15,000గా నిర్ణయించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుంది.
 
 స్మార్ట్ హెరిటేజ్ సిటీగా వారణాసి

 ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరాన్ని స్మార్ట్ హెరిటేజ్ సిటీగా రూపొందించేందుకు భారత్-జపాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందంపై ఆగస్టు 30న భారత రాయబారి దీపా వాద్వా, క్యోటో నగర మేయర్ దైసా కడోకోవాలు సంతకాలు చేశారు. దేశంలో 100 స్మార్ట్ సిటీల కార్యాచరణకు వారణాసితో కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వారణాసిని క్యోటో నగరం తరహాలో స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దుతారు.
 
 కాలదోషం పట్టిన చట్టాల సమీక్ష
 ప్రభుత్వ పాలనలో ఇబ్బందికరంగా పరిణమించిన.. నిరుపయోగ, కాలదోషం పట్టిన చట్టాలను గుర్తించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 27న  కమిటీని ఏర్పాటు చేశారు. ప్రధాని కార్యాలయ కార్యదర్శి ఆర్.రామానుజం, పాలనా విభాగం మాజీ కార్యదర్శి వీకే భాసిన్ ఇందులో ఉంటారు. ఈ కమిటీ దేశంలోని చట్టాలను పరిశీలించి.. వాటిల్లో గత పది, పదిహేనేళ్లుగా సరిగా అమల్లో లేని, కాలదోషం పట్టిన చట్టాలను గుర్తిస్తుంది.
 
 డాట్ భారత్ డొమైన్‌ను ప్రారంభించిన కేంద్రం
 దేవనాగరి లిపిలో కొత్త డొమైన్ డాట్ భారత్‌ను కేంద్రం న్యూఢిల్లీలో ఆగస్టు 27న ప్రారంభించింది. ఈ డొమైన్ హిందీ, బోడో, డోగ్రీ, కొంకణ్, మైథిలీ, మరాఠీ, నేపాలీ, సింధీ వంటి ఎనిమిది భాషల్లో ఉంటుంది. సామాజిక మీడియాతో ప్రజల్ని అనుసంధానించేందుకు, ముఖ్యంగా ఇంగ్లిష్ పరిచయం లేనివారికి ప్రాంతీయ భాషల్లో విషయాలు అందించడమే లక్ష్యంగా డాట్ భారత్ (.ఆజ్చిట్చ్ట) ను సృష్టించారు.
 
 నలందాలో తరగతులు ప్రారంభం
 ప్రపంచంలోనే తొట్టతొలి విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా, పలు దేశాల విద్యార్థులను ఆకర్షించిన ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో 821 సంవత్సరాల తర్వాత మళ్లీ లాంఛనంగా సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ వర్సిటీని పునరుద్ధరించాలని 2006లో నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ అసెంబ్లీలో ప్రసంగం సందర్భంగా ప్రతిపాదించారు. పార్లమెంటు ఆమోదించిన నలందా వర్సిటీ చట్టం ద్వారా ఈ వర్సిటీ తిరిగి ఉనికిలోకి వచ్చింది. ఆరో శతాబ్దంలో గుప్తుల కాలంలో ప్రారంభమైన నలందా విశ్వవిద్యాలయాన్ని టర్కీ సైన్యం 1193లో కొల్లగొట్టి ధ్వంసం చేయడంతో మూతపడింది. నలందా యూనివర్సిటీని లాంఛనంగా సెప్టెంబర్ 14న ప్రారంభిస్తారు.
 
  అంతర్జాతీయం
 కంచె నిర్మాణానికి భారత్ నిర్ణయం
 బంగ్లాదేశ్ జలాల మీద సింగపూర్ నమూనా (స్కిడ్ మెరైన్ హెడ్జ్ మోడల్)లో కంచె నిర్మించేందుకు భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్-బంగ్లా సరిహద్దు ప్రాంతంలో నదులు, చిత్తడి నేలతో నిండి ఉండడం వల్ల, కేంద్ర ప్రభుత్వం ఆ నీటిపై కంచెను ఏర్పాటు చే యాలని భావిస్తోంది. కంచె నిర్మాణం పూర్తయితే దేశంలోకి వలసదారుల చొరబాటుకు అడ్డుకట్ట పడుతుంది.
 
 ప్రధాని మోడీ జపాన్ పర్యటన
 భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ జపాన్ పర్యటనలో సెప్టెంబర్ 1న ఆ దేశ ప్రధాని షింజో అబేతో శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఇరుదేశాల మధ్య రక్షణ, కాలుష్య రహిత ఇంధనం, రహదారుల నిర్మాణం, ఆరోగ్యం, మహిళా సంక్షేమ రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో జపాన్ ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను రూ. 2,10,000 కోట్లకు పెంచేందుకు అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది. వీటిని స్మార్ట్‌సిటీల నిర్మాణం, జల సంరక్షణ, గంగా నదితోపాటు ఇతర నదుల ప్రక్షాళన, నైపుణ్యాల అభివృద్ధి, తయారీ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి రంగా ల్లో పెడతారు. 1998లో అణు పరీక్షల అనంతరం భారత్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినట్లు జపాన్ ప్రకటించింది.
 
 గాజాలో అమల్లోకి కాల్పుల విరమణ
 ఇజ్రాయెల్, పాలస్తీనాల అంగీకారంతో గాజాలో ఆగస్టు 26 నుంచి దీర్ఘకాల కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. గాజాలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు, దాడుల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల పునర్మిణానికి వీలుగా దిగ్బంధాన్ని తొలగించేందుకు కూడా ఇజ్రాయెల్ అంగీకరించింది.
 
 ఈ-మెయిల్‌కు 32 ఏళ్లు
 సమాచార రంగంలో విప్లవాత్మకమై.. నేడు ప్రపంచమంతా విస్తృతంగా వాడకంలో ఉన్న ఎలక్ట్రానిక్ మెయిల్ (ఈ-మెయిల్)కు ఈ ఏడాది ఆగస్టు 30తో 32 ఏళ్లు నిండాయి.
 
 
 అవార్డులు
 పాకిస్థాన్ మహిళకు పీటర్ మాక్లేర్ అవార్డు
 ధైర్య సాహసాలు, నైతిక విలువలతో కూడిన జర్నలిజానికి ఇచ్చే పీటర్ మాక్లేర్ అవార్డు-2014 పాకిస్థాన్ తొలి మహిళా వార్ కరస్పాండెంట్, టీవీ వ్యాఖ్యాత అస్మా షిరాజికి లభించింది. షిరాజి 2006 ఇజ్రాయెల్-లెబనాన్ పోరాటం, 2009లో పాక్-అఫ్గానిస్థాన్ సరిహద్దులో తాలిబన్ యుద్ధం, 2007లో జనరల్ ముషారఫ్ ఎమర్జెన్సీ పాలన వంటి సంఘటనలపై ఆమె వార్తా సమాచారం అందించారు. ఈ అవార్డును 2008లో ఏజెన్సీ ఫ్రాన్సి-ప్రెస్సి జర్నలిస్ట్ పీటర్ మాక్లేర్ పేరిట ఏర్పాటు చేసింది. ఈ పురస్కారం అందుకున్న రెండో మహిళ షిరాజి.
 
 బెలఫాంటెకు హ్యుమానిటేరియన్ ఆస్కార్
 అమెరికాకు చెందిన నటుడు, గాయకుడు హ్యారీ బెలఫాంటెకు జీన్ హెర్‌షాల్ట్ హ్యుమానిటేరియన్ ఆస్కార్ అవార్డు లభించింది. మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సెన్సైస్ అకాడమీ అందించే మూడు జీవిత కాల సాఫల్య పురస్కారాల్లో ఈ అవార్డు ఒకటి. బెలఫాంటె ఎయిడ్స్ నివారణ, విద్య, పౌర హక్కుల రక్షణతోపాటు పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్ నిర్వహించిన లాంగ్‌మార్చ్‌కు మద్దతు తెలిపారు. 1987లో యూనిసెఫ్ సౌహార్థ్ర రాయబారి (గుడ్‌విల్ అంబాసిడర్)గా వ్యవహరించారు.
 
 రాజీవ్‌గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డులు
 2012 సంవత్సరానికి రాజీవ్‌గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ఆగస్టు 26న ప్రకటించింది. వివరాలు.. బెస్ట్ ఆఫ్ ఆల్ అవార్డు (అన్నింటా ఉత్తమం)ను రైలు చక్రాల కర్మాగారానికి(బెంగళూరు) దక్కింది. పెద్ద సేవా సంస్థల కేటగిరీలో టాటా బిజినెస్ సపోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్-హైదరాబాద్, పెద్ద తరహా ఉత్పత్తి పరిశ్రమ విభాగంలో శక్తి మసాలా ప్రైవేట్ లిమిటెడ్ -తమిళనాడు, చిన్న తరహా ఉత్పత్తి పరిశ్రమ కేటగిరీలో ఎలీన్ గృహోపకరణాల లిమిటెడ్ -హిమాచల్ ప్రదేశ్‌లకు అవార్డులు లభించాయి.
 
 యువరాజ్, పాక్ జర్నలిస్టుకు ‘రాజీవ్ ఎక్స్‌లెన్స్’
 భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ , పాకిస్థాన్ జర్నలిస్టు రీమా అబాసీ సహా 24 మంది ఐదో రాజీవ్ గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపికయ్యారు. కేన్సర్ నివారణ ప్రచారంలో విశేష కృషికి గాను యువరాజ్ స్థాపించిన ‘యువీకెన్’ అనే స్వచ్ఛంద సంస్థకు ఈ అవార్డు లభించింది. ‘హిస్టారిక్ టెంపుల్స్ ఇన్ పాకిస్థాన్: ఏ కాల్ టు కాన్‌సైన్స్(పాకిస్థాన్‌లో చారిత్రక దేవాలయాలు: అంతరాత్మకు పిలుపు)’ అనే గ్రంథం ద్వారా పాకిస్థాన్‌లోని దేవాలయాల ఖ్యాతిని చాటినందుకు రీమా అబాసీని ఈ అవార్డు వరించింది.
 
 వార్తల్లో వ్యక్తులు
 ఈయూ అధ్యక్షుడిగా డోనాల్డ్ టుస్క్
 పోలెండ్ ప్రధాన మంత్రి డోనాల్డ్ టుస్క్ యూరోపియన్ యూనియన్ (ఈయూ) అధ్యక్షుడిగా ఆగస్టు 30న ఎన్నికయ్యారు. ఇటలీ విదేశాంగ మంత్రి ఫెడరికా మొగెరినీని విదేశాంగ విధాన అధిపతిగా వ్యవహరిస్తారు.
 
 మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు
 కేంద్ర మాజీ మంత్రి, తెలంగాణ బీజేపీ నేత చెన్నమనేని విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు రాజస్థాన్ గవర్నర్‌గా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్, వాజూభాయ్ రూడాభాయ్‌వాలాను కర్ణాటక, మృదులా సిన్హాను గోవా గవర్నర్లుగా నియమితులయ్యారు.
 
 బిపిన్ చంద్ర మృతి

 ఆధునిక భారతదేశ చరిత్రను సాధారణ ప్రజలకు చేరువ చేసిన ప్రముఖ చరిత్ర కారుడు బిపిన్ చంద్ర(86) అనారోగ్యంతో ఆగస్టు 30న గుర్గావ్‌లో తుదిశ్వాస విడిచారు. 1928లో హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో జన్మించారు. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ డెమోక్రసీ: జేపీ మూవ్‌మెంట్ అండ్ ది ఎమర్జెన్సీ’, ‘ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎకనమిక్ నేషనలిజం’, ‘నేషనలిజం అండ్ కలోనియలిజం ఇన్ మోడరన్ ఇండియా’, ‘ద మేకింగ్ ఆఫ్ మోడరన్ ఇండియా: ఫ్రమ్ మార్క్స్ టు గాంధీ’, ‘ద ఇండియన్ లెఫ్ట్: క్రిటికల్ అప్రైజల్’ తదితరాలు ఆయన రచనల్లో కొన్ని.
 
 ఇంటర్ పోల్ అంబాసిడర్‌గా షారుక్‌ఖాన్
 అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్ ప్రచారకర్తగా బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్ ఆగస్టు 28న ఎంపికయ్యారు. దీంతో ఇంటర్‌పోల్ ప్రచారకర్తగా ఎంపికైన తొలి  భారతీయ నటుడిగా ఖాన్ గుర్తింపు పొందారు.
 
 బీబీసీకి తొలి మహిళా చైర్ పర్సన్ రోనా
 బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కు తొలి మహిళాచైర్ పర్సన్‌గా రోనా ఫెయిర్ హెడ్ ఆగస్టు 30న నియమితులయ్యారు.
 
 రాష్ట్రీయంబాపు మృతి
 ప్రముఖ దర్శకుడు, చిత్రకారుడు, కార్టూనిస్ట్ బాపు (81) చెన్నైలో ఆగస్టు 31న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన అసలు పేరు సత్తిరాజు లక్ష్మీనారాయణ. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని కంతేరు. బాపు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తొలిచిత్రం సాక్షి (1967). 2013లో బాపుకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
 
 ఏపీ రాజధానిపై హోంశాఖకు నివేదిక
 ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆగస్టు 27న న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు నివేదిక అందించింది. కమిటీ ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి వివిధ ప్రాంతాల్లో పలువురి అభిప్రాయాలను సేకరించి నివేదిక సిద్ధం చేసింది. రాజధాని ఏర్పాటుపై ఆయా ప్రాంతాల్లో అనుకూల, ప్రతికూలత నివేదికలను సిద్ధం చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement