మెల్‌బోర్న్: తొలి మూడు రౌండ్‌లలో అంతగా కష్టపడకుండానే విజయాలు నమోదు చేసుకున్న స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), సిమోనా హలెప్ (రొమేనియా), నయోమి ఒసాకా (జపాన్)లకు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం గట్టి పోటీనే ఎదురైంది. అయితే ఈ ‘గ్రాండ్‌స్లామ్ విన్నర్స్’ కీలకదశలో తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన పదో సీడ్ సెరెనా 2 గంటల 9 నిమిషాల్లో 6–4, 2–6, 6–4తో ఏడో సీడ్ సబలెంకా (బెలారస్)పై... రెండో సీడ్ హలెప్ గంటా 50 నిమిషాల్లో 3–6, 6–1, 6–4తో గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై... మూడో సీడ్ ఒసాకా గంటా 55 నిమిషాల్లో 4–6, 6–4, 7–5తో గత ఏడాది రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్)పై అద్భుత విజయాలు సాధించారు. ముగురుజాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్‌లో ఒసాకా 3–5తో వెనుకబడింది. రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాచుకున్న ఆమె వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.
మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–4, 6–2తో 2019 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, 19వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)ను బోల్తా కొట్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన సె సువె సింగిల్స్ విభాగంలో మాత్రం తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది.
మూడో సీడ్ థీమ్‌కు షాక్
పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన థీమ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6, 4–6, 0–6తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓడిపోయాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో థీమ్ ఏకంగా 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. పది ఏస్‌లు సంధించడంతోపాటు థీమ్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన దిమిత్రోవ్ ఈ గెలుపుతో నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
జొకోవిచ్ @ 300
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), క్వాలిఫయర్ అస్లాన్ కరాత్‌సెవ్ (రష్యా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 7–6 (7/4), 4–6, 6–1, 6–4తో 14వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో 300వ విజయాన్ని నమోదు చేశాడు. ఫెడరర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. మరో మ్యాచ్‌లో కరాత్‌సెవ్ 3–6, 1–6, 6–3, 6–3, 6–4తో 20వ సీడ్ ఉజెర్ ఆలియాసిమ్ (కెనడా)ను ఓడించి అరంగేట్రం గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన ఏడో క్రీడాకారుడిగా ఘనత వహించాడు. మరో మ్యాచ్‌లో జ్వెరెవ్ 6–4, 7–6 (7/5), 6–3తో లజోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు.
శ్రమించి... సాధించి
Published Mon, Feb 15 2021 3:02 AM | Last Updated on Mon, Feb 15 2021 3:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment