సెరెనా గర్జన | Williams defeats world No 1 Halep | Sakshi
Sakshi News home page

సెరెనా గర్జన

Published Tue, Jan 22 2019 12:11 AM | Last Updated on Tue, Jan 22 2019 4:24 AM

Williams defeats world No 1 Halep  - Sakshi

తల్లి హోదా వచ్చాక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన 37 ఏళ్ల సెరెనా విలియమ్స్‌ ఆ దిశగా మరో అడుగు వేసింది. రెండేళ్ల క్రితం రెండు నెలల గర్భంతో ఈ మెగా టోర్నీలో ఆడి విజేతగా నిలిచిన ఆమె ఈసారీ అదే జోరు కనబరుస్తోంది. గత సంవత్సరం వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్స్‌లో ఓడిపోయిన ఈ అమెరికా నల్లకలువ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అదరగొడుతోంది. తొలి మూడు రౌండ్‌లలో అంతగా ప్రతిఘటన ఎదుర్కోని సెరెనాకు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సిమోనా హలెప్‌ రూపంలో అసలు సిసలు సవాల్‌ ఎదురైంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో 24 ఏళ్ల అనుభవమున్న సెరెనా ఈ అడ్డంకిని అద్భుత ఆటతో అధిగమించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో 12వసారి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.   

మెల్‌బోర్న్‌: అమ్మతనం వచ్చాక తన ఆటలో మరింత పదును పెరిగిందని అమెరికా టెన్నిస్‌ స్టార్‌ సెరెనా విలియమ్స్‌ నిరూపించింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లో ఈ మాజీ చాంపియన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మూడో రౌండ్‌లో తన అక్క వీనస్‌ విలియమ్స్‌ను ఓడించిన ప్రపంచ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)పై సెరెనా ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అద్భుత విజయం సాధించింది. గంటా 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 16వ సీడ్‌ సెరెనా 6–1, 4–6, 6–4తో టాప్‌ సీడ్‌ హలెప్‌ను బోల్తా కొట్టించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెరెనాపై హలెప్‌ గెలిచుంటే ఒకే టోర్నీలో విలియమ్స్‌ సిస్టర్స్‌ వీనస్, సెరెనాలను ఓడించిన తొమ్మిదో క్రీడాకారిణిగా గుర్తింపు పొందేది.  

కెరీర్‌లో పదోసారి హలెప్‌తో తలపడిన సెరెనా తొలి సెట్‌ను కేవలం 20 నిమిషాల్లో సొంతం చేసుకుంది. తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆనందం హలెప్‌నకు ఎక్కువసేపు నిలువలేదు. ఆమె వరుసగా ఆరు గేమ్‌లు కోల్పోయి సెట్‌ను సెరెనాకు అప్పగించేసింది. అయితే రెండో సెట్‌లో పరిస్థితి మారిపోయింది. ప్రతి పాయింట్‌ కోసం ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. సెరెనా ఆటకు తగిన సమాధానమిస్తూ హలెప్‌ స్కోరు 5–4 వద్ద బ్రేక్‌ పాయింట్‌ సంపాదించి రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణాయక మూడో సెట్‌లో స్కోరు 3–2 వద్ద సెరెనా సర్వీస్‌లో హలెప్‌ మూడు బ్రేక్‌ పాయింట్లు సాధించింది. కానీ వాటిని అనుకూలంగా మల్చుకోవడంలో ఆమె విఫలమైంది. తీవ్రంగా పోరాడి తన సర్వీస్‌ను కాపాడుకున్న సెరెనా స్కోరును 3–3తో సమం చేసింది. ఆ తర్వాత ఏడో గేమ్‌లో హలెప్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఆమె 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో హలెప్‌ తన సర్వీస్‌ను కాపాడుకుంది. మ్యాచ్‌లో నిలవాలంటే పదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కచ్చితంగా బ్రేక్‌ చేయాల్సిన హలెప్‌ చేతులెత్తేయడంతో మ్యాచ్‌ సెరెనా వశమైంది. ఓవరాల్‌గా హలెప్‌పై సెరెనాకిది తొమ్మిదో విజయం. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో మూడోది. గతంలో వీరిద్దరు తలపడిన రెండు  గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మ్యాచ్‌లు (2016 యూఎస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌; 2011 వింబుల్డన్‌ రెండో రౌండ్‌) కూడా మూడు సెట్‌లపాటు సాగడం విశేషం. బుధవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)తో సెరెనా ఆడుతుంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్లిస్కోవా 6–3, 6–1తో 18వ సీడ్‌ గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌)పై విజయం సాధించింది.  

మరోవైపు నాలుగో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌), ఆరో సీడ్‌ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్‌) క్వార్టర్‌ ఫైనల్‌ చేరేందుకు తీవ్రంగా శ్రమించారు. 13వ సీడ్‌ సెవస్తోవా (లాత్వియా)తో గంటా 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 4–6, 6–3, 6–4తో గెలుపొందింది. 17వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)తో గంటా 36 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వితోలినా 6–2, 1–6, 6–1తో నెగ్గి క్వార్టర్‌ ఫైనల్లో ఒసాకాతో పోరుకు సిద్ధమైంది.  

5 గంటల  5 నిమిషాలు పోరాడి... 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఎనిమిదో సీడ్‌ కి నిషికోరి (జపాన్‌), టాప్‌ సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), 16వ సీడ్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా), 28వ సీడ్‌ లుకాస్‌ పుయి (ఫ్రాన్స్‌) క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 23వ సీడ్‌ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్‌)తో జరిగిన మ్యాచ్‌లో నిషికోరి ఏకంగా 5 గంటల 5 నిమిషాలు పోరాడి 6–7 (8/10), 4–6, 7–6 (7/4), 6–4, 7–6 (10/8)తో విజయాన్ని దక్కించుకున్నాడు. తొలి రెండు సెట్‌లను కోల్పోయిన నిషికోరి ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లలో గెలిచాడు. నిర్ణాయక ఐదో సెట్‌ టైబ్రేక్‌లో 5–8తో వెనుకబడిన నిషికోరి ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు సాధించి 10–8తో టైబ్రేక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ‘నేను ఎలా పుంజుకున్నానో నాకే తెలియదు. తుది ఫలితంతో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను’ అని క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌తో తలపడనున్న నిషికోరి వ్యాఖ్యానించాడు. 15వ సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)తో 3 గంటల 15 నిమిషాలపాటు సాగిన మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ 6–4, 6–7 (5/7), 6–2, 6–3తో గెలిచాడు. 

నేటి క్వార్టర్‌ ఫైనల్స్‌ 
పురుషుల సింగిల్స్‌ విభాగం 
సిట్సిపాస్‌ (VS) బాటిస్టా అగుట్‌ 
రాఫెల్‌ నాదల్‌ (VS) టియాఫో 
మహిళల సింగిల్స్‌ విభాగం 
పావ్లీచెంకోవా (VS) డానియెలా కొలిన్స్‌ 
క్విటోవా(VS) యాష్లే బార్టీ 

ఉదయం 7 గంటల నుంచి;  మధ్యాహ్నం గం. 1.30 నుంచి  సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement