Simona Halep
-
హాలెప్ వీడ్కోలు
బుకారెస్ట్ (రొమేనియా): మాజీ ప్రపంచ నంబర్‌వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్ సిమోనా హాలెప్ (రొమేనియా) కెరీర్‌కు వీడ్కోలు పలికింది. డోపింగ్ సస్పెన్షన్‌తో పాటు గాయాల కారణంగా చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న 33 ఏళ్ల హాలెప్... బుధవారం ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన హాలెప్... టాన్సిల్వేనియా ఓపెన్ తొలి రౌండ్లో పరాజయం ఆనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ఇది సంతోషమో, బాధో అర్థం కావడం లేదు. కానీ ఈ నిర్ణయంతో నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మాత్రం చెప్పగలను. ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడేందుకు నా శరీరం సహకరించదని అనిపిస్తోంది. అందుకే ఆట నుంచి తప్పుకుంటున్నా. ఈ స్థాయికి చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డా. చివరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. అయినా అభిమానుల సమక్షంలో మైదానంలో దిగడాన్ని ఆస్వాదించా’ అని హాలెప్ పేర్కొంది. 2017లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన హాలెప్... ఆ తర్వాత గాయాలు, నిషేధం కారణంగా 870వ ర్యాంక్‌కు పడిపోయింది. టాన్సిల్వేనియా ఓపెన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె బుధవారం జరిగిన మ్యాచ్‌లో 1–6, 1–6తో లుసియా బ్రాంజెట్టి (రొమేనియా) చేతిలో ఓడింది. మోకాలు, భుజం గాయాలతో ఇబ్బంది పడుతున్న హాలెప్ ఇటీవల ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి కూడా తప్పుకుంది. 2018 ఫ్రెంచ్ ఓపెన్, 2019 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన హాలెప్ మరో మూడు గ్రాండ్‌స్లామ్ (2014, 2017 ఫ్రెంచ్ ఓపెన్, 2018 ఆస్ట్రేలియా ఓపెన్) టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 2022 యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ పరాజయం అనంతరం డోపింగ్ కారణంగా హాలెప్ ప్రొఫెషనల్ కెరీర్‌కు దూరమైంది. దీంతో ఆమె మీద నాలుగు సంవత్సరాల నిషేధం పడింది. దీనిపై హాలెప్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ స్పోర్ట్‌లో అప్పీల్ చేసుకోగా... నిషేధాన్ని 9 నెలలకు తగ్గించారు. అయితే గాయాల బెడద ఎక్కువవడంతో తిరిగి కోర్టులో పూర్వ వైభవం సాధించలేకపోయింది. కెరీర్ విశేషాలు 24 మొత్తం గెలిచిన సింగిల్స్ టైటిల్స్ 2 సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (2018 ఫ్రెంచ్ ఓపెన్; 2019 వింబుల్డన్) 580 కెరీర్లో గెలిచిన మ్యాచ్‌లు 243 కెరీర్లో ఓడిన మ్యాచ్‌లు 1 అత్యుత్తమ ర్యాంక్ (అక్టోబర్ 9, 2017) 64 ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న వారాలు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో గెలుపోటములు (112/44) » ఆ్రస్టేలియన్ ఓపెన్ (12 సార్లు): 31/12 » ఫ్రెంచ్ ఓపెన్ (11 సార్లు): 32/11 » వింబుల్డన్ (10 సార్లు): 29/9 » యూఎస్ ఓపెన్ (12 సార్లు): 20/12 సంపాదించిన మొత్తం ప్రైజ్‌మనీ 4,02,32,663 డాలర్లు (రూ. 351 కోట్లు) -
స్వియాటెక్‌పై ఉదారత ఎందుకు?
బుడాపెస్ట్ (రొమేనియా): వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ మాజీ చాంపియన్ సిమోనా హాలెప్ అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ పక్షపాత వైఖరిపై మండిపడింది. గతంలో తాను డోపింగ్‌లో పట్టుబడితే నాలుగేళ్ల నిషేధం విధించిన టెన్నిస్ వర్గాలు ఇప్పుడు స్వియాటెక్ డోపీగా తేలితే ఒకే ఒక్క నెల సస్పెన్షన్‌తో సరిపెట్టడంపై ఆమె తీవ్రస్థాయిలో ఆక్షేపించింది. క్రీడాకారుల పట్ల ఇలాంటి పక్షపాత వైఖరి ఎంతమాత్రం తగదని బాహాటంగా తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. ‘నేను ఎంతసేపు స్థిమితంగా కూర్చొని ఆలోచించినా ఈ వ్యత్యాసమెంటో అంతుచిక్కడం లేదు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో తన అసంతృప్తిని పోస్ట్ చేసింది. ‘ఎంత ఆలోచించినా... ఆశ్చర్యమే తప్ప అసలెందుకీ వివక్షో తెలియడం లేదు. ఒకే రకమైన శిక్షకు ఒకే రకమైన తీర్పు ఉండదా? ఎంతగా ప్రయతి్నంచినా కూడా ఇదేం లాజిక్కో అర్థమవడం లేదు. కనీసం అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) వద్దనయినా సరైన సమాధానం దొరుకుతుందేమో చూడాలి. నా విషయంలో కఠినంగా వ్యవహరించిన టెన్నిస్ ఏజెన్సీ... స్వియాటెక్ విషయంలో ఎందుకంత ఉదాíసీనంగా వ్యవహరించాలి. నేను నేరుగా నిషేధిత ఉ్రత్పేరకాలు తీసుకోలేదని ఎంత వాదించినా వినని ఐటీఐఏ స్వియాటెక్ చెబితే వినడమెంటో తెలియడం లేదు’ అని తనకు జరిగిన అన్యాయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. 2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ నెగ్గిన హాలెప్... 2022 యూఎస్ ఓపెన్ సందర్భంగా నిర్వహించిన పరీక్షల్లో నిషిద్ధ ఉ్రత్పేరకం ‘రొక్సాడ్యుస్టట్’ తీసుకున్నట్లు తేలడంతో ఏకంగా నాలుగేళ్ల నిషేధం విధించారు. తర్వాత ఆమె న్యాయపోరాటం చేయడంతో కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ శిక్షను 9 నెలలకు తగ్గించింది. అయితే ఆమె ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైంది. కానీ తాజాగా స్వియాటెక్‌కు కేవలం 30 రోజుల శిక్ష విధించడాన్ని తప్పుబట్టింది. ‘నేనెప్పుడు మంచినే కోరుకుంటా. టెన్నిస్‌లోనూ నీతి న్యాయం సమానంగా ఉండాలని ఆశిస్తా. కానీ ఇంతటి అసమానతలు చూసి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు’ అని ఐటీఐఏ తీరును దుయ్యబట్టింది. ఇటీవల ఐటీఐఏ వ్యవహారం తరచూ విమర్శలపాలవుతోంది. పురుషుల టాప్ ర్యాంక్ ప్లేయర్ యానిక్ సినెర్ ఈ ఏడాది మార్చిలో రెండు సార్లు డోపింగ్‌లో దొరికిపోయినా టెన్నిస్ ఏజెన్సీ మెతక వైఖరి అవలంభించడంతో పలువురు టెన్నిస్ దిగ్గజాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. -
పరాజయంతో పునరాగమనం
ప్రపంచ మాజీ నంబర్‌వన్ సిమోనా హలెప్ పరాజయంతో ప్రొఫెషనల్ సర్క్యూట్లో పునరాగమనం చేసింది. మయామి ఓపెన్ టోర్నీలో హలెప్ (రొమేనియా) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. పౌలా బదోసా (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో హలెప్ 6–1, 4–6, 3–6తో ఓడిపోయింది. హలెప్ 2022లో డోపింగ్‌లో విఫలమవడంతో నాలుగేళ్ల నిషేధం విధించారు. అయితే ఈ నిషేధంపై ఆమె కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అప్పీల్ చేసింది. విచారణ తర్వాత హలెప్ నిషేధాన్ని 9 నెలలకు కుదించారు. -
హాలెప్‌పై నాలుగేళ్ల నిషేధం
లండన్: డోపింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు... రొమేనియా టెన్నిస్ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ సిమోనా హాలెప్‌పై ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది. 31 ఏళ్ల హాలెప్ 2022 యూఎస్ ఓపెన్ సందర్భంగా డోపింగ్ పరీక్షలో విఫలమైంది. దాంతో ఆమెపై 2022 అక్టోబర్‌లో తాత్కాలిక నిషేధం విధించారు. ఐటీఐఏ ప్యానెల్ విచారణలో హాలెప్ ఉద్దేశపూర్వకంగానే డోపింగ్ నియమావళిని ఉల్లంఘించిందని తేలింది. దాంతో ఆమెపై నిషేధాన్ని అక్టోబర్ 2026 వరకు పొడిగించారు. 2017లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన హాలెప్ రెండు గ్రాండ్‌స్లామ్ (2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్) సింగిల్స్ టైటిల్స్ సాధించింది. మరోవైపు ఐటీఐఏ విధించిన నిషేధాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో సవాలు చేస్తానని హాలెప్ తెలిపింది. -
టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్‌పై నిషేధం
రొమేనియా టెన్నిస్ స్టార్.. మాజీ వరల్డ్ నంబర్‌వన్ సిమోనా హలెప్ డోపింగ్ టెస్టులో పట్టుబడింది. దీంతో అంతర్జాతీయ టెన్నిస్ ఇంటెగ్రిటీ ఏజెన్సీ(ఐటీఐఏ) శుక్రవారం హలెప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. విషయంలోకి వెళితే.. ఆగస్టులో యూఎస్ ఓపెన్‌లో పాల్గొన్న హలెప్ డోపింగ్ టెస్టులో భాగంగా శాంపిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే హలెప్ రోక్సాడుస్టాట్(FG-4592)అనే నిషేధిత డ్రగ్ తీసుకున్నట్లు తేలింది. కాగా 2022లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) రోక్సాడుస్టాట్ డ్రగ్‌ను నిషేధిత జాబితాలో చేర్చింది. ఈ క్రమంలోనే టెన్నిస్ యాంటీ డోపింగ్ ప్రోగ్రామ్ (TADP) ఆర్టికల్ 7.12.1 ప్రకారం 31 ఏళ్ల హలెప్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లు ఐటీఐఏ ధృవీకరించింది. కాగా తనను సస్పెండ్ చేయడంపై స్పందించిన సిమోనా హలెప్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ అయింది.''ఇన్నేళ్ల నా కెరీర్లో మోసం చేయాలనే ఆలోచన ఒక్కసారి కూడా మనస్సులోకి రాలేదు. ఎందుకంటే మోసం అనేది నా విలువలకు పూర్తిగా విరుద్ధం. కానీ తెలియకుండా చేసిన ఒక పని నన్ను బాధిస్తుంది. కానీ నేను తెలియక చేసింది తప్పు కాదని నిరూపించుకోవడానికి చివరి వరకు ప్రయత్నిస్తా. గత 25 ఏళ్లలో టెన్నిస్‌పై పెంచుకున్న ప్రేమను, సాధించిన టైటిల్స్‌ను, గౌరవాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తా'' అంటూ ముగించింది. ఇక సిమోనా హలెప్ 2006లో ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మారింది. ఆమె ఖాతాలో రెండు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిల్స్‌తో పాటు 24 డబ్ల్యూటీఏ టూర్ టైటిల్స్ గెలుచుకుంది. 2017 నుంచి 2019 మధ్య హలెప్ రెండుసార్లు మహిళల టెన్నిస్ నెంబర్ వన్ క్రీడాకారిణిగా కొనసాగింది. రొమేనియా తరపున ఈ ఘనత సాధించిన తొలి మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. ఆమె కెరీర్లో 2018లో ఫ్రెంచ్ ఓపెన్, 2019లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించింది. pic.twitter.com/bhS2B2ovzS — Simona Halep (@Simona_Halep) October 21, 2022 చదవండి: సూపర్-12 మ్యాచ్‌లు.. టీమిండియా పూర్తి షెడ్యూల్, వివరాలు -
హలెప్ హ్యాట్రిక్.. మూడోసారి కెనడా ఓపెన్ నెగ్గిన రొమేనియా స్టార్
రొమేనియా స్టార్ సిమోనా హలెప్ మూడోసారి టొరంటో ఓపెన్ డబ్ల్యూటీఏ మాస్టర్స్–1000 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో హలెప్.. బ్రెజిల్‌కు చెందిన బీట్రిజ్ హదాద్ మయాస్పై 6-3, 2-6, 6-3 తేడాతో విజయం సాధించింది. సెమీస్‌లో జెస్సికా పెగూలా (అమెరికా)పై 2–6, 6–3, 6–4తో పోరాడి నెగ్గిన హలెప్.. ఫైనల్లోనూ అదే పోరాట పటిమ కనబర్చి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుది సమరంలో తొలి సెట్ సునయాసంగా గెలిచిన హలెప్.. రెండో సెట్లో ప్రత్యర్ధి నుంచి ఊహించని పోరాటం ఎదురుకావడంతో తడబడి 2-6తో చేజార్చుకుంది. అయితే కీలకమైన మూడో సెట్లో ప్రత్యర్ధికి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. తద్వారా మూడో కెనాడిన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2016, 2018లో హలెప్ ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది. -
కార్నెట్ పట్టు వీడని పోరాటం
మెల్బోర్న్: ఏళ్ల తరబడి టెన్నిస్ ఆడుతున్నా అందరి కళ్లలో పడని ఫ్రాన్స్ స్టార్ అలిజె కార్నెట్ ఇప్పుడు ఒక్క ప్రిక్వార్టర్స్ విజయంతో పతాక శీర్షికల్లో నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 32 ఏళ్ల కార్నెట్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 15 ఏళ్ల ప్రాయంలో 2005 నుంచి గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడుతున్న ఈ ఫ్రాన్స్ స్టార్ గతంలో ఎప్పుడూ ప్రిక్వార్టర్స్ దశనే దాటలేకపోయింది. ఇప్పుడైతే ఏకంగా రెండుసార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్, 14వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను కంగుతినిపించి మరీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో కార్నెట్ 6–4, 3–6, 6–4తో హలెప్‌పై విజయం సాధించి తన 63వ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. రెండో సీడ్ సబలెంకాకు షాక్ మరో ప్రిక్వార్టర్స్‌లో కూడా మరో అలుపెరగని క్రీడాకారిణి కయా కనెపి సంచలన విజయంతో క్వార్టర్స్ చేరింది. ఎస్తోనియాకు చెందిన 115వ ర్యాంకర్ కనెపి 5–7, 6–2, 7–6 (10/7)తో బెలారస్ స్టార్, రెండో సీడ్ సబలెంకాపై అద్భుత విజయం సాధించింది. 2007 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న కనెపి తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. కనెపి 15 ఏళ్ల కెరీర్లో మిగతా మూడు గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో క్వార్టర్స్ చేరింది. కానీ ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం ఈ ఏడాదే ఆ అవకాశం దక్కించుకుంది. మిగతా ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 5–7, 6–3, 6–3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై, 27వ సీడ్ కొలిన్స్ (అమెరికా) 4–6, 6–4, 6–4తో 19వ సీడ్ ఎలైజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలుపొందారు. చెమటోడ్చిన మెద్వెదెవ్ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)కు అసాధారణ ప్రతిఘటన ఎదురైంది. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో మెద్వెదెవ్ 6–2, 7–6 (7/4), 6–7 (4/7), 7–5తో 70వ ర్యాంకర్ మ్యాక్సిమ్ క్రెస్సీ (అమెరికా)పై గెలిచాడు. ఇతర ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్) 4–6, 6–4, 4–6, 6–3, 6–4తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, 11వ సీడ్ సినెర్ (ఇటలీ) 7–6 (7/3), 6–3, 6–4తో డి మినార్ (ఆస్ట్రేలియా)పై, తొమ్మిదో సీడ్ అలియాసిమ్ (కెనడా) 2–6, 7–6 (9/7), 6–2, 7–6 (7/4)తో సిలిచ్ (క్రొయేషియా)పై నెగ్గారు. -
జొకోవిచ్‌కు అనుకూలం
లండన్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గి జోరు మీదున్న వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ వింబుల్డన్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి మెయిన్ ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. 2019 చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్లో బ్రిటన్‌కు చెందిన టీనేజర్ జాక్ డ్రేపర్‌తో తలపడతాడు. తొలి రౌండ్ దాటితే రెండో రౌండ్లో జొకోవిచ్‌కు 2018 రన్నరప్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) ఎదురయ్యే అవకాశముంది. అంతా సవ్యంగా సాగిపోతే క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా), సెమీఫైనల్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)తో జొకోవిచ్ ఆడాల్సి రావొచ్చు. టాప్–10 సీడింగ్స్‌లో ఉన్నప్పటికీ రుబ్లెవ్, సిట్సిపాస్ గ్రాస్ కోర్టు స్పెషలిస్ట్‌లు కాకపోవడం జొకోవిచ్‌కు అనుకూలాంశం. ఎనిమిది సార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గిన స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ ఆరో సీడ్‌గా ఈ టోర్నీలో ఆడనున్నాడు. వాస్తవానికి ఫెడరర్‌కు ఏడో సీడింగ్ కేటాయించినా ... నాలుగో సీడ్‌గా ఉన్న డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) టోర్నీ నుంచి వైదొలగడంతో సీడింగ్స్‌లో మార్పులు జరిగాయి. దాంతో ఫెడరర్ కు ‘డ్రా’లోని కింది పార్శ్వంలో చోటు లభించింది. తొలి రౌండ్లో ఫ్రాన్స్ ప్లేయర్ మనారినోతో ఫెడరర్ ఆడతాడు. వింబుల్డన్‌లో అద్భుతమైన రికార్డు ఉన్న ఫెడరర్ స్థాయికి తగ్గట్టు ఆడితే మరో సారి ఫైనల్‌కు చేరుకునే అవకాశముంది. కరోనా కారణంగా గత ఏడాది వింబుల్డన్ టోర్నీని రద్దు చేశారు. హలెప్ దూరం... మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా) కాలి పిక్క గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగింది. ఇదే గాయంతో ఫ్రెంచ్ ఓపెన్‌లోనూ ఆడలేకపోయిన సిమోనా శుక్రవారం తాను వింబుల్డన్‌లో ఆడటం లేదని ప్రకటించింది. మహిళల డబుల్స్ విభాగంలో భారత స్టార్ సానియా మీర్జా అమెరికాకు చెందిన బెథానీ మాటెక్ సాండ్స్‌తో కలసి ఆడనుంది. తొలి రౌండ్లో ఆరో సీడ్ అలెక్సా గురాచీ (చిలీ)–డెసిరె క్రాజిక్ (అమెరికా) జోడీతో సానియా –బెథానీ ద్వయం తలపడనుంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ (భారత్) జోడీ కొంటినెన్ (ఫిన్లాండ్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంటతో ఆడుతుంది. -
French Open: మరో స్టార్ ప్లేయర్ దూరం
రొమేనియా: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమైన స్టార్ ప్లేయర్ల జాబితాలో మరొకరు చేరారు. పురుషుల సింగిల్స్‌లో 2015 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈ మెగా ఈవెంట్‌కు దూరంకాగా ... తాజాగా మహిళల సింగిల్స్‌లో 2018 చాంపియన్, మూడో ర్యాంకర్ సిమోనా హలెప్ బరిలోకి దిగడంలేదని ప్రకటించింది. కాలిపిక్క గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హలెప్ తెలిపింది. ఈనెల 30న ఫ్రెంచ్ ఓపెన్ మొదలవుతుంది. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట ఓటమి జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–ఫ్రాంకోస్కుగర్ (క్రొయేషియా) పోరాటం ముగిసింది. స్విట్జర్లాండ్‌లో శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ బోపన్న–స్కుగర్ ద్వయం 3–6, 6–3, 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో గొంజాలో ఎస్కోబార్ (కొలంబియా)–ఏరియల్ బెహర్ (ఉరుగ్వే) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. క్వార్టర్స్‌లో ఓడిన బోపన్న జంటకు 4,710 యూరోల (రూ. 4 లక్షల 18 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 45 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
శ్రమించి... సాధించి
మెల్బోర్న్: తొలి మూడు రౌండ్లలో అంతగా కష్టపడకుండానే విజయాలు నమోదు చేసుకున్న స్టార్ టెన్నిస్ ప్లేయర్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), సిమోనా హలెప్ (రొమేనియా), నయోమి ఒసాకా (జపాన్)లకు ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం గట్టి పోటీనే ఎదురైంది. అయితే ఈ ‘గ్రాండ్‌స్లామ్ విన్నర్స్’ కీలకదశలో తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన పదో సీడ్ సెరెనా 2 గంటల 9 నిమిషాల్లో 6–4, 2–6, 6–4తో ఏడో సీడ్ సబలెంకా (బెలారస్)పై... రెండో సీడ్ హలెప్ గంటా 50 నిమిషాల్లో 3–6, 6–1, 6–4తో గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేత ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై... మూడో సీడ్ ఒసాకా గంటా 55 నిమిషాల్లో 4–6, 6–4, 7–5తో గత ఏడాది రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్)పై అద్భుత విజయాలు సాధించారు. ముగురుజాతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో సెట్లో ఒసాకా 3–5తో వెనుకబడింది. రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాచుకున్న ఆమె వరుసగా నాలుగు గేమ్‌లు నెగ్గి 7–5తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–4, 6–2తో 2019 ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, 19వ సీడ్ వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)ను బోల్తా కొట్టించింది. మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్, మూడు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలిచిన సె సువె సింగిల్స్ విభాగంలో మాత్రం తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో సీడ్ థీమ్‌కు షాక్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకడైన మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన థీమ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 4–6, 4–6, 0–6తో 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో ఓడిపోయాడు. రెండు గంటల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో థీమ్ ఏకంగా 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. పది ఏస్‌లు సంధించడంతోపాటు థీమ్ సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసిన దిమిత్రోవ్ ఈ గెలుపుతో నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. జొకోవిచ్ @ 300 మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, వరల్డ్ నంబర్‌వన్ జొకోవిచ్ (సెర్బియా), ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), క్వాలిఫయర్ అస్లాన్ కరాత్సెవ్ (రష్యా) కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 7–6 (7/4), 4–6, 6–1, 6–4తో 14వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)ను ఓడించి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో 300వ విజయాన్ని నమోదు చేశాడు. ఫెడరర్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. మరో మ్యాచ్‌లో కరాత్సెవ్ 3–6, 1–6, 6–3, 6–3, 6–4తో 20వ సీడ్ ఉజెర్ ఆలియాసిమ్ (కెనడా)ను ఓడించి అరంగేట్రం గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన ఏడో క్రీడాకారుడిగా ఘనత వహించాడు. మరో మ్యాచ్‌లో జ్వెరెవ్ 6–4, 7–6 (7/5), 6–3తో లజోవిచ్ (సెర్బియా)పై గెలిచాడు. -
ఆస్ట్రేలియన్ ఓపెన్: బియాంక, క్విటోవా అవుట్
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రోజు సంచలన ఫలితాలు నమోదయ్యాయి. మహిళల సింగిల్స్ విభాగంలో 2019 యూఎస్ ఓపెన్ చాంపియన్, ఎనిమిదో సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా)... 2011, 2014 వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. పురుషుల సింగిల్స్‌లో 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) కూడా రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు. అమెరికా దిగ్గజం సెరెనా విలియమ్స్‌ను 2019 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఓడించిన బియాంక మోకాలి గాయం కారణంగా గతేడాది మొత్తం ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన బియాంక రెండో రౌండ్ దాటి ముందుకెళ్లలేకపోయింది. 35 ఏళ్ల సె సువె (చైనీస్ తైపీ) 6–3, 6–2తో తొమ్మిదో ర్యాంకర్ బియాంక ఆండ్రెస్కూను ఓడించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. టాప్–10లోని క్రీడాకారిణులను ఓడించడం 71వ ర్యాంకర్ సె సువెకిది ఎనిమిదోసారి కావడం విశేషం. 83 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో బియాంక ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 25 అనవసర తప్పిదాలు చేసింది. మరో మ్యాచ్‌లో సొరానా కిర్‌స్టియా (రొమేనియా) 6–4, 1–6, 6–1తో క్విటోవాపై సంచలన విజయం సాధించింది. రెండు గంటల మూడు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సొరానా ఆరుసార్లు క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెరెనా జోరు... కెరీర్లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగిన అమెరికా దిగ్గజం సెరెనా మరో అడుగు ముందుకేసింది. నినా స్లొజనోవిచ్ (సెర్బియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ సెరెనా 6–3, 6–0తో గెలిచి మూడో రౌండ్‌కు చేరింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్) 6–2, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)పై, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) 4–6, 6–4, 7–5తో తమియనోవిచ్ (ఆస్ట్రేలియా)పై, ఏడో సీడ్ సబలెంకా (బెలారస్) 7–6 (7/5), 6–3తో కసత్కినా (రష్యా)పై, 15వ సీడ్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) 6–2, 6–4తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచి మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 1–6, 0–6తో క్వాలిఫయర్ సారా ఎరాని (ఇటలీ) చేతిలో, 17వ సీడ్ ఎలీనా రైబకినా (కజకిస్తాన్) 4–6, 4–6తో ఫియోనా ఫెరో (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయారు. అయ్యో వావ్రింకా... పురుషుల సింగిల్స్ విభాగంలో 17వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చేజేతులా ఓడిపోయాడు. ప్రపంచ 55వ ర్యాంకర్ మార్టన్ ఫుచోవిచ్ (హంగేరి)తో 3 గంటల 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వావ్రింకా 5–7, 1–6, 6–4, 6–2, 6–7 (9/11)తో పరాజయం పాలయ్యాడు. నిర్ణాయక ఐదో సెట్ టైబ్రేక్‌లో వావ్రింకా 6–1తో ఆధిక్యంలో నిలిచి విజయానికి పాయింట్ దూరంలో నిలిచాడు. అయితే ఫుచోవిచ్ వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి స్కోరును 6–6తో సమం చేశాడు. చివరకు ఫుచోవిచ్ 11–9తో టైబ్రేక్‌లో గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–7 (3/7), 7–6 (7/2), 6–3తో టియాఫో (అమెరికా)పై, మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–0, 6–2తో కోఫెర్ (జర్మనీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 6–4, 6–3తో క్రెసీ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 6–2, 6–0, 6–3తో ములెర్ (ఫ్రాన్స్)పై గెలిచారు. 11వ సీడ్ షపోవలోవ్ (కెనడా), 14వ సీడ్ రావ్‌నిచ్ (కెనడా), 15వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్), 18వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. బోపన్న జంట ఓటమి పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–బెన్ మెక్లాలన్ (జపాన్) జంట 4–6, 6–7 (0/7)తో జీ సుంగ్ నామ్–మిన్ క్యు సాంగ్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
అయ్యో హలెప్...
పారిస్: పలువురు స్టార్ క్రీడాకారిణుల గైర్హాజరీలో కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు వచ్చిన సదవకాశాన్ని టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ సిమోనా హలెప్ (రొమేనియా) చేజార్చుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఈ మాజీ చాంపియన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించి ఆశ్చర్యపరిచింది. పోలాండ్ టీనేజర్ ఇగా స్వియాటెక్ కేవలం 68 నిమిషాల్లో 6–1, 6–2తో హలెప్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. గత ఏడాది ఇదే టోర్నీలో హలెప్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 1–6, 0–6తో ఓడిపోయింది. ఏడాది తిరిగేలోపు అదే వేదికపై, ప్రిక్వార్టర్ ఫైనల్లోనే హలెప్‌ను స్వియాటెక్ చిత్తు చేయడం విశేషం. ఈ గెలుపుతో 19 ఏళ్ల స్వియాటెక్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. స్వియాటెక్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో హలెప్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశాన్ని సంపాదించకపోవడం గమనార్హం. మరోవైపు స్వియాటెక్ నాలుగుసార్లు హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. క్వాలిఫయర్ల హవా... మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు క్వాలిఫయర్లు మార్టినా ట్రెవిసాన్ (ఇటలీ), నదియా పొడొరోస్కా (అర్జెంటీనా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో 159వ ర్యాంకర్ ట్రెవిసాన్ 6–4, 6–4తో ఐదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను కంగుతినిపించగా... 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా 2–6, 6–2, 6–3తో బార్బరా క్రాయికోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గారు. తద్వారా 2012 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన క్వాలిఫయర్లుగా గుర్తింపు పొందారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించి మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఎదురులేని నాదల్... కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురిపెట్టిన పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–1, 6–1, 6–2తో సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై అలవోకగా గెలిచాడు. మరోవైపు ఇటలీకి చెందిన 75వ ర్యాంకర్ జానిక్ సినెర్ సంచలనం సృష్టించాడు. ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల సినెర్ 6–3, 6–3, 4–6, 6–3తో గెలుపొంది రాఫెల్ నాదల్ (2005లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అరంగేట్రంలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో సినెర్ ఆడనున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్, గతేడాది రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 3 గంటల 32 నిమిషాల్లో 6–4, 6–4, 5–7, 3–6, 6–3తో 239వ ర్యాంకర్ హుగో గస్టాన్ (ఫ్రాన్స్)పై గెలిచి వరుసగా ఐదో సంవత్సరం క్వార్టర్ ఫైనల్ చేరాడు. -
విజేత హలెప్
ప్రాగ్ (చెక్ రిపబ్లిక్): ఆరు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ప్రాగ్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ హలెప్ 6–2, 7–5తో మూడో సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. ఈ ఏడాది హలెప్ ఖాతాలో చేరిన రెండో టైటిల్ ఇది. ఓవరాల్‌గా ఆమె కెరీర్లో ఇది 21వ సింగిల్స్ టైటిల్. 93 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో హలెప్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. చాంపియన్ హలెప్‌నకు 25 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 71 వేలు)తోపాటు 280 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
మూడో రౌండ్లో బెన్సిక్, ప్లిస్కోవా
సీడెడ్ ప్లేయర్లు తమ జోరు కొనసాగించారు. ఆరంభ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ఎలాంటి సంచలనానికి తావివ్వకుండా నాలుగో రోజు ఆటను ముగించారు. రెండో సీడ్ ప్లిస్కోవా, నాలుగో సీడ్ హలెప్, ఆరో సీడ్ బెన్సిక్ అలవోక విజయాలతో మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మెల్బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఈసారి టైటిల్‌పై కన్నేసిన కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మరో సునాయాస విజయంతో రెండో రౌండ్‌ను దాటేసింది. 2018 రన్నరప్ హలెప్ (రొమేనియా) కూడా వరుస సెట్లలోనే ప్రత్యర్థిని ఓడించింది. స్విట్జర్లాండ్ స్టార్, ఆరో సీడ్ బెలిండా బెన్సిక్ మాజీ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్లాపెంకోను కంగుతినిపించగా... పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ నాదల్కు రెండో సెట్లో గట్టీపోటీ ఎదురైనా మ్యాచ్‌ను మాత్రం మూడు సెట్లలోనే ముగించాడు. మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) మూడో రౌండ్ చేరేందుకు ఐదు సెట్లు పోరాడాల్సి వచి్చంది. అమ్మయ్యాక తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గాయంతో ని్రష్కమించింది. ఒస్టాపెంకోకు మళ్లీ నిరాశే మహిళల సింగిల్స్‌లో జెలీనా ఒస్టాపెంకోకు ఆ్రస్టేలియా ఓపెన్‌లో మళ్లీ నిరాశ ఎదురైంది. 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ అయిన లాతి్వయా స్టార్ ఇక్కడ ఒకటి లేదంటే మూడో రౌండ్లలో ని్రష్కమించేది. తాజాగా ఆరో సీడ్ బెన్సిక్ (స్విట్జర్లాండ్) చేతిలో రెండో రౌండ్లో ఓడింది. స్విస్ క్రీడాకారిణి 7–5, 7–5తో ఒస్టాపెంకో ఆట ముగించింది. మిగతా మ్యాచ్‌ల్లో ప్లిస్కోవా 6–3, 6–3తో లౌర సీగెమండ్ (జర్మనీ)పై, హలెప్ 6–2, 6–4తో ఇంగ్లండ్ క్వాలిఫయర్ హరియెట్ డార్ట్‌పై, 17వ సీడ్ కెర్బెర్ (జర్మనీ) 6–3, 6–2తో ప్రిసిలా హాన్ (ఆ్రస్టేలియా)పై పోటీలేని విజయాలు సాధించి ముందంజ వేశారు. ఐదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) 6–2, 7–6 (8/6)తో డావిస్ (అమెరికా)ను ఓడించగా.. మాజీ ప్రపంచ నంబర్‌వన్ ముగురుజ 6–3, 3–6, 6–3తో అజ్లా టాంజనోవిక్ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించింది. మూడో రౌండ్లో నాదల్ గత ఆ్రస్టేలియన్ ఓపెన్ రన్నరప్, టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన టాప్‌సీడ్ స్పానిష్ దిగ్గజం రాఫెల్ నాదల్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో అతను 6–3, 7–6 (7/4), 6–1తో డెల్బొనిస్ (అర్జెంటీనా)ను ఓడించాడు. 19 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత అయిన నాదల్ ఇక్కడ మాత్రం ఒక్కసారి మాత్రమే... అది కూడా 11 ఏళ్ల క్రితం 2009లో టైటిల్ గెలిచాడు. మిగతా మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–6 (7/5), 6–4, 7–5తో ఎగొర్ గెలరసిమోవ్ (బెలారస్)పై, నాలుగో సీడ్ మెద్వెదెవ్ (రష్యా) 7–5, 6–1, 6–3తో పెడ్రో మార్టినెజ్ (స్పెయిన్)పై, 15వ సీడ్ వావ్రింకా 4–6, 7–5, 6–3, 3–6, 6–4తో అండ్రిస్ సెప్పి (ఇటలీ)పై విజయం సాధించారు. ఐదో సీడ్ డోమినిక్ థిమ్ (ఆ్రస్టియా) 6–2, 5–7, 6–7 (5/7), 6–1, 6–2తో ఓ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ పొందిన అలెక్స్ బోల్ట్ (ఆస్ట్రేలియా)పై శ్రమించి నెగ్గాడు. ఆ్రస్టేలియన్ స్టార్ నిక్ కిర్జియోస్ 6–2, 6–4, 4–6, 7–5తో ఫ్రాన్స్‌కు చెందిన గైల్స్ సిమోన్‌ను ఓడించాడు. -
హలెప్ ఔట్
యూఎస్ ఓపెన్‌లో మరో సంచలనం. నాలుగో సీడ్ రుమేనియన్ స్టార్ హలెప్ ఔట్... సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ ఆరో ర్యాంకర్, వింబుల్డన్ చాంపియన్ సిమోనా హలెప్ ఆట రెండోరౌండ్లోనే ముగిసింది. గత రెండేళ్లుగా ఈ టోర్నీ ఆమెకు నిరాశనే మిగిలిస్తోంది. 2017, 2018లలో తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో స్పానిష్ దిగ్గజం నాదల్ ముందంజ వేయగా, జ్వెరెవ్ రెండో రౌండ్లో శ్రమించి గట్టెక్కాడు. న్యూయార్క్: వింబుల్డన్ చాంపియన్ సిమోనా హలెప్ కథ ముగిసింది. యూఎస్ ఓపెన్‌లో ఆమె రెండో రౌండ్లోనే కంగుతింది. టాప్ సీడ్ నయోమి ఒసాకా (జపాన్) అలవోక విజయంతో ముందంజ వేయగా, పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ జ్వెరెవ్ శ్రమించి రెండో రౌండ్ అడ్డంకిని దాటాడు. స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్కు ఆస్ట్రేలియా ఆటగాడు తనసి కొకినకిస్ నుంచి వాకోవర్ లభించింది. పురుషుల డబుల్స్‌లో భారత యువ ఆటగాడు దివిజ్ శరణ్ తొలిరౌండ్లోనే నిరాశ పరిచాడు. మూడో రౌండ్లో స్విస్ స్టార్, మూడో సీడ్ రోజర్ ఫెడరర్ 6–2, 6–2, 6–1తో డానియెల్ ఇవాన్స్ (బ్రిటన్)పై సునాయాస విజయం సాధించాడు. కేవలం గంటా 20 నిమిషాల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. ఏడో సీడ్ నిషికొరి (జపాన్)కి 2–6, 4–6, 6–2, 3–6తో డి మినర్ (ఆస్ట్రేలియా) చేతిలో చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మూడో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 4–6, 6–4తో ఓన్స్ జాబెర్ (ట్యునీషియా)ను ఓడించింది. యూఎస్‌లో ఇంతేనా! అమెరికన్ క్రీడాకారిణి టేలర్ టౌన్సెండ్ ఆరేళ్లుగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడుతోంది. కానీ... ఏ సీజన్లోనూ, ఏ టోర్నీలోనూ ఇప్పటి వరకు రెండో రౌండే దాటలేదు. ఇప్పుడేమో తన గ్రాండ్‌స్లామ్ కెరీర్లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళల సింగిల్స్‌లో తాజా వింబుల్డన్ చాంపియన్, నాలుగో సీడ్ హలెప్ (రుమేనియా)ను కంగుతినిపించింది. 116వ ర్యాంకర్ అయిన అమెరికన్ 2–6, 6–3, 7–6(7/4)తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హలెప్ కథ ముగించింది. గత రెండేళ్లుగా మిగతా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో విజేత (ఫ్రెంచ్–2018), రన్నరప్ (ఆస్ట్రేలియా–2018, ఫ్రెంచ్– 2017)గా నిలుస్తున్న హలెప్ యూఎస్ ఓపెన్‌లో మాత్రం తొలిరౌండ్నే దాటలేకపోతోంది. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ ఒసాకా (జపాన్) 6–2, 6–4తో లినెట్ (పోలండ్)పై, 19వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 4–6, 6–3, 6–4తో కొలిన్స్ (అమెరికా)పై, గాఫ్ (అమెరికా) 6–4, 4–6, 6–4తో బబొస్ (హంగేరి)పై, ఒస్టాపెంకో (లాత్వియా) 6–4, 6–3తో అలిసన్ రిస్కే (అమెరికా)పై విజయం సాధించారు. దివిజ్ జోడి ఔట్: పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో భారత ఆటగాడు లియాండర్ పేస్–డ్యురన్ (అర్జెంటీనా) జోడీ 5–7, 2–6తో కెమెనొవిక్ (సెర్బియా)– కాస్పెర్ రుడ్(నార్వే) జంట చేతిలో ఓడింది. దివిజ్ శరణ్–హ్యూగో నిస్ (మొనాకొ) జంట 4–6, 4–6తో రాబర్ట్ కార్బలెస్–ఫెడెరికో డెల్బనిస్ (క్రొయేషియా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. ఐదు సెట్లవరకు పోరాటం పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–3, 3–6, 6–2, 2–6, 6–3తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై చెమటోడ్చి నెగ్గాడు. జర్మనీ ఆటగాడు మ్యాచ్ గెలిచేందుకు 3 గంటలకు పైగా పోరాటం చేశాడు. మిగతా మ్యాచ్‌ల్లో రష్యా ఆటగాడు, 5వ సీడ్ మెద్వెదెవ్ 6–3, 7–5, 5–7, 6–3తో హ్యూగో డెలియన్ (బొలివియా)పై, అమెరికాకు చెందిన 14వ సీడ్ జాన్ ఇస్నెర్ 6–3, 7–6 (7/4), 7–6 (7/5)తో స్ట్రఫ్ (జర్మనీ)పై గెలుపొందారు. 22వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 4–6, 6–3, 7–5, 6–3తో సెడ్రిక్ మార్సెల్ స్టీబ్ (జర్మనీ)ను ఓడించగా, 23వ సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–4, 6–3, 6–7 (3/7), 6–3తో జెరెమి చార్డీ (ఫ్రాన్స్)పై నెగ్గాడు. 13వ సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్) 6–3, 6–2, 6–2తో మారియస్ కొపిల్ (రుమేనియా)పై, ఆస్ట్రేలియన్ స్టార్, 28వ సీడ్ కిర్గియోస్ 6–4, 6–2, 6–4తో ఆంటోని హోంగ్ (ఫ్రాన్స్)పై వరుస సెట్లలో గెలుపొందారు. నయోమి ఒసాకా -
ఆట కోసం బ్రెస్ట్ తీయించుకుంది!
వింబుల్డన్ టైటిల్ గెలిచి సిమోనా హలెప్ చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు వెనుక ఆమె 23 ఏళ్ల కష్టం ఉంది. ఎవరు చేయని త్యాగం ఉంది. అంతకు మించి వాళ్ల అమ్మ కలను నెరవేర్చాలనే బలమైన కోరిక ఉంది. ఇవే హలెప్‌కు సెరెనా విలియమ్స్లాంటి కొండను ఢీకొట్టే ధైర్యాన్నిచ్చింది. ఏడుసార్లు చాంపియన్.. 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేతను మట్టికరిపించేలా చేసింది. కేవలం ఫైనల్‌కు చేరడమే తన లక్ష్యంగా పెట్టుకున్న ఈ రొమేనియా స్టార్ ఏకంగా టైటిల్‌నే సొంతం చేసుకుంది. నాలుగేళ్లకే టెన్నిస్ రాకెట్ పట్టుకున్న హలెప్ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె తండ్రి హలెప్‌ను ‘లిటిల్ రొలెక్స్’ అని ముద్దుగా పిలిచేవాడు. ఆట కోసం 16 ఏళ్లకే ఇళ్లును వదిలిన ఆమె నిరంతారయంగా శ్రమించింది. ఎవరూ చేయని త్యాగం.. తనకిష్టమైన ఆటకోసం హలెప్ ఎవరూ చేయని త్యాగం చేసింది. తన ఆటకు ఇబ్బంది కలుగుతుందని సర్జరీ ద్వారా బ్రెస్ట్‌నే తీయించుకుంది. తన 34DD చాతి భాగంతో తన కల నెరవేరదని భావించిన ఆమె బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీతో 34C సైజుకు తగ్గించుకుంది. 2009లో ఈసర్జరీ జరగ్గా.. అప్పటికి ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. టెన్నిస్ కోసమే ఈ పని చేసానని, అదే ఈ రోజు తనని అగ్రస్థానంలో నిలబెట్టిందని సర్జరీ గురించి ఇటీవల పేర్కొంది. అయితే ఇదేదో పెద్ద త్యాగం అనుకోవడం లేదని తెలిపింది. ఆటపై ఉన్న మక్కువనే అలా చేయించిందని స్పష్టం చేసింది. వరుస ఓటములు.. గ్రాండ్‌స్లామ్ అందుకోవడానికి హలెప్ చాలా కష్టపడింది. పలుసార్లు అడుగు దూరంలో టైటిల్ దూరమైనా ఏ మాత్రం నిరాశకు లోనవ్వలేదు. పోయినచోటే వెతుక్కోవాలని పోరాడింది. హలెప్‌కు 2014లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకునే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఒపెన్ ఫైనల్లో మారియా షరపోవా (రష్యా) చేతిలో హలెప్ ఓటమిపాలైంది. ఆ తర్వాత 2017 వరకు హలెప్‌కు ఫైనల్ చేరే అవకాశం రాలేదు. ఆ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో లాట్వియాకు చెందిన జెలెనా ఓస్టాపెంకో(20) చేతిలో హలెప్ ఖంగుతిన్నది. టైటిల్‌తో పాటు ప్రపంచ నెం1 ర్యాంకు కోల్పోయింది. 2018లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియాకి చేతిలో పరాజయం పాలైంది. ‘ఫ్రెంచ్’ కోటలో.. చివరకు ఫ్రెంచ్ కోటలోనే హలెప్‌కు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కింది. 2014, 2017లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ ముచ్చటగా మూడో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తాజాగా శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ హలెప్ 6–2, 6–2తో 11వ సీడ్, సెరెనా విలియమ్స్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. అంతేకాకుండా వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి రొమేనియా ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. మా అమ్మ కోరిక.. వింబుల్డన్ ఫైనల్ ఆడాలనేది తన తల్లి కోరికని, అది ఈ రోజు నెరవేరిందని విజయానంతరం హలెప్ సంతోషం వ్యక్తం చేసింది. ‘నా జీవితంలోనే గొప్ప మ్యాచ్ ఆడాను. వింబుల్డన్ ఫైనల్ ఆడాలన్నది మా అమ్మ కోరిక. వింబుల్డన్ ఫైనల్ ఆడితే టెన్నిస్‌లో ఏదో ఘనత సాధించినట్టేనని మా అమ్మ చెప్పింది. ఆ రోజు రానే వచ్చింది. ఆమె కోరుకున్నట్టే వింబుల్డన్‌లో ఫైనల్ ఆడటమే కాకుండా టైటిల్ కూడా గెలిచాను. మా అమ్మ కలను నిజం చేశాను.’ అని హలెప్ పట్టారని సంతోషంతో పరవశించిపోయింది. చదవండి : హై హై... హలెప్ -
హై హై... హలెప్
ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేసే అవకాశాన్ని అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి చేజార్చుకుంది. సహజశైలిలో, స్థాయికి తగ్గట్టు ఆడితే విజయం ఖాయమనుకున్న చోట ఈ నల్లకలువకు ఊహించని పరాజయం ఎదురైంది. గతంలో సెరెనాతో ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే నెగ్గిన రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ వింబుల్డన్ వేదికపై తన కెరీర్లోనే చిరస్మరణీయ విజయం నమోదు చేసుకుంది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనాపై కేవలం 56 నిమిషాల్లో అదీ నాలుగు గేమ్‌లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగురవేసిన హలెప్ కెరీర్లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. లండన్: మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన సెరెనా విలియమ్స్‌కు మళ్లీ ఆశాభంగమైంది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా స్టార్ మరో టైటిల్‌తో మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) పేరిట ఉన్న ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేయాలని ప్రయత్నించి విఫలమైంది. గత ఏడాది వింబుల్డన్‌లో, యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న సెరెనా ఈ యేడు కూడా వింబుల్డన్ ఫైనల్లో ఓటమి రుచి చూసింది. గత సంవత్సరం తుది పోరులోఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) షాక్ ఇవ్వగా... ఈసారి సిమోనా హలెప్ (రొమేనియా) ఆ పని చేసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ హలెప్ 6–2, 6–2తో 11వ సీడ్, ఏడుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. అంతేకాకుండా వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి రొమేనియా ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. విజేతగా నిలిచిన హలెప్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 26 లక్షలు)... రన్నరప్ సెరెనాకు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ.10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరంభం నుంచే దూకుడు... గతంలో 37 ఏళ్ల సెరెనాపై ఒక్కసారి మాత్రమే నెగ్గిన 27 ఏళ్ల హలెప్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో, మూడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసిన హలెప్ తన సర్వీస్‌లను కాపాడుకొని 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెరెనాకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా ఆడిన హలెప్ తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో సెరెనా పుంజుకుంటుందని ఆశించినా హలెప్ జోరు ముందు ఆమె తేలిపోయింది. ఐదో గేమ్‌లో, ఏడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసిన హలెప్ ఎనిమిదో గేమ్‌లోనూ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గతేడాది హలెప్ ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది. నా జీవితంలోనే గొప్ప మ్యాచ్ ఆడాను. వింబుల్డన్ ఫైనల్ ఆడాలన్నది మా అమ్మ కోరిక. వింబుల్డన్ ఫైనల్ ఆడితే టెన్నిస్‌లో ఏదో ఘనత సాధించినట్టేనని మా అమ్మ చెప్పింది. ఆ రోజు రానే వచ్చింది. ఆమె కోరుకున్నట్టే వింబుల్డన్‌లో ఫైనల్ ఆడటమే కాకుండా టైటిల్ కూడా గెలిచాను. మా అమ్మ కలను నిజం చేశాను. – సిమోనా హలెప్ -
హలెప్ సంచలనం
లండన్: వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో కొత్త చాంపియన్ అవతరించారు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రొమేనియా క్రీడాకారిణి, ఏడో సీడ్ సిమోనా హలెప్ విజయం సాధించారు. హలెప్ 6-2, 6-2 తేడాతో నల్లకలువ సెరెనా విలియమ్స్‌పై ఏకపక్ష విజయం సాధించి తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని ముద్దాడారు. మరొకవైపు రొమేనియా తరఫున తొలి వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ సాధించిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. తొలి సెట్‌ను అవలీలగా గెలుచుకున్న హలెప్.. రెండో సెట్లో కూడా అదే జోరును కొనసాగించారు. ఏ దశలోనూ సెరెనాకు అవకాశం ఇవ్వకుండా ఆద్యంతం దూకుడును ప్రదర్శించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఇది హలెప్‌కు రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను గెలిచిన హలెప్.. ఇప్పుడు తాజాగా వింబుల్డన్‌లో విజేతగా నిలిచారు.దాంతో అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన మార్గరెట్(24 టైటిల్స్) రికార్డును సమం చేద్దామనుకున్న సెరెనా ఆశలు తీరలేదు. వరుస రెండు సెట్లలో దారుణంగా విఫలమైన సెరెనా విలియమ్స్ రన్నరప్‌గా సరిపెట్టుకున్నారు. -
తుది పోరుకు ‘సై’రెనా
లండన్ : టెన్నిస్ దిగ్గజ మహిళా క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్(ఆస్ట్రేలియా) అత్యధిక గ్రాండ్ స్లామ్ రికార్డుకు అడుగు దూరంలో సెరెనా విలియమ్స్ నిలిచింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీ మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ 11వ సారి ఫైనల్ చేరింది. గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో 11వ సీడ్ సెరెనా 6–1, 6–2తో అన్‌సీడెడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి హలెప్‌తో జరిగే టైటిల్ పోరుకు సిద్ధమైంది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో రుమేనియా తార 7వ సీడ్ హలెప్ 6–1, 6–3తో 8వ సీడ్ స్వితోలినా(ఉక్రెయిన్)పై వరుస సెట్లల్లో గెలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ఫోర్ హ్యాండ్ షాట్లతో హోరెత్తించి.. హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగిన సెరెనా అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆడింది. తనదైన ఫోర్ హ్యాం డ్ షాట్లతో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించింది. సెరెనా ఫోర్ హ్యాండ్ షాట్లకు స్ట్రికోవా దగ్గర ఎటువంటి సమాధానం లేకపోవడంతో మొదటి సెట్‌ను 27 నిమిషాల్లో, రెండో సెట్‌ను 22 నిమిషాల్లో గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో సెరెనా 28 విన్నర్లను, 4 ఏస్‌లను కొట్టగా.. స్ట్రికోవా కేవలం 8 విన్నర్లను, ఒక ఏస్‌ను మాత్రమే కొట్టింది. తొలిసారి.. 2018 ఫ్రెంచ్ ఓపెన్ విజేత హలెప్ తన కెరీర్లోనే తొలిసారిగా వింబుల్డన్ మహిళల విభాగంలో ఫైనల్ చేరింది. టోర్నీ మొత్తం అంచనాలకు మించి రాణించిన ఉక్రెయిన్ భామ స్వితోలినా మాత్రం తన కెరీర్లో ఆడుతున్న తొలి సెమీస్‌లో తడబడింది. మ్యాచ్ ఆసాంతం క్రాస్ కోర్టు, డౌన్ ద లైన్ షాట్లతో ప్రత్యర్థిని కోర్టు నలువైపులా పరుగెత్తించిన హలెప్ 73 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసిన హలెప్ 26 విన్నర్లను కొట్టగా.. స్వితోలినా ఒక సారి మాత్రమే బ్రేక్ చేసి కేవలం 10 విన్నర్లను కొట్టింది. ఫైనల్‌కు చేరే క్రమంలో హలెప్ కేవలం ఒకే ఒక్క సెట్‌ను ప్రత్యర్థికి కోల్పోవడం విశేషం. నేటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ జొకోవిచ్ X బాటిస్టా ఫెడరర్ఠ్ X నాదల్ సాయంత్రం 5.30 నుంచి స్టార్ స్పోర్ట్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
జకోవిచ్, హలెప్ శుభారంభం
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ మాజీ నెం.1 సిమోనా హలెప్(రొమేనియా) శుభారంభం చేసింది. సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో వరల్డ్ నెం.7 హలెప్ 6–4, 7–5తో సాస్నోవిచ్(బల్గేరియా)పై గెలుపొందింది. తొలి సెట్‌ను అలవోకగా గెల్చుకున్న హలెప్‌కు రెండో సెట్లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో మూడోసీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్) 6–2, 7–6(7/4)తో జు లాంగ్(చైనా)పై, మాడిసన్ కీస్(అమెరికా) 6–3, 6–2తో ఖుమ్ఖుమ్(థాయ్‌లాండ్)పై, స్వితోలినా (ఉక్రెయిన్) 7–5, 6–0తో గవ్రిలోవా (ఆస్ట్రేలియా)పై గెలిచారు. జకోవిచ్ అలవోకగా.. పురుషుల విభాగంలో వరల్డ్ నెం.1 నొవాక్ జకోవిచ్ 6–3, 7–5, 6–3తో కొష్లిషెరిబర్ (జర్మనీ)పై అలవోకగా నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నాడు. జకోవిచ్‌కు ధాటికి రెండో సెట్లో మినహా ప్రత్యర్థి పూర్తిగా చేతులెత్తేశాడు. ఈ విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) 6–3, 6–4, 6–2తో హెర్బర్ట్ (ఫ్రాన్స్)పై, స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–3, 6–2, 6–2తో బెమెల్మెనాస్ (బెల్జియం)పై గెలుపొందారు. -
అనిసిమోవా సంచలనం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈసారి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ కనిపించనుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) ఇంటిముఖం పట్టింది. అమెరికాకు చెందిన 17 ఏళ్ల టీనేజర్ అమండ అనిసిమోవా తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్లో 6–2, 6–4తో హలెప్‌ను బోల్తా కొట్టించింది. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లో అడుగు పెట్టింది. అంతేకాకుండా నికోల్ వైదిసోవా (చెక్ రిపబ్లిక్–2007 ఆస్ట్రేలియన్ ఓపెన్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. 1990లో జెన్నిఫర్ కాప్రియాటి తర్వాత అమెరికా తరఫున ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా... 1997లో వీనస్ విలియమ్స్ తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరిన పిన్న వయస్కురాలిగా అనిసిమోవా ఘనత వహించింది. మరో క్వార్టర్ ఫైనల్లో 14వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–3, 7–5తో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది. నేడు జరిగే సెమీఫైనల్లో 14వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)తో అనిసిమోవా; మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్)తో జొహనా కొంటా (బ్రిటన్) తలపడతారు. సెమీస్‌లో జొకోవిచ్, థీమ్ పురుషుల సింగిల్స్ విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7–5, 6–2, 6–2తో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–2, 6–4, 6–2తో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో ఫెడరర్ (స్విట్జర్లాండ్); జొకోవిచ్‌తో థీమ్ ఆడతారు. -
ఇటాలియన్ ఓపెన్‌లో సంచలనం
రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంటో రెండో రౌండ్లో సంచలనం నమోదైంది. గురువారం మహిళల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ నెం.2 సిమోనా హలెప్ 6–2, 5–7, 3–6తో అన్‌సీడెడ్, వరల్డ్ నెం.44 వాండ్రొసోవా(చెక్‌రిపబ్లిక్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. హలెప్ ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేయగా, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసిన వాండ్రసోవా బ్రేక్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మహిళల సింగిల్స్‌లోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత, వరల్డ్ నెం.1 నవోమీ ఒసాకా(జపాన్) 6–3, 6–3తో సిబుల్కోవా(స్లొవేకియా)పై నెగ్గగా, తాజాగా ముగిసిన మాడ్రిడ్ ఓపెన్‌లో టైటిల్ దక్కించుకున్న కికి బెర్టెన్స్(నెదర్లాండ్స్) 6–2, 4–6, 7–5తో అనిసిమోవా(అమెరికా)పై చెమటోడ్చి గెలిచింది. వరల్డ్ నెం.2 పెట్రా క్విటోవా 6–0, 6–1తో పుతిన్త్సెవ(కజకిస్థాన్)పై, గార్బియన్ ముగురుజ(స్పెయిన్) 6–4, 4–6, 6–2తో కొలిన్స్(అమెరికా)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 7–6(7/3), 4–6, 1–6తో జొహన్నా కొంటా(బ్రిటన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. జకో, నాదల్ అలవోకగా.. పురుషుల విభాగంలో ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ 6–1, 6–3తో డేనియల్ షపలోవ్ (కెనడా)ను, ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్(స్పెయిన్) 6–0, 6–1తో జెరేమీ చార్డీ(ఫ్రాన్స్)ని చిత్తు చేయగా, స్విస్ దిగ్గజం, వరల్డ్ నెం.3 ఫెదరర్ 6–4, 6–3తో సౌసా(పోర్చుగల్)ను ఇంటిబాట పట్టిం చాడు. ఈ విభాగం లోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ నిషికోరి(జపాన్) 6–2, 6–4తో ఫ్రిట్జ్(అమెరికా)పై, ఏడో ర్యాంకర్ డెల్‌పొట్రో 6–4, 6–2తో డేవిడ్ గఫి న్(బెల్జియం)పై, వరల్డ్ నెం.8 సిట్సిపాస్ 6–3, 6–2తో సిన్నర్(ఇటలీ)పై గెలవగా తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. కాగా, వరల్డ్ నెం.4 డొమెనిక్ థీమ్(ఆస్ట్రియా) 6–4, 4–6, 5–7తో ఫ్రాన్సిస్కో వెర్దాస్కో(స్పెయిన్) చేతిలో, పదో ర్యాంకర్ మారిన్ సిలిచ్(క్రొయేషియా) 2–6, 3–6తో జె.ఎల్.స్ట్రఫ్(జర్మనీ) చేతిలో ఓడి ఇంటిబాట పట్టారు. -
పొరపాటు.. వెనుదిరిగిన మాజీ నెంబర్ వన్..!!
-
పొరపాటు.. వెనుదిరిగిన మాజీ నెంబర్ వన్..!!
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో సెరెనా విలియమ్స్ చాంపియన్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. గంటా 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ సెరెనా 6–1, 4–6, 6–4తో టాప్ సీడ్ హలెప్‌ను బోల్తా కొట్టించారు. అయితే, మ్యాచ్‌కు ముందు సెరెనా చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల కాస్త గందరగోళం, ఇంకాస్త సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అనౌన్సర్ ప్లేయర్లను పరిచయం చేసే క్రమంలో.. ‘టాప్ సీడ్, వరల్డ్ నెంబర్ వన్ సిమోనా హాలెప్ (రొమేనియా) ను ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పగానే.. సెరెనా గ్రౌండ్లోకి ప్రవేశించేందుకు నడిచారు. (సెరెనా గర్జన) టన్నెల్ దాటి నాలుగు అడుగులు వేయగానే.. తన పొరపాటును గ్రహించారు. దాంతో వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. హాలెప్ వచ్చిన అనంతరం మళ్లీ వచ్చారు. కాగా, చాలా ఏళ్లపాటు ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణిగా కొనసాగిన సెరేనా ప్రస్తుతం 16వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఇక మూడో రౌండ్లో సెరెనా సోదరి వీనస్ విలియమ్స్ హాలెప్ చేతిలో ఓడారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెరెనాపై హలెప్ గెలిచుంటే ఒకే టోర్నీలో విలియమ్స్ సిస్టర్స్ వీనస్, సెరెనాలను ఓడించిన తొమ్మిదో క్రీడాకారిణిగా గుర్తింపు పొందేవారు. సెరెనా 2017లో కూతురు అలెక్సిస్ ఒలంపియా ఒహానియన్ జూనియర్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. -
సెరెనా గర్జన
తల్లి హోదా వచ్చాక గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన 37 ఏళ్ల సెరెనా విలియమ్స్ ఆ దిశగా మరో అడుగు వేసింది. రెండేళ్ల క్రితం రెండు నెలల గర్భంతో ఈ మెగా టోర్నీలో ఆడి విజేతగా నిలిచిన ఆమె ఈసారీ అదే జోరు కనబరుస్తోంది. గత సంవత్సరం వింబుల్డన్, యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌లో ఓడిపోయిన ఈ అమెరికా నల్లకలువ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అదరగొడుతోంది. తొలి మూడు రౌండ్లలో అంతగా ప్రతిఘటన ఎదుర్కోని సెరెనాకు ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ రూపంలో అసలు సిసలు సవాల్ ఎదురైంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో 24 ఏళ్ల అనుభవమున్న సెరెనా ఈ అడ్డంకిని అద్భుత ఆటతో అధిగమించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో 12వసారి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మెల్బోర్న్: అమ్మతనం వచ్చాక తన ఆటలో మరింత పదును పెరిగిందని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ నిరూపించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో ఈ మాజీ చాంపియన్ క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మూడో రౌండ్లో తన అక్క వీనస్ విలియమ్స్‌ను ఓడించిన ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా)పై సెరెనా ప్రిక్వార్టర్ ఫైనల్లో అద్భుత విజయం సాధించింది. గంటా 47 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ సెరెనా 6–1, 4–6, 6–4తో టాప్ సీడ్ హలెప్‌ను బోల్తా కొట్టించింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో సెరెనాపై హలెప్ గెలిచుంటే ఒకే టోర్నీలో విలియమ్స్ సిస్టర్స్ వీనస్, సెరెనాలను ఓడించిన తొమ్మిదో క్రీడాకారిణిగా గుర్తింపు పొందేది. కెరీర్లో పదోసారి హలెప్‌తో తలపడిన సెరెనా తొలి సెట్‌ను కేవలం 20 నిమిషాల్లో సొంతం చేసుకుంది. తొలి గేమ్‌లోనే సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆనందం హలెప్‌నకు ఎక్కువసేపు నిలువలేదు. ఆమె వరుసగా ఆరు గేమ్‌లు కోల్పోయి సెట్‌ను సెరెనాకు అప్పగించేసింది. అయితే రెండో సెట్లో పరిస్థితి మారిపోయింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. సెరెనా ఆటకు తగిన సమాధానమిస్తూ హలెప్ స్కోరు 5–4 వద్ద బ్రేక్ పాయింట్ సంపాదించి రెండో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 3–2 వద్ద సెరెనా సర్వీస్‌లో హలెప్ మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. కానీ వాటిని అనుకూలంగా మల్చుకోవడంలో ఆమె విఫలమైంది. తీవ్రంగా పోరాడి తన సర్వీస్‌ను కాపాడుకున్న సెరెనా స్కోరును 3–3తో సమం చేసింది. ఆ తర్వాత ఏడో గేమ్‌లో హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఆమె 5–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొమ్మిదో గేమ్‌లో హలెప్ తన సర్వీస్‌ను కాపాడుకుంది. మ్యాచ్‌లో నిలవాలంటే పదో గేమ్‌లో సెరెనా సర్వీస్‌ను కచ్చితంగా బ్రేక్ చేయాల్సిన హలెప్ చేతులెత్తేయడంతో మ్యాచ్ సెరెనా వశమైంది. ఓవరాల్‌గా హలెప్‌పై సెరెనాకిది తొమ్మిదో విజయం. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మూడోది. గతంలో వీరిద్దరు తలపడిన రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీ మ్యాచ్‌లు (2016 యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్; 2011 వింబుల్డన్ రెండో రౌండ్) కూడా మూడు సెట్లపాటు సాగడం విశేషం. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)తో సెరెనా ఆడుతుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్లిస్కోవా 6–3, 6–1తో 18వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)పై విజయం సాధించింది. మరోవైపు నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), ఆరో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) క్వార్టర్ ఫైనల్ చేరేందుకు తీవ్రంగా శ్రమించారు. 13వ సీడ్ సెవస్తోవా (లాత్వియా)తో గంటా 47 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 4–6, 6–3, 6–4తో గెలుపొందింది. 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)తో గంటా 36 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వితోలినా 6–2, 1–6, 6–1తో నెగ్గి క్వార్టర్ ఫైనల్లో ఒసాకాతో పోరుకు సిద్ధమైంది. 5 గంటల 5 నిమిషాలు పోరాడి... పురుషుల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ కి నిషికోరి (జపాన్), టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), 16వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా), 28వ సీడ్ లుకాస్ పుయి (ఫ్రాన్స్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 23వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో నిషికోరి ఏకంగా 5 గంటల 5 నిమిషాలు పోరాడి 6–7 (8/10), 4–6, 7–6 (7/4), 6–4, 7–6 (10/8)తో విజయాన్ని దక్కించుకున్నాడు. తొలి రెండు సెట్లను కోల్పోయిన నిషికోరి ఆ తర్వాత వరుసగా మూడు సెట్లలో గెలిచాడు. నిర్ణాయక ఐదో సెట్ టైబ్రేక్‌లో 5–8తో వెనుకబడిన నిషికోరి ఆ తర్వాత వరుసగా ఐదు పాయింట్లు సాధించి 10–8తో టైబ్రేక్‌ను సొంతం చేసుకోవడం విశేషం. ‘నేను ఎలా పుంజుకున్నానో నాకే తెలియదు. తుది ఫలితంతో మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను’ అని క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌తో తలపడనున్న నిషికోరి వ్యాఖ్యానించాడు. 15వ సీడ్ మెద్వెదెవ్ (రష్యా)తో 3 గంటల 15 నిమిషాలపాటు సాగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్ 6–4, 6–7 (5/7), 6–2, 6–3తో గెలిచాడు. నేటి క్వార్టర్ ఫైనల్స్ పురుషుల సింగిల్స్ విభాగం సిట్సిపాస్ (VS) బాటిస్టా అగుట్ రాఫెల్ నాదల్ (VS) టియాఫో మహిళల సింగిల్స్ విభాగం పావ్లీచెంకోవా (VS) డానియెలా కొలిన్స్ క్విటోవా(VS) యాష్లే బార్టీ ఉదయం 7 గంటల నుంచి; మధ్యాహ్నం గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
హలెప్ అలవోకగా..
గతేడాది ఆఖరి మెట్టుపై బోల్తా పడిన ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి సిమోనా హలెప్ ఈసారి మాత్రం టైటిల్‌తో తిరిగి వెళ్లాలనే లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ రొమేనియా అమ్మాయి అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్‌పై అలవోక విజయంతో ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్లో చోటు కోసం వీనస్ సోదరి సెరెనాతో హలెప్ అమీతుమీ తేల్చుకోనుంది. హలెప్తోపాటు సెరెనా, ముగురుజా సునాయాసంగా ముందంజ వేయగా... ఇతర సీడెడ్ క్రీడాకారిణులు నయోమి ఒసాకా, కరోలినా ప్లిస్కోవా, ఎలీనా స్వితోలినా మాత్రం మూడో రౌండ్ దాటేందుకు కష్ట పడ్డారు. మెల్బోర్న్: టాప్ సీడ్ హోదాకు తగ్గ ప్రదర్శన చేస్తూ ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో హలెప్ 6–2, 6–3తో విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గతేడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన హలెప్‌నకు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. 19వసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న వీనస్ మ్యాచ్ మొత్తంలో నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. హలెప్ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్ పాయింట్లు సాధించే అవకాశం వచ్చినా 38 ఏళ్ల వీనస్ ఒక్కసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు 27 ఏళ్ల హలెప్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. సోమవారం సెరెనాతో జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని హలెప్ వ్యాఖ్యానించింది. ‘నేను ఓ గొప్ప చాంపియన్‌తో తలపడబోతున్నా. ఈ సవాల్‌కు నేను సిద్ధంగా ఉన్నా. ఫలితం ఎలా వచ్చినా కోల్పోయేదేమీ లేదు’ అని తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో మూడు సెట్లలో విజయాలను అందుకున్న హలెప్ తెలిపింది. మరోవైపు సెరెనా సునాయాస విజయం సాధించింది. 16వ సీడ్‌గా బరిలోకి దిగిన 37 ఏళ్ల సెరెనా 6–2, 6–1తో డయానా యెస్ట్రెంస్కా (ఉక్రెయిన్)పై గెలిచింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సెరెనా ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న డయానాను నెట్ వద్దకు వచ్చి సెరెనా ఓదార్చింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–2తో 12వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై, 18వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) 7–6 (7/5), 6–2తో తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై, 13వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) 6–3, 6–3తో 21వ సీడ్ కియాంగ్ వాంగ్ (చైనా)పై గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఓటమి దిశ నుంచి... మరోవైపు నాలుగో సీడ్ నయోమి ఒసాకా (జపాన్), ఆరో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఏడో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మూడు సెట్లపాటు పోరాడి మూడో రౌండ్‌ను దాటారు. 28వ సీడ్ సు వె సెయి (చైనీస్ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 5–7, 6–4, 6–1తో గెలిచింది. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా తొలి సెట్‌ను కోల్పోయి రెండో సెట్లో 1–4తో వెనుకబడి ఓటమి దిశగా సాగింది. అయితే గత సంవత్సరం యూఎస్ ఓపెన్ ఫైనల్లో సెరెనాపై గెలిచి పెను సంచలనం సృష్టించిన ఒసాకా పట్టుదలతో పోరాడింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ను 6–4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో మాత్రం ఒసాకా ధాటికి సు వె సెయి ఎదురునిలువలేకపోయింది. 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన మరో మ్యాచ్‌లో స్వితోలినా 4–6, 6–4, 7–5తో షుయె జాంగ్ (చైనా)పై, 2 గంటల 11 నిమిషాల పోరులో ప్లిస్కోవా 6–4, 3–6, 6–2తో 27వ సీడ్ కామిల్లా జార్జి (ఇటలీ)పై గెలుపొందారు. జొకోవిచ్ ముందుకు... పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ నిషికోరి (జపాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. జొకోవిచ్ 6–3, 6–4, 4–6, 6–0తో 25వ సీడ్ షపవలోవ్ (కెనడా)పై, జ్వెరెవ్ 6–3, 6–3, 6–2తో అలెక్స్ బోల్ట్ (ఆస్ట్రేలియా)పై, నిషికోరి 7–6 (8/6), 6–1, 6–2తో జోవో సుసా (పోర్చుగల్)పై గెలిచారు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ కొరిచ్ (క్రొయేషియా) 2–6, 6–3, 6–4, 6–3 తో క్రాజ్నోవిచ్ (సెర్బియా)పై, 23వ సీడ్ కరెనో బుస్టా (స్పెయిన్) 6–2, 6–4, 2–6, 6–4తో 12వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ)పై, 15వ సీడ్ మెద్వె దెవ్ (రష్యా) 6–2, 7–6 (7/3), 6–3తో 21వ సీడ్ గాఫిన్ (బెల్జియం)పై, 16వ సీడ్ రావ్‌నిచ్ (కెనడా) 6–4, 6–4, 7–6 (8/6)తో హెర్బర్ట్ (ఫ్రాన్స్)పై, 28వ సీడ్ లుకాస్ పుయి (ఫ్రాన్స్) 7–6 (7/3), 6–3, 6–7 (10/12), 4–6, 6–3తో పాపిరిన్ (ఆస్ట్రేలియా)పై నెగ్గారు. పేస్ జంట శుభారంభం మిక్స్డ్ డబుల్స్‌లో భారత స్టార్స్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–సమంత స్టోసుర్ (ఆస్ట్రేలియా) ద్వయం 6–4, 7–5తో క్వెటా పెశెక్ (చెక్ రిపబ్లిక్)–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) జంటను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే రోహన్ బోపన్న (భారత్)–జావోజువాన్ యాంగ్ (చైనా) జోడీ 6–3, 3–6, 6–10తో ‘సూపర్ టైబ్రేక్’లో రాబర్ట్ ఫరా (కొలంబియా)–అనా లెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది. -
అయ్యో... హలెప్!
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ తొలిరోజే... తొలిరౌండే... సంచలనంతో మొదలైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) ఆట ఆదిలోనే ముగిసింది. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ హలెప్‌కు ఎస్తోనియా ప్లేయర్ కయి కనెపి షాక్ ఇచ్చింది. వరుస సెట్లలో నంబర్‌వన్‌కు ఇంటిదారి చూపించింది. కనెపి 6–2, 6–4తో హలెప్‌ను కంగుతినిపించింది. సోమవారం జరిగిన ఈ పోరులో టాప్ సీడ్‌ను ఓడించేందుకు కనెపి పెద్దగా కష్టపడలేదు. కేవలం 76 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించింది. ఈ మ్యాచ్‌లో హలెప్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. మ్యాచ్ మొత్తంమీద 9 విన్నర్లే కొట్టిన హలెప్ ఒక ఏస్ సంధించింది. మరోవైపు మ్యాచ్ ఆసాంతం దూకుడుగా ఆడిన కనెపి 26 విన్నర్లు కొట్టింది. 5 బ్రేక్ పాయింట్లను సాధించింది. ఇతర మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 1–6, 6–1తో సచియా వికెరి (అమెరికా)పై, ఇరినా కెమెలియా (రొమేనియా) 6–3, 6–3తో బ్రాడీ (అమెరికా)పై గెలుపొందగా... 31వ సీడ్ మగ్ధలినా రిబరికోవా (స్లొవేకియా) 2–6, 2–6తో కియాంగ్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 18వ సీడ్ జాక్సాక్ (అమెరికా) 6–0, 7–6 (7/4), 6–2తో అండ్రియోజి (అర్జెంటీనా)పై, కరెన్ ఖచనోవ్ (రష్యా) 6–3, 6–2, 6–3తో ఆల్బర్ట్ రామోస్ వినోలస్ (స్పెయిన్)పై విజయం సాధించారు. యూఎస్ ఓపెన్ చరిత్రలో టాప్ సీడ్ క్రీడాకారిణి తొలి రౌండ్లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. గతేడాది కూడా హలెప్ తొలి రౌండ్లోనే ఓడిపోయినా ఆమె రెండో సీడ్‌గా బరిలోకి దిగింది. -
ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత సిమోనాహలెప్
-
‘ఫ్రెంచ్’ కోటలో కొత్త రాణి
పోయినచోటే వెతుక్కోవాలి. రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్ విషయంలో ఇది నిజమైంది. గత ఏడాది అన్‌సీడెడ్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెంకోతో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఒక దశలో విజయానికి చేరువై... ఆ తర్వాత తడబడి ఓటమిని మూటగట్టుకున్న ఆమె సంవత్సరం తిరిగేలోపు అదే వేదికపై విజయ గర్జన చేసింది. ఈసారి కూడా ఫైనల్లో హలెప్‌కు ఓటమి తప్పదా అనే పరిస్థితి నుంచి కోలుకొని అద్వితీయ పోరాటంతో విజయం వైపు అడుగు వేయడం విశేషం. పారిస్: ఎర్రమట్టి కోటలో కొత్త రాణి కొలువైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా మూడో ఏడాది మహిళల సింగిల్స్ విభాగంలో నయా చాంపియన్ అవతరించింది. 2014, 2017లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ సిమోనా హలెప్ ముచ్చటగా మూడో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ హలెప్ 3–6, 6–4, 6–1తో పదో సీడ్, 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. విజేతగా నిలిచిన హలెప్‌కు 22 లక్షల యూరోలు (రూ. 17 కోట్ల 48 లక్షలు), రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్కు 11 లక్షల 20 వేల యూరోలు (రూ. 8 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత ఏడాది అన్‌సీడెడ్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)తో జరిగిన ఫైనల్లో హలెప్ తొలి సెట్‌ను గెలిచి, రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలో నిలిచి విజయానికి చేరువైంది. కానీ ఒస్టాపెంకో ధాటికి తడబడి చివరకు ఓటమిపాలైంది. ఈసారి స్లోన్తో జరిగిన తుది పోరులో హలెప్ తొలి సెట్‌ను చేజార్చుకుంది. రెండో సెట్లో 0–2తో వెనుకబడింది. మళ్లీ గత ఏడాది దృశ్యమే పునరావృతమవుతుందా అని సందేహిస్తున్న తరుణంలో హలెప్ నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. మూడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, నాలుగో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. ఆ తర్వాత ఐదో గేమ్‌లో సర్వీస్ కాపాడుకొని, ఆరో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను మరోసారి బ్రేక్ చేసిన హలెప్ 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఏడో గేమ్‌లో హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్లోన్, ఎనిమిదో గేమ్‌లో సర్వీస్ కాపాడుకొని స్కోరును 4–4తో సమం చేసింది. కీలకమైన తొమ్మిదో గేమ్‌లో హలెప్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, పదో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండో సెట్‌ను 6–4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో హలెప్ తన విశ్వరూపం ప్రదర్శించింది. రెండుసార్లు స్లోన్ సర్వీస్‌లను బ్రేక్ చేసి, తన సర్వీస్‌లను నిలబెట్టుకొని 6–1తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. విశేషాలు వర్జినియా రుజుసి (1978లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో రొమేనియా క్రీడాకారిణి హలెప్. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల,జూనియర్ బాలికల సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఎనిమిదో క్రీడాకారిణి హలెప్. 2008 లో హలెప్ జూనియర్ సింగిల్స్ టైటిల్ నెగ్గింది. గత ఏడాది చేసిన పొరపాట్లు ఈసారి పునరావృతం చేయకూడదని అనుకున్నాను. ఈ విజయంతో నా కల నిజమైంది. రెండో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో ఒత్తిడికి లోనుకావొద్దని, ఆటను ఆస్వాదించాలని భావించాను. అదే చేసి కోలుకున్నాను. మ్యాచ్ చివరి గేమ్‌లోనైతే నాకు ఊపిరి ఆడనంత పనైంది. – సిమోనా హలెప్ -
హై హై హలెప్
పారిస్: గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ సిమోనా హలెప్ ఈసారి మాత్రం టైటిల్ సాధించే దిశగా మరో అడుగు వేసింది. మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)తో బుధవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ 6–7 (2/7), 6–3, 6–2తో విజయం సాధించింది. 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో హలెప్ తొలి సెట్లో 0–4తో వెనుకబడింది. ఆ తర్వాత మూడుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పుంజుకుంది. అయితే టైబ్రేక్‌లో 12వ సీడ్ కెర్బర్ పైచేయి సాధించింది. తొలి సెట్ కోల్పోయినా హలెప్ విజయంపై ఆశలు వదులుకోలేదు. లోపాలను సరిదిద్దుకొని రెండుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోనూ హలెప్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి మూడుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి అదే ఊపులో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ‘తొలి సెట్ చేజార్చుకున్నా పట్టువదలకుండా పోరాడాలని నిశ్చయించుకున్నాను. తొలి సెట్ ఆరంభంలో ఎక్కువ ప్రయోగాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. ఆ తర్వాత నా వ్యూహాల్లో మార్పు చేసి ఫలితాన్ని సాధించాను’ అని హలెప్ వ్యాఖ్యానించింది. షరపోవా చిత్తు... మరో క్వార్టర్ ఫైనల్లో 2016 చాంపియన్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) ధాటికి మాజీ విజేత, రష్యా స్టార్ షరపోవా హడలిపోయింది. ఆరేళ్ల కాలంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ముగురుజా 6–2, 6–1తో 28వ సీడ్ షరపోవాను చిత్తుగా ఓడించి హలెప్‌తో సెమీస్ పోరుకు సిద్ధమైంది. 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో 3–6, 0–6తో అజరెంకా (బెలారస్) చేతిలో ఓటమి తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో షరపోవా ఏకపక్ష ఓటమిని చవిచూడటం ఇదే తొలిసారి. సెమీస్‌లో ముగురుజాపై గెలిస్తే హలెప్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను పదిలం చేసుకుంటుంది. ఒకవేళ హలెప్ ఓడిపోతే ముగురుజాకు నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమవుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ముగురుజా ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. మరోవైపు హలెప్ రెండు సెట్లను చేజార్చుకుంది. నాదల్ మ్యాచ్ నేటికి వాయిదా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా నిలవడంతో గురువారానికి వాయిదా వేశారు. డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)తో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) తొలి సెట్‌ను 4–6తో కోల్పోయి... రెండో సెట్లో 5–3తో ఆధిక్యంలో ఉన్నాడు. మారిన్ సిలిచ్ (క్రొయేషియా), డెల్ పొట్రో (అర్జెంటీనా) మధ్య మ్యాచ్‌లో ఇద్దరూ తొలి సెట్లో 6–6 పాయింట్ల వద్ద... టైబ్రేక్‌లో 5–5తో సమంగా ఉన్నారు. ఈ దశలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు. -
హలెప్ హవా...
అపారిస్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నా... ఎంతోకాలంగా ఊరిస్తోన్న గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న సిమోనా హలెప్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ రొమేనియా క్రీడాకారిణి అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ 6–2, 6–1తో 16వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. 59 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హలెప్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించడంతోపాటు నెట్ వద్దకు 10 సార్లు వచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది. గత ఐదేళ్లలో ఈ టోర్నీలో హలెప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. క్వార్టర్ ఫైనల్లో మాజీ నంబర్‌వన్, 12వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)తో హలెప్ తలపడుతుంది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో కెర్బర్ 6–2, 6–3తో ఏడో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది. కసత్కినా సంచలనం మరోవైపు రష్యా యువతార దరియా కసత్కినా తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, రెండో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించి కసత్కినా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. గంటా 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కసత్కినా 7–6 (7/5), 6–3తో వొజ్నియాకిపై నెగ్గింది. నాదల్ జోరు... పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ 34వ సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 6–3, 6–2, 7–6 (7/4)తో మాక్సిమిలియన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. నాదల్ కెరీర్లో ఇది 900వ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో ఓపెన్ శకంలో (1967 తర్వాత) కనీసం 900 విజయాలు సాధించిన ఐదో ప్లేయర్‌గా నాదల్ గుర్తింపు పొందాడు. జిమ్మీ కానర్స్ (అమెరికా –1,256), ఫెడరర్ (స్విట్జర్లాండ్–1,149), లెండిల్ (అమెరికా–1,068), గిలెర్మో విలాస్ (అర్జెంటీనా– 948) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆదివారం తన 32వ జన్మదినాన్ని జరుపుకున్న ఈ స్పెయిన్ స్టార్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో తొలి రెండు సెట్లలో అంతగా పోటీ ఎదురుకాలేదు. కానీ మూడో సెట్లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌ను కోల్పోయి మిగతా వాటిని నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నాదల్ పైచేయి సాధించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 1–6, 2–6, 7–5, 7–6 (9/7), 6–2తో అండ ర్సన్ (దక్షిణాఫ్రికా)పై, డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 6–4, 6–4తో ఇస్నెర్ (అమెరికా)పై, సిలిచ్ (క్రొయేషియా) 6–4, 6–1, 3–6, 6–7 (4/7), 6–3తో ఫాగ్నిని (ఇటలీ)పై గెలిచారు. షరపోవాకు సెరెనా వాకోవర్... ఇద్దరు మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా) మధ్య సోమవారం ‘బ్లాక్ బస్టర్’ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాలని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. భుజం కండరాలు పట్టేయడంతో సెరెనా కోర్టులోకి అడుగు పెట్టకుండానే షరపోవాకు ‘వాకోవర్’ ఇచ్చింది. దాంతో షరపోవా బరిలోకి దిగకుండానే క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ‘భుజం కండరాలు పట్టేయడంతో సర్వీస్ చేసే పరిస్థితిలో లేను. టోర్నీకి ముందు ఈ సమస్య లేదు. జూలియా జార్జెస్‌తో జరిగిన మూడో రౌండ్లో భుజం నొప్పి మొదలైంది. గాయం కారణంగా వైదొలుగుతున్నందుకు చాలా బాధగా ఉంది’ అని సెరెనా వ్యాఖ్యానించింది. -
హలెప్ టాప్ ర్యాంకు పదిలం
మాడ్రిడ్: మహిళల టెన్నిస్ అసోసియేషన్ ర్యాంకింగ్స్‌లో రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ తన టాప్ ర్యాంకును పదిలంగా ఉంచుకుంది. తాజాగా విడుదుల చేసిన ర్యాంకింగ్స్‌లో హలెప్ 8,140 పాయింట్లతో నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. ఆ తర్వాత స్థానాల్లో వొజ్నయాకి(డెన్మార్క్-6,790 పాయింట్లు), ముగురుజా(స్పెయిన్-5,970 పాయింట్లు), ఇలినా స్విటోలినా(ఉక్రెయిన్-5,630)లు ఉన్నారు. కాగా, యూఎస్ క్రీడాకారిణి స్టీఫెన్స్ తన కెరీర్లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం స్టీఫెన్స్ 3,938 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. -
ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్
కాలిఫోర్నియా: ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి సిమోనా హలెప్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హలెప్ 3-6, 0-6 తేడాతో జపాన్‌కు చెందిన అన్ సీడెడ్ క్రీడాకారిణి నయోమి ఒసాకా చేతిలో ఓటమి పాలైంది. 64 నిమిషాల పాటు జరిగిన పోరులో హలెప్ ఏ దశలోనూ ఆకట్టులేకపోయింది. అనవసర తప్పిదాలతో తొలి సెట్‌ను కోల్పోయిన హలెప్.. రెండో సెట్లో కూడా అదే పునరావృతం చేసింది. ఫలితంగా టోర్నీ నుంచి హలెప్ నిష్ర్రమించగా, ఒసాకా ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగే తుదిపోరులో రష్యాకు చెందిన దారియా కసాత్కినాతో ఒసాకా అమీతుమీ తేల్చుకోనుంది. -
కొత్త చాంపియన్ వొజ్నియాకి..
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ ఓపెన్ టోర్నీలో రెండో సీడ్, డెన్మార్క్ క్రీడాకారిణి వొజ్నియాకి కొత్త చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో వొజ్నియాకి 7-6(7/2), 3-6, 6-4 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి హలెప్(రొమేనియా)పై విజయం సాధించి తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించింది. మరొకవైపు ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరిన మొదటిసారే టైటిల్‌ను సాధించిన క్రీడాకారిణిగా అరుదైన ఘనతను వొజ్నియాకి సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టై బ్రేక్ ద్వారా దక్కించుకున్న వొజ్నియాకి.. రెండో సెట్‌ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో వొజ్నియాకి విజృంభించి పదునైన సర్వీస్‌లను సంధించింది. దాంతో తడబాటకు లోనైన హలెప్.. వరుస పాయింట్లను కోల్పోయి సెట్‌తో పాటు టైటిల్‌ను కూడా చేజార్చుకుంది. ఇది హలెప్‌కు మూడో గ్రాండ్ స్లామ్ ఫైనల్ కాగా, మూడుసార్లు రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. 2014, 2017ల్లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు చేరినా హలెప్ విజేతగా నిలవకలేకపోయింది.మరొకవైపు 2009, 2014 సంవత్సరాల్లో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన వొజ్నియాకి టైటిల్ సాధించడంలో విఫలమైంది. -
కెర్బర్ అవుట్.. ఫైనల్లో హలెప్
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి, రొమేనియా టెన్నిస్ ప్లేయర్ సిమోనా హలెప్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ పోరులో హలెప్ 6-3, 4-6, 9-7 తేడాతో జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్‌ను ఓడించి తుది పోరుకు సిద్దమైంది. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో హలెప్ కడవరకూ పోరాడి విజయం సాధించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన హలెప్.. రెండో సెట్లో ఓటమి పాలైంది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ అనివార్యమైంది. తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో సెట్లో హలెప్ తన అనుభవాన్ని ఉపయోగించి గెలుపును సొంతం చేసుకోవడమే కాకుండా ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగే తుది పోరులో వొజ్నియాకితో హలెప్ అమీతుమీ తేల్చుకోనుంది. -
‘కొత్త నంబర్‌వన్’ హలెప్
బీజింగ్: మహిళల టెన్నిస్‌లో ఈ ఏడాది సిమోనా హలెప్ రూపంలో ఐదో క్రీడాకారిణి ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను ఖాయం చేసుకుంది. చైనా ఓపెన్‌లో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా హలెప్... సోమవారం విడుదల చేసే తాజా ర్యాంకింగ్స్‌లో ముగురుజా (స్పెయిన్) నుంచి నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంటుంది. సెమీఫైనల్లో హలెప్ 6–2, 6–4తో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)తో హలెప్ ఆడుతుంది. టాప్ ర్యాంక్ ఖాయం చేసుకున్నందుకు నిర్వాహకులు హలెప్‌కు నంబర్‌వన్ అంకె రూపంలో ఉన్న పూల బోకేను అందజేశారు. 1975లో కంప్యూటర్ ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టాక టాప్ ర్యాంక్‌లో నిలువనున్న 25వ క్రీడాకారిణిగా, రొమేనియా తరఫున తొలి ప్లేయర్‌గా హలెప్ గుర్తింపు పొందనుంది. ‘నా కల నిజమైంది. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నా కోరిక నెరవేరడంతో కోర్టులోనే తొలిసారి ఆనందభాష్పాలు వచ్చేశాయి. ఇక నా తదుపరి లక్ష్యం గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడం’ అని 26 ఏళ్ల హలెప్ వ్యాఖ్యానించింది. ఈ ఏడాది కెర్బర్ (జర్మనీ), సెరెనా (అమెరికా), ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ముగురుజా (స్పెయిన్) నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. -
రష్యా భామను చిత్తుగా ఓడించి..
బీజింగ్: చైనా ఓపెన్ లో రష్యా టెన్నిస్ క్వీన్, మాజీ నెంబర్ వన్ మరియా షరపోవాకు చుక్కెదురైంది. డోపింగ్ ఆరోపణలతో 15 నెలల నిషేధం తర్వాత ఆడిన ప్రతి టోర్నమెంట్లో ఏదో ఓ దశలో ఇంటిబాట పడుతున్న షరపోవా.. తాజాగా చైనా ఓపెన్ మూడో రౌండ్లో ఓటమి పాలైంది. రొమేనియా భామ, వరల్డ్ నెంబర్ 2 సిమోనా హలెప్ చేతిలో 6-2, 6-2తో రెండు వరుస సెట్లు కోల్పోయిన షరపోవా చైనా ఓపెన్ నుంచి నిష్క్రమించింది. వరుస సెట్లలో షరపోవాకు ముచ్చెమటలు పట్టించిన హలెప్ ఈ విజయంతో గతంలో ఎదురైన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకుంది. డోపింగ్ నిషేధం తర్వాత గత ఏప్రిల్ లో మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టిన రష్యన్ టెన్సిస్ క్వీన్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. బీజింగ్ లోని హార్డుకోర్టులోనూ రాణించలేకపోవడంతో హలెప్ చేతిలో చిత్తయింది. ఇటీవల యూఎస్ ఓపెన్ టోర్నీలో నాలుగో రౌండ్లో లాత్వియాకు చెందిన అనస్తాసిజా సెవస్తోవా చేతిలో 5-7, 6-4, 6-2 తేడాతో షరపోవా ఓటమిపాలైంది. మునుపటిలా గ్రాండ్ స్లామ్ లు, భారీ టోర్నీలు నెగ్గాలంటే షరపోవా అంతకుమించి శ్రమించాల్సి ఉంటుందని టెన్నిస్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు వరల్డ్ నెంబర్ వన్ ముగురుజా టోర్నీ నుంచి ఇదివరకే తప్పుకోవడంతో, చైనా ఓపెన్ లో హలెప్ అవకాశాలు మెరుగయ్యాయి. -
సూపర్ షరపోవా
♦ గ్రాండ్’గా రష్యా స్టార్ పునరాగమనం ♦ యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లో ♦ రెండో సీడ్ హలెప్‌పై విజయం న్యూయార్క్: డోపింగ్ కారణంగా 15 నెలల పాటు ఆటకు దూరమైనా... తన ఆటతీరులో ఏమాత్రం పదును తగ్గలేదని రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా నిరూపించుకుంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ఈ మాజీ నంబర్‌వన్ ఘనంగా పునరాగమనం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో షరపోవా 6–4, 4–6, 6–3తో ప్రపంచ రెండో ర్యాంకర్, రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను బోల్తా కొట్టించింది. 2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో షరపోవా ఖాతాలో 60 విన్నర్స్, 64 అనవసర తప్పిదాలు, ఏడు ఏస్‌లు, ఏడు డబుల్ ఫాల్ట్‌లు ఉన్నప్పటికీ... కీలక దశలో పాయింట్లు నెగ్గడం ఆమెకు కలిసొచ్చింది. మరోవైపు హలెప్ కేవలం 15 విన్నర్స్ సాధించింది. షరపోవా సర్వీస్‌ను పదిసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా హలెప్ నాలుగుసార్లు మాత్రమే సఫలమైంది. తన సర్వీస్‌ను మాత్రం ఐదుసార్లు కోల్పోయింది. షరపోవా చేతిలో హలెప్కిది వరుసగా ఏడో పరాజయం. యూఎస్ ఓపెన్ తుది ఫలితం ద్వారా ఈసారి మహిళల సింగిల్స్‌లో ఏకంగా ఎనిమిది మందికి టాప్ ర్యాంకర్ అయ్యే అవకాశం ఉండగా... ఈ ఓటమితో హలెప్‌కు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ అయ్యే అవకాశం చేజారిపోయింది. ఆరో సీడ్ కెర్బర్, ఏడో సీడ్ కొంటా అవుట్... మరోవైపు ఆరో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), ఏడో సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. నవోమి ఒసాకా (జపాన్) 6–3, 6–1తో కెర్బర్‌ను... క్రునిక్ (సెర్బియా) 4–6, 6–3, 6–4తో కొంటాను ఓడించి సంచలనం సృష్టించారు. గత ఏడాది రన్నరప్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ప్లిస్కోవా 6–2, 6–1తో మగ్దా లినెట్టి (పోలాండ్)పై అలవోకగా గెలిచింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్, తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–3, 3–6, 6–2తో కుజ్మోవా (స్లొవేకియా)పై, 23వ సీడ్ స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో మిసాకి దోయి (జపాన్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్, ఐదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఎనిమిదో సీడ్ సోంగా (ఫ్రాన్స్), పదో సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) రెండో రౌండ్లోకి ప్రవేశిం చారు. తొలి రౌండ్లో సిలిచ్ 6–4, 6–3, 3–6, 6–3తో సాండ్‌గ్రెన్ (అమెరికా)పై, జ్వెరెవ్ 7–6 (11/9), 7–5, 6–4తో డారియన్ కింగ్ (బార్బడోస్)పై, సోంగా 6–3, 6–3, 6–4తో కోపిల్ (రొమేనియా)పై, ఇస్నెర్ 6–1, 6–3, 4–6, 6–3తో హెర్బెర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. -
నిషేధం తర్వాత అద్భుత విజయం
సాక్షి, న్యూయార్క్: యూఎస్ ఓపెన్ 2017ను మాజీ ప్రపంచనెంబర్ వన్ స్టార్ మరియా షరపోవా అద్భుత విజయంతో ఆరంభించారు. డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధం అనంతరం తొలిసారి రాకెట్ పట్టిన ఆమె రెండో సిమోనా హలెప్‌ను 6-4, 4-6, 6-3 వరుస సెట్లలో మట్టి కరిపించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా, హలెప్‌లు హోరాహోరీగా తలపడ్డారు. ఒత్తిడి అధిగమించే క్రమంలో తడబాటుకు గురైన హలెప్ మ్యాచ్‌లో చిత్తైయ్యారు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన షరపోవా.. నాకు ఇదో కొత్త రోజుగా భావించాను. కొత్త అవకాశం. కొత్త మ్యాచ్. గెలవాలనే బరిలోకి దిగాను. కానీ అంతకంటే ఎక్కువ సాధించినట్లు అనిపిస్తోంది.' అని అన్నారు. -
హాలెప్ కు షాక్
మెల్బోర్న్:ఈ సీజన్ ఆరంభపు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నాల్గో సీడ్ క్రీడాకారిణి సిమోనా హాలెప్(రొమేనియా)కు ఆదిలోనే షాక్ తగిలింది. మహిళల సింగిల్స్ లో హాలెప్ తొలి రౌండ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం జరిగిన పోరులో హాలెప్ 3-6, 1-6 తేడాతో అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ చేతిలో ఓటమి పాలైంది. గంటా 15 నిమిషాలు పాటు జరిగిన పోరులో షెల్బీ రోజర్స్ కు హాలెప్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఏకపక్షంగా సాగిన రెండు సెట్లను రోజర్స్ తిరుగులేని ఆధిక్యాన్ని చెలాయించి రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. రెండు వారాల క్రితం జరిగిన బ్రిస్బేన్ టోర్నీలో టాప్-10 క్రీడాకారిణి బౌచర్డ్‌పై రోజర్స్ సంచలన విజయం సాధించింది. ఇదిలా ఉంచితే గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా హాలెప్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇక్కడ గమనార్హం. మరొకవైపు బ్రిటన్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ముర్రే 7-5,7-6(7/5),6-2 తేడాతో మార్చెన్కోపై విజయం సాధించి శుభారంభం చేశాడు. -
ప్రిక్వార్టర్స్ కు హాలెప్
లండన్:ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్ స్లామ్లో రొమేనియా క్రీడాకారిణి, ఐదో సీడ్ సిమోన్ హాలెప్ నాల్గో రౌండ్లోకి ప్రవేశించింది. శుక్రవారం ఆలస్యంగా జరిగిన మూడో రౌండ్లో హాలెప్ 6-4, 6-3 తేడాతో అన్‌సీడెడ్ ప్లేయర్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) పై గెలిచి ప్రిక్వార్టర్స్ లో కి దూసుకెళ్లింది. ఇప్పటివరకూ ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకోని హాలెప్ మాత్రం ఆద్యంత ఆకట్టుకుంది. తొలి రెండు సెట్లలో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసిన హాలెప్ మరో అడుగు ముందుకేసింది. గత ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే కెర్బర్‌ను ఓడించడంతో పాటు సెమీస్ చేరిన కికి బెరటెన్స్ .. ఈ టోర్నీ మూడో రౌండ్ లో ఎటువంటి ప్రతిఘటన లేకుండా టోర్నీ నుంచి నిష్ర్కమించింది. -
షరపోవా సులభంగా..
మూడో రౌండ్లోకి రష్యా స్టార్ ♦ మూడో సీడ్ హలెప్‌కు మిర్యానా షాక్ ♦ ఫెడరర్, నిషికోరి ముందంజ ♦ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్ : గతేడాది విజేత షరపోవా మరో అలవోక విజయంతో ముందుకు దూసుకెళ్లగా... నిరుటి రన్నరప్ సిమోనా హలెప్ మాత్రం అనూహ్య ఓటమితో ఇంటిముఖం పట్టింది. ఫలితంగా సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్‌లో నాలుగో రోజు మరో సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరిగా భావించిన సిమోనా హలెప్‌కు వెటరన్ క్రీడాకారిణి మిర్యానా లూసిచ్ బరోని (క్రొయేషియా) షాక్ ఇచ్చింది. వరుస సెట్లలో 7-5, 6-1తో ఓడించి మూడో రౌండ్లోకి అడుగుపెట్టింది. గతేడాది యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ హలెప్‌ను బోల్తా కొట్టించిన 33 ఏళ్ల మిర్యానా అదే ఫలితాన్ని ఫ్రెంచ్ ఓపెన్‌లో పునరావృతం చేసింది. హోరాహోరీగా సాగిన తొలి సెట్లో కీలకదశలో మిర్యానా భారీ సర్వీస్‌లు, శక్తివంతమైన గ్రౌండ్‌స్ట్రోక్స్‌తో విజృంభించింది. ఏకపక్షంగా జరిగిన రెండో సెట్లో మిర్యానా 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అతికష్టమ్మీద ఒక గేమ్ నెగ్గిన హలెప్ ఆ తర్వాత ఓటమిని తప్పించుకోలేకపోయింది. మ్యాచ్ మొత్తంలో మిర్యానా 29 విన్నర్స్ కొట్టగా, హలెప్ కేవలం ఐదింటితో సరిపెట్టుకుంది. తన దేశానికే చెందిన వితాలియా దియత్చెంకోతో జరిగిన రెండో రౌండ్లో షరపోవా ఆద్యంతం ఆధిపత్యం చలాయించింది. నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు వితాలియా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ఈ డిఫెండింగ్ చాంపియన్ 24 విన్నర్స్ కొట్టి, కేవలం ఎనిమిది అనవసర తప్పిదాలు చేసింది. తదుపరి రౌండ్లో సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా)తో షరపోవా ఆడుతుంది. గతేడాది వీరిద్దరూ ప్రిక్వార్టర్ ఫైనల్లో తలపడగా, మూడు సెట్లలో షరపోవాను విజయం వరించింది. రెండో రౌండ్లో సమంతా స్టోసుర్ 6-0, 6-1తో అమందైన్ హెసి (ఫ్రాన్స్)పై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో 29వ సీడ్ అలీజా కార్నె (ఫ్రాన్స్) 6-2, 7-5తో డల్గెరు (రుమేనియా)పై, 13వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-2, 6-0తో కురుమి నారా (జపాన్)పై నెగ్గారు. పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-2, 7-6 (7/1), 6-3తో గ్రానోలెర్స్ (స్పెయిన్)పై, నాలుగో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-3, 6-7 (7/9), 6-3, 6-3తో స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)పై, ఐదో సీడ్ నిషికోరి (జపాన్) 7-5, 6-4, 6-4తో బెలూచి (బ్రెజిల్)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఎనిమిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-4, 5-7, 6-3తో లాజోవిచ్ (సెర్బియా)పై, 12వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్) 7-5, 6-2, 6-3తో క్లిజాన్ (స్లొవేకియా)పై, 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 6-1, 6-1తో డూడీ సెలా (ఇజ్రాయెల్)పై గెలిచారు. 24వ సీడ్ గుల్బిస్ (లాత్వియా) 3-6, 6-3, 5-7, 3-6తో మహుట్ (ఫ్రాన్స్) చేతిలో, 28వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) 1-6, 3-6, 5-7తో పెయిర్ (ఫ్రాన్స్) చేతిలో, 19వ సీడ్ అగుట్ (స్పెయిన్) 4-6, 2-6, 2-6తో లూకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయారు. -
16 ఏళ్ల తర్వాత...
సెరెనాకు దారుణ ఓటమి సింగపూర్: మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్‌కు దారుణ ఓటమి ఎదురైంది. సిమోనా హలెప్ (రుమేనియా)తో బుధవారం జరిగిన ‘రెడ్ గ్రూప్’ లీగ్ మ్యాచ్‌లో సెరెనా 0-6, 2-6తో ఓడిపోయింది. తాను ఓడిపోయిన మ్యాచ్‌లో సెరెనా కేవలం రెండు గేమ్‌లు మాత్రమే గెలవడం 16 ఏళ్ల తర్వాత ఇప్పుడే. చివరిసారి సెరెనాకు ఈ తరహా ఓటమి 1998లో ఎదురైంది. ఒక్లాహామా సిటీ టోర్నమెంట్లో సెరెనా 1-6, 1-6తో జోనెట్ క్రుగెర్ (దక్షిణాఫ్రికా) చేతిలో ఓడిపోయింది. -
ఫ్రెంచ్ ఓపెన్ ను చేజిక్కించుకున్న షరపోవా
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్ ను మరోసారి మరియా షరపోవా (రష్యా) చేజిక్కించుకుంది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో షరపోవా 6-4, 6-7, 6-4 తేడాతో సిమోనా హలెప్ (రుమేనియా) పై విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో షరపోవా పదునైన సర్వీస్ లతో హలెప్ కు షాకిచ్చింది. తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన హలెప్ టైటిల్ ఆశలకు షరపోవా గండి కొట్టింది. గత ఆరేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరిస్తూ వస్తున్న ఆనవాయితీకి కూడా షరపోవా బ్రేక్ వేసి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. వరుసగా మూడో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన షరపోవా.. కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన సిమోనా హలెప్ లు ఫైనల్ కు చేరే క్రమంలో ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన సిమోనా అదే జోరును అంతిమ పోరులో కొనసాగించలేకపోయింది. కాగా, కెరీర్లో సిమోనాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన షరపోవా మళ్లీ అదే పునరావృతం చేసి తనకు తిరుగులేదని నిరూపించింది. 2012 లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకున్న షరపోవా తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. -
షరపోవా x సిమోనా
సాయంత్రం గం. 6.30 నుంచి నియో ప్రైమ్‌లో ప్రత్యక్ష ప్రసారం గత ఆరేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరిస్తోంది. ఆ ఆనవాయితీ ఈ ఏడాదీ కొనసాగుతుందా? లేదంటే మాజీ విజేత షరపోవా రెండోసారి టైటిల్ సాధిస్తుందో ఈ రోజు తేలిపోనుంది. వరుసగా మూడో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన షరపోవా (రష్యా) కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడనున్న సిమోనా హలెప్ (రుమేనియా)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ చేరే క్రమంలో ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని సిమోనా అదే జోరును అంతిమ పోరులోనూ కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. కెరీర్లో సిమోనాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన షరపోవా అలాంటి ఫలితాన్ని మరోసారి పునరావృతం చేయాలనే కృతనిశ్చయంతో ఉంది.