వింబుల్డన్ టైటిల్ గెలిచి సిమోనా హలెప్ చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు వెనుక ఆమె 23 ఏళ్ల కష్టం ఉంది. ఎవరు చేయని త్యాగం ఉంది. అంతకు మించి వాళ్ల అమ్మ కలను నెరవేర్చాలనే బలమైన కోరిక ఉంది. ఇవే హలెప్‌కు సెరెనా విలియమ్స్‌లాంటి కొండను ఢీకొట్టే ధైర్యాన్నిచ్చింది. ఏడుసార్లు చాంపియన్.. 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేతను మట్టికరిపించేలా చేసింది. కేవలం ఫైనల్‌కు చేరడమే తన లక్ష్యంగా పెట్టుకున్న ఈ రొమేనియా స్టార్ ఏకంగా టైటిల్‌నే సొంతం చేసుకుంది.
నాలుగేళ్లకే టెన్నిస్ రాకెట్ పట్టుకున్న హలెప్ అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ఆమె తండ్రి హలెప్‌ను ‘లిటిల్ రొలెక్స్’ అని ముద్దుగా పిలిచేవాడు. ఆట కోసం 16 ఏళ్లకే ఇళ్లును వదిలిన ఆమె నిరంతారయంగా శ్రమించింది.
ఎవరూ చేయని త్యాగం..
తనకిష్టమైన ఆటకోసం హలెప్ ఎవరూ చేయని త్యాగం చేసింది. తన ఆటకు ఇబ్బంది కలుగుతుందని సర్జరీ ద్వారా బ్రెస్ట్‌నే తీయించుకుంది. తన 34DD చాతి భాగంతో తన కల నెరవేరదని భావించిన ఆమె బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీతో 34C సైజుకు తగ్గించుకుంది. 2009లో ఈసర్జరీ జరగ్గా.. అప్పటికి ఆమె వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. టెన్నిస్ కోసమే ఈ పని చేసానని, అదే ఈ రోజు తనని అగ్రస్థానంలో నిలబెట్టిందని సర్జరీ గురించి ఇటీవల పేర్కొంది. అయితే ఇదేదో పెద్ద త్యాగం అనుకోవడం లేదని తెలిపింది. ఆటపై ఉన్న మక్కువనే అలా చేయించిందని స్పష్టం చేసింది.
వరుస ఓటములు..
గ్రాండ్‌స్లామ్ అందుకోవడానికి హలెప్ చాలా కష్టపడింది. పలుసార్లు అడుగు దూరంలో టైటిల్ దూరమైనా ఏ మాత్రం నిరాశకు లోనవ్వలేదు. పోయినచోటే వెతుక్కోవాలని పోరాడింది. హలెప్‌కు 2014లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకునే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఒపెన్ ఫైనల్లో మారియా షరపోవా (రష్యా) చేతిలో హలెప్ ఓటమిపాలైంది. ఆ తర్వాత 2017 వరకు హలెప్‌కు ఫైనల్ చేరే అవకాశం రాలేదు. ఆ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో లాట్వియాకు చెందిన జెలెనా ఓస్టాపెంకో(20) చేతిలో హలెప్ ఖంగుతిన్నది. టైటిల్‌తో పాటు ప్రపంచ నెం1 ర్యాంకు కోల్పోయింది. 2018లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నియాకి చేతిలో పరాజయం పాలైంది.
‘ఫ్రెంచ్’ కోటలో..
చివరకు ఫ్రెంచ్ కోటలోనే హలెప్‌కు తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కింది. 2014, 2017లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ ముచ్చటగా మూడో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. తాజాగా శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ హలెప్ 6–2, 6–2తో 11వ సీడ్, సెరెనా విలియమ్స్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. అంతేకాకుండా వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి రొమేనియా ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.
మా అమ్మ కోరిక..
వింబుల్డన్ ఫైనల్ ఆడాలనేది తన తల్లి కోరికని, అది ఈ రోజు నెరవేరిందని విజయానంతరం హలెప్ సంతోషం వ్యక్తం చేసింది. ‘నా జీవితంలోనే గొప్ప మ్యాచ్ ఆడాను. వింబుల్డన్ ఫైనల్ ఆడాలన్నది మా అమ్మ కోరిక. వింబుల్డన్ ఫైనల్ ఆడితే టెన్నిస్‌లో ఏదో ఘనత సాధించినట్టేనని మా అమ్మ చెప్పింది. ఆ రోజు రానే వచ్చింది. ఆమె కోరుకున్నట్టే వింబుల్డన్‌లో ఫైనల్ ఆడటమే కాకుండా టైటిల్ కూడా గెలిచాను. మా అమ్మ కలను నిజం చేశాను.’ అని హలెప్ పట్టారని సంతోషంతో పరవశించిపోయింది.
చదవండి : హై హై... హలెప్
Comments
Please login to add a commentAdd a comment