సెరెనా విలియమ్స్, విన్నర్స్ ట్రోఫీతో హలెప్
ఆల్‌టైమ్ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ రికార్డును సమం చేసే అవకాశాన్ని అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ మరోసారి చేజార్చుకుంది. సహజశైలిలో, స్థాయికి తగ్గట్టు ఆడితే విజయం ఖాయమనుకున్న చోట ఈ నల్లకలువకు ఊహించని పరాజయం ఎదురైంది. గతంలో సెరెనాతో ఆడిన పది మ్యాచ్‌ల్లో కేవలం ఒక్కసారి మాత్రమే నెగ్గిన రొమేనియా క్రీడాకారిణి సిమోనా హలెప్ వింబుల్డన్ వేదికపై తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయం నమోదు చేసుకుంది. 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనాపై కేవలం 56 నిమిషాల్లో అదీ నాలుగు గేమ్‌లు మాత్రమే కోల్పోయి జయకేతనం ఎగురవేసిన హలెప్ కెరీర్‌లో రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది.
లండన్: మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావించిన సెరెనా విలియమ్స్‌కు మళ్లీ ఆశాభంగమైంది. ఇప్పటికే 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఈ అమెరికా స్టార్ మరో టైటిల్‌తో మార్గరెట్ కోర్ట్ (ఆస్ట్రేలియా–24 టైటిల్స్) పేరిట ఉన్న ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ రికార్డును సమం చేయాలని ప్రయత్నించి విఫలమైంది. గత ఏడాది వింబుల్డన్‌లో, యూఎస్ ఓపెన్‌లో ఫైనల్ చేరి రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న సెరెనా ఈ యేడు కూడా వింబుల్డన్ ఫైనల్లో ఓటమి రుచి చూసింది. గత సంవత్సరం తుది పోరులోఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) షాక్ ఇవ్వగా... ఈసారి సిమోనా హలెప్ (రొమేనియా) ఆ పని చేసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఏడో సీడ్ హలెప్ 6–2, 6–2తో 11వ సీడ్, ఏడుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్‌ను చిత్తుగా ఓడించి తొలిసారి వింబుల్డన్ టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. అంతేకాకుండా వింబుల్డన్ టైటిల్ గెలిచిన తొలి రొమేనియా ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. విజేతగా నిలిచిన హలెప్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 26 లక్షలు)... రన్నరప్ సెరెనాకు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ.10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
ఆరంభం నుంచే దూకుడు...
గతంలో 37 ఏళ్ల సెరెనాపై ఒక్కసారి మాత్రమే నెగ్గిన 27 ఏళ్ల హలెప్ ఈసారి మాత్రం ఆరంభం నుంచే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలి గేమ్‌లో, మూడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసిన హలెప్ తన సర్వీస్‌లను కాపాడుకొని 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెరెనాకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా ఆడిన హలెప్ తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో సెరెనా పుంజుకుంటుందని ఆశించినా హలెప్ జోరు ముందు ఆమె తేలిపోయింది. ఐదో గేమ్‌లో, ఏడో గేమ్‌లో సెరెనా సర్వీస్‌లను బ్రేక్ చేసిన హలెప్ ఎనిమిదో గేమ్‌లోనూ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. గతేడాది హలెప్ ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచి కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది.
నా జీవితంలోనే గొప్ప మ్యాచ్ ఆడాను. వింబుల్డన్ ఫైనల్ ఆడాలన్నది మా అమ్మ కోరిక. వింబుల్డన్ ఫైనల్ ఆడితే టెన్నిస్‌లో ఏదో ఘనత సాధించినట్టేనని మా అమ్మ చెప్పింది. ఆ రోజు రానే వచ్చింది. ఆమె కోరుకున్నట్టే వింబుల్డన్‌లో ఫైనల్ ఆడటమే కాకుండా టైటిల్ కూడా గెలిచాను. మా అమ్మ కలను నిజం చేశాను.
– సిమోనా హలెప్
Comments
Please login to add a commentAdd a comment