రోమ్: ఇటాలియన్ ఓపెన్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంటో రెండో రౌండ్‌లో సంచలనం నమోదైంది. గురువారం మహిళల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్ నెం.2 సిమోనా హలెప్ 6–2, 5–7, 3–6తో అన్‌సీడెడ్, వరల్డ్ నెం.44 వాండ్రొసోవా(చెక్‌రిపబ్లిక్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. హలెప్ ఒక డబుల్ ఫాల్ట్ మాత్రమే చేయగా, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసిన వాండ్రసోవా బ్రేక్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మహిళల సింగిల్స్‌లోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత, వరల్డ్ నెం.1 నవోమీ ఒసాకా(జపాన్) 6–3, 6–3తో సిబుల్కోవా(స్లొవేకియా)పై నెగ్గగా, తాజాగా ముగిసిన మాడ్రిడ్ ఓపెన్‌లో టైటిల్ దక్కించుకున్న కికి బెర్టెన్స్(నెదర్లాండ్స్) 6–2, 4–6, 7–5తో అనిసిమోవా(అమెరికా)పై చెమటోడ్చి గెలిచింది. వరల్డ్ నెం.2 పెట్రా క్విటోవా 6–0, 6–1తో పుతిన్‌త్సెవ(కజకిస్థాన్)పై, గార్బియన్ ముగురుజ(స్పెయిన్) 6–4, 4–6, 6–2తో కొలిన్స్(అమెరికా)పై గెలిచి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. స్లోన్ స్టీఫెన్స్(అమెరికా) 7–6(7/3), 4–6, 1–6తో జొహన్నా కొంటా(బ్రిటన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
జకో, నాదల్ అలవోకగా..
పురుషుల విభాగంలో ప్రపంచ నెం.1, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ 6–1, 6–3తో డేనియల్ షపలోవ్ (కెనడా)ను, ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్(స్పెయిన్) 6–0, 6–1తో జెరేమీ చార్డీ(ఫ్రాన్స్)ని చిత్తు చేయగా, స్విస్ దిగ్గజం, వరల్డ్ నెం.3 ఫెదరర్ 6–4, 6–3తో సౌసా(పోర్చుగల్)ను ఇంటిబాట పట్టిం చాడు. ఈ విభాగం లోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ నిషికోరి(జపాన్) 6–2, 6–4తో ఫ్రిట్జ్(అమెరికా)పై, ఏడో ర్యాంకర్ డెల్‌పొట్రో 6–4, 6–2తో డేవిడ్ గఫి న్(బెల్జియం)పై, వరల్డ్ నెం.8 సిట్సిపాస్ 6–3, 6–2తో సిన్నర్(ఇటలీ)పై గెలవగా తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. కాగా, వరల్డ్ నెం.4 డొమెనిక్ థీమ్(ఆస్ట్రియా) 6–4, 4–6, 5–7తో ఫ్రాన్సిస్కో వెర్దాస్కో(స్పెయిన్) చేతిలో, పదో ర్యాంకర్ మారిన్ సిలిచ్(క్రొయేషియా) 2–6, 3–6తో జె.ఎల్.స్ట్రఫ్(జర్మనీ) చేతిలో ఓడి ఇంటిబాట పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment