ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రొమేనియా స్టార్
బుకారెస్ట్ (రొమేనియా): మాజీ ప్రపంచ నంబర్‌వన్ మహిళా టెన్నిస్ ప్లేయర్ సిమోనా హాలెప్ (రొమేనియా) కెరీర్‌కు వీడ్కోలు పలికింది. డోపింగ్ సస్పెన్షన్‌తో పాటు గాయాల కారణంగా చాన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న 33 ఏళ్ల హాలెప్... బుధవారం ప్రొఫెషనల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన హాలెప్... టాన్సిల్వేనియా ఓపెన్ తొలి రౌండ్‌లో పరాజయం ఆనంతరం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ‘ఇది సంతోషమో, బాధో అర్థం కావడం లేదు.
కానీ ఈ నిర్ణయంతో నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని మాత్రం చెప్పగలను. ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడేందుకు నా శరీరం సహకరించదని అనిపిస్తోంది. అందుకే ఆట నుంచి తప్పుకుంటున్నా. ఈ స్థాయికి చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డా. చివరి మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోయా. అయినా అభిమానుల సమక్షంలో మైదానంలో దిగడాన్ని ఆస్వాదించా’ అని హాలెప్ పేర్కొంది.
2017లో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన హాలెప్... ఆ తర్వాత గాయాలు, నిషేధం కారణంగా 870వ ర్యాంక్‌కు పడిపోయింది. టాన్సిల్వేనియా ఓపెన్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఆమె బుధవారం జరిగిన మ్యాచ్‌లో 1–6, 1–6తో లుసియా బ్రాంజెట్టి (రొమేనియా) చేతిలో ఓడింది.
మోకాలు, భుజం గాయాలతో ఇబ్బంది పడుతున్న హాలెప్ ఇటీవల ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వాలిఫయింగ్ టోర్నీ నుంచి కూడా తప్పుకుంది. 2018 ఫ్రెంచ్ ఓపెన్, 2019 వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన హాలెప్ మరో మూడు గ్రాండ్‌స్లామ్ (2014, 2017 ఫ్రెంచ్ ఓపెన్, 2018 ఆస్ట్రేలియా ఓపెన్) టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది.
2022 యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ పరాజయం అనంతరం డోపింగ్ కారణంగా హాలెప్ ప్రొఫెషనల్ కెరీర్‌కు దూరమైంది. దీంతో ఆమె మీద నాలుగు సంవత్సరాల నిషేధం పడింది. దీనిపై హాలెప్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ స్పోర్ట్‌లో అప్పీల్ చేసుకోగా... నిషేధాన్ని 9 నెలలకు తగ్గించారు. అయితే గాయాల బెడద ఎక్కువవడంతో తిరిగి కోర్టులో పూర్వ వైభవం సాధించలేకపోయింది.
కెరీర్ విశేషాలు
24 మొత్తం గెలిచిన సింగిల్స్ టైటిల్స్
2 సాధించిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (2018 ఫ్రెంచ్ ఓపెన్; 2019 వింబుల్డన్)
580 కెరీర్‌లో గెలిచిన మ్యాచ్‌లు
243 కెరీర్‌లో ఓడిన మ్యాచ్‌లు
1 అత్యుత్తమ ర్యాంక్ (అక్టోబర్ 9, 2017)
64 ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న వారాలు
గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో గెలుపోటములు (112/44)
» ఆ్రస్టేలియన్ ఓపెన్ (12 సార్లు): 31/12
» ఫ్రెంచ్ ఓపెన్ (11 సార్లు): 32/11
» వింబుల్డన్ (10 సార్లు): 29/9
» యూఎస్ ఓపెన్ (12 సార్లు): 20/12
సంపాదించిన మొత్తం ప్రైజ్‌మనీ 4,02,32,663 డాలర్లు (రూ. 351 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment