అపారిస్: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్నా... ఎంతోకాలంగా ఊరిస్తోన్న గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను ఈసారైనా నెగ్గాలనే పట్టుదలతో ఉన్న సిమోనా హలెప్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఈ రొమేనియా క్రీడాకారిణి అలవోక విజయంతో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ 6–2, 6–1తో 16వ సీడ్ ఎలీజ్ మెర్‌టెన్స్ (బెల్జియం)పై విజయం సాధించింది. 59 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో హలెప్ ఆరు బ్రేక్ పాయింట్లు సాధించడంతోపాటు నెట్ వద్దకు 10 సార్లు వచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది. గత ఐదేళ్లలో ఈ టోర్నీలో హలెప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి. క్వార్టర్ ఫైనల్లో మాజీ నంబర్‌వన్, 12వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)తో హలెప్ తలపడుతుంది. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో కెర్బర్ 6–2, 6–3తో ఏడో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించింది.
కసత్‌కినా సంచలనం
మరోవైపు రష్యా యువతార దరియా కసత్‌కినా తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్, రెండో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించి కసత్‌కినా ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. గంటా 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కసత్‌కినా 7–6 (7/5), 6–3తో వొజ్నియాకిపై నెగ్గింది.
నాదల్ జోరు...
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ 34వ సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ నాదల్ 6–3, 6–2, 7–6 (7/4)తో మాక్సిమిలియన్ మార్టెరర్ (జర్మనీ)పై గెలుపొందాడు. నాదల్ కెరీర్‌లో ఇది 900వ విజయం కావడం విశేషం. ఈ క్రమంలో ఓపెన్ శకంలో (1967 తర్వాత) కనీసం 900 విజయాలు సాధించిన ఐదో ప్లేయర్‌గా నాదల్ గుర్తింపు పొందాడు. జిమ్మీ కానర్స్ (అమెరికా –1,256), ఫెడరర్ (స్విట్జర్లాండ్–1,149), లెండిల్ (అమెరికా–1,068), గిలెర్మో విలాస్ (అర్జెంటీనా– 948) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆదివారం తన 32వ జన్మదినాన్ని జరుపుకున్న ఈ స్పెయిన్ స్టార్‌కు ప్రిక్వార్టర్ ఫైనల్లో తొలి రెండు సెట్‌లలో అంతగా పోటీ ఎదురుకాలేదు. కానీ మూడో సెట్‌లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్‌ను కోల్పోయి మిగతా వాటిని నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నాదల్ పైచేయి సాధించాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) 1–6, 2–6, 7–5, 7–6 (9/7), 6–2తో అండ ర్సన్ (దక్షిణాఫ్రికా)పై, డెల్‌పొట్రో (అర్జెంటీనా) 6–4, 6–4, 6–4తో ఇస్నెర్ (అమెరికా)పై, సిలిచ్ (క్రొయేషియా) 6–4, 6–1, 3–6, 6–7 (4/7), 6–3తో ఫాగ్‌నిని (ఇటలీ)పై గెలిచారు.
షరపోవాకు సెరెనా వాకోవర్...
ఇద్దరు మాజీ చాంపియన్స్ సెరెనా విలియమ్స్ (అమెరికా), షరపోవా (రష్యా) మధ్య సోమవారం ‘బ్లాక్ బస్టర్’ ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాలని ఆశించిన అభిమానులకు నిరాశ ఎదురైంది. భుజం కండరాలు పట్టేయడంతో సెరెనా కోర్టులోకి అడుగు పెట్టకుండానే షరపోవాకు ‘వాకోవర్’ ఇచ్చింది. దాంతో షరపోవా బరిలోకి దిగకుండానే క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ‘భుజం కండరాలు పట్టేయడంతో సర్వీస్ చేసే పరిస్థితిలో లేను. టోర్నీకి ముందు ఈ సమస్య లేదు. జూలియా జార్జెస్‌తో జరిగిన మూడో రౌండ్‌లో భుజం నొప్పి మొదలైంది. గాయం కారణంగా వైదొలుగుతున్నందుకు చాలా బాధగా ఉంది’ అని సెరెనా వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment