న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ తొలిరోజే... తొలిరౌండే... సంచలనంతో మొదలైంది. ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా) ఆట ఆదిలోనే ముగిసింది. మహిళల సింగిల్స్ తొలిరౌండ్‌లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ హలెప్‌కు ఎస్తోనియా ప్లేయర్ కయి కనెపి షాక్ ఇచ్చింది. వరుస సెట్లలో నంబర్‌వన్‌కు ఇంటిదారి చూపించింది. కనెపి 6–2, 6–4తో హలెప్‌ను కంగుతినిపించింది. సోమవారం జరిగిన ఈ పోరులో టాప్ సీడ్‌ను ఓడించేందుకు కనెపి పెద్దగా కష్టపడలేదు. కేవలం 76 నిమిషాల్లో ప్రత్యర్థి ఆటకట్టించింది. ఈ మ్యాచ్‌లో హలెప్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. మ్యాచ్ మొత్తంమీద 9 విన్నర్లే కొట్టిన హలెప్ ఒక ఏస్ సంధించింది.
మరోవైపు మ్యాచ్ ఆసాంతం దూకుడుగా ఆడిన కనెపి 26 విన్నర్లు కొట్టింది. 5 బ్రేక్ పాయింట్లను సాధించింది. ఇతర మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 1–6, 6–1తో సచియా వికెరి (అమెరికా)పై, ఇరినా కెమెలియా (రొమేనియా) 6–3, 6–3తో బ్రాడీ (అమెరికా)పై గెలుపొందగా... 31వ సీడ్ మగ్ధలినా రిబరికోవా (స్లొవేకియా) 2–6, 2–6తో కియాంగ్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 18వ సీడ్ జాక్‌సాక్ (అమెరికా) 6–0, 7–6 (7/4), 6–2తో అండ్రియోజి (అర్జెంటీనా)పై, కరెన్ ఖచనోవ్ (రష్యా) 6–3, 6–2, 6–3తో ఆల్బర్ట్ రామోస్ వినోలస్ (స్పెయిన్)పై విజయం సాధించారు. యూఎస్ ఓపెన్ చరిత్రలో టాప్ సీడ్ క్రీడాకారిణి తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఇదే తొలిసారి. గతేడాది కూడా హలెప్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయినా ఆమె రెండో సీడ్‌గా బరిలోకి దిగింది.
అయ్యో... హలెప్!
Published Tue, Aug 28 2018 12:53 AM | Last Updated on Tue, Aug 28 2018 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment