పారిస్: పలువురు స్టార్ క్రీడాకారిణుల గైర్హాజరీలో కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు వచ్చిన సదవకాశాన్ని టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ సిమోనా హలెప్ (రొమేనియా) చేజార్చుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఈ మాజీ చాంపియన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించి ఆశ్చర్యపరిచింది. పోలాండ్ టీనేజర్ ఇగా స్వియాటెక్ కేవలం 68 నిమిషాల్లో 6–1, 6–2తో హలెప్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. గత ఏడాది ఇదే టోర్నీలో హలెప్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 1–6, 0–6తో ఓడిపోయింది. ఏడాది తిరిగేలోపు అదే వేదికపై, ప్రిక్వార్టర్ ఫైనల్లోనే హలెప్‌ను స్వియాటెక్ చిత్తు చేయడం విశేషం. ఈ గెలుపుతో 19 ఏళ్ల స్వియాటెక్ తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. స్వియాటెక్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో హలెప్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశాన్ని సంపాదించకపోవడం గమనార్హం. మరోవైపు స్వియాటెక్ నాలుగుసార్లు హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది.
క్వాలిఫయర్ల హవా...
మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు క్వాలిఫయర్లు మార్టినా ట్రెవిసాన్ (ఇటలీ), నదియా పొడొరోస్కా (అర్జెంటీనా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో 159వ ర్యాంకర్ ట్రెవిసాన్ 6–4, 6–4తో ఐదో సీడ్ కికి బెర్‌టెన్స్ (నెదర్లాండ్స్)ను కంగుతినిపించగా... 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా 2–6, 6–2, 6–3తో బార్బరా క్రాయికోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గారు. తద్వారా 2012 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన క్వాలిఫయర్లుగా గుర్తింపు పొందారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించి మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.
ఎదురులేని నాదల్...
కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురిపెట్టిన పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–1, 6–1, 6–2తో సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై అలవోకగా గెలిచాడు. మరోవైపు ఇటలీకి చెందిన 75వ ర్యాంకర్ జానిక్ సినెర్ సంచలనం సృష్టించాడు. ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల సినెర్ 6–3, 6–3, 4–6, 6–3తో గెలుపొంది రాఫెల్ నాదల్ (2005లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అరంగేట్రంలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో సినెర్ ఆడనున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్, గతేడాది రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 3 గంటల 32 నిమిషాల్లో 6–4, 6–4, 5–7, 3–6, 6–3తో 239వ ర్యాంకర్ హుగో గస్టాన్ (ఫ్రాన్స్)పై గెలిచి వరుసగా ఐదో సంవత్సరం క్వార్టర్ ఫైనల్ చేరాడు.
Comments
Please login to add a commentAdd a comment