మూడేళ్ల క్రితం అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి సంచలన ప్రదర్శనతో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచిన జెలెనా ఒస్టాపెంకో తనకు అచ్చొచ్చిన వేదికగా మళ్లీ రాణిస్తోంది. 2020లో కూడా అన్‌సీడెడ్‌గా వచ్చిన ఈ లాత్వియా అమ్మాయి టోర్నీ రెండో సీడ్ ప్లిస్కోవాకు షాక్ ఇచ్చి మరో అడుగు ముందుకు వేసింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సోఫియా కెనిన్ కొంత పోరాడి మూడో రౌండ్‌కు చేరగా, పురుషుల విభాగంలో నంబర్‌వన్ జొకోవిచ్ కూడా తన జోరు ప్రదర్శించగా, గురువారం టోర్నీలో ఇతర సంచలనాలేమీ నమోదు కాలేదు.
పారిస్: మాజీ చాంపియన్, అన్‌సీడెడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మూడో రౌండ్‌కు చేరుకుంది. గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ఒస్టాపెంకో 6–4, 6–2 స్కోరుతో 2వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదు సార్లు బ్రేక్ చేసిన ఆమె 27 విన్నర్లు కొట్టింది. ఇటీవల జరిగిన రోమ్ ఓపెన్‌కు ఫైనల్‌కు చేరి గాయంతో తప్పుకున్న ప్రపంచ 8వ ర్యాంకర్ ప్లిస్కోవా 69 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. నాలుగో సీడ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ సోఫియా కెనిన్ కూడా ముందంజ వేసింది. రెండో రౌండ్‌లో ఆమె 3–6, 6–3, 6–2 తేడాతో అనా బోగ్‌డెన్ (రొమేనియా)ను ఓడించింది. ఇతర మహిళల సింగిల్స్ మ్యాచ్‌లలో ఏడో సీడ్ పెట్రో క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో జాస్మిన్ పావొలిని (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ అరైనా సబలెంకా (బెలారస్)పై, పావ్‌లా బడోసా (స్పెయిన్) 6–4, 4–6, 6–2తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై విజయం సాధించారు.
ఓటమి తప్పించుకున్న జ్వెరేవ్...
పురుషుల సింగిల్స్‌లో ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరేవ్ (జర్మనీ)కి అదృష్టం కలిసొచ్చింది. పియరీ హ్యూజెస్ హెర్బర్ట్ (ఫ్రాన్స్)తో ఐదు సెట్ల పాటు జరిగిన పోరులో అతను చివరకు విజయం సాధించి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. 3 గంటల 59 నిమిషాల పాటు సాగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో జ్వెరేవ్ 2–6, 6–4, 7–6 (7/5), 4–6, 6–4తో గెలుపొందాడు. 45 విన్నర్లు కొట్టిన జ్వెరేవ్ 10 ఏస్‌లు సంధించాడు. 3 గంటల 53 నిమిషాలు సాగిన మరో మ్యాచ్‌లో స్టెఫానో ట్రవాగ్లియా (ఇటలీ) 6–4, 2–6, 7–6 (9/7), 4–6, 6–2తో నిషికొరి (జపాన్)పై విజయం సాధించాడు. టాప్ సీడ్, వరల్డ్ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు రెండో రౌండ్‌లో ఎలాంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. కేవలం 83 నిమిషాల్లో ముగిసి మ్యాచ్‌లో జొకోవిచ్ 6–1, 6–2, 6–2తో బెరాంకిస్ (లిథువేనియా)ను చిత్తుగా ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్) 6–1, 6–4, 6–2తో పాబ్లో క్వాస్ (ఉరుగ్వే)ను ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు.
దివిజ్ జోడి ఓటమి...
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్ శరణ్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. శరణ్–సూన్‌వూ క్వాన్ (కొరియా) జంట 2–6, 6–4, 4–6తో ఫ్రాంకో స్కుగర్ (క్రొయేషియా)–అస్టిన్ క్రాజిసెక్ (అమెరికా) చేతిలో పరాజయంపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment