పారిస్: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలనాలతో మొదలైంది. ఆదివారం ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ యోహానా కొంటా (బ్రిటన్), ప్రపంచ మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా), 17వ సీడ్ అనెట్ కొంటావె (ఎస్తోనియా), 24వ సీడ్ డయానా యాస్‌ట్రెమ్‌స్కా (ఉక్రెయిన్)... పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. అమెరికా టీనేజ్ సంచలనం, 16 ఏళ్ల కోరి గాఫ్ గంటా 41 నిమిషాల్లో 6–3, 6–3తో యోహానా కొంటాను బోల్తా కొట్టించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది.
కరోలినా షిమెద్లోవా (స్లొవేకియా) 6–4, 6–4తో వీనస్‌పై... దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా) 6–4, 6–3తో యాస్‌ట్రెమ్‌స్కాపై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–4, 3–6, 6–4తో కొంటావెపై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. 1997 నుంచి ఈ టోర్నీలో ఆడుతోన్న 40 ఏళ్ల వీనస్ వరుసగా మూడో ఏడాది తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం గమనార్హం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 6–0తో సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై, మాజీ నంబర్‌వన్, పదో సీడ్ అజరెంకా (బెలారస్) 6–1, 6–2తో డాంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)పై, 16వ సీడ్ ఎలీజ్ మెర్‌టెన్స్ (బెల్జియం) 6–2, 6–3తో గాస్‌పర్యాన్ (రష్యా)పై విజయం సాధించారు.
వావ్రింకా ముందంజ...
పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో 16వ సీడ్ వావ్రింకా 6–1, 6–3, 6–2తో మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలిచాడు. మరోవైపు 19 ఏళ్ల జానిక్ సినెర్ (ఇటలీ) 7–5, 6–0, 6–3తో 11వ సీడ్ డేవిడ్ గాఫిన్‌పై సంచలన విజయం సాధించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 23వ సీడ్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్) 7–5, 6–4, 6–4తో సూన్‌వున్ క్వాన్ (కొరియా)పై, నిషికోరి (జపాన్) 1–6, 6–1, 7–6 (7/3), 1–6, 6–4తో 32వ సీడ్ ఇవాన్స్ (బ్రిటన్)పై, గాంబోస్ (స్లొవేకియా) 6–4, 3–6, 6–3, 6–4తో 24వ సీడ్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా)పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment