johanna Konta
-
సంచలనంతో షురూ...
పారిస్: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలనాలతో మొదలైంది. ఆదివారం ప్రారంభమైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో తొమ్మిదో సీడ్ యోహానా కొంటా (బ్రిటన్), ప్రపంచ మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా), 17వ సీడ్ అనెట్ కొంటావె (ఎస్తోనియా), 24వ సీడ్ డయానా యాస్ట్రెమ్స్కా (ఉక్రెయిన్)... పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్) తొలి రౌండ్లోనే నిష్క్రమించారు. అమెరికా టీనేజ్ సంచలనం, 16 ఏళ్ల కోరి గాఫ్ గంటా 41 నిమిషాల్లో 6–3, 6–3తో యోహానా కొంటాను బోల్తా కొట్టించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. కరోలినా షిమెద్లోవా (స్లొవేకియా) 6–4, 6–4తో వీనస్‌పై... దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా) 6–4, 6–3తో యాస్ట్రెమ్స్కాపై, కరోలినా గార్సియా (ఫ్రాన్స్) 6–4, 3–6, 6–4తో కొంటావెపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. 1997 నుంచి ఈ టోర్నీలో ఆడుతోన్న 40 ఏళ్ల వీనస్ వరుసగా మూడో ఏడాది తొలి రౌండ్లోనే వెనుదిరగడం గమనార్హం. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 6–0తో సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై, మాజీ నంబర్‌వన్, పదో సీడ్ అజరెంకా (బెలారస్) 6–1, 6–2తో డాంకా కొవినిచ్ (మాంటెనిగ్రో)పై, 16వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం) 6–2, 6–3తో గాస్పర్యాన్ (రష్యా)పై విజయం సాధించారు. వావ్రింకా ముందంజ... పురుషుల సింగిల్స్‌లో మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) శుభారంభం చేశాడు. తొలి రౌండ్లో 16వ సీడ్ వావ్రింకా 6–1, 6–3, 6–2తో మాజీ నంబర్‌వన్ ఆండీ ముర్రే (బ్రిటన్)పై గెలిచాడు. మరోవైపు 19 ఏళ్ల జానిక్ సినెర్ (ఇటలీ) 7–5, 6–0, 6–3తో 11వ సీడ్ డేవిడ్ గాఫిన్‌పై సంచలన విజయం సాధించాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 23వ సీడ్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్) 7–5, 6–4, 6–4తో సూన్వున్ క్వాన్ (కొరియా)పై, నిషికోరి (జపాన్) 1–6, 6–1, 7–6 (7/3), 1–6, 6–4తో 32వ సీడ్ ఇవాన్స్ (బ్రిటన్)పై, గాంబోస్ (స్లొవేకియా) 6–4, 3–6, 6–3, 6–4తో 24వ సీడ్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా)పై గెలిచారు. -
అతని విడుదల తెలిసి వణికిపోయా: సెరెనా
వాషింగ్టన్ : తన సోదరిని చంపిన హంతకుడి విడుదల వార్త తెలిసి వణికిపోయానని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తెలిపారు. దీంతోనే సిలికాన్ వ్యాలీ క్లాసిక్ టోర్నీలో ఓటమి చెందానని 23 గ్రాండ్ స్లామ్ల విజేత చెప్పుకొచ్చారు. ఈ టోర్నీలో సెరెనా ఊహించని విధంగా తొలి రౌండ్లోనే అత్యంత దారుణంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. బ్రిటన్ క్రీడాకారిణి జొహన్నా కొంటా చేతిలో 6-1, 6-0తో పరాజయం చెందింది సెరెనా. ఇది ఆమె కెరీర్లోనే అత్యంత ఘోర పరాజయం. ఇటీవల టైమ్స్ మ్యాగ్జైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఓటమిపై స్పందిస్తూ.. ‘నా సోదరిని చంపిన హంతకుడు పేరోల్ మీద విడుదలైనట్లు వచ్చిన స్క్రోల్స్‌ను ఆ మ్యాచ్‌కు పది నిమిషాల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. దీంతో భయాన్ని నా మనసు నుంచి తొలగించలేకపోయాను. అది నాకు చాలా కష్టం. నేనెప్పుడు నా సోదరి పిల్లల గురించే ఆలోచిస్తాను. వారంటే నాకంత ఇష్టం. ఆమె లేకపోవడం తట్టుకోలేకపోతున్నాను’ అని సెరెనా ఆవేదన వ్యక్తం చేశారు. సెరెనా సోదరి ఎటుండే ప్రైస్(31)ని 2003లో హంతకుడు రొబెర్ట్ మ్యాక్స్‌ఫీల్డ్ లాస్ ఎంజెల్స్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో నిందితుడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ప్రైస్ మరణించే సమయానికి ఆమెకు 11, 9, 5 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. అప్పటి నుంచి ఆ పిల్లలను సెరెనానే పెంచుతున్న విషయం విదితమే. -
బ్రిటన్ 39 ఏళ్ల నిరీక్షణ ముగిసింది
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
►39 ఏళ్ల తర్వాత మహిళల సింగిల్స్ సెమీస్‌లోకి బ్రిటన్ క్రీడాకారిణి ►జొహనా కొంటా సంచలనం ►క్వార్టర్స్‌లో రెండో సీడ్ హలెప్‌పై గెలుపు ►కొత్త నంబర్‌వన్‌గా ప్లిస్కోవా ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 39 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో జొహనా కొంటా రూపంలో మహిళల సింగిల్స్ విభాగంలో మరోసారి బ్రిటన్ క్రీడాకారిణి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. చివరిసారి బ్రిటన్ తరఫున 1978లో వర్జినియా వేడ్ ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు అమెరికా వెటరన్ స్టార్, 37 ఏళ్ల వీనస్ విలియమ్స్ కూడా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా మార్టినా నవ్రతిలోవా (1994లో) తర్వాత ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందింది. లండన్: కొన్నేళ్ల నుంచి పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రే విజయాలతోనే మురిసిపోయిన బ్రిటన్ అభిమానులకు జొహనా కొంటా రూపంలో మహిళల విభాగంలో కొత్త తార దొరికింది. టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో 26 ఏళ్ల కొంటా మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ కొంటా 6–7 (2/7), 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను బోల్తా కొట్టించింది. 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో కొంటా తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ పట్టుదలతో పోరాడి తర్వాతి రెండు సెట్లలో గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఒకవేళ హలెప్ ఈ మ్యాచ్‌లో గెలిచిఉంటే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను హస్తగతం చేసుకునేది. హలెప్ పరాజయంతో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోనుంది. ఒస్టాపెంకో జోరుకు బ్రేక్: మరో క్వార్టర్ ఫైనల్లో ఐదుసార్లు వింబుల్డన్ విజేత వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–3, 7–5తో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి గెలిచింది. వింబుల్డన్‌లో 100వ మ్యాచ్ ఆడిన వీనస్ 86వ విజయాన్ని నమోదు చేసి తన సోదరి సెరెనా పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. గురువారం జరిగే సెమీఫైనల్లో జొహనా కొంటాతో వీనస్ తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 2015 రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–3, 6–4తో ఏడో సీడ్ కుజ్నెత్సోవా (రష్యా)ను ఓడించింది. మరో క్వార్టర్ ఫైనల్లో రిబరికోవా (స్లొవేకియా) 6–3, 6–3తో కోకో వాండెవాగె (అమెరికా)ను ఓడించి ముగురుజాతో సెమీస్ పోరుకు సిద్ధమైంది. నాదల్కు చుక్కెదురు ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, ఫ్రెంచ్ ఓపెన్‌లో పదోసారి టైటిల్ గెలిచి జోరు మీదున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు వింబుల్డన్ టోర్నీలో మాత్రం అనూహ్య పరాజయం ఎదురైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) 4 గంటల 47 నిమిషాల్లో 6–3, 6–4, 3–6, 4–6, 15–13తో ప్రపంచ రెండో ర్యాంకర్, నాలుగో సీడ్ రాఫెల్ నాదల్‌ను బోల్తా కొట్టించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–2, 7–6 (7/5), 6–4తో మనారినో (ఫ్రాన్స్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో సామ్ క్వెరీతో ఆండీ ముర్రే, సిలిచ్‌తో గైల్స్ ముల్లర్, ఫెడరర్‌తో రావ్‌నిచ్, జొకోవిచ్‌తో థామస్ బెర్డిచ్ తలపడతారు. -
40 ఏళ్ల తర్వాత...
ఫ్లోరిడా (అమెరికా): మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో బ్రిటన్ క్రీడాకారిణి జొహానా కోంటా మహిళల సింగిల్స్ చాంపియన్‌గా అవతరించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 25 ఏళ్ల కోంటా 6–4, 6–3తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్)పై విజయం సాధించింది. తద్వారా వర్జినియా వేడ్ (1977లో వింబుల్డన్ టైటిల్) తర్వాత ఓ ప్రతిష్టాత్మక టోర్నీలో టైటిల్ సాధించిన తొలి బ్రిటన్ క్రీడాకారిణిగా కోంటా గుర్తింపు పొందింది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 2009లో ప్రీమియర్ స్థాయి టోర్నీలు ప్రవేశపెట్టాక ఓ బ్రిటన్ క్రీడాకారిణి ఈ స్థాయి ఈవెంట్స్‌లో టైటిల్ సాధించడం ఇదే ప్రథమం. విజేతగా నిలిచిన కోంటాకు 11 లక్షల75 వేల 505 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 7 కోట్ల 61 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సుదీర్ఘ పోరులో సంచలనం
క్వాలిఫయర్ జోనా కొంటా (బ్రిటన్) అద్వితీయ ప్రదర్శనతో తొమ్మిదో సీడ్ ముగురుజా ఆట కట్టించింది. ఏకంగా 3 గంటల 23 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో కొంటా 7-6 (7/4), 6-7 (4/7), 6-2తో ముగురుజాను మట్టికరిపించింది. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ చరిత్రలో సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు 2011లో సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా), నదియా పెత్రోవా (రష్యా-3 గంటల 16 నిమిషాలు)ల పేరిట ఉండేది.