ఎన్నాళ్లకెన్నాళ్లకు... | Johanna Konta Advance to Wimbledon Semifinals | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

Published Wed, Jul 12 2017 12:47 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

ఎన్నాళ్లకెన్నాళ్లకు...

39 ఏళ్ల తర్వాత మహిళల సింగిల్స్‌ సెమీస్‌లోకి బ్రిటన్‌ క్రీడాకారిణి
జొహనా కొంటా సంచలనం
క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ హలెప్‌పై గెలుపు
కొత్త నంబర్‌వన్‌గా ప్లిస్కోవా


ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 39 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో జొహనా కొంటా రూపంలో మహిళల సింగిల్స్‌ విభాగంలో మరోసారి బ్రిటన్‌ క్రీడాకారిణి సెమీఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. చివరిసారి బ్రిటన్‌ తరఫున 1978లో వర్జినియా వేడ్‌ ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు అమెరికా వెటరన్‌ స్టార్, 37 ఏళ్ల వీనస్‌ విలియమ్స్‌ కూడా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా మార్టినా నవ్రతిలోవా (1994లో) తర్వాత ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందింది.

లండన్‌: కొన్నేళ్ల నుంచి పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రే విజయాలతోనే మురిసిపోయిన బ్రిటన్‌ అభిమానులకు జొహనా కొంటా రూపంలో మహిళల విభాగంలో కొత్త తార దొరికింది. టెన్నిస్‌ సీజన్‌ మూడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌లో 26 ఏళ్ల కొంటా మహిళల సింగిల్స్‌ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ కొంటా 6–7 (2/7), 7–6 (7/5), 6–4తో రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)ను బోల్తా కొట్టించింది. 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో కొంటా తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ పట్టుదలతో పోరాడి తర్వాతి రెండు సెట్‌లలో గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఒకవేళ హలెప్‌ ఈ మ్యాచ్‌లో గెలిచిఉంటే ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను హస్తగతం చేసుకునేది. హలెప్‌ పరాజయంతో చెక్‌ రిపబ్లిక్‌ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకోనుంది.

ఒస్టాపెంకో జోరుకు బ్రేక్‌: మరో క్వార్టర్‌ ఫైనల్లో ఐదుసార్లు వింబుల్డన్‌ విజేత వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 6–3, 7–5తో ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్‌ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి గెలిచింది. వింబుల్డన్‌లో 100వ మ్యాచ్‌ ఆడిన వీనస్‌ 86వ విజయాన్ని నమోదు చేసి తన సోదరి సెరెనా పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. గురువారం జరిగే సెమీఫైనల్లో జొహనా కొంటాతో వీనస్‌ తలపడుతుంది. మరో క్వార్టర్‌ ఫైనల్లో 2015 రన్నరప్, 14వ సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌) 6–3, 6–4తో ఏడో సీడ్‌  కుజ్‌నెత్సోవా (రష్యా)ను ఓడించింది. మరో క్వార్టర్‌ ఫైనల్లో రిబరికోవా (స్లొవేకియా) 6–3, 6–3తో కోకో వాండెవాగె (అమెరికా)ను ఓడించి ముగురుజాతో సెమీస్‌ పోరుకు  సిద్ధమైంది.

నాదల్‌కు చుక్కెదురు
ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పదోసారి టైటిల్‌ గెలిచి జోరు మీదున్న స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌కు వింబుల్డన్‌ టోర్నీలో మాత్రం అనూహ్య పరాజయం ఎదురైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 16వ సీడ్‌ గైల్స్‌ ముల్లర్‌ (లక్సెంబర్గ్‌) 4 గంటల 47 నిమిషాల్లో 6–3, 6–4, 3–6, 4–6, 15–13తో ప్రపంచ రెండో ర్యాంకర్, నాలుగో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ను బోల్తా కొట్టించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ 6–2, 7–6 (7/5), 6–4తో మనారినో (ఫ్రాన్స్‌)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. బుధవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌లో సామ్‌ క్వెరీతో ఆండీ ముర్రే, సిలిచ్‌తో గైల్స్‌ ముల్లర్, ఫెడరర్‌తో రావ్‌నిచ్, జొకోవిచ్‌తో థామస్‌ బెర్డిచ్‌ తలపడతారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement