Wimbledon Grand Slam Tennis
-
ఎన్నాళ్లకెన్నాళ్లకు...
►39 ఏళ్ల తర్వాత మహిళల సింగిల్స్ సెమీస్‌లోకి బ్రిటన్ క్రీడాకారిణి ►జొహనా కొంటా సంచలనం ►క్వార్టర్స్‌లో రెండో సీడ్ హలెప్‌పై గెలుపు ►కొత్త నంబర్‌వన్‌గా ప్లిస్కోవా ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 39 ఏళ్ల నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో జొహనా కొంటా రూపంలో మహిళల సింగిల్స్ విభాగంలో మరోసారి బ్రిటన్ క్రీడాకారిణి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. చివరిసారి బ్రిటన్ తరఫున 1978లో వర్జినియా వేడ్ ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మరోవైపు అమెరికా వెటరన్ స్టార్, 37 ఏళ్ల వీనస్ విలియమ్స్ కూడా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వారా మార్టినా నవ్రతిలోవా (1994లో) తర్వాత ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కురాలిగా గుర్తింపు పొందింది. లండన్: కొన్నేళ్ల నుంచి పురుషుల సింగిల్స్‌లో ఆండీ ముర్రే విజయాలతోనే మురిసిపోయిన బ్రిటన్ అభిమానులకు జొహనా కొంటా రూపంలో మహిళల విభాగంలో కొత్త తార దొరికింది. టెన్నిస్ సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డన్‌లో 26 ఏళ్ల కొంటా మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ కొంటా 6–7 (2/7), 7–6 (7/5), 6–4తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)ను బోల్తా కొట్టించింది. 2 గంటల 38 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో కొంటా తొలి సెట్‌ను కోల్పోయినప్పటికీ పట్టుదలతో పోరాడి తర్వాతి రెండు సెట్లలో గెలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఒకవేళ హలెప్ ఈ మ్యాచ్‌లో గెలిచిఉంటే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను హస్తగతం చేసుకునేది. హలెప్ పరాజయంతో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా సోమవారం విడుదలయ్యే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకోనుంది. ఒస్టాపెంకో జోరుకు బ్రేక్: మరో క్వార్టర్ ఫైనల్లో ఐదుసార్లు వింబుల్డన్ విజేత వీనస్ విలియమ్స్ (అమెరికా) 6–3, 7–5తో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)ను ఓడించింది. 73 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వీనస్ తన అనుభవాన్నంతా రంగరించి పోరాడి గెలిచింది. వింబుల్డన్‌లో 100వ మ్యాచ్ ఆడిన వీనస్ 86వ విజయాన్ని నమోదు చేసి తన సోదరి సెరెనా పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. గురువారం జరిగే సెమీఫైనల్లో జొహనా కొంటాతో వీనస్ తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 2015 రన్నరప్, 14వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–3, 6–4తో ఏడో సీడ్ కుజ్నెత్సోవా (రష్యా)ను ఓడించింది. మరో క్వార్టర్ ఫైనల్లో రిబరికోవా (స్లొవేకియా) 6–3, 6–3తో కోకో వాండెవాగె (అమెరికా)ను ఓడించి ముగురుజాతో సెమీస్ పోరుకు సిద్ధమైంది. నాదల్కు చుక్కెదురు ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచి, ఫ్రెంచ్ ఓపెన్‌లో పదోసారి టైటిల్ గెలిచి జోరు మీదున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్కు వింబుల్డన్ టోర్నీలో మాత్రం అనూహ్య పరాజయం ఎదురైంది. సోమవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 16వ సీడ్ గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) 4 గంటల 47 నిమిషాల్లో 6–3, 6–4, 3–6, 4–6, 15–13తో ప్రపంచ రెండో ర్యాంకర్, నాలుగో సీడ్ రాఫెల్ నాదల్‌ను బోల్తా కొట్టించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ జొకోవిచ్ 6–2, 7–6 (7/5), 6–4తో మనారినో (ఫ్రాన్స్)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో సామ్ క్వెరీతో ఆండీ ముర్రే, సిలిచ్‌తో గైల్స్ ముల్లర్, ఫెడరర్‌తో రావ్‌నిచ్, జొకోవిచ్‌తో థామస్ బెర్డిచ్ తలపడతారు. -
ముర్రే మెరిసె...
అలవోక విజయంతో మూడో రౌండ్లోకి ∙వింబుల్డన్ టోర్నమెంట్ లండన్: డిఫెండింగ్ చాంపియన్ బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే మళ్లీ మెరిశాడు. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో సునాయాస విజయాన్ని సాధించాడు. తద్వారా ఈ టోర్నీలో తాను ఆడిన 13వసారీ మూడో రౌండ్లోకి అడుగు పెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ ఆండీ ముర్రే 6–3, 6–2, 6–2తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై గెలుపొందాడు. గంటా 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ముర్రేకు ఏదశలోనూ ఇబ్బంది కాలేదు. తొమ్మిది ఏస్‌లు సంధించిన ముర్రే, కేవలం ఐదు అనవసర తప్పిదాలు చేశాడు. బ్రౌన్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసిన ముర్రే, తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. జులపాల జుట్టుతో అందరి దృష్టిని ఆకర్షించే డస్టిన్ బ్రౌన్ 2015లో రాఫెల్ నాదల్‌ను మట్టికరిపించి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. 1996 నుంచి తన జుట్టును కత్తిరించుకోని 32 ఏళ్ల బ్రౌన్ ఈసారి మాత్రం ఎలాంటి అద్భుతం చేయలేదు. పురుషుల సింగిల్స్ ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 7–6 (7/2), 6–4, 7–5తో మాయెర్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ నిషికోరి (జపాన్) 6–4, 6–7 (7/9), 6–1, 7–6 (8/6)తో స్టకోవ్స్కీ (ఉక్రెయిన్)పై, 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6–1, 7–5, 6–2తో బొలెలీ (ఇటలీ)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నారు. క్విటోవాకు షాక్... మహిళల సింగిల్స్‌లో 11వ సీడ్, రెండుసార్లు చాంపియన్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో క్విటోవా 3–6, 6–1, 2–6తో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్ వీనస్ 4–6, 6–4, 6–1తో కియాంగ్ వాంగ్ (చైనా)పై , ఆరో సీడ్ జొహానా కొంటా (బ్రిటన్) 7–6 (7/4), 4–6, 10–8తో వెకిక్ (క్రొయేషియా)పై, ఎనిమిదో సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 6–4, 6–4తో బ్రాడీ (అమెరికా)పై, అజరెంకా (బెలారస్) 6–3, 6–3తో 15వ సీడ్ వెస్నినా (రష్యా)పై గెలిచారు. సానియా జంట శుభారంభం మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)–ఫ్లిప్కెన్స్ (బెల్జియం) జోడీ 6–4, 6–3తో ఒసాకా (జపాన్)–షుయె జాంగ్ (చైనా) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్–పురవ్ రాజా (భారత్) ద్వయం 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (8/6)తో ఎడ్మండ్ (ఇంగ్లండ్)–సుసా (పోర్చుగల్) జోడీపై నెగ్గింది. -
వింబుల్డన్ టోర్నీకి షరపోవా దూరం
లండన్: రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా వచ్చే నెలలో జరగనున్న వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌కు దూరమైంది. తొడ గాయం కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. 2004లో వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన షరపోవా... సరైన ర్యాంక్ లేని కారణంగా ఈసారి వింబుల్డన్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో చోటు కోసం క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. ‘రోమ్ ఓపెన్ టోర్నీ సందర్భంగా తొడకు గాయమైంది. స్కాన్ చేస్తే ఆ గాయం ఇంకా తగ్గలేదని తేలింది. దాంతో ముందు జాగ్రత్తగా మొత్తం గ్రాస్‌కోర్టు సీజన్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 30 ఏళ్ల షరపోవా తెలిపింది. గతేడాది డోపింగ్‌లో పట్టుబడినందుకు షరపోవాపై 15 నెలల నిషేధం విధించారు. నిషేధం గడువు పూర్తయ్యాక ఏప్రిల్ చివరి వారంలో స్టట్గార్ట్ ఓపెన్‌తో ఆమె పునరాగమనం చేసింది. ప్రస్తుతం 178వ ర్యాంక్‌లో ఉన్న షరపోవాకు ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 10 వరకు జరిగే సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లోనూ మెయిన్ ‘డ్రా’లో నేరుగా చోటు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. -
సాఫీగా... ముందుకు...
తొలి రోజు తరహాలోనే రెండో రోజూ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. టైటిల్ ఫేవరెట్స్‌గా భావిస్తున్న వారందరూ తమ ప్రత్యర్థులపై విజయాలు నమోదు చేసి శుభారంభం చేశారు. మిగతా సీడెడ్ క్రీడాకారులకు కాస్త గట్టిపోటీ ఎదురైనా తుదకు గట్టెక్కి రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. లండన్ : భారీ అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ క్రీడాకారులు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. మాజీ చాంపియన్స్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఆండీ ముర్రే (బ్రిటన్) తొలి రౌండ్లో సునాయాస విజయాలతో ముందంజ వేశారు. గతేడాది రన్నరప్, రెండో సీడ్ ఫెడరర్ 6-1, 6-3, 6-3తో దామిర్ జుమ్హుర్ (బోస్నియా)పై కేవలం 67 నిమిషాల్లో గెలుపొంది తన ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు. రెండో రౌండ్లో సామ్ క్వెరీ (అమెరికా)తో ఈ స్విస్ స్టార్ తలపడతాడు. పదో సీడ్, 2008, 2010 చాంపియన్ రాఫెల్ నాదల్ 6-4, 6-2, 6-4తో థామస్ బెలూచీ (బ్రెజిల్)ను అలవోకగా ఓడించాడు. గత మూడేళ్లుగా ఈ టోర్నీలో నాలుగో రౌండ్ దాటలేకపోయిన నాదల్ ఈసారి పూర్వ వైభవం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు. మరోవైపు బ్రిటన్ స్టార్, మూడో సీడ్ ఆండీ ముర్రే అంచనాలకు అనుగుణంగా ఆడుతూ 6-4, 7-6 (7/3), 6-4తో మిఖాయిల్ కుకుష్కిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. ఈ ఇద్దరికి మహిళా కోచ్‌లు ఉండటం విశేషం. ముర్రేకు 2006 మహిళల సింగిల్స్ చాంపియన్ అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్) కోచ్‌గా ఉండగా... కుకుష్కిన్కు అతని భార్య అనస్తాసియా కోచ్‌గా వ్యవహరిస్తోంది. మరో మ్యాచ్‌లో 13వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 7-6 (10/8), 6-7 (3/7), 6-4, 3-6, 6-2తో గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)పై కష్టపడి గెలుపొందగా... ఇతర మ్యాచ్‌ల్లో 15వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 6-2, 7-6 (7/4), 6-4తో డార్సిస్ (బెల్జియం)పై, 23వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా) 6-7 (2/7), 6-2, 6-4, 7-6 (7/2)తో ఐమెర్ (స్వీడన్)పై, 22వ సీడ్ విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) 6-1, 6-4, 3-6, 6-3తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)పై, 25వ సీడ్ ఆండ్రియాస్ సెప్పి (ఇటలీ) 6-3, 6-2, 6-2తో క్లెయిన్ (బ్రిటన్)పై గెలిచారు. మూడో సీడ్ హలెప్‌కు షాక్ మహిళల సింగిల్స్ విభాగంలో మాత్రం రెండు సంచలనాలు నమోదయ్యాయి. మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)... నిరుటి రన్నరప్, 12వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. సెపెలోవా (స్లొవేకియా) 5-7, 6-4, 6-3తో హలెప్‌ను ఓడించగా... యింగ్ యింగ్ దువాన్ (చైనా) 7-6 (7/3), 6-4తో బౌచర్డ్ను బోల్తా కొట్టించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 6-0తో బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై, 10వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6-0, 6-0తో విటోఫ్ట్ (బ్రిటన్)పై నెగ్గి రెండో రౌండ్లోకి చేరుకున్నారు. బాబోయ్ ఎండ... గత కొన్నేళ్లుగా వింబుల్డన్ టోర్నమెంట్ మొదలైన వెంటనే వరుణుడు కూడా ప్రత్యక్షమయ్యేవాడు. ఆటకు ఆటంకం కలిగించేవాడు. కానీ ఈ ఏడాది ఎండలు మండి పోతున్నాయి. రెండో రోజు 30 డిగ్రీల వేడిలో మ్యాచ్‌లు జరిగాయి. బుధవారం ఉష్ణోగ్రత రికార్డుస్థాయిలో 35 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణశాఖ అంచనా. ఒకవేళ ఇలా జరిగితే మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో రెండో సెట్‌కు, మూడో సెట్‌కు 10 నిమిషాల చొప్పున విరామం ఇస్తారు. పురుషుల విభాగంలో మాత్రం ఈ తరహా విరామం లేదు.