ముర్రే మెరిసె... | Wimbledon 2017 day three live scores and results as Andy Murray and Rafael Nadal play in second round | Sakshi
Sakshi News home page

ముర్రే మెరిసె...

Published Thu, Jul 6 2017 12:29 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

ముర్రే మెరిసె...

ముర్రే మెరిసె...

అలవోక విజయంతో మూడో రౌండ్‌లోకి ∙వింబుల్డన్‌ టోర్నమెంట్‌
లండన్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌ బ్రిటన్‌ స్టార్‌ ఆండీ ముర్రే మళ్లీ మెరిశాడు. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సునాయాస విజయాన్ని సాధించాడు. తద్వారా ఈ టోర్నీలో తాను ఆడిన 13వసారీ మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో టాప్‌ సీడ్, ప్రపంచ నంబర్‌వన్‌ ఆండీ ముర్రే 6–3, 6–2, 6–2తో డస్టిన్‌ బ్రౌన్‌ (జర్మనీ)పై గెలుపొందాడు. గంటా 36 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ముర్రేకు ఏదశలోనూ ఇబ్బంది కాలేదు. తొమ్మిది ఏస్‌లు సంధించిన ముర్రే, కేవలం ఐదు అనవసర తప్పిదాలు చేశాడు. బ్రౌన్‌ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసిన ముర్రే, తన సర్వీస్‌లో ఒక్కసారి కూడా బ్రేక్‌ పాయింట్‌ అవకాశం ఇవ్వలేదు.

జులపాల జుట్టుతో అందరి దృష్టిని ఆకర్షించే డస్టిన్‌ బ్రౌన్‌ 2015లో రాఫెల్‌ నాదల్‌ను మట్టికరిపించి ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చాడు. 1996 నుంచి తన జుట్టును కత్తిరించుకోని 32 ఏళ్ల బ్రౌన్‌ ఈసారి మాత్రం ఎలాంటి అద్భుతం చేయలేదు. పురుషుల సింగిల్స్‌ ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 7–6 (7/2), 6–4, 7–5తో మాయెర్‌ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్‌ నిషికోరి (జపాన్‌) 6–4, 6–7 (7/9), 6–1, 7–6 (8/6)తో స్టకోవ్‌స్కీ (ఉక్రెయిన్‌)పై, 12వ సీడ్‌ సోంగా (ఫ్రాన్స్‌) 6–1, 7–5, 6–2తో బొలెలీ (ఇటలీ)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరుకున్నారు.

క్విటోవాకు షాక్‌...
మహిళల సింగిల్స్‌లో 11వ సీడ్, రెండుసార్లు చాంపియన్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. మాడిసన్‌ బ్రింగిల్‌ (అమెరికా)తో జరిగిన మ్యాచ్‌లో క్విటోవా 3–6, 6–1, 2–6తో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో పదో సీడ్‌ వీనస్‌ 4–6, 6–4, 6–1తో కియాంగ్‌ వాంగ్‌ (చైనా)పై , ఆరో సీడ్‌ జొహానా కొంటా (బ్రిటన్‌)  7–6 (7/4), 4–6, 10–8తో వెకిక్‌ (క్రొయేషియా)పై, ఎనిమిదో సీడ్‌ సిబుల్కోవా (స్లొవేకియా) 6–4, 6–4తో బ్రాడీ (అమెరికా)పై, అజరెంకా (బెలారస్‌) 6–3, 6–3తో 15వ సీడ్‌ వెస్నినా (రష్యా)పై గెలిచారు.

సానియా జంట శుభారంభం
మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సానియా మీర్జా (భారత్‌)–ఫ్లిప్‌కెన్స్‌ (బెల్జియం) జోడీ 6–4, 6–3తో ఒసాకా (జపాన్‌)–షుయె జాంగ్‌ (చైనా) జంటపై గెలిచింది. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో దివిజ్‌ శరణ్‌–పురవ్‌ రాజా (భారత్‌) ద్వయం 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (8/6)తో ఎడ్మండ్‌ (ఇంగ్లండ్‌)–సుసా (పోర్చుగల్‌) జోడీపై నెగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement