సాఫీగా... ముందుకు...
తొలి రోజు తరహాలోనే రెండో రోజూ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. టైటిల్ ఫేవరెట్స్‌గా భావిస్తున్న వారందరూ తమ ప్రత్యర్థులపై విజయాలు నమోదు చేసి శుభారంభం చేశారు. మిగతా సీడెడ్ క్రీడాకారులకు కాస్త గట్టిపోటీ ఎదురైనా తుదకు గట్టెక్కి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
లండన్ : భారీ అంచనాలతో బరిలోకి దిగిన స్టార్ క్రీడాకారులు వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో శుభారంభం చేశారు. మాజీ చాంపియన్స్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఆండీ ముర్రే (బ్రిటన్) తొలి రౌండ్‌లో సునాయాస విజయాలతో ముందంజ వేశారు. గతేడాది రన్నరప్, రెండో సీడ్ ఫెడరర్ 6-1, 6-3, 6-3తో దామిర్ జుమ్‌హుర్ (బోస్నియా)పై కేవలం 67 నిమిషాల్లో గెలుపొంది తన ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశాడు. రెండో రౌండ్‌లో సామ్ క్వెరీ (అమెరికా)తో ఈ స్విస్ స్టార్ తలపడతాడు. పదో సీడ్, 2008, 2010 చాంపియన్ రాఫెల్ నాదల్ 6-4, 6-2, 6-4తో థామస్ బెలూచీ (బ్రెజిల్)ను అలవోకగా ఓడించాడు. గత మూడేళ్లుగా ఈ టోర్నీలో నాలుగో రౌండ్ దాటలేకపోయిన నాదల్ ఈసారి పూర్వ వైభవం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తున్నాడు.
మరోవైపు బ్రిటన్ స్టార్, మూడో సీడ్ ఆండీ ముర్రే అంచనాలకు అనుగుణంగా ఆడుతూ 6-4, 7-6 (7/3), 6-4తో మిఖాయిల్ కుకుష్‌కిన్ (కజకిస్తాన్)పై గెలిచాడు. ఈ ఇద్దరికి మహిళా కోచ్‌లు ఉండటం విశేషం. ముర్రేకు 2006 మహిళల సింగిల్స్ చాంపియన్ అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్) కోచ్‌గా ఉండగా... కుకుష్‌కిన్‌కు అతని భార్య అనస్తాసియా కోచ్‌గా వ్యవహరిస్తోంది.
మరో మ్యాచ్‌లో 13వ సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 7-6 (10/8), 6-7 (3/7), 6-4, 3-6, 6-2తో గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్)పై కష్టపడి గెలుపొందగా... ఇతర మ్యాచ్‌ల్లో 15వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 6-2, 7-6 (7/4), 6-4తో డార్సిస్ (బెల్జియం)పై, 23వ సీడ్ కార్లోవిచ్ (క్రొయేషియా) 6-7 (2/7), 6-2, 6-4, 7-6 (7/2)తో ఐమెర్ (స్వీడన్)పై, 22వ సీడ్ విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) 6-1, 6-4, 3-6, 6-3తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)పై, 25వ సీడ్ ఆండ్రియాస్ సెప్పి (ఇటలీ) 6-3, 6-2, 6-2తో క్లెయిన్ (బ్రిటన్)పై గెలిచారు.
మూడో సీడ్ హలెప్‌కు షాక్
మహిళల సింగిల్స్ విభాగంలో మాత్రం రెండు సంచలనాలు నమోదయ్యాయి. మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)... నిరుటి రన్నరప్, 12వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. సెపెలోవా (స్లొవేకియా) 5-7, 6-4, 6-3తో హలెప్‌ను ఓడించగా... యింగ్ యింగ్ దువాన్ (చైనా) 7-6 (7/3), 6-4తో బౌచర్డ్‌ను బోల్తా కొట్టించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 6-0తో బెర్‌టెన్స్ (నెదర్లాండ్స్)పై, 10వ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) 6-0, 6-0తో విటోఫ్ట్ (బ్రిటన్)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి చేరుకున్నారు.
బాబోయ్ ఎండ...
గత కొన్నేళ్లుగా వింబుల్డన్ టోర్నమెంట్ మొదలైన వెంటనే వరుణుడు కూడా ప్రత్యక్షమయ్యేవాడు. ఆటకు ఆటంకం కలిగించేవాడు. కానీ ఈ ఏడాది ఎండలు మండి పోతున్నాయి. రెండో రోజు 30 డిగ్రీల వేడిలో మ్యాచ్‌లు జరిగాయి. బుధవారం ఉష్ణోగ్రత రికార్డుస్థాయిలో 35 డిగ్రీలకు చేరుకోవచ్చని వాతావరణశాఖ అంచనా. ఒకవేళ ఇలా జరిగితే మహిళల సింగిల్స్ మ్యాచ్‌ల్లో రెండో సెట్‌కు, మూడో సెట్‌కు 10 నిమిషాల చొప్పున విరామం ఇస్తారు. పురుషుల విభాగంలో మాత్రం ఈ తరహా విరామం లేదు.