స్పెయిన్ దిగ్గజం రాఫెల్ నాదల్ చేసిన వ్యాఖ్యలు అతడి అభిమానులను కలవరపెడుతున్నాయి. ఫెడరర్ మాదిరే రాఫెల్‌నూ ఇక టెన్నిస్ కోర్టులో చూడలేమా అని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా నాదల్ లేవర్ కప్ టెన్నిస్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. వచ్చే వారం నుంచి బెర్లిన్ వేదికగా ఈ టెన్నిస్ టీమ్ టోర్నీ జరగనుంది.
అయితే, గత కొంతకాలంగా గాయాలతో సతమతమవుతున్న నాదల్ ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో మూడింట పాల్గొనలేదు. చివరగా ప్యారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన 38 ఏళ్ల నాదల్... నిరాశపరిచాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో సెర్బియా స్టార్ జొకోవిచ్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఈ నేపథ్యంలో లేవర్ కప్ టోర్నీతో తిరిగి వస్తాడని భావించిన అభిమానులకు షాకిచ్చాడు.
‘వచ్చే వారం జరగనున్న లేవర్ కప్‌లో ఆడలేకపోతున్నా. ఇది టీమ్ ఈవెంట్. జట్టుకు ఏది మంచో అదే చేయాలి. టీమ్‌ను విజయ తీరాలకు చేర్చగల ఆటగాళ్లు ఉండటం ముఖ్యం అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. మానసికంగా నేనేమీ ఇబ్బందిపడటం లేదు. ప్రస్తుతం ఇంట్లోనే ఉన్నాను.
వీలైనంత వరకు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. అయితే, ఇప్పటికిప్పుడు కోర్టులో దిగే పరిస్థితి మాత్రం లేదు. అందుకే తప్పుకొంటున్నా. ఒలింపిక్స్ వరకు ఆడతానని చెప్పాను. ఇక ఇప్పుడు ఏం జరుగబోతుందో చూడాలి’ అని నాదల్ పేర్కొన్నాడు. లేవర్ కప్‌నకు దూరం కావడానికి ప్రధాన కారణం చెప్పకపోయినా... గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, అదే సమయంలో త్వరలోనే రిటైర్మెంట్ కాబోతున్నాననే సంకేతాలు ఇస్తున్నాడనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. కాగా స్విట్జర్లాండ్ దిగ్గజ ఆటగాడు ఫెడరర్ 2022 లేవర్ కప్ అనంతరమే కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక.. పురుషుల సింగిల్స్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన నాదల్... ఇటీవల యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో కూడా గాయం కారణంగానే బరిలోకి దిగలేదన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment