తగ్గేదేలే..! టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సుదీర్ఘ మ్యాచ్‌లు ఇవే | Dan Evans Creates History, Look At Longest Tennis Matches At Each Grand Slam, See More Details | Sakshi
Sakshi News home page

Longest Tennis Matches: తగ్గేదేలే..! టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో సుదీర్ఘ మ్యాచ్‌లు ఇవే

Published Thu, Aug 29 2024 9:58 AM | Last Updated on Thu, Aug 29 2024 12:22 PM

Dan Evans Creates History: Look At Longest Tennis Matches At Each Grand Slam

టెన్నిస్‌ కోర్టులో అడుగుపెట్టిన ఏ ఆటగాడైనా గెలవాలనే కసితోనే పోరాడతాడు. కొందరు ప్లేయర్లు ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ చూస్తుండగానే మ్యాచ్‌ను లాగేసుకుంటే... మరికొందరు తుదికంటా పోరాడుతూ శక్తి మేరకు ప్రయత్నిస్తారు! టెన్నిస్‌ కోర్టులో అప్పుడప్పుడు సమఉజ్జీల సమరాలు అభిమానులను అలరిస్తూ ఉంటాయి. 

శరీరంలో శక్తి క్షీణిస్తున్నా... చెమట ధారగా కారుతున్నా లెక్కచేయకుండా మైదానంలో ఇరువురు ఆటగాళ్లు కొదమ సింహాల్లా పోరాడినపుడు ఆ మ్యాచ్‌లు గంటలకొద్దీ సాగుతూ ఉంటాయి. ఇరువురు ప్లేయర్లు ‘తగ్గేదేలే’ అన్నట్లు చెలరేగిన మ్యాచ్‌లు సుదీర్ఘ పోరాటాలుగా చరిత్ర పుటల్లో చోటు దక్కించుకుంటున్నాయి. టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో అలా రికార్డుల్లోకెక్కిన మ్యాచ్‌లను ఓసారి పరిశీలిస్తే... 

శారీరక శ్రమ అధికంగా ఉండే టెన్నిస్‌ క్రీడలో అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్‌లు సుదీర్ఘంగా సాగడం పరిపాటే. తాజాగా సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌లో డేనియల్‌ ఇవాన్స్‌ (బ్రిటన్‌), కరెన్‌ ఖచనోవ్‌ (రష్యా) మధ్య పోరు 5 గంటల 35 నిమిషాల పాటు సాగి అభిమానులకు ప్రత్యేక అనుభూతినిచ్చింది. 

యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఇదే సుదీర్ఘమైన మ్యాచ్‌ కాగా.. గతంలో వింబుల్డన్‌ టోరీ్నలో ఇంతకుమించిన మ్యాచ్‌లు చాలా జరిగాయి. 2010 వింబుల్డన్‌ టోర్నీలో జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా), నికోలస్‌ మహుత్‌ (ఫ్రాన్స్‌) మధ్య జరిగిన పోరు ఇందులో ముందు వరుసలో నిలుస్తుంది.

వర్షం అంతరాయం కలిగించడంతో... వరుసగా మూడు రోజులు సాగిన ఈ మారథాన్‌ మ్యాచ్‌ టెన్నిస్‌ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన పోరుగా రికార్డుల్లోకెక్కింది. ఇప్పటి వరకు ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో రెండు మ్యాచ్‌లు మాత్రమే 7 గంటలకు పైగా సాగగా... మరో 14 మ్యాచ్‌లు ఆరు గంటలకు పైగా జరిగాయి. 

ప్లేయర్ల అలసట, అభిమానుల అసౌకర్యం, నిర్వాహకులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రధాన టోర్నీల్లోని చివరి సెట్‌లోనూ ‘టైబ్రేకర్‌’ నిబంధనలు తీసుకొచ్చారు. 1970 నుంచి యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ‘టైబ్రేకర్‌’ అమలు చేస్తున్నారు. దీంతో సుదీర్ఘ పోరాటాలకు ఒకింత బ్రేక్‌ పడింది.  

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో... 6 గంటల 33 నిమిషాలు
సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లోనూ మారథాన్‌ మ్యాచ్‌లకు కొదువలేదు. 2004 ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సుదీర్ఘ మ్యాచ్‌ జరిగింది. రెండు రోజుల పాటు సాగిన పోరులో ఫ్రాన్స్‌కే చెందిన ఫాబ్రిస్‌ సాంతోరో, ఆర్నాడ్‌ క్లెమెంట్‌ తుదికంటా పోరాడారు. 6 గంటల 33 నిమిషాల తర్వాత ఫాబ్రిస్‌ సాంతోరో 6–4, 6–3, 6–7 (5/7), 3–6, 16–14తో ఆర్నాడ్‌ క్లెమెంట్‌పై గెలిచాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఇదే సుదీర్ఘ మ్యాచ్‌గా రికార్డుల్లోకెక్కింది.  

వింబుల్డన్‌లో ఇస్నెర్‌ డబుల్‌ ధమాకా
టెన్నిస్‌ చరిత్రలో అత్యంత పురాతన గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ అయిన వింబుల్డన్‌లో అమెరికా ఆటగాడు జాన్‌ ఇస్నెర్‌ ఒకటికి రెండుసార్లు ఇలాంటి సుదీర్ఘ మ్యాచ్‌ల్లో భాగస్వామి అయ్యాడు. 2010 వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఇస్నెర్, నికోలస్‌ మహుత్‌  మధ్య పోరు వరుసగా మూడు రోజుల పాటు నడిచింది. 

వర్షం కారణంగా అంతరాయాల నడుము జరిగిన పోరులో ఇస్నెర్‌ 6–4, 3–6, 6–7 (7/9), 7–6 (7/3), 70–68తో మహుత్‌పై విజయం సాధించాడు. 11 గంటల 5 నిమిషాల పాటు సాగిన ఈ పోరాటం... ప్రొఫెషనల్‌ టెన్నిస్‌లో అత్యంత సుదీర్ఘ పోరుగా చరిత్రకెక్కింది. ఇరువురు ఆటగాళ్లు గంటలకొద్దీ పట్టు వదలకుండా పోరాడటంతో ఈ రికార్డు సాధ్యమైంది. 

మరో ఎనిమిదేళ్ల తర్వాత 2018 వింబుల్డన్‌ సెమీఫైనల్లో మరోసారి ఇలాంటి సుదీర్ఘ పోరాటమే జరిగింది. 6 గంటల 36 నిమిషాల పాటు సాగిన పోరులో కెవిన్‌ అండర్సన్‌ (దక్షిణాఫ్రికా) 7–6 (8/6), 6–7 (5/7), 6–7 (9/11), 6–4, 26–24తో ఇస్నెర్‌పై విజయం సాధించాడు. 

 

ఆస్ట్రేలియా ఓపెన్‌లో... 5 గంటల 53 నిమిషాలు
టెన్నిస్‌ చరిత్రలో దిగ్గజ ప్లేయర్లుగా గుర్తింపు సాధించిన నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) కూడా సుదీర్ఘ పోరాటాల్లో భాగస్వాములయ్యారు. గిరిగీసి బరిలోకి దిగితే అంతుచూసేవరకు వదలని స్వభావం గల ఈ ఇద్దరూ ఎన్నో సార్లు హోరాహోరీగా తలబడ్డారు. 

అందులో 2012 ఆస్ట్రేలియా ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ ఒకటి. 5 గంటల 53 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జొకోవిచ్‌ 5–7, 6–4, 6–2, 6–7 (5/7), 7–5తో నాదల్‌ను ఓడించి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు. ఓపెన్‌ శకంలో (1968 నుంచి)అత్యంత సుదీర్ఘంగా సాగిన గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌గానూ ఈ పోరు చరిత్రకెక్కింది. 1975కంటే ముందు టైబ్రేక్‌ నిబంధన లేదు.

ఫలితంగా డేవిస్‌కప్‌లోనూ ఎన్నో సుదీర్ఘ మ్యాచ్‌లు జరిగాయి. 1975 తర్వాత నిర్ణాయక ఐదో సెట్‌ మినహా ఇతర సెట్‌లలో టైబ్రేక్‌లను అమలు చేయడం మొదలుపెట్టారు. 12 పాయింట్ల టైబ్రేక్‌లో తొలుత ఏడు పాయింట్లు సాధించిన ప్లేయర్‌కు సెట్‌ లభించేది. 

ఒకవేళ మ్యాచ్‌ ఐదో సెట్‌కు వెళితే స్కోరు 5–5 తర్వాత రెండు గేమ్‌ల ఆధిక్యం సంపాదించిన ప్లేయర్‌ను విజేతగా ప్రకటించేవారు. 2016 నుంచి డేవిస్‌ కప్‌లోనూ నిబంధనలు మార్చారు. మ్యాచ్‌లను ‘బెస్ట్‌ ఆఫ్‌ 5 సెట్స్‌’ పద్ధతిలో కాకుండా ‘బెస్ట్‌ ఆఫ్‌ 3 సెట్స్‌’గా నిర్వహించడం ప్రారంభించారు. సెట్‌లో స్కోరు 6–6తో సమంగా నిలిస్తే టైబ్రేక్‌ను అమలు చేస్తున్నారు.

డేవిస్‌ కప్‌లో సుదీర్ఘ పురుషుల సింగిల్స్‌ మ్యాచ్‌లు
సమయం-  విజేత -పరాజిత- ఏడాది- స్కోరు 
👉6గం:43ని- లియోనార్డో మాయెర్‌ (అర్జెంటీనా)-    జొవా సౌజా (బ్రెజిల్‌)- 2015-    7–6 (7/4), 7–6 (7/5), 5–7, 5–7, 15–13  
👉6గం:22ని-జాన్‌ మెకన్రో (అమెరికా)-విలాండర్‌ (స్వీడన్‌) -1982- 9–7, 6–2, 15–17, 3–6, 8–6  
👉6గం:21ని-బోరిస్‌ బెకర్‌ (జర్మనీ)-జాన్‌ మెకన్రో (అమెరికా)-1987-6–3, 6–2, 4–6, 14–12  
👉6గం:15ని-జోస్‌ లూయిస్‌ క్లెర్క్‌ (అర్జెంటీనా)-జాన్‌ మెకన్రో (అమెరికా)-1980-6–3, 6–2, 4–6, 14–12  
👉6గం: 04ని-హార్స్‌ స్కాఫ్‌ (ఆ్రస్టియా)- విలాండర్‌ (స్వీడన్‌)-1989-6–7 (5/7), 7–6 (9/7), 1–6, 6–4, 9–7 

– సాక్షి క్రీడావిభాగం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement