నాదల్‌కు అడ్డుగా జొకోవిచ్!
►ఒకే పార్శ్వంలో మాజీ విజేత, డిఫెండింగ్ చాంపియన్
►ఇద్దరూ సెమీస్‌లో తలపడే అవకాశం
►ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ విడుదల
పారిస్: రికార్డుస్థాయిలో పదోసారి ఫ్రెంచ్ ఓపెన్ సింగిల్స్ టైటిల్ నెగ్గాలంటే స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఆదివారం మొదలయ్యే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌కు సంబంధించిన ‘డ్రా’ను శుక్రవారం విడుదల చేశారు. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), తొమ్మిదిసార్లు విజేత రాఫెల్ నాదల్ ఒకే పార్శ్వంలో ఉన్నారు. ఫలితంగా ఈ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటితే సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడతారు. ఈ టోర్నీ చరిత్రలో నాదల్ గెలుపోటముల రికార్డు 72–2గా ఉంది. గాయం కారణంగా గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలోనే నిష్క్రమించిన నాదల్ ఈసారి క్లే కోర్టు సీజన్‌లో మోంటెకార్లో మాస్టర్స్, బార్సిలోనా ఓపెన్, మాడ్రిడ్ ఓపెన్ టైటిల్స్ గెలిచి జోరుమీదున్నాడు.
తొలి రౌండ్‌లో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)తో ఆడనున్న నాదల్‌కు మూడో రౌండ్‌లో సిమోన్ (ఫ్రాన్స్), క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ రావ్‌నిచ్ (కెనడా) ఎదురయ్యే అవకాశముంది. మరో పార్శ్వంలో టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), మాజీ చాంపియన్, మూడో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) ఉన్నారు.
గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత పూర్తి చేసుకున్న జొకోవిచ్ ఈసారి తొలి రౌండ్‌లో గ్రానోలెర్స్ (స్పెయిన్)తో ఆడతాడు. ఈ సీజన్‌లో గొప్ప విజయాలు సాధించలేకపోయిన జొకోవిచ్ తాజాగా అమెరికా టెన్నిస్ దిగ్గజం ఆండ్రీ అగస్సీని కొత్త కోచ్‌గా నియమించుకొని ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగుతున్నాడు.
మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్), టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరిద్దరూ సెమీఫైనల్లో తలపడే అవకాశముంది. తొలి రౌండ్‌లో మకరోవా (రష్యా)తో కెర్బర్; షియవోని (ఇటలీ)తో ముగురుజా ఆడతారు.