జొకోవిచ్ విశ్వరూపం
ఎర్రకోటలో మకుటంలేని మహారాజుగా వెలుగొందిన రాఫెల్ నాదల్ ఎట్టకేలకు మట్టికరిచాడు. ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా ఆరుసార్లు ఈ స్పెయిన్ స్టార్ చేతిలో ఓడిన సెర్బియా యోధుడు నొవాక్ జొకోవిచ్ ఏడో ప్రయత్నంలో విజయఢంకా మోగించాడు. నాదల్ సామ్రాజ్యంలో పాగా వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనలే అయిన్పటికీ ఫైనల్ సమరంలా భావించిన పోరులో జొకోవిచ్ పకడ్బందీ ప్రణాళికతో ఆడి వరుస సెట్‌లలో నాదల్ ఆట కట్టించాడు. రికార్డుస్థాయిలో తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన నాదల్‌కు ఈ టోర్నీ చరిత్రలో ఇది కేవలం రెండో ఓటమి మాత్రమే కావడం గమనార్హం.
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ ఘనమైన గత చరిత్రను పాతరేసేలా జొకోవిచ్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఎవ్వరూ ఊహించనివిధంగా చెలరేగిపోయి నాదల్‌ను బోల్తా కొట్టించాడు. యావత్ టెన్నిస్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూసిన క్వార్టర్ ‘ఫైనల్’ సమరంలో జొకోవిచ్ 7-5, 6-3, 6-1తో నాదల్‌ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ గెలుపుతో ఫ్రెంచ్ ఓపెన్‌లో రాబిన్ సోడెర్లింగ్ (స్వీడన్-2009లో) తర్వాత నాదల్‌ను ఓడించిన రెండో ప్లేయర్‌గా జొకోవిచ్ గుర్తింపు పొందాడు. మ్యాచ్ వరుస సెట్‌లలో ముగిసినప్పటికీ జొకోవిచ్ ప్రతీ పాయింట్ కోసం పోరాడాడు.
జొకోవిచ్ ఆటతీరు చూశాక ఈసారి ఎలాగైనా నాదల్‌ను ఓడించాలనే పట్టుదలతోనే అతను వచ్చినట్లు అనిపించింది. సుదీర్ఘ ర్యాలీలు, అంచనాలకు అందని డ్రాప్ షాట్‌లు, నెట్ వద్ద అప్రమత్తత, అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఎట్టకేలకు నాదల్‌ను ఓడించగలిగాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఫ్రెంచ్ ఓపెన్‌లో 70 విజయాలు నమోదు చేసిన నాదల్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా బరిలోకి దిగిన జొకోవిచ్ ఆరంభంలో పూర్తి విశ్వాసంతో ఆడాడు. రెండుసార్లు నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-0తో ముందంజ వేశాడు. అయితే ‘క్లే కింగ్’గా పేరొందిన నాదల్ వెంటనే తేరుకున్నాడు. జొకోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని స్కోరును 4-4తో సమం చేశాడు.
ఆ తర్వాత పదకొండో గేమ్‌లో నాదల్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను కాపాడుకొని తొలి సెట్‌ను 67 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ నెగ్గడంతో జొకోవిచ్ రెట్టించిన ఉత్సాహంతో ఆడగా... నాదల్ మాత్రం డీలా పడిపోయాడు. ఇదే వేదికపై ఆరుసార్లు జొకోవిచ్‌ను ఓడించిన అతను ఈసారి మాత్రం తలవంచాడు. తన పుట్టిన రోజున ఓటమితో నిరాశ మూటగట్టుకున్నాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో జొకోవిచ్; వావ్రింకా (స్విట్జర్లాండ్)తో సోంగా (ఫ్రాన్స్) తలపడతారు. చివరి క్వార్టర్ ఫైనల్లో ముర్రే 7-6 (7/4), 6-2, 5-7, 6-1తో ఏడో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)పై గెలిచాడు.
2 గంటల 26 నిమిషాలు నాదల్, జొకోవిచ్‌ల క్వార్టర్ ఫైనల్‌కు పట్టిన సమయం