Nadal Bowled Over Alcaraz Beats Djokovic In Wimbledon 2023 Final Tweet Viral - Sakshi
Sakshi News home page

Carlos Alcaraz: జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించిన అల్‌కరాజ్‌.. నాదల్‌ భావోద్వేగ ట్వీట్‌ వైరల్‌

Jul 17 2023 5:00 PM | Updated on Jul 17 2023 6:16 PM

Nadal Bowled Over Alcaraz Beats Djokovic In Wimbledon Final Tweet Viral - Sakshi

Wimbledon 2023 Mens Singles Winner Alcaraz: ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ వేదికపై కొత్త చరిత్ర నమోదైంది. క్లే కోర్టు స్పెషలిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకొని, హార్డ్‌కోర్ట్‌పై తొలి గ్రాండ్‌స్లామ్‌ సాధించిన తర్వాత ఇప్పుడు గ్రాస్‌ కోర్టుపై స్పెయిన్‌ ‘బేబీ బుల్‌’ మెరిశాడు. 23 గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్‌ జొకోవిచ్‌ వరుస విజయాలకు విరామమిస్తూ యువ సంచలనం కొత్త శకానికి నాంది పలికాడు. 

జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించి
రెండు పదుల వయసుకే కీర్తి శిఖరంపై నిలిచిన కార్లోస్‌ అల్‌కరాజ్‌ అద్భుత ఆటతో ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ వింబుల్డన్‌లో విజేతగా నిలిచాడు. ఐదు సెట్‌ల పాటు హోరాహోరీగా సాగిన సమరంలో ‘ఆల్‌టైమ్‌ దిగ్గజం’ జొకోవిచ్‌ను ‘పచ్చిక’ కరిపించి చాంపియన్‌గా అవతరించాడు. 

వరల్డ్‌ నంబర్‌వన్‌గా తన అద్వితీయ ఆటను అతను సాధించిన గెలుపు టెన్నిస్‌లో రాబోయే నూతన శకానికి నాంది పలికింది. 24వ టైటిల్‌తో పాటు క్యాలెండర్‌ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన జొకోవిచ్‌ ఆఖరి వరకు తన స్థాయికి తగ్గ ఆటతో ప్రయత్నించినా... ఇద్దరి మధ్య ఉన్న ‘16’ ఏళ్ల అంతరం ఆట చివర్లో అతని జోరుకు అడ్డుకట్ట వేసింది. 

నాదల్‌ భావోద్వేగ ట్వీట్‌ వైరల్‌
నాదల్‌ వారసుడిగా గుర్తింపు తెచ్చుకొని పిన్న వయసులోనే పలు రికార్డులకు చిరునామాగా మారిన అల్‌కరాజ్‌ సగర్వంగా తన రెండో గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీని ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో ఈ స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

సెర్బియా స్టార్‌, రెండో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను ఓడించిన అతడి ఆటకు అభిమానులు మాత్రమే కాదు దిగ్గజ ఆటగాళ్లు సైతం ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో మరో స్పెయిన్‌ స్టార్‌, లెజెండ్‌ రాఫెల్‌ నాదల్‌ చేసిన ట్వీట్‌ ప్రత్యేకంగా నిలిచింది.

‘‘కంగ్రాట్యులేషన్స్‌ అల్‌కరాజ్‌. ఈరోజు మాకు నువ్వు ఎనలేని సంతోషాన్ని పంచావు. స్పానిష్‌ టెన్నిస్‌లో మన మార్గదర్శి, దిక్సూచి, వింబుల్డన్‌లో అద్భుతాలు చేసిన మనోలో సాంటానా కూడా నీ ఆట చూసి ఉప్పొంగిపోయి ఉంటారు. నిన్ను గట్టిగా హత్తుకుని ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని ఉంది చాంపియన్‌!!! మన టీమ్‌కు ఇదొక గొప్ప క్షణం’’ అని నాదల్.. అల్‌కరాజ్‌ను ఉద్దేశించి భావోద్వేగపూరిత ట్వీట్‌ చేశాడు. 

కాగా తొంటినొప్పి కారణంగా నాదల్‌ ఈ ఏడాది వింబుల్డన్‌ చాంపియన్‌షిప్‌నకు దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. అల్‌కరాజ్‌ అద్భుత ఆట కారణంగా 24వ గ్రాండ్‌స్లామ్‌ గెలవాలన్న జొకోవిచ్‌ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఇక ఈ విజయంతో.. గతేడాది యూఎస్‌ ఓపెన్‌ విజేతగా నిలిచిన అల్‌కరాజ్‌ ఖాతాలో రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేరింది.

చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్‌ అరంగేట్రం.. రహానేపై వేటు! అతడు కూడా..
‘సెహ్వాగ్‌.. నీకు బ్యాటింగే రాదు! పాక్‌లో ఉంటే ఇక్కడి దాకా వచ్చేవాడివే కాదు’
జైశ్వాల్‌ ఒక్కడే కాదు.. అతడు కూడా టాలెంటెడ్‌.. ఛాన్స్‌ ఇస్తేనే: పాంటింగ్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement