ఒకే పార్శ్వంలో ముర్రే, జొకోవిచ్
వింబుల్డన్ ‘డ్రా’ విడుదల
లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రేకు ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ నిలబెట్టుకోవాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే... గతేడాది ఫైనల్లో తలపడిన ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈసారి సెమీఫైనల్లోనే తలపడే అవకాశముంది.
మరో పార్శ్వం నుంచి రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లో పోటీపడే చాన్స్ ఉంది. తొలి రౌండ్‌లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)తో ఆండీ ముర్రే; గొలుబెవ్ (కజకిస్థాన్)తో జొకోవిచ్; లొరెంజీ (ఇటలీ)తో ఫెడరర్; క్లిజాన్ (స్లొవేకియా)తో నాదల్ ఆడతారు.
సోమ్‌దేవ్‌కు క్లిష్టం
భారత్‌కు చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్‌లో 15వ సీడ్ జెర్జీ జనోవిచ్ (పోలండ్)తో సోమ్‌దేవ్ ఆడతాడు. ఈ టోర్నీలో ఒక్కసారి (2011లో) మాత్రమే పాల్గొన్న సోమ్‌దేవ్ రెండో రౌండ్‌కు చేరాడు. పురుషుల డబుల్స్‌లో ఐదో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి తొలి రౌండ్‌లో ఫ్రిస్టన్‌బర్గ్ (పోలండ్)-రాజీవ్ రామ్ (అమెరికా) జంటతో; రోహన్ బోపన్న (భారత్)-ఐజాముల్ ఖురేషీ (పాకిస్థాన్) ద్వయం తొలి రౌండ్‌లో సెర్మాక్ (చెక్ రిపబ్లిక్)-ఎల్గిన్ (రష్యా) జోడితో ఆడతాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-వెరా జ్వొనరేవా (రష్యా)లతో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) తలపడతారు.
మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశముంది. తొలి రౌండ్‌లో తాతిష్‌విలి (అమెరికా)తో సెరెనా; సమంత ముర్రే (బ్రిటన్)తో షరపోవా ఆడతారు.