Novak Jokovic
-
పతకం లేకుండానే వెనుదిరిగిన వరల్డ్ నెం.1
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో వరల్డ్ నెం.1 టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ పోరాటం ముగిసింది. వింబుల్డన్ 2021 టైటిల్ గెలిచి జోరుమీద ఉన్న జోకోవిచ్ టోక్యో ఒలింపిక్స్‌లో పతకం లేకుండానే ఇంటిముఖం పట్టాడు.సెమీ ఫైనల్స్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతుల్లో ఓడిన నోవాక్ జొకోవిచ్, కారెన్నో బూస్టతో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లోనూ పోరాడి ఓడాడు. రెండు గంటల 47 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ మ్యాచ్‌లో జొకోవిచ్... 4-6, 8-6, 3-6 తేడాతో ఓటమి పాలయ్యాడు. తొలి సెట్ కోల్పోయినా, రెండో సెట్లో ప్రతిఘటించిన జోకోవిచ్ రెండో సెట్లో విజయం సాధించాడు. అయితే మూడో సెట్లో కారెన్నో బూస్ట 3-6 తేడాతో విజయం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జెరేవ్, రష్యా ప్లేయర్ కచానోవ్ మధ్య ఫైనల్ జరగనుంది. కాగా జకోవిచ్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. -
French Open 2021: నాదల్ ఓటమి.. ఫైనల్లో జకోవిచ్
పారిస్: ప్రపంచం నెంబర్‌వన్ టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ టోర్నీలో అడుగుపెట్టాడు. 13 సార్లు ఛాంపియన్ అయిన రఫెల్ నాదల్‌ను జకోవిచ్ చిత్తుగా ఓడించాడు. భారత కాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి రొలాండ్‌గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్ 3-6, 6-3, 7-6(7/4), 6-2 సెట్స్‌తో నాదల్‌ను ఓడించడం విశేషం. నాదల్‌కి గత పదహారేళ్లలో(2005 నుంచి) క్లే కోర్టు గ్రాండ్ స్లామ్లో ఆడిన 108 మ్యాచ్‌లలో ఇది మూడో ఓటమి కాగా, 14 సెమీ ఫైనల్స్‌లో మొదటి ఓటమి. అంతేకాదు ఫ్రెంచ్ ఓపెన్‌లో నాదల్‌ను రెండుసార్లు ఓడించిన ఏకైక వ్యక్తి జకోవిచ్ కావడం విశేషం. ఇక రోలాండ్ గారోస్‌లో జరిగిన మ్యాచ్‌లో మొదటి సెట్‌నే కోల్పోవడం రఫెల్ నాదల్‌కి ఇదే ఫస్ట్ టైం. జకోవిచ్ గనుక ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిస్తే.. 19వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కించుకోవడంతో పాటు నాలుగు గ్రాండ్ స్లామ్స్ టైటిల్స్ రెండేసి సార్లు గెల్చుకున్న ప్లేయర్‌గా రికార్డు సొంతం చేసుకుంటాడు. కాగా, ఓటమిపై నాదల్ స్పందిస్తూ. ‘బెస్ట్ ప్లేయర్ గెలిచాడు’ అని జకోవిచ్‌పై పొగడ్తలు గుప్పించగా. 34 ఏళ్ల సెర్బియన్ ప్లేయర్ జకోవిచ్ తన విక్టరీలలో ఇది గొప్పదని చెప్పుకొచ్చాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 4️⃣ hours and 1️⃣1️⃣ minutes You've earned that smile @DjokerNole!#RolandGarros pic.twitter.com/75wWsWNUwY — Roland-Garros (@rolandgarros) June 11, 2021 ఇక జకోవిచ్ ఆదివారం జరగబోయే ఫైనల్మ్యాచ్లో స్టెఫనోస్ సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న మొట్టమొదటి గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్ కావడం విశేషం. గతంలో మూడుసార్లు గ్రాండ్ స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ అడ్డంకిని దాటలేకపోయిన ఈ యువ కెరటం.. శుక్రవారం జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో తలపడి మూడున్నర గంటల హోరాహోరీ పోరు తర్వాత విజయం సాధించాడు. చదవండి: ట్రాప్ చేసి వీడియో తీయమన్నారు -
మెద్వెదెవ్ మొదటిసారి...
మెల్బోర్న్: రష్యా ఆటగాడు, నాలుగో సీడ్ డానిల్ మెద్వెదెవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌తో అమీతుమీకి అర్హత సాధించాడు. ఆదివారం వీరిద్దరి మధ్య పురుషుల సింగిల్స్ టైటిల్ పోరు జరుగనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మెద్వెదెవ్ 6–4, 6–2, 7–5తో ఐదోసీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్)పై వరుస సెట్లలో గెలుపొందాడు. 25 ఏళ్ల మెద్వెదెవ్కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ కానుంది. గత నాలుగేళ్లుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడుతున్న ఈ రష్యన్ స్టార్ ఏనాడు నాలుగోరౌండ్నే అధిగమించలేకపోయాడు. మొత్తం గ్రాండ్‌స్లామ్ ఈవెంట్లలో అతని అత్యుత్తమ ప్రదర్శన యూఎస్ ఓపెన్ (2020)లో సెమీస్ చేరడమే! ఈ సారి మాత్రం మెల్బోర్న్లో మరో అడుగు ముందుకేశాడు. టైటిల్ దారిన పడ్డాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్ ప్రతీ సెట్లోనూ పైచేయి సాధించాడు. రెండో సెట్‌ను అలవోకగా గెలుచుకున్న నాలుగో సీడ్ ఆటగాడికి చివరి సెట్లో ప్రత్యర్థి సిట్సిపాస్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. 5–5 వద్ద సర్వీస్‌ను నిలబెట్టుకున్న మెద్వెదెవ్ తర్వాత గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 6–5తో అధిక్యంలోకి వచ్చాడు. మరుసటి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 7–5 స్కోరుతో సెట్‌తో పాటు మ్యాచ్ గెలిచాడు. ఈ మ్యాచ్‌లో రష్యన్ స్టార్ ఏస్‌లతో చెలరేగాడు. మూడు సెట్ల ఆటలో అతను 17 ఏస్‌లు సంధించగా... ప్రత్యర్థి 3 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 21 అనవసర తప్పిదాలు చేసిన మెద్వెదెవ్ 46 విన్నర్లు కొట్టాడు. మరోవైపు సిట్సిపాస్ 30 అనవసర తప్పిదాలు చేశాడు. 2 గంటల 09 నిమిషాల్లోనే సెమీస్ మ్యాచ్‌ను సునాయాసంగా ముగించాడు. అయితే రష్యన్ ఆటగాడికి ఫైనల్ మాత్రం కొండను ఢీకొట్టడమే! ఎందుకంటే సెర్బియన్ స్టార్ జొకోవిచ్ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎనిమిది టైటిళ్లను ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే గెలవడం మరో విశేషం. ఇంతటి మేరునగధీరుడ్ని తొలిసారి ఫైనల్ చేరిన మెద్వెదెవ్ ఏ మేరకు ఎదుర్కొంటాడో ఆదివారం జరిగే ఫైనల్లో చూడాలి. -
నాదల్కు కష్టమే!
ఫ్రెంచ్ ఓపెన్ ‘డ్రా’ విడుదల పారిస్: గత పదేళ్లలో తొమ్మిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి మట్టికోర్టులో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న రాఫెల్ నాదల్కు ఈసారి అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ఆదివారం మొదలయ్యే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ‘ఫ్రెంచ్ ఓపెన్’లో ఈ స్పెయిన్ స్టార్ పదోసారి విజేతగా నిలవాలంటే తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. ఆరోసీడ్‌గా బరిలోకి దిగుతున్న నాదల్ పార్శ్వంలోనే ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఉన్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్‌తో... సెమీఫైనల్లో ముర్రేతో నాదల్ తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ షరపోవా (రష్యా) తొలి రౌండ్లో కెయి కనెపి (ఎస్తొనియా)తో ఆడుతుంది. మరో పార్శ్వంలో ఉన్న టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్లో క్వాలిఫయర్‌ను ఢీకొంటుంది. -
ఎదురులేని జొకోవిచ్, ముర్రే
- నాలుగో సీడ్ ఫెరర్‌కు షాక్ - క్వార్టర్స్‌లో సానియా మిక్స్డ్ జోడి - యూఎస్ ఓపెన్ న్యూయార్క్: మాజీ చాంపియన్లు నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే యూఎస్ ఓపెన్‌లో జోరును కొనసాగిస్తున్నారు. మరోవైపు నాలుగో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) 6-3, 3-6, 6-1, 6-3తో ఫెరర్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్, ఆరో సీడ్ యుగెనీ బౌచర్డ్ (కెనడా) నాలుగో రౌండ్లో ప్రవేశించారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2, 6-2 తేడాతో అమెరికాకు చెందిన సామ్ క్వెర్రీని చిత్తుగా ఓడించాడు. 2011లో యూఎస్ ఓపెన్ గెలుచుకున్న జొకోవిచ్.. క్వెర్రీపై గెలవడం ఇది ఎనిమిదోసారి. అలాగే జకోవిచ్ వరుసగా 22 సార్లు ఈ టోర్నీ నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. 85 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శక్తివంతమైన సర్వ్‌లకు పెట్టింది పేరైన సామ్‌ను జొకోవిచ్ సులువుగానే ఎదుర్కొన్నాడు. తొలి సెట్లో వరుసగా పాయింట్లు సాధిస్తూ 5-0 ఆధిక్యం సాధించాడు. ప్రత్యర్థిని కుదురుగా ఉండనీయకుండా కోర్టు చుట్టూ తిరిగేలా వ్యూహం ప్రకారం ఆడి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు. ఇక 2012 చాంపియన్, బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే 6-1, 7-5, 4-6, 6-2 స్కోరుతో రష్యా ఆటగాడు ఆండ్రీ కుజ్నెత్సోవ్ను ఓడించి ఏడోసారి నాలుగో రౌండ్‌కు చేరాడు. ప్రపంచ 96వ ర్యాంకర్ కుజ్నెత్సోవ్ మూడో సెట్లో ముర్రేకు దీటుగా బదులిచ్చాడు. అయితే నాలుగో సెట్లో మాత్రం 27 ఏళ్ల ముర్రే త్వరగానే కోలుకుని సుదీర్ఘ ర్యాలీలతో సత్తా చూపాడు. ఓవరాల్‌గా 47 విన్నర్ షాట్లతో ఈ ఎనిమిదో సీడ్ మ్యాచ్‌ను కైవసం చేసుకుని కీ నిషికొరి (జపాన్)తో పోరుకు సిద్ధమయ్యాడు. అలాగే ఐదో సీడ్ మిలోస్ రవోనిక్ 7-6 (7/5), 7-6 (7/5), 7-6 (7/3) తేడాతో తొలిసారిగా యూఎస్ ఓపెప్లో బరిలోకి దిగిన 34 ఏళ్ల విక్టర్ ఎస్ట్రేల్లా బుర్గోస్పై నెగ్గేందుకు చెమటోడ్చాడు. తొమ్మిదో సీడ్ జో విల్ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 6-4, 6-4తో కారెనో బుస్టా (స్పెయిన్)పై నెగ్గాడు. సెరెనా జోరు ఆరోసారి టైటిల్ గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న అమెరికా సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆశించినట్టుగానే దూసుకెళుతోంది. మూడో రౌండ్లో ఈ నంబర్‌వన్ సీడ్... 6-3, 6-3 తేడాతో వర్వారా లెప్చెంకో (అమెరికా)పై సునాయాసంగా నెగ్గింది. నాలుగో రౌండ్లో అన్‌సీడెడ్ కియా కనేపీ (ఎస్తోనియా)తో తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే యూఎస్ ఓపెన్‌లో సెరెనాకు 75వ మ్యాచ్ నెగ్గినట్టవుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో ఈ ఏడాది వింబుల్డన్ ఫైనలిస్ట్, ఏడో సీడ్ యుగెనీ బౌచర్డ్ (కెనడా) 6-2, 6-7 (2/7), 6-4 తేడాతో జహ్లవోవా స్ట్రికోవాను, విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-1, 6-1తో వెస్నీనా (రష్యా)పై నెగ్గింది. మరోవైపు ఆదివారం జరిగిన నాలుగో రౌండ్లో 13వ సీడ్ సారా ఎర్రానీ 6-3, 2-6, 6-0తో లూసిక్ బరోని (క్రొయేషియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. మిక్స్డ్ క్వార్టర్స్‌లో సానియా జోడి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బరిలోకి దిగిన రెండు విభాగాల్లో మంచి ఆటతీరును కనబరిచింది. డబుల్స్‌లో ఇప్పటికే మూడో రౌండ్‌కు చేరగా మిక్స్డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో రౌండ్లో టాప్ సీడ్ సానియా-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంట 6-2, 7-6 (10/8)తో డెలాక్వా (అమెరికా)-జేమీ ముర్రే (గ్రేట్ బ్రిటన్)ను ఓడించింది. లియాండర్ పేస్ (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జంట 6-1, 4-6, 10-4తో ఐజమ్ అల్ ఖురేషి (పాక్)-కుద్య్రత్సేవ (రష్యా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది. -
ఒకే పార్శ్వంలో ముర్రే, జొకోవిచ్
వింబుల్డన్ ‘డ్రా’ విడుదల లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రేకు ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ నిలబెట్టుకోవాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే... గతేడాది ఫైనల్లో తలపడిన ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈసారి సెమీఫైనల్లోనే తలపడే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లో పోటీపడే చాన్స్ ఉంది. తొలి రౌండ్లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)తో ఆండీ ముర్రే; గొలుబెవ్ (కజకిస్థాన్)తో జొకోవిచ్; లొరెంజీ (ఇటలీ)తో ఫెడరర్; క్లిజాన్ (స్లొవేకియా)తో నాదల్ ఆడతారు. సోమ్‌దేవ్‌కు క్లిష్టం భారత్‌కు చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో 15వ సీడ్ జెర్జీ జనోవిచ్ (పోలండ్)తో సోమ్‌దేవ్ ఆడతాడు. ఈ టోర్నీలో ఒక్కసారి (2011లో) మాత్రమే పాల్గొన్న సోమ్‌దేవ్ రెండో రౌండ్‌కు చేరాడు. పురుషుల డబుల్స్‌లో ఐదో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి తొలి రౌండ్లో ఫ్రిస్టన్బర్గ్ (పోలండ్)-రాజీవ్ రామ్ (అమెరికా) జంటతో; రోహన్ బోపన్న (భారత్)-ఐజాముల్ ఖురేషీ (పాకిస్థాన్) ద్వయం తొలి రౌండ్లో సెర్మాక్ (చెక్ రిపబ్లిక్)-ఎల్గిన్ (రష్యా) జోడితో ఆడతాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-వెరా జ్వొనరేవా (రష్యా)లతో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) తలపడతారు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశముంది. తొలి రౌండ్లో తాతిష్విలి (అమెరికా)తో సెరెనా; సమంత ముర్రే (బ్రిటన్)తో షరపోవా ఆడతారు.