Wimbledon title
-
US Open 2021: రికార్డులపై జొకోవిచ్ గురి
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో ప్రపంచ నంబర్‌వన్, సెర్బియా స్టార్ జొకోవిచ్‌ను రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. అందులో ఒకటి ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ (ఒకే ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గడం) కాగా... రెండోది పురుషుల విభాగంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ప్లేయర్‌గా నిలువడం. ఈ ఏడాది సూపర్ ఫామ్‌లో ఉన్న జొకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ టోర్నీ టైటిల్స్‌ను గెలిచాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) సరసన చేరాడు. యూఎస్ ఓపెన్‌లోనూ జొకోవిచ్ గెలిస్తే 21 టైటిల్స్‌తో కొత్త చరిత్రను సృష్టిస్తాడు. అంతేకాకుండా దిగ్గజ ప్లేయర్ రాడ్ లేవర్ (1969లో) తర్వాత ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలుస్తాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున జరిగే తొలి రౌండ్లో క్వాలిఫయర్ హోల్గర్ రునే (డెన్మార్క్) తో జొకోవిచ్ తలపడతాడు. -
జయహో జొకోవిచ్
సమఉజ్జీల పోరంటే ఇది. అసలు సిసలు ఫైనల్ అంటే కచ్చితంగా ఇదే! అలసటే ఉత్సాహం తెచ్చుకున్న సమరంలో దిగ్గజం ఫెడరర్ పోరాడి ఓడగా... డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్ ఫైనల్ వేదిక ఐదు సెట్ల దాకా ఆడించింది. ప్రేక్షకుల్ని 4 గంటల 57 నిమిషాలపాటు కూర్చోబెట్టింది. ఆఖరి దాకా నువ్వానేనా అన్నట్లు టైటిల్ కోసం ఈ పోరాట యోధులిద్దరూ యుద్ధమే చేశారు. తుదకు కీలకదశలో సంయమనంతో ఆడిన జొకోవిచ్ పైచేయి సాధించాడు. తన కెరీర్లో ఐదోసారి వింబుల్డన్ టైటిల్‌ను, 16వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. లండన్: టాప్ సీడ్ల మధ్య జరిగిన ఆఖరి సమరంలో అంతిమ విజయం జొకోవిచ్‌కు దక్కింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 7–6 (7/5), 1–6, 7–6 (7/4), 4–6, 13–12 (7/3)తో రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. ఐదు సెట్ల పోరాటంలో మూడు సెట్లను టైబ్రేక్లే తేల్చాయి. ఏస్‌ల రారాజు ఫెడరర్ ఏకంగా 25 ఏస్‌లు సంధించినప్పటికీ టైబ్రేక్‌లో వెనుకబడటంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విజేత జొకోవిచ్ 10 ఏస్‌లు సంధించి, 52 అనవసర తప్పిదాలు చేశాడు. స్విస్ స్టార్ 61 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 94 విన్నర్లు కొట్టిన ఫెడరర్, ఆరుసార్లు డబుల్ ఫాల్ట్ చేశాడు. జొకోవిచ్ 54 విన్నర్లు కొట్టాడు. ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఐదో టైటిల్ గెలిచిన జొకోవిచ్ ఓవరాల్‌గా 16వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఓపెన్ శకం మొదలయ్యాక టాప్ సీడ్, రెండో సీడ్ వింబుల్డన్ ఫైనల్లో తలపడటం ఇది 14వసారి. 2015లోనూ ఈ ఇద్దరు టైటిల్ కోసం పోటీపడగా ఫెడెక్స్‌పై జొకోవిచే గెలిచాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 26 లక్షలు)... రన్నరప్ ఫెడరర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరంభం నుంచే హోరాహోరీ... ఇద్దరి ఆట ఆరంభం నుంచే వేటగా మారింది. అందుకే ఒక్క సెట్ మినహా మిగతా అన్ని సెట్లు నువ్వానేనా అన్నట్లే సాగాయి. ముందుగా 58 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్లో ఎవరి సర్వీస్‌ను వారు నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ ఒక గేమ్ గెలిస్తే... మరో గేమ్ ఫెడరర్ నెగ్గాడు. ఇలా 12 గేమ్‌ల దాకా సాగిన తొలి సెట్లో ఇద్దరూ ఆరేసి పాయింట్లు సంపాదించారు. దీంతో ఫలితం తేల్చేందుకు టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియన్ అంత చురుగ్గా ఫెడరర్ షాట్లకు పదును పెట్టలేకపోయాడు. దీంతో ఫెడెక్స్ తొలి సెట్‌ను కోల్పోయాడు. రెండో సెట్ మినహా... తుది పోరులో ఈ రెండో సెట్ మినహా అన్నీ సెట్లు యుద్ధాన్ని తలపించాయి. ఈ సెట్లో ఫెడెక్స్ ఫోర్‌హ్యాండ్, బ్యాక్ హాండ్ షాట్లతో చెలరేగాడు. ప్రత్యర్థి కంటే రెట్టింపు వేగంతో కదం తొక్కడంతో జొకో ఆటలేవీ సాగలేదు. దీంతో ఫెడరర్ జోరుకు తిరుగేలేకుండా పోయింది. ఆరంభం నుంచి చకచకా పాయింట్లు సాధిస్తుండటంతో వరుస గేముల్లో రోజర్ గెలుస్తూ వచ్చాడు. రెండు బ్రేక్ పాయింట్లతో పాటు తన సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో కేవలం 15 నిమిషాల్లోనే ఫెడరర్ 4–0తో ఆధిపత్యం చాటాడు. అదేపనిగా అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్ స్టార్ ఒక్క గేమ్ అయిన గెలకుండానే సెట్ కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. చివరకు ఐదో గేమ్‌లో సెర్బియన్ స్టార్‌కు గేమ్ గెలిచే పట్టుచిక్కింది. తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 1–4తో స్విస్ స్టార్ జోరుకు ఎదురు నిలిచాడు. వెంటనే తేరుకున్న ఫెడరర్ మరో బ్రేక్ పాయింట్‌తో పాటు సర్వీస్ నిలబెట్టుకొని సెట్‌ను 6–1తో గెలిచాడు. టైబ్రేక్‌లో జొకో జోరు... మూడో సెట్ కూడా తొలి సెట్‌నే తలపించింది. ప్రతి పాయింట్ కోసం ఇద్దరు శక్తికి మించే శ్రమించారు. 52 నిమిషాల పాటు జరిగిన ఈ సెట్లో ఫెడరర్ తన ప్రత్యర్థిపై 4 ఏస్‌లతో విరుచుకుపడినప్పటికీ 12 అనవసర తప్పిదాలు ఫలితంపై ప్రభావం చూపాయి. ఈ సెట్ కూడా 6–6దాకా సాగడంతో టైబ్రేక్ తప్పలేదు. ఇందులో సెర్బియన్ స్టార్ వయసుపైబడిన ఫెడెక్స్‌పై సహజంగా తన దూకుడు కనబరచడంతో సెట్ దక్కించుకున్నాడు. నాలుగో సెట్లో మళ్లీ ఫెడరర్ జోరు పెంచాడు. ఇందులో సుదీర్ఘ ర్యాలీలు జరిగిన ప్రతీసారి ఫెడరర్ విన్నర్లు సంధించి సెట్‌ను గెలుపొందాడు. నిర్ణాయక ఐదో సెట్ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 8–7తో ఆధిక్యంలో ఉన్నపుడు తన సర్వీస్‌లో ఫెడరర్ 40–15తో రెండు మ్యాచ్ పాయింట్లు సంపాదించాడు. అయితే జొకోవిచ్ తేరుకొని ఈ గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 8–8తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచాడు. ఆ తర్వాత ఆఖరి సెట్ కటాఫ్ స్కోరు 12–12 దాకా జరిగింది. ఇక్కడ టైబ్రేక్ నిర్వహిస్తే మళ్లీ జొకోవిచే పైచేయి సాధించడంతో టైటిల్ వశమైంది. ఈ సీజన్లో సెర్బియన్ స్టార్కిది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో సెమీస్‌లో వెనుదిరిగాడు. -
'అష్ట' చమక్...
♦ ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఫెడరర్ ♦ ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డు ♦ ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో సిలిచ్‌పై ఘనవిజయం ♦ రూ. 18 కోట్ల 53 లక్షల ప్రైజ్‌మనీ సొంతం ఎలాంటి అద్భుతం జరగలేదు. ఊహించిన ఫలితమే వచ్చింది. తనకెంతో కలిసొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ఎనిమిదోసారి విజయగర్జన చేశాడు. 140 ఏళ్ల ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధికసార్లు విజేతగా నిలిచిన క్రీడాకారుడిగా కొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో పీట్ సంప్రాస్ (అమెరికా), విలియమ్ రెన్షా (బ్రిటన్) ఏడుసార్లు చొప్పున ఈ టైటిల్‌ను సాధించగా... తాజా విజయంతో ఫెడరర్ ఈ ఇద్దరినీ అధిగమించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. లండన్: ఏ లక్ష్యం కోసమైతే క్లే కోర్టు సీజన్ మొత్తానికి దూరంగా ఉండాలని ఫెడరర్ నిర్ణయం తీసుకున్నాడో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. తనకెంతో ప్రియమైన వింబుల్డన్ టోర్నమెంట్లో ఎనిమిదోసారి చాంపియన్‌గా నిలవాలని ఆశించిన అతను అనుకున్నది చేశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 6–1, 6–4తో ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచాడు. తద్వారా వింబుల్డన్ టోర్నమెంట్ చరిత్రలో పురుషుల సింగిల్స్ విభాగంలో రికార్డుస్థాయిలో ఎనిమిదోసారి విజేతగా నిలిచి రికార్డు పుటల్లో తన పేరును లిఖించుకున్నాడు. టైటిల్ నెగ్గిన ఫెడరర్‌కు 22 లక్షల పౌండ్లు (రూ. 18 కోట్ల 53 లక్షలు)... రన్నరప్ సిలిచ్‌కు 11 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఆరంభం నుంచే... గంటా 41 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో ఫెడరర్‌కు తన ప్రత్యర్థి నుంచి ఏమాత్రం పోటీ ఎదురుకాలేదు. అందరి అంచనాలను తారుమారు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చిన సిలిచ్ అంతిమ సమరంలో మాత్రం 35 ఏళ్ల ఫెడరర్ జోరు ముందు నిలువలేకపోయాడు. తొలి సెట్ రెండో గేమ్‌లోనే ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసే అవకాశం వచ్చినా సిలిచ్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకున్న ఫెడరర్... ఐదో గేమ్‌లో సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తొమ్మిదో గేమ్‌లో మరోసారి సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఫెడరర్ తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. సిలిచ్ కంట కన్నీరు... రెండో సెట్లో ఫెడరర్ మరింత చెలరేగిపోయాడు. ఈ స్విస్ దిగ్గజాన్ని ఎలా నిలువరించాలో సిలిచ్‌కు అర్థం కాలేదు. 0–3తో వెనుకబడిన దశలో సిలిచ్ తన విజయావకాశాలు చేజారిపోతున్నాయనే బాధను తట్టుకోలేక కోర్టులోనే కన్నీరు పెట్టుకున్నాడు. వెంటనే తన ముఖాన్ని టవల్లో దాచుకున్నాడు. రెండో సెట్లో ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయిన ఫెడరర్ మూడో సెట్లోనూ తన దూకుడును కొనసాగించాడు. ఎనిమిదో గేమ్‌లో సిలిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత పదో గేమ్‌లో తన సర్వీస్‌లో ఏస్ సంధించి సెట్‌తోపాటు మ్యాచ్‌ను ముగించేశాడు. విజయానంతరం ఫెడరర్ పెద్దగా సంబరాలు చేసుకోలేదు. గాల్లో చేతులు ఎత్తి అందరికీ వందనం చేశాడు. తన ప్రత్యర్థి సిలిచ్ దగ్గరకు వెళ్లి అతడినీ అభినందించాడు. ఇన్ని ఘనతలు సాధించగలగడం నమ్మశక్యంగా లేదు. మరోసారి ఈ వేదికపై ఫైనల్ ఆడగలనని గత ఏడాది అనుకోలేదు. అప్పట్లో రెండు సార్లు జొకోవిచ్ చేతిలో ఫైనల్స్‌లో ఓడిపోవడం బాధించింది. అయితే పునరాగమనం చేయగలనని నాకు నేను ధైర్యం చెప్పుకున్నాను. మనల్ని మనం నమ్మితే ఏదైనా సాధించవచ్చనేదానికి నా ఎనిమిదో టైటిల్ ఉదాహరణ. ఒక్క సెట్ ఓడకుండా ట్రోఫీ సాధించడం ఒక మాయలా కనిపిస్తోంది. విశ్రాంతి నాకు కలిసొచ్చింది. ఈ సారి మళ్లీ ఆరు నెలలు విరామం ఇస్తే అది మరోసారి అనుకూలంగా మారుతుందేమో చూడాలి. –ఫెడరర్ 19 ఫెడరర్ సాధించిన గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య. ఇందులో ఐదు ఆస్ట్రేలియన్ ఓపెన్ (2004, 06, 07, 2010, 2017), ఒక ఫ్రెంచ్ ఓపెన్ (2009), ఎనిమిది వింబుల్డన్ (2003, 04, 05, 06, 07, 09, 2012, 2017), ఐదు యూఎస్ ఓపెన్ (2004, 05, 06, 07, 08) టైటిల్స్ ఉన్నాయి. 2 ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫెడరర్ నెగ్గిన గ్రాండ్‌స్లామ్ టైటిల్స్. 2007 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, 2017 వింబుల్డన్ టోర్నీలో ఫెడరర్ తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. 1976లో జాన్ బోర్గ్ (స్వీడన్) తర్వాత ఫెడరర్ మాత్రమే ఒక్క సెట్ చేజార్చుకోకుండా వింబుల్డన్ విజేతగా నిలిచాడు. 2 ఓపెన్ శకంలో (1968 తర్వాత) 30 ఏళ్లు దాటిన తర్వాత ఒకే ఏడాది రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ప్లేయర్ ఫెడరర్. గతంలో రాడ్ లేవర్ (1969లో) మాత్రమే ఈ ఘనత సాధించాడు. 1111 ఫెడరర్ కెరీర్లో విజయాల సంఖ్య. 102 వింబుల్డన్‌లో ఫెడరర్ ఆడిన మ్యాచ్‌లు. జిమ్మీ కానర్స్ రికార్డును అతను సమం చేశాడు. 1 వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా ఫెడరర్ గుర్తింపు పొందాడు. 1976లో ఆర్థర్ యాష్ (32 ఏళ్లు) రికార్డు తెరమరుగైంది. హింగిస్... 23వ ‘గ్రాండ్’ టైటిల్ స్విట్జర్లాండ్ టెన్నిస్ మహిళా దిగ్గజం మార్టినా హింగిస్ తన కెరీర్లో 23వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించింది. వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విభాగం ఫైనల్లో హింగిస్–జేమీ ముర్రే (బ్రిటన్) ద్వయం 6–4, 6–4తో కొంటినెన్ (ఫిన్లాండ్)–హీతెర్ (బ్రిటన్) జంటపై గెలిచి విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా హింగిస్ సింగిల్స్‌లో 5, డబుల్స్‌లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచింది. -
నా కల సాకారం
లండన్ : భారతదేశం గర్వించదగ్గ మరో ఘనత... దేశంలో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచేలా మరో గొప్ప టైటిల్... సానియా మీర్జా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి... రెండేళ్లుగా అసమాన ఆటతీరుతో చెలరేగుతున్న భారత టెన్నిస్ స్టార్ తాజాగా వింబుల్డన్‌లో మిహ ళల డబుల్స్ టైటిల్‌తో మరో ఘనతను సొంతం చేసుకుంది. దీంతో అన్ని గ్రాండ్‌స్లామ్‌లలోనూ ఏదో ఒక విభాగంలో టైటిల్ సాధించి కెరీర్ స్లామ్‌ను పూర్తి చేసుకుంది. మార్టినా హింగిస్‌తో కలిసి ఫైనల్లో 5-7, 7-6 (7/4), 7-5తో రష్యా జోడి వెస్నినా, మకరోవాపై గెలిచింది. విజయం తర్వాత సానియా చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే... వింబుల్డన్ విజయం: చాంపియన్‌గా నిద్రలేవడం అనేది గొప్ప అనుభూతి. దీనిని వర్ణించడానికి మాటలు సరిపోవు. వింబుల్డన్ టైటిల్‌కు విలువ కట్టలేం. ఇది సాధించాలనేది నా కల. నా కెరీర్లో ఈ ఘనత సాధించడం, 4 గ్రాండ్‌స్లామ్‌లు గెలవడం నా అదృష్టం. అద్భుతమైన ఫైనల్: ఒక గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఎంత బాగా జరగాలో అలా జరిగింది. నలుగురం కూడా సర్వశక్తులూ ఒడ్డి పోరాడాం. మా ప్రత్యర్థులు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా వాళ్ల సర్వీస్ చాలా బాగుంది. ఒక బ్రేక్ దొరికితే మరింత దూకుడుగా ఆడాలనేది మా వ్యూహం. దానిని అమలు చేసి ఫలితం సాధించాం. హార్డ్కోర్ట్ సీజన్‌పై గురి : త్వరలో హార్డ్కోర్ట్ సీజన్ ప్రారంభం కానుంది. దీనికోసం మరింత కష్టపడతాను. వింబుల్డన్‌లో సర్వీస్‌కు ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. హార్డ్కోర్టులలో మా శైలి ఆట ద్వారా ఫలితాలు ఎక్కువగా వస్తాయి. రాబోయే సీజన్లో మంచి ఫలితాలే వస్తాయని ఆశిస్తున్నాను. స్ఫూర్తి పెరిగితే సంతోషం : నా విజయం మరికొంతమంది భారతీయ మహిళల్లో స్ఫూర్తిని పెంచొచ్చు. నేను ఆడేది గెలవడం కోసం. ఆ గెలుపు ద్వారా మరింత మంది అమ్మాయిలు స్ఫూర్తి తెచ్చుకుని గెలిస్తే మరీ సంతోషం. ఆందోళన చెందలేదు: ఫైనల్లో వెనకబడ్డ సమయంలో ఆందోళన చెందలేదు. కెరీర్లో ఇలాంటి పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాం. ఇలాంటి వాటి మీద ఏళ్ల తరబడి కష్టపడ్డాం. కాబట్టి నియంత్రణతోనే ఆడాం. తప్పులు చేయకుండా ఆడాం: ఎట్టి పరిస్థితుల్లోనూ మన తప్పుల వల్ల మ్యాచ్ పోగూడదు. వాళ్లు గెలవాలంటే మనకంటే మెరుగ్గా ఆడాలి. అంటే మేం ప్రతి బంతినీ కోర్టులో సరైన ప్రదేశంలోకి పంపాలి. ఇదే వ్యూహంతో ఆడితే ఏదో ఒక సమయంలో ప్రత్యర్థులు తప్పు చేస్తారు. చివరికి అదే జరిగింది. అభినందనల వెల్లువ సానియాపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ సహా అనేకమంది ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలిపారు. ‘సానియా సాధించిన విజయం దేశంలో మహిళలకు ప్రేరణ ఇస్తుంది. నీతోపాటు దేశమంతా నీ విజయానికి సంబరం జరుపుకుంటోంది’ అని ప్రణబ్ హర్షం వ్యక్తం చేశారు. ‘సానియా, హింగిస్ అద్భుతంగా ఆడారు. వింబుల్డన్‌లో మరపురాని విజయాన్ని నమోదు చేసి మమ్మల్ని గర్వపడేలా చేశారు’ అని ప్రధాని మోదీ తెలిపారు. కేంద్ర మంత్రులు సోనోవాల్, అరుణ్ జైట్లీ కూడా ఇదే రీతిన తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సానియా మీర్జా సాధించిన విజయాన్ని సీఎం కె.చంద్రశేఖర్ రావు కొనియాడారు. ‘అంతర్జాతీయ టోర్నమెంట్స్ గెలుస్తూ హైదరాబాదీ అమ్మాయిలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సానియాకు నా అభినందనలు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సానియాను అభినందించారు. సంబరాలు లేవు : సానియా మీర్జాకు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకు అనేక మంది ప్రముఖులు ఫైనల్‌కు వెళ్లారు. బాలీవుడ్ హీరో, డెరైక్టర్ ఫర్హాన్ అక్తర్, పాకిస్తాన్ క్రికెటర్ అజహర్ మహమూద్, తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్ తదితరులు ఫ్యామిలీ బాక్స్‌లో కూర్చుని మ్యాచ్ చూశారు. అయితే మ్యాచ్ అయిపోయేసరికి రాత్రి 10 గంటలు దాటిపోవడంతో సానియా-హింగిస్ సంబరాలేమీ చేసుకోకుండా హోటల్‌కు వెళ్లారు. -
వింబుల్డన్ విజేత జొకోవిచ్
లండన్: డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరోసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో జొకోవిచ్ 7-6(7-1),6-7(10-12), 6-4, 6-3 తేడాతో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ను బోల్తాకొట్టించి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. దీంతో 9 వ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్న జొకోవిచ్.. ముచ్చటగా మూడోసారి వింబుల్డన్ టైటిల్ ను గెలుచుకున్నాడు. కాగా, 18 వ గ్రాండ్ స్లామ్ సాధించాలన్నఫెదరర్ ఆశ నెరవేరలేదు. తొలిసెట్ లో ఫెదరర్ ముందంజలో పయనించినట్లు కనిపించినా.. ఆ సెట్ టై బ్రేక్ కు దారి తీసింది. ఆ సమయంలో జొకోవిచ్ రెచ్చిపోయాడు. టై బ్రేక్ లో ఫెదరర్ కు ఒక్క పాయింట్ మాత్రమే చేజార్చుకున్న జొకోవిచ్ ఆ సెట్ ను వశ పరుచుకున్నాడు. ఇక రెండో సెట్ వచ్చేసరికి వీరిద్దరి మధ్య పోరు యుద్ధ వాతావారణాన్ని తలపించింది. నువ్వా-నేనా అన్నట్లు సాగిన రెండో సెట్ కూడా ట్రై బ్రేక్ వెళ్లింది. అయితే ఇక్కడ మాత్రం ఫెదరర్ ఆ సెట్ ను దక్కించుకుని స్కోరు సమం చేశాడు. కీలకమైన మూడో సెట్ లో జొకోవిచ్ పైచేయి సాధించి ఆధిక్యం దిశగా దూసుకుపోయాడు. తర్వాత జొకోవిచ్ కు ఎదురులేకుండా పోయింది. నిర్ణయాత్మ నాల్గో సెట్ లో జొకోవిచ్ దూకుడుగా ఆడి ఫెదరర్ ను మట్టికరిపించాడు. నొవాక్ జొకోవిచ్ ప్రొఫైల్.. జన్మదినం: 1987 మే 22 దేశం: సెర్బియా కెరీర్ సింగిల్స్ టైటిల్స్: 53 ప్రస్తుత ర్యాంక్ 1 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ 9 ఆస్ట్రేలియా ఓపెన్ 5 వింబుల్డన్ 3 యూఎస్ ఓపెన్ 1 ఒలింపిక్ గేమ్స్ 2008లో కాంస్యం -
సానియాకు అభినందనల వెల్లువ
న్యూఢిల్లీ: భారత్ కు తొలిసారిగా మహిళల డబుల్స్ విభాగంలో వింబుల్డన్ టైటిల్ సాధించిపెట్టిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జాపై అభినందనల జల్లు కురుస్తోంది. మార్టినా హింగిస్ తో కలిసి మహిళల డబుల్స్ సాధించిన సానియాకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. గొప్ప విజయం సాధించారని సానియాను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. వింబుల్డన్ విజయానికి తామెంతో గర్విస్తున్నామని, సంతోషపడుతున్నామని ప్రశంసించారు. సానియా సాధించిన విజయం దేశంలోని యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. క్రీడల మంత్రి శర్బానంద సోనోవాల్ కూడా సానియా, హింగిస్ జోడికి అభినందనలు తెలిపారు. మహిళల డబుల్స్ విభాగంలో తొలిసారి గ్రాండ్ స్లామ్ గెలిచిన సానియా మిర్జాకు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. Hearty congratulations @MirzaSania @mhingis on winning women's doubles in Wimbledon, @MirzaSania's achievement will inspire youth of India — President of India (@RashtrapatiBhvn) July 12, 2015 Well played @mhingis & @MirzaSania. You played wonderful tennis & registered a fantastic win at @Wimbledon. We are proud & very happy. — Narendra Modi (@narendramodi) July 12, 2015 -
‘జై’కోవిచ్...
రెండోసారి వింబుల్డన్ టైటిల్ వశం ఫైనల్లో ఫెడరర్‌పై విజయం ఐదు సెట్ల హోరాహోరీ పోరాటం మళ్లీ ‘టాప్’ ర్యాంక్ హస్తగతం రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం జొకోవిచ్ మళ్లీ జయకేతనం ఎగురవేశాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో రెండోసారి విజేతగా నిలిచాడు. గత ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో మూడుసార్లు టైటిల్ విజయానికి దూరమైన ఈ సెర్బియా స్టార్ ఈసారి సత్తా చాటాడు. అత్యధికంగా ఎనిమిదిసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గి రికార్డు సృష్టించాలని ఆశించిన ఫెడరర్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. ఐదు సెట్ల హోరాహోరీ పోరాటంలో పైచేయి సాధించి తన కెరీర్లో ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను చేర్చుకున్నాడు. లండన్: గతేడాది రన్నరప్‌తో సంతృప్తి పడిన టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ ఈసారి సగర్వంగా ట్రోఫీని ఎత్తుకున్నాడు. ‘గ్రాస్‌కోర్టు రారాజు’... ఏడుసార్లు వింబుల్డన్ విజేత... స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ను ఓడించి ఈ సెర్బియా స్టార్ రెండోసారి చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 56 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ అంతిమ సమరంలో జొకోవిచ్ 6-7 (7/9), 6-4, 7-6 (7/4), 5-7, 6-4తో విజయం సాధించాడు. ఈ గెలుపుతో జొకోవిచ్ 9 నెలల తర్వాత మళ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. విజేత జొకోవిచ్‌కు 17 లక్షల 60 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 5 లక్షలు); రన్నరప్ ఫెడరర్‌కు 8 లక్షల 80 వేల పౌండ్లు (రూ. 8 కోట్ల 80 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2011లో రాఫెల్ నాదల్‌ను ఓడించి తొలిసారి వింబుల్డన్ టైటిల్ నెగ్గిన ఆనందంలో సరదాగా పచ్చగడ్డి రుచి చూసిన ఈ సెర్బియా స్టార్ అదే దృశ్యాన్ని ఆదివారం పునరావృతం చేశాడు. హా గతంలో వింబుల్డన్‌లో ఫెడరర్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయిన జొకోవిచ్ ఈసారి విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. మ్యాచ్ ఆద్యంతం అద్వితీయంగా సాగింది. ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. పదునైన సర్వీస్‌లు, శక్తివంతమైన రిటర్న్ షాట్లు, సుదీర్ఘ ర్యాలీలు, ఫోర్‌హ్యాండ్ షాట్లతో ఇద్దరూ అలరించారు. హా 13 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మ్యాచ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నెట్‌వద్ద 26 పాయింట్లు నెగ్గాడు. మరోవైపు ఫెడరర్ 29 ఏస్‌లు సంధించాడు. ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. -
వింబుల్డన్ ఫైనల్లో ఫెదరర్‌పై జకోవిచ్ గెలుపు
లండన్: టాప్ సీడ్, సెర్పియన్ టెన్నిస్ క్రీడాకారుడు నువాక్ జోకోవిచ్ రెండవ వింబుల్డన్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాలుగవ సీడ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ ను ఓడించడం ద్వారా కెరీర్ లో ఏడవ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలుచుకున్నాడు. మూడు గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 6-7(7) 6-4 7-6 (4) 5-7 6-4 స్కోర్ తేడాతో ఫెదరర్ పై జకోవిచ్ విజయం సాధించాడు. 2011లో వింబుల్డన్ టైటిల్ ను గెలిచిన జోకోవిచ్ ఖాతాలో ఓ యూఎస్ ఓపెన్ తోపాటు, నాలుగు ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. -
‘క్వీన్’ క్విటోవా...
రెండోసారి వింబుల్డన్ టైటిల్ వశం టైటిల్ పోరులో బౌచర్డ్‌పై గెలుపు కేవలం 55 నిమిషాల్లో ముగిసిన ఫైనల్ రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం లండన్: యువజోరుపై అనుభవమే పైచేయి సాధించింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా వశమైంది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి 6-3, 6-0తో ‘కెనడా భామ’ యూజిన్ బౌచర్డ్‌పై గెలిచింది. కేవలం 55 నిమిషాల్లోనే ముగిసిన ఈ టైటిల్ పోరులో 24 ఏళ్ల క్విటోవా తన ప్రత్యర్థికి కేవలం మూడు గేమ్‌లే సమర్పించుకోవడం విశేషం. విజేతగా నిలిచిన ఆరో సీడ్ క్విటోవాకు 17 లక్షల 60 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 5 లక్షలు); రన్నరప్, 13వ సీడ్ బౌచర్డ్‌కు 8 లక్షల 80 వేలు (రూ. 9 కోట్ల 2 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2011లో తొలిసారి వింబుల్డన్ విజేతగా అవతరించిన క్విటోవాకు ఆనాటి అనుభవం ఈసారి ఉపయోగపడింది. మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన 20 ఏళ్ల బౌచర్డ్ ఒత్తిడికిలోనై తడబడి మూల్యం చెల్లించుకుంది. 6 అడుగుల ఎత్తు, 70 కేజీల బరువున్న క్విటోవా శక్తివంతమైన రిటర్న్ షాట్లతో ఏదశలోనూ బౌచర్డ్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని బౌచర్డ్‌కు అంతిమ సమరంలో ఆరంభం నుంచే ఇబ్బందులు ఎదురయ్యాయి. తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడానికి ఆమె తీవ్రంగా శ్రమించింది. క్విటోవా సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన బౌచర్డ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి తొలి సెట్‌ను 32 నిమిషాల్లో చేజార్చుకుంది. రెండో సెట్లో క్విటోవా దూకుడుకు బౌచర్డ్ వద్ద సమాధానమే కరువైంది. క్విటోవా చెలరేగి తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతోపాటు మూడుసార్లు బౌచర్డ్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. దాంతో ఈ సెట్లో బౌచర్డ్ ఒక్క గేమూ నెగ్గలేకపోయింది. నాలుగు ఏస్‌లు, మూడు డబుల్ ఫాల్ట్‌లు సంధించిన క్విటోవా... నెట్‌వద్ద 14 సార్లు దూసుకొచ్చి 11 సార్లు పాయింట్లు నెగ్గింది. 28 విన్నర్స్ కొట్టిన క్విటోవా, 12 అనవసర తప్పిదాలు చేసింది. నేటి పురుషుల సింగిల్స్ ఫైనల్ ఫెడరర్ Xజొకోవిచ్ సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
చాంపియన్ ఖేల్‌ఖతం
-
చాంపియన్ ఖేల్‌ఖతం
దిమిత్రోవ్ చేతిలో ఓడిన ముర్రే సెమీస్‌లో జొకోవిచ్, ఫెడరర్ లండన్: గత ఏడాది స్వదేశంలో వింబుల్డన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన ఆండీ ముర్రే (బ్రిటన్) ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్, 11వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-1, 7-6 (7/4), 6-2తో ప్రపంచ ఐదో ర్యాంకర్, మూడోసీడ్ ముర్రేపై విజయం సాధించాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి బల్గేరియా ఆటగాడిగా రికార్డులకెక్కాడు. దాదాపు రెండుగంటల పాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రే 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. రెండు బ్రేక్ పాయింట్లలో ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 3-6, 6-7 (4), 6-2, 6-2తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై; 4వ సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 3-6, 7-6 (7/5), 6-4, 6-4తో 5వ సీడ్ వావింకా (స్విట్జర్లాండ్)పై గెలిచి సెమీస్‌కు చేరారు. హలెప్, బౌచర్డ్ విజయం మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడోసీడ్ హలెప్ (రొమేనియా) 6-4, 6-0తో 19వ సీడ్ లిసికి (జర్మనీ)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. మరో మ్యాచ్‌లో 13వ సీడ్ బౌచర్డ్ (కెనడా) 6-3, 6-4తో 9వసీడ్ కెర్బర్ (జర్మనీ) పై నెగ్గింది. డబుల్స్ క్వార్టర్స్‌కు పేస్ జోడి పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో ఐదోసీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్) 6-4, 6-7 (5), 6-4, 7-5తో రోజెర్ (నెదర్లాండ్స్)-టెకాయు (రొమేనియా)పై గెలిచి క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో బోపన్న (భారత్) -హల్వకోవా (చెక్) 6-4, 7-5తో ఫ్లెమింగ్-జోస్లిన్ రే (బ్రిటన్)పై నెగ్గారు. సానియా- టెకాయు (రొమేనియా) జోడి 6-3, 6-3తో పావిక్ (క్రొయేషియా) - జానోవిస్కీ (సెర్బియా)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరింది. -
ఫెడరర్ శుభారంభం
నాదల్, వావింకా, సోంగా కూడా... షరపోవా, రద్వాన్‌స్కా ముందంజ వింబుల్డన్ టెన్నిస్ లండన్: ఎనిమిదోసారి వింబుల్డన్ టైటిల్‌పై గురిపెట్టిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్... తొలి రౌండ్లో సునాయాస విజయాన్ని నమోదు చేశాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌లో నాలుగోసీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 6-1, 6-1, 6-3తో ప్రపంచ 83వ ర్యాంకర్, అన్‌సీడెడ్ పావోలో లోరెంజీ (ఇటలీ)పై నెగ్గి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గత 11 ఏళ్లలో తొలి రౌండ్ మ్యాచ్‌ను వరుస సెట్లలో గెలవడం ఫెడరర్‌కు ఇది పదోసారి. 93 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ఐదు బ్రేక్ పాయింట్లను కాపాడుకున్న ఈ స్విస్ ప్లేయర్ లోరెంజీ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండోసీడ్ నాదల్ (స్పెయిన్) 4-6, 6-3, 6-3, 6-3తో మార్టిన్ క్లిజాన్ (స్లొవేకియా)పై; 5వ సీడ్ వావింకా (స్విట్జర్లాండ్) 6-3, 6-4, 6-3తో జో సోసా (పోర్చుగల్)పై; 8వ సీడ్ రావోనిక్ (కెనడా) 6-2, 6-4, 6-4తో ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై; 10వ సీడ్ నిషికోరి (జపాన్) 6-4, 7-6 (5), 7-5తో డి షీపర్ (ఫ్రాన్స్)పై; 13వ సీడ్ గాస్కెట్ (ఫ్రాన్స్) 6-7 (3), 6-3, 3-6, 6-0, 6-1తో జేమ్స్ డక్‌వర్త్ (ఆస్ట్రేలియా)పై; 14వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) 6-1, 3-6, 3-6, 6-2, 6-4తో జుర్గెన్ మెల్జర్ (ఆస్ట్రియా)పై; 19వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 7-6 (6), 7-6 (6), 7-6 (6)తో యుచి సుగిటా (జపాన్)పై నెగ్గి తదుపరి రౌండ్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో టాప్‌సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 6-1, 6-2తో తతిషవిల్లీ(అమెరికా)పై; 5వ సీడ్ మరియా షరపోవా (రష్యా) 6-1, 6-0తో సమంతా ముర్రే (బ్రిటన్)పై; 14వ సీడ్ రద్వాన్‌స్కా (పోలెండ్) 6-2, 6-2తో ఆండ్రియా మిటూ (రొమేరియా)పై; 9వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 6-2, 6-4తో ఉసుజులా రద్వాన్‌స్కా (పోలెండ్)పై; 16వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 6-3, 6-0తో షాహర్ పీర్ (ఇజ్రాయిల్)పై; 20వ సీడ్ పెట్కోవిచ్ (జర్మనీ) 6-1, 6-4తో కట్జైనా పీటర్ (పోలెండ్)పై గెలిచి రెండోరౌండ్లోకి అడుగుపెట్టారు. మళ్లీ తొలి రౌండ్లోనే... ఎంత పోరాడినా భారత స్టార్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించలేకపోతున్నాడు. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో అతను 6-4, 3-6, 3-6, 6-3, 3-6తో 15వ సీడ్ జెర్జీ జానోవిచ్ (పోలెండ్) చేతిలో ఓటమిపాలయ్యాడు. చివరి 13 టోర్నీల్లో సోమ్‌దేవ్ తొలి రౌండ్లోనే ఓడటం ఇది 10వసారి. దాదాపు మూడు గంటలకుపైగా సాగిన ఈ మ్యాచ్‌లో సర్వీస్‌లో విఫలమైన సోమ్‌దేవ్ 19 డబుల్ ఫాల్ట్‌లతో మూల్యం చెల్లించుకున్నాడు. జానోవిచ్ బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లకు, బైస్లైన్ ఆటకు భారత కుర్రాడి వద్ద సమాధానం లేకపోయింది. కీలకమైన ఐదోసెట్లో నాలుగు బ్రేక్ పాయింట్లను కాపాడుకుని, నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 3-1 ఆధిక్యంలో నిలిచాడు. కానీ ఈ దశలో పుంజుకున్న జానోవిచ్ వరుస పాయింట్లతో సోమ్‌దేవ్‌కు నిరాశ మిగిల్చాడు. -
ఒకే పార్శ్వంలో ముర్రే, జొకోవిచ్
వింబుల్డన్ ‘డ్రా’ విడుదల లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఆండీ ముర్రేకు ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్ నిలబెట్టుకోవాలంటే విశేషంగా రాణించాల్సి ఉంటుంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక గ్రాండ్‌స్లామ్ టోర్నీకి సంబంధించిన ‘డ్రా’ వివరాలను శుక్రవారం విడుదల చేశారు. అంతా అనుకున్నట్లు జరిగితే... గతేడాది ఫైనల్లో తలపడిన ప్రపంచ రెండో ర్యాంకర్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఈసారి సెమీఫైనల్లోనే తలపడే అవకాశముంది. మరో పార్శ్వం నుంచి రెండో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లో పోటీపడే చాన్స్ ఉంది. తొలి రౌండ్లో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)తో ఆండీ ముర్రే; గొలుబెవ్ (కజకిస్థాన్)తో జొకోవిచ్; లొరెంజీ (ఇటలీ)తో ఫెడరర్; క్లిజాన్ (స్లొవేకియా)తో నాదల్ ఆడతారు. సోమ్‌దేవ్‌కు క్లిష్టం భారత్‌కు చెందిన సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్‌కు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. తొలి రౌండ్లో 15వ సీడ్ జెర్జీ జనోవిచ్ (పోలండ్)తో సోమ్‌దేవ్ ఆడతాడు. ఈ టోర్నీలో ఒక్కసారి (2011లో) మాత్రమే పాల్గొన్న సోమ్‌దేవ్ రెండో రౌండ్‌కు చేరాడు. పురుషుల డబుల్స్‌లో ఐదో సీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్) జోడి తొలి రౌండ్లో ఫ్రిస్టన్బర్గ్ (పోలండ్)-రాజీవ్ రామ్ (అమెరికా) జంటతో; రోహన్ బోపన్న (భారత్)-ఐజాముల్ ఖురేషీ (పాకిస్థాన్) ద్వయం తొలి రౌండ్లో సెర్మాక్ (చెక్ రిపబ్లిక్)-ఎల్గిన్ (రష్యా) జోడితో ఆడతాయి. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)-వెరా జ్వొనరేవా (రష్యా)లతో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) తలపడతారు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) ఒకే పార్శ్వంలో ఉన్నారు. వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్లో తలపడే అవకాశముంది. తొలి రౌండ్లో తాతిష్విలి (అమెరికా)తో సెరెనా; సమంత ముర్రే (బ్రిటన్)తో షరపోవా ఆడతారు.