
చాంపియన్ ఖేల్‌ఖతం
దిమిత్రోవ్ చేతిలో ఓడిన ముర్రే
సెమీస్‌లో జొకోవిచ్, ఫెడరర్
లండన్: గత ఏడాది స్వదేశంలో వింబుల్డన్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన ఆండీ ముర్రే (బ్రిటన్) ఈసారి క్వార్టర్ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ 13వ ర్యాంకర్, 11వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) 6-1, 7-6 (7/4), 6-2తో ప్రపంచ ఐదో ర్యాంకర్, మూడోసీడ్ ముర్రేపై విజయం సాధించాడు. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీ సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి బల్గేరియా ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
దాదాపు రెండుగంటల పాటు జరిగిన మ్యాచ్‌లో ముర్రే 37 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. రెండు బ్రేక్ పాయింట్లలో ఒక్కదాన్ని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-1, 3-6, 6-7 (4), 6-2, 6-2తో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై; 4వ సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 3-6, 7-6 (7/5), 6-4, 6-4తో 5వ సీడ్ వావింకా (స్విట్జర్లాండ్)పై గెలిచి సెమీస్‌కు చేరారు.
హలెప్, బౌచర్డ్ విజయం
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడోసీడ్ హలెప్ (రొమేనియా) 6-4, 6-0తో 19వ సీడ్ లిసికి (జర్మనీ)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించింది. మరో మ్యాచ్‌లో 13వ సీడ్ బౌచర్డ్ (కెనడా) 6-3, 6-4తో 9వసీడ్ కెర్బర్ (జర్మనీ) పై నెగ్గింది.
డబుల్స్ క్వార్టర్స్‌కు పేస్ జోడి
పురుషుల డబుల్స్ మూడో రౌండ్‌లో ఐదోసీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్) 6-4, 6-7 (5), 6-4, 7-5తో రోజెర్ (నెదర్లాండ్స్)-టెకాయు (రొమేనియా)పై గెలిచి క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న (భారత్) -హల్వకోవా (చెక్) 6-4, 7-5తో ఫ్లెమింగ్-జోస్లిన్ రే (బ్రిటన్)పై నెగ్గారు. సానియా- టెకాయు (రొమేనియా) జోడి 6-3, 6-3తో పావిక్ (క్రొయేషియా) - జానోవిస్కీ (సెర్బియా)పై గెలిచి మూడో రౌండ్‌కు చేరింది.