
‘జై’కోవిచ్...
రెండోసారి వింబుల్డన్ టైటిల్ వశం
ఫైనల్లో ఫెడరర్‌పై విజయం
ఐదు సెట్‌ల హోరాహోరీ పోరాటం
మళ్లీ ‘టాప్’ ర్యాంక్ హస్తగతం
రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం
జొకోవిచ్ మళ్లీ జయకేతనం ఎగురవేశాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ టోర్నీలో రెండోసారి విజేతగా నిలిచాడు. గత ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో మూడుసార్లు టైటిల్ విజయానికి దూరమైన ఈ సెర్బియా స్టార్ ఈసారి సత్తా చాటాడు. అత్యధికంగా ఎనిమిదిసార్లు వింబుల్డన్ టైటిల్ నెగ్గి రికార్డు సృష్టించాలని ఆశించిన ఫెడరర్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. ఐదు సెట్‌ల హోరాహోరీ పోరాటంలో పైచేయి సాధించి తన కెరీర్‌లో ఏడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను చేర్చుకున్నాడు.
లండన్: గతేడాది రన్నరప్‌తో సంతృప్తి పడిన టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ ఈసారి సగర్వంగా ట్రోఫీని ఎత్తుకున్నాడు. ‘గ్రాస్‌కోర్టు రారాజు’... ఏడుసార్లు వింబుల్డన్ విజేత... స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ను ఓడించి ఈ సెర్బియా స్టార్ రెండోసారి చాంపియన్‌గా నిలిచాడు. 3 గంటల 56 నిమిషాలపాటు నువ్వా నేనా అన్నట్లు సాగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ అంతిమ సమరంలో జొకోవిచ్ 6-7 (7/9), 6-4, 7-6 (7/4), 5-7, 6-4తో విజయం సాధించాడు.
ఈ గెలుపుతో జొకోవిచ్ 9 నెలల తర్వాత మళ్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. విజేత జొకోవిచ్‌కు 17 లక్షల 60 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 5 లక్షలు); రన్నరప్ ఫెడరర్‌కు 8 లక్షల 80 వేల పౌండ్లు (రూ. 8 కోట్ల 80 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
2011లో రాఫెల్ నాదల్‌ను ఓడించి తొలిసారి వింబుల్డన్ టైటిల్ నెగ్గిన ఆనందంలో సరదాగా పచ్చగడ్డి రుచి చూసిన ఈ సెర్బియా స్టార్ అదే దృశ్యాన్ని ఆదివారం పునరావృతం చేశాడు. హా గతంలో వింబుల్డన్‌లో ఫెడరర్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లో ఓడిపోయిన జొకోవిచ్ ఈసారి విజయం సాధించి ప్రతీకారం తీర్చుకున్నాడు. మ్యాచ్ ఆద్యంతం అద్వితీయంగా సాగింది. ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. పదునైన సర్వీస్‌లు, శక్తివంతమైన రిటర్న్ షాట్‌లు, సుదీర్ఘ ర్యాలీలు, ఫోర్‌హ్యాండ్ షాట్‌లతో ఇద్దరూ అలరించారు. హా 13 ఏస్‌లు సంధించిన జొకోవిచ్ మూడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. మ్యాచ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. నెట్‌వద్ద 26 పాయింట్లు నెగ్గాడు. మరోవైపు ఫెడరర్ 29 ఏస్‌లు సంధించాడు. ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు.