ఆస్ట్రేలియన్‌ ఓపెన్​లో ఊహించని సంఘటన.. జొకోవిచ్ గుడ్‌బై చెప్పేస్తాడా? | Injured Djokovic booed off after quitting semi-final | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియన్‌ ఓపెన్​లో ఊహించని సంఘటన.. జొకోవిచ్ గుడ్‌బై చెప్పేస్తాడా?

Published Fri, Jan 24 2025 9:35 PM | Last Updated on Fri, Jan 24 2025 9:34 PM

Injured Djokovic booed off after quitting semi-final

వయసుతో సంబంధం లేకుండా ఆడుతూ టెన్నిస్ లో ఉన్నత శిఖరాలను అధిరోహించిన 37 ఏళ్ళ నోవాక్ జొకోవిచ్ చివరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్‌లో ప్రేక్షకుల నిరసనల మధ్య నిష్క్రమించడం చాలా బాధాకరం. శుక్రవారం అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో మొదటి సెట్‌ను కోల్పోయిన తర్వాత ఎడమ కాలిలో కండరాల నొప్పుల కారణంగా నిష్క్రమిస్తున్నట్టు  జొకోవిచ్ ప్రకటించాడు. జొకోవిచ్ తొలి సెట్ ను 7-6 (5) తేడాతో కోల్పోయిన అనంతరం  నెట్ చుట్టూ నడిచి జ్వెరెవ్‌కు కరచాలనం చేసి ఓటమి అంకీకరిస్తూ ప్రేక్షకులకు అభివాదం చేసి వెనుదిరిగాడు.

సెర్బియా కు చెందిన  జొకోవిచ్ మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రారంభంలో ఒక సెట్ ని కోల్పోయినప్పటికీ మూడో సీడ్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ విసిరిన సవాలును గట్టిగా ఎదుర్కొని 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో విజేత గా నిలిచి సెమీఫైనల్ కి దూసుకెళ్లాడు.

రికార్డు స్థాయిలో తన పదకొండవ ఆస్ట్రేలియన్ ఓపెన్ కిరీటాన్ని గెలుచుకోవడానికి జొకోవిచ్ తన శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ చివరికి ఒక అడుగు దూరంలో గాయం కారణంగా తలొగ్గాల్సింది.  జొకోవిచ్ మళ్ళీ   క్వార్టర్ ఫైనల్స్‌ ఆడిన రీతిలోనే  అదే స్పూర్తితో ఆడి గెలుపొంది ఫైనల్ కి దూసుకెళ్తాడని ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు ఆశించారు. ఇందుకోసం వారంతా ఏంటో ఖర్చు పెట్టి స్టేడియం కి వచ్చారు. అయితే జొకోవిచ్ ఈ రీతి లో వైదొలగడం వారికి ఎంతో నిరాశ పరిచింది.  

మ్యాచ్ అనంతరం   జొకోవిచ్ మాట్లాడుతూ, జెరెవ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. “సాషాకు శుభాకాంక్షలు, అతను తన మొదటి స్లామ్‌కు సాధించడానికి సంపూర్ణంగా అర్హుడు," అని కితాబు ఇచ్చాడు. గత సంవత్సరం కూడా  జొకోవిచ్   ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో సెమీఫైనల్‌ దశలోనే నిష్క్రమించడం గమనార్హం. 2017 తర్వాత మొదటిసారిగా జొకోవిచ్ ఒక గ్రాండ్ స్లాం కూడా గెలవక పోవడం ఇదే మొదటి సారి. అయితే జొకోవిచ్ గత ఏడాది ఒలింపిక్ స్వర్ణం సాధించడం విశేషం.

ఈ ఏడాదిలో తనకెంతో ఇష్టమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మరోసారి సెమిస్ స్థాయి నుంచే వైదొలగడం తో ఇంక జొకోవిచ్ కూడా తన చిరకాల ప్రత్యర్థులైన  ఫెదరర్, రాఫెల్ నాదల్ లాగానే త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అతని అభిమానులు భావిస్తున్నారు. గత కొంత కాలంగా జొకోవిచ్ తండ్రి అతనిని  రిటైర్మెంట్  ప్రకటించమని ఒత్తిడి చేస్తుండటం  గమనార్హం.

"గత కొంత కాలంగా నన్ను టెన్నిస్ నుంచి రిటైర్ చేయించడానికి   నాన్న  ప్రయత్నిస్తున్నారు. టెన్నిస్ లో ఇంకా ఏమి సాధించాలని భావిస్తున్నావ్" అని అయన ప్రశ్నిస్తున్నారు. సుదీర్ఘంగా టెన్నిస్ ఆడటం వల్ల అది అతని శరీరం పై ప్రభావం చూపుతోంది. ఈ కారణంగానే జొకోవిచ్ ని అతని తండ్రి రిటైర్మెంట్ గురుంచి ఒత్తిడి చేసున్నానడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా ఓపెన్ నుంచి తప్పుకోవడంతో జొకోవిచ్ పై మరింత ఒత్తిడి పెరుగుతుందనడంలో సందేహం లేదు. అయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రేక్షకులు జొకోవిచ్ వంటి అరుదైన ఆటగాడిని ఆ విధంగా గేలి చేయడం మాత్రం ఏ విధంగా సమర్థనీయం కాదు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement