జయహో జొకోవిచ్‌ | Novak Djokovic beats Roger Federer in epic match to win fifth Wimbledon title | Sakshi
Sakshi News home page

జయహో జొకోవిచ్‌

Published Mon, Jul 15 2019 5:00 AM | Last Updated on Mon, Jul 15 2019 11:39 AM

Novak Djokovic beats Roger Federer in epic match to win fifth Wimbledon title - Sakshi

సమఉజ్జీల పోరంటే ఇది. అసలు సిసలు ఫైనల్‌ అంటే కచ్చితంగా ఇదే! అలసటే ఉత్సాహం తెచ్చుకున్న సమరంలో దిగ్గజం ఫెడరర్‌ పోరాడి ఓడగా... డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్‌ ఫైనల్‌ వేదిక ఐదు సెట్ల దాకా ఆడించింది. ప్రేక్షకుల్ని 4 గంటల 57 నిమిషాలపాటు కూర్చోబెట్టింది. ఆఖరి దాకా నువ్వానేనా అన్నట్లు టైటిల్‌ కోసం ఈ పోరాట యోధులిద్దరూ యుద్ధమే చేశారు. తుదకు కీలకదశలో సంయమనంతో ఆడిన జొకోవిచ్‌ పైచేయి సాధించాడు. తన కెరీర్‌లో ఐదోసారి వింబుల్డన్‌ టైటిల్‌ను, 16వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

లండన్‌: టాప్‌ సీడ్ల మధ్య జరిగిన ఆఖరి సమరంలో అంతిమ విజయం జొకోవిచ్‌కు దక్కింది. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 7–6 (7/5), 1–6, 7–6 (7/4), 4–6, 13–12 (7/3)తో రెండో సీడ్‌ రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌)పై గెలుపొందాడు. ఐదు సెట్ల పోరాటంలో మూడు సెట్లను టైబ్రేక్‌లే తేల్చాయి. ఏస్‌ల రారాజు ఫెడరర్‌ ఏకంగా 25 ఏస్‌లు సంధించినప్పటికీ టైబ్రేక్‌లో వెనుకబడటంతో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. విజేత జొకోవిచ్‌ 10 ఏస్‌లు సంధించి, 52 అనవసర తప్పిదాలు చేశాడు.

స్విస్‌ స్టార్‌ 61 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 94 విన్నర్లు కొట్టిన ఫెడరర్, ఆరుసార్లు డబుల్‌ ఫాల్ట్‌ చేశాడు. జొకోవిచ్‌ 54 విన్నర్లు కొట్టాడు. ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌లో ఐదో టైటిల్‌ గెలిచిన జొకోవిచ్‌ ఓవరాల్‌గా 16వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. ఓపెన్‌ శకం మొదలయ్యాక టాప్‌ సీడ్, రెండో సీడ్‌ వింబుల్డన్‌ ఫైనల్లో తలపడటం ఇది 14వసారి. 2015లోనూ ఈ ఇద్దరు టైటిల్‌ కోసం పోటీపడగా ఫెడెక్స్‌పై జొకోవిచే గెలిచాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 23 లక్షల 50 వేల పౌండ్లు (రూ. 20 కోట్ల 26 లక్షలు)... రన్నరప్‌ ఫెడరర్‌కు 11 లక్షల 75 వేల పౌండ్లు (రూ. 10 కోట్ల 13 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.

ఆరంభం నుంచే హోరాహోరీ...
ఇద్దరి ఆట ఆరంభం నుంచే వేటగా మారింది. అందుకే ఒక్క సెట్‌ మినహా మిగతా అన్ని సెట్లు నువ్వానేనా అన్నట్లే సాగాయి. ముందుగా 58 నిమిషాలపాటు జరిగిన తొలి సెట్‌లో ఎవరి సర్వీస్‌ను వారు నిలబెట్టుకోవడంలో సఫలమయ్యారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ ఒక గేమ్‌ గెలిస్తే... మరో గేమ్‌ ఫెడరర్‌ నెగ్గాడు. ఇలా 12 గేమ్‌ల దాకా సాగిన తొలి సెట్‌లో ఇద్దరూ ఆరేసి పాయింట్లు సంపాదించారు. దీంతో ఫలితం తేల్చేందుకు టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో సెర్బియన్‌ అంత చురుగ్గా ఫెడరర్‌ షాట్లకు పదును పెట్టలేకపోయాడు. దీంతో ఫెడెక్స్‌ తొలి సెట్‌ను కోల్పోయాడు.  

రెండో సెట్‌ మినహా...
తుది పోరులో ఈ రెండో సెట్‌ మినహా అన్నీ సెట్లు యుద్ధాన్ని తలపించాయి. ఈ సెట్‌లో ఫెడెక్స్‌ ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌ హాండ్‌ షాట్లతో చెలరేగాడు. ప్రత్యర్థి కంటే రెట్టింపు వేగంతో కదం తొక్కడంతో జొకో ఆటలేవీ సాగలేదు. దీంతో ఫెడరర్‌ జోరుకు తిరుగేలేకుండా పోయింది. ఆరంభం నుంచి చకచకా పాయింట్లు సాధిస్తుండటంతో వరుస గేముల్లో రోజర్‌ గెలుస్తూ వచ్చాడు. రెండు బ్రేక్‌ పాయింట్లతో పాటు తన సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో కేవలం 15 నిమిషాల్లోనే ఫెడరర్‌ 4–0తో ఆధిపత్యం చాటాడు. అదేపనిగా అనవసర తప్పిదాలు చేసిన సెర్బియన్‌ స్టార్‌ ఒక్క గేమ్‌ అయిన గెలకుండానే సెట్‌ కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. చివరకు ఐదో గేమ్‌లో సెర్బియన్‌ స్టార్‌కు గేమ్‌ గెలిచే పట్టుచిక్కింది. తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 1–4తో స్విస్‌ స్టార్‌ జోరుకు ఎదురు నిలిచాడు. వెంటనే తేరుకున్న ఫెడరర్‌ మరో బ్రేక్‌ పాయింట్‌తో పాటు సర్వీస్‌ నిలబెట్టుకొని సెట్‌ను 6–1తో గెలిచాడు.

టైబ్రేక్‌లో జొకో జోరు...
మూడో సెట్‌ కూడా తొలి సెట్‌నే తలపించింది. ప్రతి పాయింట్‌ కోసం ఇద్దరు శక్తికి మించే శ్రమించారు. 52 నిమిషాల పాటు జరిగిన ఈ సెట్‌లో ఫెడరర్‌ తన ప్రత్యర్థిపై 4 ఏస్‌లతో విరుచుకుపడినప్పటికీ 12 అనవసర తప్పిదాలు ఫలితంపై ప్రభావం చూపాయి. ఈ సెట్‌ కూడా 6–6దాకా సాగడంతో టైబ్రేక్‌ తప్పలేదు. ఇందులో సెర్బియన్‌ స్టార్‌ వయసుపైబడిన ఫెడెక్స్‌పై సహజంగా తన దూకుడు కనబరచడంతో సెట్‌ దక్కించుకున్నాడు. నాలుగో సెట్‌లో మళ్లీ ఫెడరర్‌ జోరు పెంచాడు. ఇందులో సుదీర్ఘ ర్యాలీలు జరిగిన ప్రతీసారి ఫెడరర్‌ విన్నర్లు సంధించి సెట్‌ను గెలుపొందాడు.

నిర్ణాయక ఐదో సెట్‌ హోరాహోరీగా సాగింది. ఒక దశలో 8–7తో ఆధిక్యంలో ఉన్నపుడు తన సర్వీస్‌లో ఫెడరర్‌ 40–15తో రెండు మ్యాచ్‌ పాయింట్లు సంపాదించాడు. అయితే జొకోవిచ్‌ తేరుకొని ఈ గేమ్‌లో ఫెడరర్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి స్కోరును 8–8తో సమం చేసి మ్యాచ్‌లో నిలిచాడు. ఆ తర్వాత ఆఖరి సెట్‌ కటాఫ్‌ స్కోరు 12–12 దాకా జరిగింది. ఇక్కడ టైబ్రేక్‌ నిర్వహిస్తే మళ్లీ జొకోవిచే పైచేయి సాధించడంతో టైటిల్‌ వశమైంది. ఈ సీజన్‌లో సెర్బియన్‌ స్టార్‌కిది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచిన జొకోవిచ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సెమీస్‌లో వెనుదిరిగాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement