‘క్వీన్’ క్విటోవా...
రెండోసారి వింబుల్డన్ టైటిల్ వశం
టైటిల్ పోరులో బౌచర్డ్‌పై గెలుపు
కేవలం 55 నిమిషాల్లో ముగిసిన ఫైనల్
రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం
లండన్: యువజోరుపై అనుభవమే పైచేయి సాధించింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా వశమైంది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి 6-3, 6-0తో ‘కెనడా భామ’ యూజిన్ బౌచర్డ్‌పై గెలిచింది.
కేవలం 55 నిమిషాల్లోనే ముగిసిన ఈ టైటిల్ పోరులో 24 ఏళ్ల క్విటోవా తన ప్రత్యర్థికి కేవలం మూడు గేమ్‌లే సమర్పించుకోవడం విశేషం. విజేతగా నిలిచిన ఆరో సీడ్ క్విటోవాకు 17 లక్షల 60 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 5 లక్షలు); రన్నరప్, 13వ సీడ్ బౌచర్డ్‌కు 8 లక్షల 80 వేలు (రూ. 9 కోట్ల 2 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
2011లో తొలిసారి వింబుల్డన్ విజేతగా అవతరించిన క్విటోవాకు ఆనాటి అనుభవం ఈసారి ఉపయోగపడింది. మరోవైపు కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన 20 ఏళ్ల బౌచర్డ్ ఒత్తిడికిలోనై తడబడి మూల్యం చెల్లించుకుంది.
6 అడుగుల ఎత్తు, 70 కేజీల బరువున్న క్విటోవా శక్తివంతమైన రిటర్న్ షాట్‌లతో ఏదశలోనూ బౌచర్డ్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని బౌచర్డ్‌కు అంతిమ సమరంలో ఆరంభం నుంచే ఇబ్బందులు ఎదురయ్యాయి. తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడానికి ఆమె తీవ్రంగా శ్రమించింది. క్విటోవా సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన బౌచర్డ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి తొలి సెట్‌ను 32 నిమిషాల్లో చేజార్చుకుంది.
రెండో సెట్‌లో క్విటోవా దూకుడుకు బౌచర్డ్ వద్ద సమాధానమే కరువైంది. క్విటోవా చెలరేగి తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతోపాటు మూడుసార్లు బౌచర్డ్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. దాంతో ఈ సెట్‌లో బౌచర్డ్ ఒక్క గేమూ నెగ్గలేకపోయింది. నాలుగు ఏస్‌లు, మూడు డబుల్ ఫాల్ట్‌లు సంధించిన క్విటోవా... నెట్‌వద్ద 14 సార్లు దూసుకొచ్చి 11 సార్లు పాయింట్లు నెగ్గింది. 28 విన్నర్స్ కొట్టిన క్విటోవా, 12 అనవసర తప్పిదాలు చేసింది.
నేటి పురుషుల సింగిల్స్ ఫైనల్
ఫెడరర్ Xజొకోవిచ్
సాయంత్రం గం. 6.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం