Petra Kvitova
-
కోచ్‌తో ప్రేమపెళ్లి.. శుభవార్త చెప్పిన టెన్నిస్ స్టార్
చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్, వింబుల్డన్ మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్-2024కు దూరం కానుంది. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది. ప్రస్తుతం తాను గర్భవతినని.. అందుకే ఆటకు విరామం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కొత్త సంవత్సరం సందర్భంగా తాను తల్లి కాబోతున్న శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. సోనోగ్రామ్ ఫొటోను చూపిస్తూ భర్త జిరి వనెక్తో కలిసి ఉన్న దృశ్యాలను ఈ సందర్భంగా క్విటోవా షేర్ చేసింది. ఈ ఏడాది వేసవిలో తమ ఇంట్లోకి బుజ్జాయి రానుందంటూ హర్షం వ్యక్తం చేసింది. జీవితంలోని కొత్త దశను పూర్తిగా ఆస్వాదించడానికే కొంతకాలం ఆటకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా 33 ఏళ్ల పెట్రా క్విటోవా రెండుసార్లు వింబుల్డన్ విజేతగా నిలిచింది. 2011లో మారియా షరపోవాను ఓడించి.. 2014లో ఉజెనీ బౌచర్డ్ను మట్టికరిపించి టైటిల్స్ సాధించింది. అదే విధంగా.. 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచింది. ఇక 2019లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్ చేరిన క్విటోవా నయోమి ఒసాకా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక పెట్రా క్విటోవా వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. తనకు కోచ్‌గా వ్యవహరించిన జిరి వనెక్తో 2019 నుంచి డేటింగ్ చేసిన ఆమె గతేడాది అతడిని పెళ్లాడింది. ఈ జంట త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. కాగా జనవరి 14- 28 వరకు ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. On the first day of 2024 I wanted to wish you a happy new year and share the exciting news that Jiri and I will be welcoming a baby into our family this summer! 👼 pic.twitter.com/JwUi2Lcose — Petra Kvitova (@Petra_Kvitova) December 31, 2023 -
Miami Open 2023: 13వ ప్రయత్నంలో సఫలం
ఫ్లోరిడా: ఎట్టకేలకు చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నమెంట్లో 33 ఏళ్ల క్విటోవా తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. గతంలో 12 సార్లు ఈ టోర్నీలో పాల్గొని ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన క్విటోవా 13వ ప్రయత్నంలో ఏకంగా టైటిల్ సాధించడం విశేషం. ప్రపంచ ఏడో ర్యాంకర్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ క్విటోవా గంటా 42 నిమిషాల్లో 7–6 (16/14), 6–2తో విజయం సాధించింది. క్విటోవా కెరీర్లో ఇది 30వ సింగిల్స్ టైటిల్‌కాగా, డబ్ల్యూటీఏ–1000 విభాగంలో తొమ్మిదోది. ఈ గెలుపుతో క్విటోవా 2021 సెప్టెంబర్ తర్వాత మళ్లీ ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి రానుంది. రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచి సూపర్ ఫామ్‌లో ఉన్న రిబాకినా ఫైనల్లో తొలి సెట్లో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 22 నిమిషాలపాటు జరిగిన టైబ్రేక్‌లో క్విటోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో క్విటోవా దూకుడుకు రిబాకినా చేతులెత్తేసింది. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే ఆమె గెల్చుకుంది. విజేతగా నిలిచిన క్విటోవాకు 12,62,220 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 36 లక్షలు), రన్నరప్ రిబాకినాకు 6,62,360 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 43 లక్షలు) లభించాయి. -
Stefanos Tsitsipas: సిట్సి‘పాస్’ కాలేదు
లండన్: మట్టి కోర్టులపై అదరగొట్టే గ్రీస్ యువ టెన్నిస్ స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్టెఫనోస్ సిట్సిపాస్ పచ్చిక కోర్టులపై మాత్రం తడబడ్డాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సిట్సిపాస్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 57వ ర్యాంకర్ ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–3తో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్‌ను ఓడించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. తన కెరీర్లో టాప్–5లోని ఆటగాడిపై నెగ్గడం టియాఫోకిదే తొలిసారి. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టియాఫో తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 15 ఏస్‌లు సంధించిన సిట్సిపాస్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశాడు. జేక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్లో జొకోవిచ్ 4–6, 6–1, 6–2, 6–2తో గెలుపొందాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏకంగా 25 ఏస్‌లు సంధించాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 6–4, 6–1, 6–2తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై నెగ్గాడు. స్లోన్ స్టీఫెన్స్ సంచలనం మహిళల సింగిల్స్ విభాగంలో 2011, 2014 చాంపియన్, పదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 73వ ర్యాంకర్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–3, 6–4తో క్విటోవాను ఓడించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో నికెలెస్కూ (రొమేనియా)పై, 11వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–0, 6–1తో ఫియోనా (ఫ్రాన్స్) పై, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–4, 6–2తో జిన్యు వాంగ్ (చైనా)పై, ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–4తో సు వె సెయి (చైనీస్ తైపీ)పై, 23వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–4తో స్వాన్ (బ్రిటన్)పై గెలిచారు. -
క్విటోవా కేక...
పారిస్: కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా ఆ దిశగా మరో అడుగు వేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ క్విటోవా 6–3, 6–3తో లౌరా సిగెముండ్ (జర్మనీ)పై విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్విటోవా ఆరు ఏస్‌లు సంధించింది. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 15 అనవసర తప్పిదాలు చేసిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. పదునైన ఏస్‌లతో చెలరేగిన క్విటోవా తొలి సెట్లో ప్రత్యర్థికి ఒక్కసారీ బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. ఫోర్ హ్యాండ్ విన్నర్‌తో తొలి సెట్‌ను నెగ్గిన ఆమె రెండో సెట్లోనూ అదే జోరు కొనసాగించింది. తొలి గేమ్‌లోనే సిగెముండ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్విటోవా ఆ తర్వాత తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. కానీ సిగెముండ్ తన సర్వీస్‌ను కాపాడుకోవడంలో మూడుసార్లు విఫలమవ్వడంతో క్విటోవాకు విజయం సులువుగానే దక్కింది. 2012లో ఏకైకసారి ఈ టోర్నీలో సెమీస్ చేరిన క్విటోవా తొలిసారి ఫైనల్‌కు చేరాలంటే సెమీఫైనల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా)ను ఓడించాల్సి ఉంటుంది. మరో క్వార్టర్ ఫైనల్లో సోఫియా 6–4, 4–6, 6–0తో అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సోఫియా ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు చేరడం విశేషం. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోఫియా రెండో సెట్లో తడబడింది. కానీ నిర్ణాయక మూడో సెట్లో ఈ అమెరికా క్రీడాకారిణి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది. -
ప్రేక్షకుల్లేకుండా టోర్నీలు ఆడలేను
ప్రాగ్: ఖాళీ స్టేడియాల్లో ఆటకు తాను వ్యతిరేకమని చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా చెప్పింది. కరోనా మహమ్మారి విలయంతో ఇప్పుడంతా గేట్లు మూసే ఆటలపైనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. చెక్ రిపబ్లిక్లో మళ్లీ టెన్నిస్ పునరుద్ధరణ సందర్భంగా రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ అయిన క్విటోవా మాట్లాడుతూ ‘నాకు మరో గ్రాండ్‌స్లామ్ ఆడాలనే ఉంటుంది. కానీ ప్రేక్షకుల్లేకుండా ఆడే పరిస్థితి వస్తే... ఆటను రద్దు చేసుకోవడమే మేలని భావిస్తాను. అభిమానులే మా చోదకశక్తి. ఆ శక్తిలేని చోటును చూడాలనుకోను. అది అసలు గ్రాండ్‌స్లామ్ అనిపించుకోదు’ అని తెలిపింది. తాను మళ్లీ టెన్నిస్ క్రీడను ఒక్క చెక్ రిపబ్లిక్లోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా చూడాలనుకుంటున్నట్లు చెప్పింది. వైరస్ విస్తరిస్తుండటంతో ఈ సీజన్లో వింబుల్డన్‌ను రద్దు చేయగా... ఫ్రెంచ్ ఓపెన్‌ను సెప్టెంబర్‌కు వాయిదా వేశారు. -
క్విటోవాకు చుక్కెదురు
న్యూయార్క్: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో మరో సంచలనం నమోదైంది. ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ రన్నరప్, ఆరో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఆమె 4–6, 4–6తో ప్రపంచ 88వ ర్యాంకర్ పెట్కొవిక్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ యాష్లే బార్టీ, ఐదో సీడ్ స్వితోలినా, పదో సీడ్ మాడిసన్ కీస్ ముందంజ వేశారు. స్థానిక అక్కాచెల్లెళ్లకు మిశ్రమ ఫలితాలొచ్చాయి. అక్క వీనస్ విలియమ్స్ ఆట ముగియగా, చెల్లి సెరెనా విలియమ్స్ మూడో రౌండ్లోకి ప్రవేశించింది. రెండో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా) 6–2, 7–6 (7/2)తో అమెరికాకు చెందిన లారెన్‌పై చెమటోడ్చి నెగ్గింది. ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) ఏడు సార్లు గ్రాండ్‌స్లామ్ చాంపియన్ అయిన వీనస్‌ను 6–4, 6–4తో ఓడించింది. 2017 రన్నరప్ కీస్ (అమెరికా) 6–4, 6–1తో జు లిన్ (చైనా)పై గెలిచింది. 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి మెక్నాలీ అమెరికన్ స్టార్ సెరెనా విలియమ్స్‌తో ఓ ఆటాడుకుంది. తొలిసెట్‌ను గెలిచి తమ దేశానికే చెందిన దిగ్గజానికి ముచ్చెమటలు పట్టించింది. రెండో సెట్లో కోలుకున్న అమెరికా నల్లకలువ 5–7, 6–3, 6–1తో మెక్నాలీ (అమెరికా)పై గెలిచి ఊపిరి పీల్చుకుంది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ 6–4, 7–6 (7/3), 6–1తో 56వ ర్యాంకర్ ఇగ్నాసియో (అర్జెంటీనా)పై గెలిచాడు. మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 3–6, 6–2, 6–3, 6–4తో జుమ్హుర్ (బోస్నియా)పై నెగ్గాడు. -
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఒసాకా
-
ఆస్ట్రేలియా ఓపెన్ విజేత ఒసాకా
మెల్బోర్న్ : గతేడాది గ్రాండ్‌స్లామ్ చివరి టోర్నీ యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా.. ఈ ఏడాది సీజన్ ఆరంభపు గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో సైతం అదరగొట్టింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఒసాకా 7-6(7/2), 5-7, 6-4 తేడాతో పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇరువురు క్రీడాకారిణులు మధ్య హోరాహోరీగా సాగిన తుది పోరులో ఒసాకానే విజయం వరించింది. తొలి సెట్‌ను టైబ్రేక్ ద్వారా గెలుపొందిన ఒసాకా.. రెండో సెట్‌ను కోల్పోయింది. దాంతో నిర్ణయాత్మక మూడో సెట్ ఆసక్తికరంగా మారింది. ఓవరాల్‌గా 116 పాయింట్లను ఒసాకా సాధించి విజేతగా నిలవగా, 112 పాయింట్లను క్విటోవా సాధించారు. ఇందులో ఒసాకా 9 ఏస్‌లను సంధించగా, క్విటోవా 5 ఏస్‌లను మాత్రమే సంధించి వెనుకబడింది. ఇక ఇరువురు తలో నాలుగుసార్లు డబుల్ ఫాల్ట్స్ చేయడం గమనార్హం. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జొకో జోరు
తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన వేదికపై సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మరోసారి చెలరేగిపోయాడు. సెమీఫైనల్లో తన ప్రత్యర్థికి కేవలం నాలుగు గేమ్‌లు మాత్రమే కోల్పోయిన అతను ఘనవిజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్‌కు చేరిన ఆరుసార్లూ విజేతగా నిలిచిన ఈ ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ ఆదివారం జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో అమీతుమీ తేల్చుకుంటాడు. ఈసారీ జొకోవిచ్ గెలిస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను అత్యధికంగా ఏడుసార్లు సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి చేరుతాడు. మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన సెమీఫైనల్లో జొకోవిచ్ 6–0, 6–2, 6–2తో 28వ సీడ్ లుకాస్ పుయి (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ అద్వితీయ ఆటతీరుతో అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. ఐదు అనవసర తప్పిదాలు చేసిన అతను ఏడుసార్లు పుయి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 24 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ నెట్ వద్దకు 14 సార్లు వచ్చి తొమ్మిదిసార్లు పాయింట్ సాధించాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్ చేరిన జొకోవిచ్ (2016, 2015, 2013, 2012, 2011, 2008) ఆరుసార్లూ చాంపియన్‌గా నిలువడం విశేషం. ఆదివారం రాఫెల్ నాదల్‌తో జరిగే ఫైనల్లో జొకోవిచ్ గెలిస్తే అత్యధికంగా ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టిస్తాడు. గతంలో రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఆరుసార్లు చొప్పున ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సాధించారు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 27–25తో నాదల్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. వీరిద్దరు 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తలపడగా... జొకోవిచ్ 5 గంటల 53 నిమిషాల్లో నాదల్‌ను ఓడించాడు. నెగ్గిన వారు నంబర్‌వన్ నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ ఒసాకా (vs) క్విటోవా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), నయోమి ఒసాకా (జపాన్) తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం తలపడనున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలుస్తారు. -
కొత్త చాంపియన్ ఎవరు?
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ ఓపెన్ మహిళల సింగిల్స్ పోరులో తుది బెర్తులు ఖరారయ్యాయి. ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా, నాల్గో సీడ్ నయోమి ఒసాకాలు టైటిల్ సమరంలో తలపడేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత క్విటోవా ఫైనల్ చేరగా, ఆపై మరో సెమీ ఫైనల్లో ఒసాకా విజయం సాధించి అమీతుమీ పోరులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. క్విటోవా 7-6(7/2), 6-0 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణి డానియెల్లీ కొలిన్స్(అమెరికా)పై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఇరువురి మధ్య తొలి సెట్ హోరా హోరీగా సాగగా, రెండో సెట్ ఏకపక్షంగా సాగింది. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను క్విటోవా గెలుపొందగా, రెండో సెట్లో కూడా అదే జోరును కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరారు. దాంతో 28 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి చెక్ రిపబ్లికన్ క్రీడాకారిణిగా క్విటోవా గుర్తింపు పొందారు. మరొక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి ఒసాకా 6-2, 4-6, 6-4 తేడాతో కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్)పై విజయ సాధించారు. ఫలితంగా శనివారం జరిగే అంతిమ సమరంలో ఒసాకా-క్విటోవాలు తలపడనున్నారు. గతేడాది జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఒసాకా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తుది పోరులో సెరెనా విలియమ్సన్‌ను ఓడించి యూఎస్ గ్రాండ్ స్లామ్‌ను గెలుచుకున్నారు. ఇదే ఆమెకు తొలి సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్. కాగా, క్విటోవా రెండు సార్లు వింబుల్డన్ టైటిల్‌ను గెలిచారు. 2011, 2014ల్లో క్విటోవా వింబుల్డన్ సింగిల్స్ విజేతగా నిలిచారు. దాంతో ఆస్ట్రేలియా ఓపెన్‌ను వీరిలో ఎవరు గెలిచినా తొలిసారి ఈ టైటిల్‌ను సాధించినట్లవుతుంది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో కొత్త చాంపియన్ ఎవరు అనే దానిపై ఆసక్తినెలకొంది. -
క్విటోవా తొలిసారి..
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి, ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా ఫైనల్లోకి ప్రవేశించారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో క్విటోవా 7-6(7/2), 6-0 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణి డానియెల్లీ కొలిన్స్(అమెరికా)పై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఇరువురి మధ్య తొలి సెట్ హోరా హోరీగా సాగగా, రెండో సెట్ ఏకపక్షంగా సాగింది. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను క్విటోవా గెలుపొందగా, రెండో సెట్లో కూడా అదే జోరును కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరారు. దాంతో 28 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి చెక్ రిపబ్లికన్ క్రీడాకారిణిగా క్విటోవా గుర్తింపు పొందారు. అంతకుముందు 1991లో జోనా నవోత్నా చివరిసారి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన చెక్ రిపబ్లికన్ క్రీడాకారిణి కాగా, ఇప్పుడు క్విటోవా ఆమె సరసన చేరారు. మ్యాచ్‌లో విజయం తర్వాత క్విటోవా మాట్లాడుతూ..‘ నేను చాలా చాలా సంతోషంగా ఉన్నా. ఫైనల్లో ఏమి జరిగినా ప్రస్తుత గెలుపును ఎక్కువగా ఆస్వాదిస్తున్నా. తొలి సెట్లో కొలిన్స్‌ను తీవ్ర పోటీ ఎదుర్కొన్నా. దాంతో ఓ దశలో ఒత్తిడికి లోనయ్యా. కానీ ఒత్తిడిని తట్టుకోవడంతో టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను గెలిచా. ఇక రెండో సెట్లో ఎటువంటి పొరపాట్లు చేయకపోవడంతో కొలిన్స్‌ను ఓడించి తుది బెర్తును ఖాయం చేసుకున్నా’ అని పేర్కొన్నారు. -
క్విటోవా హవా
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ స్టార్ క్రీడాకారులు... ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి అద్భుత ఆటతీరుతో దూసుకొస్తున్న అనామక క్రీడాకారులు... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తమ హవా చలాయిస్తున్నారు. మహిళల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా ఏడేళ్ల తర్వాత మళ్లీ సెమీఫైనల్ చేరుకోగా... గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఏనాడూ తొలి రౌండ్ దాటని అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ తన విజయపరంపర కొనసాగిస్తూ తొలిసారి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌లో నాదల్ ఆరోసారి సెమీఫైనల్ చేరగా... గ్రీస్ యువతార సిట్సిపాస్ మరో అద్భుత విజయంతో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు. మెల్బోర్న్: రెండేళ్ల క్రితం ఆగంతకుడి కత్తి దాడిలో గాయపడి ఆరు నెలలపాటు ఆటకు దూరమైన పెట్రా క్విటోవాకు పునరాగమనంలో ఆశించిన ఫలితాలు రాలేదు. ఆమె ఆడిన గత ఏడు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్ దశనూ దాటలేదు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మాత్రం క్విటోవా కదం తొక్కుతోంది. తన ప్రత్యర్థులను అలవోకగా చిత్తు చేస్తూ టైటిల్ దిశగా సాగుతోంది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–4తో 15వ సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై నెగ్గి 2012 తర్వాత తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. 2014లో వింబుల్డన్ టోర్నీ తర్వాత క్విటోవా సెమీఫైనల్ చేరిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా ఇదే కావడం గమనార్హం. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ షరపోవాను బోల్తా కొట్టించిన యాష్లే బార్టీ ఈ మ్యాచ్‌లో మాత్రం క్విటోవా ముందు నిలువలేకపోయింది. 68 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో క్విటోవా మూడు ఏస్‌లు సంధించి, మూడుసార్లు బార్టీ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. సెమీఫైనల్ చేరే క్రమంలో క్విటోవా ఇప్పటివరకు తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. గురువారం జరిగే సెమీఫైనల్లో అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ (అమెరికా)తో క్విటోవా తలపడుతుంది. ‘కన్నీళ్లు కావివి ఆనంద బాష్పాలు. నా భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నా. కత్తి దాడిలో గాయపడ్డాక మళ్లీ ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ దశకు రావడానికి నేను తీవ్రంగా శ్రమించాను. నాకైతే ఇది రెండో కెరీర్లాంటిదే. పునరాగమనం చేశాక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని అనుకోలేదు. ఈ క్షణాలను నేనెంతో ఆస్వాదిస్తున్నాను’ అని విజయానంతరం సెంటర్‌కోర్టులో క్విటోవా వ్యాఖ్యానించింది. మరో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 35వ ర్యాంకర్ డానియెలా కొలిన్స్ 2–6, 7–5, 6–1తో మరో అన్‌సీడెడ్ క్రీడాకారిణి అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కొలిన్స్ ఆరు ఏస్‌లు సంధించి, తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. అగుట్ పోరు ముగిసె... పురుషుల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ నాదల్, 14వ సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యారు. క్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ 6–3, 6–4, 6–2తో ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)పై గెలుపొందగా... సిట్సిపాస్ 7–5, 4–6, 6–4, 7–6 (7/2)తో 22వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ లో సెమీఫైనల్‌కు చేరాడు. కెరీర్లో 25వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతూ తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరిన అగుట్ కీలక మ్యాచ్‌లో మాత్రం తడబడ్డాడు. తొలి రౌండ్లో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేపై... మూడో రౌండ్లో పదో సీడ్ ఖచనోవ్ (రష్యా)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో నిరుటి రన్నరప్, ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలిచిన అగుట్ ఈసారి అలాంటి ఫలితాన్ని పునరావృతం చేయలేకపోయాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్‌పై సంచలన విజయం సాధించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సిట్సిపాస్... ఈ ఏడాది తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అందుకున్నానని వ్యాఖ్యానించాడు. ‘ఈ ఏడాది నీ లక్ష్యమేంటి అని అడిగితే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరడం అని చెప్పాను. అయితే ఇంత త్వరగా జరుగుతుందని ఊహించలేదు’ అని 20 ఏళ్ల సిట్సిపాస్ అన్నాడు. పేస్ జంట పరాజయం మిక్స్డ్ డబుల్స్‌లో ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగిన లియాండర్ పేస్ (భారత్)–సమంతా స్టోసుర్ (ఆస్ట్రేలియా) జోడీ రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. పేస్–స్టోసుర్ ద్వయం 6–4, 4–6, 8–10తో ఐదో సీడ్ రాబర్ట్ ఫరా (కొలంబియా)–అనా లెనా గ్రోన్‌ఫెల్డ్ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది. పేస్ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత క్రీడాకారుల కథ ముగిసింది. నేటి క్వార్టర్ ఫైనల్స్ మహిళల సింగిల్స్ విభాగం నయోమి ఒసాకా (vs) ఎలీనా స్వితోలినా సెరెనా విలియమ్స్(vs) కరోలినా ప్లిస్కోవా పురుషుల సింగిల్స్ విభాగం మిలోస్ రావ్‌నిచ్(vs) లుకాస్ పుయి జొకోవిచ్(vs) నిషికోరి ఉదయం గం. 5.30 నుంచి; మధ్యాహ్నం గం. 1.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ముచ్చటగా మూడోసారి...
ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీ మాడ్రిడ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. ఫైనల్లో క్విటోవా 7–6 (8/6), 4–6, 6–3తో కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీని మూడుసార్లు గెలిచిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2011, 2015లలో కూడా క్విటోవా ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచింది. విజేత క్విటోవాకు 11,90,490 యూరోల (రూ. 9 కోట్ల 58 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
క్విటోవాపై కత్తితో దాడి
ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా దొంగ చేతిలో గాయానికి గురైంది. ప్రొస్టెజోవ్ నగరంలో క్విటోవా నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో చోరీకి చేయడానికి వచ్చిన గుర్తుతెలియని దుండగుడు ఆమె ఎడమ చేతిపై దాడి చేశాడు. దొంగపై ఎదురుతిరిగిన క్రమంలో క్విటోవా గాయానికి గురైంది. ‘నేను ఒక్కసారిగా షాక్‌కు లోనయ్యాను. గాయం తీవ్రత ఎక్కువగానే ఉంది. ఈ సంఘటన తర్వాత నేను జీవించి ఉన్నందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నిపుణులైన వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకుంటాను. కోలుకునే క్రమంలో కొంతకాలం నన్ను ఏకాంతంగా వదిలేయాలని కోరుతున్నాను’ అని 11వ ర్యాంకర్ క్విటోవా తెలిపింది. -
క్విటోవా, సఫరోవా శుభారంభం
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) అతి కష్టమ్మీద తొలి రౌండ్ అడ్డంకిని దాటింది. ఆదివారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పదో సీడ్ క్విటోవా 6-2, 4-6, 7-5తో డాంకా కొవినిచ్ (మోంటెనిగ్రో)పై విజయం సాధించింది. ఏకంగా పది డబుల్ ఫాల్ట్‌లు చేసిన క్విటోవా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి గట్టెక్కింది. ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) 6-0, 6-2తో దియాత్‌చెంకో (రష్యా)పై, 24వ సీడ్ పావ్లీచెంకోవా (రష్యా) 6-2, 6-0తో సొరిబెస్ టోర్మో (స్పెయిన్)పై గెలిచారు. పురుషుల సింగిల్స్ విభాగంలో 19వ సీడ్ పెయిర్ (ఫ్రాన్స్) 6-2, 4-6, 6-4, 1-6, 6-4తో అల్బోట్ (మాల్డొవా)పై, 17వ సీడ్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7-6 (8/6), 7-6 (8/6), 6-4తో చెచినాటో (ఇటలీ)పై గెలిచారు. వర్షం కారణంగా ఇతర మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది. -
క్విటోవా ఖేల్‌ఖతం
మాడిసన్ కీస్ సంచలనం మెల్బోర్న్: మహిళల సింగిల్స్ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్స్ ఎవరూ లేరని వేసిన అంచనాలు నిజమవుతున్నాయి. టైటిల్ రేసులో ఉన్న వాళ్లలో ఒక్కొక్కరూ ఇంటిముఖం పడుతున్నారు. తొలి రౌండ్లో ఐదో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), తొమ్మిదో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)... రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) నిష్ర్కమించారు. ఈ ముగ్గురి సరసన నాలుగో సీడ్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా చేరింది. అమెరికా యువతార మాడిసన్ కీస్ ధాటికి ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్ క్విటోవా ఆట ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మాడిసన్ కీస్ 6-4, 7-5తో క్విటోవాను ఓడించి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు చేరింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీస్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ఐదుసార్లు క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 4-6, 6-2, 6-0తో ఎలీనా స్విటోలినా (ఉక్రెయిన్)పై, ఆరో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-0, 7-5తో లెప్చెంకో (అమెరికా)పై, మాజీ చాంపియన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-4, 6-4తో స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై, వీనస్ విలియమ్స్ (అమెరికా) 4-6, 7-6 (7/3), 6-1తో గియార్గి (ఇటలీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. జొకోవిచ్ ముందంజ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్లో జొకోవిచ్ 7-6 (10/8), 6-3, 6-4తో వెర్డాస్కో (స్పెయిన్)పై, నాలుగో సీడ్ వావ్రింకా 6-4, 6-2, 6-4తో నిమినెన్ (ఫిన్లాండ్)పై, నిషికోరి 6-7 (7/9), 6-1, 6-2, 6-3తో జాన్సన్ (అమెరికా)పై గెలిచారు. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) 6-4, 6-3, 6-3తో బెంజిమిన్ బెకర్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-2, 7-5, 5-7, 7-6 (7/4)తో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై, 12వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 7-6 (8/6), 6-4, 7-6 (7/3)తో జనోవిజ్ (పోలండ్)పై నెగ్గారు. -
స్టార్స్ సాఫీగా...
సెరెనా, క్విటోవా శుభారంభం మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రోజు టాప్-10 నుంచి ఇద్దరు ఇంటిదారి పట్టారు. అయితే రెండో రోజు మాత్రం ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. అంచనాలకు అనుగుణంగా రాణించిన స్టార్ క్రీడాకారులు సెరెనా విలియమ్స్, పెట్రా క్విటోవా, అగ్నెస్కా రద్వాన్‌స్కా, వొజ్నియాకి, అజరెంకా, వీనస్ తదితరులు తొలి రౌండ్ అడ్డంకిని దాటారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా 6-0, 6-4తో అలీసన్ వాన్ ఉట్వాన్క్ (బెల్జియం)పై గెలిచింది. 61 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా 11 ఏస్‌లు సంధించడం విశేషం. మరోవైపు నాలుగో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 6-4తో హోగెన్క్యాంప్ (నెదర్లాండ్స్)పై, ఆరో సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్) 6-3, 6-0తో కురిమి నారా (జపాన్)పై, ఎనిమిదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 7-6 (7/1), 6-2తో టౌన్సెండ్ (అమెరికా)పై నెగ్గారు. మాజీ చాంపియన్ అజరెంకా (బెలారస్) 6-3, 6-2తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై, మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-2, 6-2తో టోరో ఫ్లోర్ (స్పెయిన్)పై, 11వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 3-6, 6-3, 6-1తో ఫ్లిప్కెన్స్ (బెల్జియం)పై విజయం సాధించారు. అయితే 12వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 6-4, 2-6, 3-6తో జియార్జి (ఇటలీ) చేతిలో; 13వ సీడ్ పెట్కోవిక్ (జర్మనీ) 7-5, 6-7 (4/7), 3-6తో బ్రెంగెల్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) శుభారంభం చేశారు. తొలి రౌండ్లో జొకోవిచ్ 6-3, 6-2, 6-4తో చెన్నై ఓపెన్ రన్నరప్ అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)పై నెగ్గగా... వావ్రింకా 6-1, 6-4, 6-2తో మార్సెల్ ఇలాన్ (టర్కీ)ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) 6-4, 7-6 (7/1), 6-2తో నికొలస్ అల్మాగ్రో (స్పెయిన్)పై, ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) 7-6 (7/3), 7-6 (7/3), 6-3తో మర్చెంకో (ఉక్రెయిన్)పై, తొమ్మిదో సీడ్ ఫెరర్ (స్పెయిన్) 6-7 (2/7), 6-2, 6-0, 6-3తో బెలూచి (బ్రెజిల్)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. -
‘రైట్ టు ప్లే’ అంబాసిడర్‌గా క్విటోవా
హాంకాంగ్: రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్‌గా నిలిచిన పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) ‘రైట్ టు ప్లే’ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. ప్రపంచ వ్యాప్తంగా 10 లక్షల మంది పిల్లలకు ఈ సంస్థ విద్యను అందిస్తోంది. షెన్జెన్ ఓపెన్ సన్నాహకాల్లో భాగంగా క్విటోవా ప్రస్తుతం హాంకాంగ్‌లో ఉంది. ‘గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేయడంపై దృష్టిపెట్టా. నా హృదయానికి దగ్గరగా ఉన్న క్రీడతో కలిసి చిన్నారులకు శిక్షణ ఇవ్వడం నిజంగా చాలా గొప్ప అనుభూతి’ అని క్విటోవా వ్యాఖ్యానించింది. స్పీడ్ స్కేటింగ్‌లో నాలుగుసార్లు ఒలింపిక్ స్వర్ణం గెలిచిన జాన్ కోస్ 2000లో ఈ సంస్థను ప్రారంభించారు. 40 దేశాలు, ప్రాం తాల నుంచి 300 మంది వాలంటీర్ అథ్లెట్లు ఈ సంస్థలో పని చేస్తున్నారు. ‘క్విటోవా అద్భుతమైన క్రీడాకారిణి. ఆమె మా జట్టుతో కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అత్యుత్తమ ఆటతో క్విటోవా టెన్నిస్‌లో అగ్రశ్రేణి క్రీడాకారిణిగా నిలబడింది’ అని ఈ సందర్భంగా కోస్ ప్రశంసించారు. -
‘క్వీన్’ క్విటోవా...
రెండోసారి వింబుల్డన్ టైటిల్ వశం టైటిల్ పోరులో బౌచర్డ్‌పై గెలుపు కేవలం 55 నిమిషాల్లో ముగిసిన ఫైనల్ రూ. 18 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం లండన్: యువజోరుపై అనుభవమే పైచేయి సాధించింది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా వశమైంది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఈ చెక్ రిపబ్లిక్ అమ్మాయి 6-3, 6-0తో ‘కెనడా భామ’ యూజిన్ బౌచర్డ్‌పై గెలిచింది. కేవలం 55 నిమిషాల్లోనే ముగిసిన ఈ టైటిల్ పోరులో 24 ఏళ్ల క్విటోవా తన ప్రత్యర్థికి కేవలం మూడు గేమ్‌లే సమర్పించుకోవడం విశేషం. విజేతగా నిలిచిన ఆరో సీడ్ క్విటోవాకు 17 లక్షల 60 వేల పౌండ్లు (రూ. 18 కోట్ల 5 లక్షలు); రన్నరప్, 13వ సీడ్ బౌచర్డ్‌కు 8 లక్షల 80 వేలు (రూ. 9 కోట్ల 2 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2011లో తొలిసారి వింబుల్డన్ విజేతగా అవతరించిన క్విటోవాకు ఆనాటి అనుభవం ఈసారి ఉపయోగపడింది. మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన 20 ఏళ్ల బౌచర్డ్ ఒత్తిడికిలోనై తడబడి మూల్యం చెల్లించుకుంది. 6 అడుగుల ఎత్తు, 70 కేజీల బరువున్న క్విటోవా శక్తివంతమైన రిటర్న్ షాట్లతో ఏదశలోనూ బౌచర్డ్‌కు పుంజుకునే అవకాశం ఇవ్వలేదు. ఫైనల్ చేరే క్రమంలో తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోని బౌచర్డ్‌కు అంతిమ సమరంలో ఆరంభం నుంచే ఇబ్బందులు ఎదురయ్యాయి. తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడానికి ఆమె తీవ్రంగా శ్రమించింది. క్విటోవా సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసిన బౌచర్డ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి తొలి సెట్‌ను 32 నిమిషాల్లో చేజార్చుకుంది. రెండో సెట్లో క్విటోవా దూకుడుకు బౌచర్డ్ వద్ద సమాధానమే కరువైంది. క్విటోవా చెలరేగి తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతోపాటు మూడుసార్లు బౌచర్డ్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. దాంతో ఈ సెట్లో బౌచర్డ్ ఒక్క గేమూ నెగ్గలేకపోయింది. నాలుగు ఏస్‌లు, మూడు డబుల్ ఫాల్ట్‌లు సంధించిన క్విటోవా... నెట్‌వద్ద 14 సార్లు దూసుకొచ్చి 11 సార్లు పాయింట్లు నెగ్గింది. 28 విన్నర్స్ కొట్టిన క్విటోవా, 12 అనవసర తప్పిదాలు చేసింది. నేటి పురుషుల సింగిల్స్ ఫైనల్ ఫెడరర్ Xజొకోవిచ్ సాయంత్రం గం. 6.00 నుంచి స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం -
ఫైనల్లో క్విటోవా, బౌచర్డ్
సెమీస్‌లో పేస్ జోడి మిక్స్‌డ్‌లో సానియా ద్వయం ఓటమి లండన్: మూడేళ్ల తర్వాత మాజీ చాంపియన్ పెట్రా క్విటోవా... వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో 6వ సీడ్ క్విటోవా (చెక్) 7-6 (8/6), 6-1తో 23వ సీడ్ లూసి సఫరోవా (చెక్)పై విజయం సాధించింది. 80 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 24 విన్నర్స్, 8 ఏస్‌లతో ప్రత్యర్థిని వణికించింది. బలమైన గ్రౌండ్ స్ట్రోక్‌లను సంధిస్తూ బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో తొలి గేమ్‌లో సఫరోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది. అయితే వెంటనే తేరుకున్న సఫరోవా నాలుగో గేమ్‌లో క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి మ్యాచ్‌లో నిలిచింది. టైబ్రేక్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన క్విటోవా తొలి సెట్ పాయింట్‌ను చేజార్చుకున్నా... ఈ అవకాశాన్ని సఫరోవా సద్వినియోగం చేసుకోలేకపోయింది. చివరకు బలమైన విన్నర్‌తో ఆరోసీడ్ ప్లేయర్ సెట్‌ను ముగించింది. రెండోసెట్ రెండో గేమ్‌లో సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్విటోవా ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది. ఆరో గేమ్‌లో బ్రేక్ పాయింట్‌ను కాపాడుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మరో సెమీస్‌లో 13వ సీడ్ ఎగుని బౌచర్డ్ (కెనడా) 7-6 (5), 6-2తో 3వ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలిచింది. తద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి కెనడా మహిళా ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. గంటా 34 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఆరో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకుని విజయం సాధించింది. రెండోసెట్లో బ్రేక్ పాయింట్ వద్ద హలెప్ డబుల్ ఫాల్ట్ చేయడం బౌచర్డ్‌కు కలిసొచ్చింది. సెమీస్‌లో పేస్ జోడి పురుషుల డబుల్స్ క్వార్టర్ఫైనల్లో ఐదోసీడ్ లియాండర్ పేస్ (భారత్)-స్టెపానెక్ (చెక్) జోడి 3-6, 7-6 (5), 6-3, 6-4తో మూడోసీడ్ నెస్టర్ (కెనడా)-జిమోన్జిక్ (సెర్బియా)పై నెగ్గి సెమీస్‌కి చేరింది. మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా (భారత్)-టెకాయు (రొమేనియా) ద్వయం 5-7, 3-6తో జెమీ ముర్రే (బ్రిటన్)-డెల్లాక్వా (ఆస్ట్రేలియా) చేతిలో ఓడింది.