పారిస్: కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా ఆ దిశగా మరో అడుగు వేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఆమె ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్లీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ క్విటోవా 6–3, 6–3తో లౌరా సిగెముండ్ (జర్మనీ)పై విజయం సాధించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్విటోవా ఆరు ఏస్‌లు సంధించింది. నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 15 అనవసర తప్పిదాలు చేసిన ఆమె ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. పదునైన ఏస్‌లతో చెలరేగిన క్విటోవా తొలి సెట్‌లో ప్రత్యర్థికి ఒక్కసారీ బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. ఫోర్ హ్యాండ్ విన్నర్‌తో తొలి సెట్‌ను నెగ్గిన ఆమె రెండో సెట్‌లోనూ అదే జోరు కొనసాగించింది.
తొలి గేమ్‌లోనే సిగెముండ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన క్విటోవా ఆ తర్వాత తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. కానీ సిగెముండ్ తన సర్వీస్‌ను కాపాడుకోవడంలో మూడుసార్లు విఫలమవ్వడంతో క్విటోవాకు విజయం సులువుగానే దక్కింది. 2012లో ఏకైకసారి ఈ టోర్నీలో సెమీస్ చేరిన క్విటోవా తొలిసారి ఫైనల్‌కు చేరాలంటే సెమీఫైనల్లో నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా)ను ఓడించాల్సి ఉంటుంది. మరో క్వార్టర్ ఫైనల్లో సోఫియా 6–4, 4–6, 6–0తో అన్‌సీడెడ్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై గెలిచింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సోఫియా ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలిసారి సెమీఫైనల్‌కు చేరడం విశేషం. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సోఫియా రెండో సెట్‌లో తడబడింది. కానీ నిర్ణాయక మూడో సెట్‌లో ఈ అమెరికా క్రీడాకారిణి ఒక్క గేమ్ కూడా కోల్పోకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment