క్విటోవా ఖేల్‌ఖతం
మాడిసన్ కీస్ సంచలనం
మెల్‌బోర్న్: మహిళల సింగిల్స్ విభాగంలో కచ్చితమైన ఫేవరెట్స్ ఎవరూ లేరని వేసిన అంచనాలు నిజమవుతున్నాయి. టైటిల్ రేసులో ఉన్న వాళ్లలో ఒక్కొక్కరూ ఇంటిముఖం పడుతున్నారు. తొలి రౌండ్‌లో ఐదో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), తొమ్మిదో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)... రెండో రౌండ్‌లో ఎనిమిదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) నిష్ర్కమించారు. ఈ ముగ్గురి సరసన నాలుగో సీడ్ క్రీడాకారిణి పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా చేరింది.
అమెరికా యువతార మాడిసన్ కీస్ ధాటికి ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్ క్విటోవా ఆట ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో మాడిసన్ కీస్ 6-4, 7-5తో క్విటోవాను ఓడించి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ దశకు చేరింది. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కీస్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ఐదుసార్లు క్విటోవా సర్వీస్‌ను బ్రేక్ చేసింది.
ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా) 4-6, 6-2, 6-0తో ఎలీనా స్విటోలినా (ఉక్రెయిన్)పై, ఆరో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-0, 7-5తో లెప్‌చెంకో (అమెరికా)పై, మాజీ చాంపియన్ విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-4, 6-4తో స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై, వీనస్ విలియమ్స్ (అమెరికా) 4-6, 7-6 (7/3), 6-1తో గియార్గి (ఇటలీ)పై నెగ్గి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు.
జొకోవిచ్ ముందంజ
పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మూడో రౌండ్‌లో జొకోవిచ్ 7-6 (10/8), 6-3, 6-4తో వెర్డాస్కో (స్పెయిన్)పై, నాలుగో సీడ్ వావ్రింకా 6-4, 6-2, 6-4తో నిమినెన్ (ఫిన్లాండ్)పై, నిషికోరి 6-7 (7/9), 6-1, 6-2, 6-3తో జాన్సన్ (అమెరికా)పై గెలిచారు.
ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) 6-4, 6-3, 6-3తో బెంజిమిన్ బెకర్ (జర్మనీ)పై, తొమ్మిదో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 6-2, 7-5, 5-7, 7-6 (7/4)తో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై, 12వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 7-6 (8/6), 6-4, 7-6 (7/3)తో జనోవిజ్ (పోలండ్)పై నెగ్గారు.