మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. ఐదో రోజు గురువారం టాప్–10లోని ఇద్దరు క్రీడాకారిణులు రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. గత ఏడాది రన్నరప్, ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ రిబాకినా (కజకిస్తాన్)... ప్రపంచ ఐదో ర్యాంకర్, ఐదో సీడ్ జెస్సికా పెగూలా (అమెరికా) రెండో రౌండ్‌లోనే ని్రష్కమించారు. ప్రస్తుతం టాప్–10లో నలుగురు క్రీడాకారిణులు టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్), రెండో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కోకో గాఫ్ (అమెరికా), పదో సీడ్ ఒస్టాపెంకో (లాత్వియా) మాత్రమే బరిలో నిలిచారు.
42 పాయింట్ల టైబ్రేక్...
రష్యాకు చెందిన 25 ఏళ్ల అనా బ్లింకోవా 2 గంటల 46 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 6–4, 4–6, 7–6 (22/20)తో రిబాకినాపై గెలుపొందగా... క్లారా బురెల్ (ఫ్రాన్స్) 70 నిమిషాల్లో 6–4, 6–2తో పెగూలాను ఓడించి తమ కెరీర్‌లో తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. బ్లింకోవా–రిబాకినా మ్యాచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. నిర్ణాయక మూడో సెట్‌లో జరిగిన టైబ్రేక్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నల చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన టైబ్రేక్‌గా నిలిచింది.
31 నిమిషాలపాటు సాగిన 42 పాయింట్ల టైబ్రేక్‌లో చివరకు బ్లింకోవా 22–20తో విజయాన్ని ఖరారు చేసుకుంది. మూడో సెట్ ఏకంగా 93 నిమిషాలు సాగింది. గత ఏడాది వింబుల్డన్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో లెసియా సురెంకో (ఉక్రెయిన్)–అనా బొగ్డాన్ (రొమేనియా) మధ్య మూడో రౌండ్ మ్యాచ్‌లోని మూడో సెట్‌లో టైబ్రేక్ 38 పాయింట్లపాటు జరిగింది. చివరకు సురెంకో ఈ టైబ్రేక్‌ను 20–18 పాయింట్లతో గెల్చుకుంది. రిబాకినాతో జరిగిన మ్యాచ్‌లో బ్లింకోవా ఏకంగా ఆరుసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని నెగ్గడం విశేషం. మరోవైపు రిబాకినా తొమ్మిదిసార్లు మ్యాచ్ పాయింట్లను కాపాడుకున్నా పదోసారి పరాజయం తప్పలేదు.
శ్రమించి నెగ్గిన స్వియాటెక్
ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్ (పోలాండ్) మూడో రౌండ్ చేరడానికి 3 గంటల 14 నిమిషాలు శ్రమించింది. ఐదో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురి పెట్టిన స్వియాటెక్ రెండో రౌండ్‌లో 6–4, 3–6, 6–4తో 2022 రన్నరప్ డానియెలా కొలిన్స్ (అమెరికా)పై కష్టపడి గెలిచింది. మరో మ్యాచ్‌లో 14వ సీడ్ కసత్‌కినా 6–4, 3–6, 3–6తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) చేతిలో, 2021 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఎమ్మా రాడుకానూ (బ్రిటన్) 4–6, 6–4, 4–6తో యాఫాన్ వాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 11వ సీడ్ ఒస్టాపెంకో (లాతి్వయా) 6–0, 3–6, 6–4తో ఐలా తొమ్లాజనోవిచ్ (ఆ్రస్టేలియా)పై, 12వ సీడ్ కిన్‌వెన్ జెంగ్ (చైనా) 6–3, 6–3తో కేటీ బుల్టర్ (బ్రిటన్)పై, 19వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 6–3తో తొమోవా (బల్గేరియా)పై గెలిచారు.
హోల్గర్ రూనెకు చుక్కెదురు
పురుషుల సింగిల్స్‌లో ఎనిమిదో సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్) రెండో రౌండ్‌లో ని్రష్కమించాడు. ఆర్థర్ కజాక్స్ (ఫ్రాన్స్) 7–6 (7/4), 6–4, 4–6, 6–3తో రూనెపై గెలిచాడు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ అల్‌కరాజ్ (స్పెయిన్) 6–4, 6–7 (3/7), 6–3, 7–6 (7/3)తో సొనెగో (ఇటలీ)పై, ఆరో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 7–5, 3–6, 4–6, 7–6 (7/5), 7–6 (10/7)తో లుకాస్ క్లీన్ (స్లొవేకియా)పై, 11వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–3, 6–7 (5/7), 6–3, 3–6, 7–6 (10/7)తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)పై కష్టపడి గెలిచారు.
పోరాడి ఓడిన సుమిత్ నగాల్
భారత నంబర్‌వన్ సుమిత్ నగాల్ పోరాటం రెండో రౌండ్‌లోనే ముగిసింది. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రపంచ 137వ ర్యాంకర్ సుమిత్ నగాల్ గురువారం జరిగిన రెండో రౌండ్‌లో 6–2, 3–6, 5–7, 4–6తో ప్రపంచ 140వ ర్యాంకర్ జున్‌చెంగ్ షాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 2 గంటల 50 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సుమిత్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. రెండో రౌండ్‌లో ఓడిన సుమిత్ నగాల్‌కు ఓవరాల్‌గా 2,45,000 ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 1 కోటీ 33 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో రోహన్ బోపన్న (భారత్) –ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ 7–6 (7/5), 4–6, 7–6 (10/2)తో డక్‌వర్త్–పాల్మన్స్ (ఆ్రస్టేలియా) జంటపై గెలిచింది. అనిరుధ్–విజయ్ ప్రశాంత్ (భారత్) ద్వయం 3–6, 4–6తో మరోజ్‌సన్–ఫుచోవిక్స్ (హంగేరి) జోడీ చేతిలో ఓడింది.
Comments
Please login to add a commentAdd a comment