స్టార్స్ సాఫీగా...
సెరెనా, క్విటోవా శుభారంభం
మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రోజు టాప్-10 నుంచి ఇద్దరు ఇంటిదారి పట్టారు. అయితే రెండో రోజు మాత్రం ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. అంచనాలకు అనుగుణంగా రాణించిన స్టార్ క్రీడాకారులు సెరెనా విలియమ్స్, పెట్రా క్విటోవా, అగ్నెస్కా రద్వాన్‌స్కా, వొజ్నియాకి, అజరెంకా, వీనస్ తదితరులు తొలి రౌండ్ అడ్డంకిని దాటారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత సెరెనా 6-0, 6-4తో అలీసన్ వాన్ ఉట్‌వాన్క్ (బెల్జియం)పై గెలిచింది.
61 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా 11 ఏస్‌లు సంధించడం విశేషం. మరోవైపు నాలుగో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6-1, 6-4తో హోగెన్‌క్యాంప్ (నెదర్లాండ్స్)పై, ఆరో సీడ్ రద్వాన్‌స్కా (పోలండ్) 6-3, 6-0తో కురిమి నారా (జపాన్)పై, ఎనిమిదో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 7-6 (7/1), 6-2తో టౌన్‌సెండ్ (అమెరికా)పై నెగ్గారు. మాజీ చాంపియన్ అజరెంకా (బెలారస్) 6-3, 6-2తో స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై, మాజీ నంబర్‌వన్ వీనస్ విలియమ్స్ (అమెరికా) 6-2, 6-2తో టోరో ఫ్లోర్ (స్పెయిన్)పై, 11వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా) 3-6, 6-3, 6-1తో ఫ్లిప్‌కెన్స్ (బెల్జియం)పై విజయం సాధించారు. అయితే 12వ సీడ్ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) 6-4, 2-6, 3-6తో జియార్జి (ఇటలీ) చేతిలో; 13వ సీడ్ పెట్కోవిక్ (జర్మనీ) 7-5, 6-7 (4/7), 3-6తో బ్రెంగెల్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), డిఫెండింగ్ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో జొకోవిచ్ 6-3, 6-2, 6-4తో చెన్నై ఓపెన్ రన్నరప్ అల్జాజ్ బెడెన్ (స్లొవేనియా)పై నెగ్గగా... వావ్రింకా 6-1, 6-4, 6-2తో మార్సెల్ ఇలాన్ (టర్కీ)ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) 6-4, 7-6 (7/1), 6-2తో నికొలస్ అల్మాగ్రో (స్పెయిన్)పై, ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) 7-6 (7/3), 7-6 (7/3), 6-3తో మర్చెంకో (ఉక్రెయిన్)పై, తొమ్మిదో సీడ్ ఫెరర్ (స్పెయిన్) 6-7 (2/7), 6-2, 6-0, 6-3తో బెలూచి (బ్రెజిల్)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.