సెరెనా విలియమ్స్, భర్త అలెక్స్
ఊఫ్! సెమీస్‌లో సెరీనా డౌన్ అయ్యారు! కానీ మొన్న చూడాలి. క్వార్టర్ ఫైనల్స్‌లో తన ప్రత్యర్థి సిమోవా హ్యాలెప్‌ను నాకౌట్ చేస్తుంటే సెరెనా భర్త అలెక్స్ మురిసిపోయారు. ఆరోజు ఆయన వేసుకున్న వైట్ టీ షర్ట్ సెరెనా గుండెల్లో పూలు పూయించే ఉండాలి. ఆ టీ షర్ట్‌పై రాకెట్ పట్టుకుని ఉన్న సెరెనా ఇలస్ట్రేషన్ ఉంది!
అలెక్స్ వేసుకున్న టీ షర్ట్ మీది సెరెనా బొమ్మ పక్కనే పెద్ద అక్షరాలతో ‘గ్రేటెస్ట్ ఫిమేల్ అథ్లెట్’ అని రాసి ఉంది. ఫిమేల్ అనే మాటపై అడ్డంగా ఇంటూ కొట్టి ఉంది. అది ఓ కంపెనీ తయారు చేసిన టీ షర్ట్. కొట్టేయడం ఎందుకంటే ఫిమేల్ అనే మాట సెరెనాకు నచ్చదు.‘గ్రేట్ అథ్లెట్స్ ఉంటారు కానీ, గ్రేట్ ఉమెన్ అథ్లెట్స్ అంటూ ఎక్కడా ఉండరు’ అని సెరెనా కొన్నేళ్ల క్రితం వాదనగా అన్న ఆ మాట కోట్‌గా ప్రసిద్ధి చెందింది. అది దృష్టిలో పెట్టుకునే ఆ టీషర్ట్ కంపెనీ ఆ విధంగా ఇంటూ కొట్టినట్లున్న కాప్షన్‌తో షర్ట్‌ను డిజైన్ చేసింది. దానిని అలెక్స్ ధరించి ఆమె ఆట చూడటానికి వచ్చారు. ‘నువ్వు కరెక్ట్’ అని భార్యకు సంకేతం ఇవ్వడం అది. భార్య బొమ్మ ఉన్న షర్ట్‌ని వేసుకొచ్చాడంటే.. ‘నువ్వు గెలిచి తీరతావ్’ అని చెప్పడం అది. భర్త అంత ప్రోత్సాహం ఇస్తూ కళ్లెదుట కనిపిస్తుంటే సెమీస్‌ను కూడా గెలిచేస్తారని సెరెనా అభిమానులు అనుకున్నారు. అయితే నవోమీ గెలిచారు.
గురువారం సెమీస్‌లో సెరెనా ఓడిపోయినప్పటికీ అదేమీ పెద్దగా బాధించే విషయం అవలేదు అలెక్స్‌కి. ‘బాగా ఆడావ్’ అని అన్నారు. అలెక్స్ (అలెక్సిస్ ఒహానియన్) అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యూర్, ఇన్వెస్టర్. ‘రెడిట్’ కంపెనీ ఆయనదే. సెరెనాతో పెళ్లి కాకముందు సెరెనాకు పెద్ద ఫ్యాన్ అతడు. ప్రేమించి, ‘విల్యూ మ్యారీ మీ’ అని ప్రపోజ్ చేసి మరీ ఆమెను పెళ్లి చేసుకున్నారు. ‘బ్లాక్ అండ్ వైట్. రెడిట్ టు ఫైట్’ అని ఆ స్థాయిలోని ఫ్రెండ్స్ కూడా అతడిని ఆట పట్టించారని అంటారు. అది తెలిసి సెరెనా కూడా నవ్వుకున్నారట. ఇప్పుడు ఇద్దరూ హ్యాపీగా ఉన్నారు. సెరెనా టెన్నిస్ ఆడుతున్నప్పుడు ఆయన మరింత హ్యాపీగా ఉంటారు.
మూడేళ్ల కూతురు ఒలింపియా తండ్రితో కలిసి తల్లి ఆటను చూస్తూ, మూడ్‌ని బట్టి చప్పట్లు కొడుతుంటుంది. ఆ దృశ్యం అలెక్స్‌కి మరింత ఆనందాన్నిస్తుందట. 2017 జనవరి 1 ఆక్లాండ్‌లో ఉన్నారు సెరెనా అలెక్స్. న్యూజిలాండ్ జనాభా మొత్తం జనవరి ఫస్ట్ కోసం ఆక్లాండ్ వచ్చినట్లుగా ఉన్నారు ఆ రోజు. ఒకరికొకరు తగులుకుంటూ తిరుగుతున్నారు. అప్పుడే వాళ్లొక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఏడాదే పెళ్లి చేసుకోవాలని. అప్పుడు కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ చూడ్డానికే సెరెనాతో కలిసి యు.ఎస్. నుంచి ఆక్లాండ్ వెళ్లారు అలెక్స్. చదవండి: (చేజారిన ఆశలు : సెరెనా భావోద్వేగం)
Comments
Please login to add a commentAdd a comment