సెమీస్‌కు సెరెనా | 2021 Australian Open Singles Draw, Results | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు సెరెనా

Published Wed, Feb 17 2021 12:40 AM | Last Updated on Wed, Feb 17 2021 12:40 AM

2021 Australian Open Singles Draw, Results - Sakshi

మెల్‌బోర్న్‌: కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్‌ లక్ష్యంగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలోకి దిగిన అమెరికా స్టార్‌ ప్లేయర్‌ సెరెనా విలియమ్స్‌ ఆ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌ మ్యాచ్‌లో పదో సీడ్‌ సెరెనా 6–3, 6–3తో రెండో సీడ్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)పై గెలుపొంది సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ టోర్నీలో సెరెనా సెమీస్‌కు చేరడం ఇది తొమ్మిదోసారి. గంటా 21 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 4 ఏస్‌లు సంధించిన ఆమె కేవలం ఒక డబుల్‌ ఫాల్ట్‌ మాత్రమే చేసింది. సెమీఫైనల్లో మూడో సీడ్‌ నమోమి ఒసాకా (జపాన్‌)తో తలపడనుంది. మరో క్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఒసాకా గంటా 6 నిమిషాల్లో 6–2, 6–2తో 71వ ర్యాంకర్‌ సెసువె (తైవాన్‌)పై సులువుగా గెలుపొంది సెరెనాతో పోరుకు సిద్ధమైంది.  

కరాత్‌సెవ్‌ సంచలనం 
పురుషుల విభాగంలో క్వాలిఫయర్, 114వ ర్యాంకర్‌ అస్లాన్‌ కరాత్‌సెవ్‌ మరో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. 2 గంటల 32 నిమిషాల పాటు జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో కరాత్‌సెవ్‌ (రష్యా) 2–6, 6–4, 6–1, 6–2తో 18వ సీడ్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)పై నెగ్గి అరంగేట్ర గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనే సెమీస్‌కు చేరిన ఆటగాడిగా ఘనత వహించాడు. ఈ మ్యాచ్‌లో 9 ఏస్‌లు సంధించిన కరాత్‌సెవ్‌ 6 డబుల్‌ఫాల్ట్‌లు చేశాడు. మరో క్వార్టర్స్‌ పోరులో టాప్‌ సీడ్‌ నోవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–7 (6/8), 6–2, 6–4, 7–6 (8/6)తో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై శ్రమించి గెలుపొందాడు. ఈ మ్యాచ్‌ 3 గంటల 30 నిమిషాల పాటు సాగింది. సెమీస్‌లో జొకోవిచ్‌తో కరాత్‌సెవ్‌ తలపడనున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement