తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన వేదికపై సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మరోసారి చెలరేగిపోయాడు. సెమీఫైనల్లో తన ప్రత్యర్థికి కేవలం నాలుగు గేమ్‌లు మాత్రమే కోల్పోయిన అతను ఘనవిజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో ఏడోసారి ఫైనల్లోకి ప్రవేశించాడు. గతంలో ఫైనల్‌కు చేరిన ఆరుసార్లూ విజేతగా నిలిచిన ఈ ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్ ఆదివారం జరిగే ఫైనల్లో మాజీ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో అమీతుమీ తేల్చుకుంటాడు. ఈసారీ జొకోవిచ్ గెలిస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను అత్యధికంగా ఏడుసార్లు సాధించిన తొలి క్రీడాకారుడిగా చరిత్ర పుటల్లోకి చేరుతాడు.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విభాగంలో జొకోవిచ్ ఏడోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన సెమీఫైనల్లో జొకోవిచ్ 6–0, 6–2, 6–2తో 28వ సీడ్ లుకాస్ పుయి (ఫ్రాన్స్)పై గెలుపొందాడు. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ అద్వితీయ ఆటతీరుతో అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో ఆరు ఏస్‌లు సంధించిన అతను ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయకపోవడం విశేషం. ఐదు అనవసర తప్పిదాలు చేసిన అతను ఏడుసార్లు పుయి సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. 24 విన్నర్స్ కొట్టిన జొకోవిచ్ నెట్ వద్దకు 14 సార్లు వచ్చి తొమ్మిదిసార్లు పాయింట్ సాధించాడు. గతంలో ఆరుసార్లు ఫైనల్ చేరిన జొకోవిచ్ (2016, 2015, 2013, 2012, 2011, 2008) ఆరుసార్లూ చాంపియన్‌గా నిలువడం విశేషం. ఆదివారం రాఫెల్ నాదల్‌తో జరిగే ఫైనల్లో జొకోవిచ్ గెలిస్తే అత్యధికంగా ఏడుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టిస్తాడు. గతంలో రాయ్ ఎమర్సన్ (ఆస్ట్రేలియా), ఫెడరర్ (స్విట్జర్లాండ్) ఆరుసార్లు చొప్పున ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సాధించారు. ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 27–25తో నాదల్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. వీరిద్దరు 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తలపడగా... జొకోవిచ్ 5 గంటల 53 నిమిషాల్లో నాదల్‌ను ఓడించాడు.
నెగ్గిన వారు నంబర్‌వన్
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
ఒసాకా (vs) క్విటోవా
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్), నయోమి ఒసాకా (జపాన్) తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కోసం తలపడనున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌గా నిలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment