ఫ్లోరిడా: ఎట్టకేలకు చెక్ రిపబ్లిక్ టెన్నిస్ స్టార్ పెట్రా క్విటోవా నిరీక్షణ ముగిసింది. ప్రతిష్టాత్మక మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 ప్రీమియర్ టోర్నమెంట్‌లో 33 ఏళ్ల క్విటోవా తొలిసారి
చాంపియన్‌గా అవతరించింది. గతంలో 12 సార్లు ఈ టోర్నీలో పాల్గొని ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయిన క్విటోవా 13వ ప్రయత్నంలో ఏకంగా టైటిల్ సాధించడం విశేషం. ప్రపంచ ఏడో ర్యాంకర్ ఎలీనా రిబాకినా (కజకిస్తాన్)తో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ క్విటోవా గంటా 42 నిమిషాల్లో 7–6 (16/14), 6–2తో విజయం సాధించింది.
క్విటోవా కెరీర్‌లో ఇది 30వ సింగిల్స్ టైటిల్‌కాగా, డబ్ల్యూటీఏ–1000 విభాగంలో తొమ్మిదోది. ఈ గెలుపుతో క్విటోవా 2021 సెప్టెంబర్ తర్వాత మళ్లీ ప్రపంచ టాప్–10 ర్యాంకింగ్స్‌లోకి రానుంది.
రెండు వారాల క్రితం ఇండియన్ వెల్స్ ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 టోర్నీలో విజేతగా నిలిచి సూపర్ ఫామ్‌లో ఉన్న రిబాకినా ఫైనల్లో తొలి సెట్‌లో గట్టిపోటీ ఇచ్చింది. చివరకు 22 నిమిషాలపాటు జరిగిన టైబ్రేక్‌లో క్విటోవా పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో క్విటోవా దూకుడుకు రిబాకినా చేతులెత్తేసింది. కేవలం రెండు గేమ్‌లు మాత్రమే ఆమె గెల్చుకుంది. విజేతగా నిలిచిన క్విటోవాకు 12,62,220 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 36 లక్షలు), రన్నరప్ రిబాకినాకు 6,62,360 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 కోట్ల 43 లక్షలు) లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment