మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ ఓపెన్ మహిళల సింగిల్స్ పోరులో తుది బెర్తులు ఖరారయ్యాయి. ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా, నాల్గో సీడ్ నయోమి ఒసాకాలు టైటిల్ సమరంలో తలపడేందుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో తొలుత క్విటోవా ఫైనల్ చేరగా, ఆపై మరో సెమీ ఫైనల్లో ఒసాకా విజయం సాధించి అమీతుమీ పోరులో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
క్విటోవా 7-6(7/2), 6-0 తేడాతో అన్ సీడెడ్ క్రీడాకారిణి డానియెల్లీ కొలిన్స్(అమెరికా)పై విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించారు. ఇరువురి మధ్య తొలి సెట్ హోరా హోరీగా సాగగా, రెండో సెట్ ఏకపక్షంగా సాగింది. టై బ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను క్విటోవా గెలుపొందగా, రెండో సెట్‌లో కూడా అదే జోరును కొనసాగించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఓపెన్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరారు. దాంతో 28 తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన తొలి చెక్ రిపబ్లికన్ క్రీడాకారిణిగా క్విటోవా గుర్తింపు పొందారు. మరొక సెమీ ఫైనల్ మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి ఒసాకా 6-2, 4-6, 6-4 తేడాతో కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్)పై విజయ సాధించారు. ఫలితంగా శనివారం జరిగే అంతిమ సమరంలో ఒసాకా-క్విటోవాలు తలపడనున్నారు.
గతేడాది జరిగిన యూఎస్ ఓపెన్‌లో ఒసాకా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తుది పోరులో సెరెనా విలియమ్సన్‌ను ఓడించి యూఎస్ గ్రాండ్ స్లామ్‌ను గెలుచుకున్నారు. ఇదే ఆమెకు తొలి సింగిల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్. కాగా, క్విటోవా రెండు సార్లు వింబుల్డన్ టైటిల్‌ను గెలిచారు. 2011, 2014ల్లో క్విటోవా వింబుల్డన్ సింగిల్స్ విజేతగా నిలిచారు. దాంతో ఆస్ట్రేలియా ఓపెన్‌ను వీరిలో ఎవరు గెలిచినా తొలిసారి ఈ టైటిల్‌ను సాధించినట్లవుతుంది. ఆస్ట్రేలియా ఓపెన్‌లో కొత్త చాంపియన్ ఎవరు అనే దానిపై ఆసక్తినెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment