వరస్ట్‌ డాన్సర్‌ని అంటూనే అదరగొట్టిన సబలెంక.. వీడియో వైరల్‌ | Sabalenka Busts Out Her Best Dance Moves At Australian Open After 1st Win Video | Sakshi
Sakshi News home page

వరస్ట్‌ డాన్సర్‌ని అంటూనే అదరగొట్టిన సబలెంక.. వీడియో వైరల్‌

Published Mon, Jan 13 2025 11:10 AM | Last Updated on Mon, Jan 13 2025 11:36 AM

Sabalenka Busts Out Her Best Dance Moves At Australian Open After 1st Win Video

బెలారస్‌ టెన్నిస్‌ స్టార్‌ అరియానా సబలెంకా(Aryna Sabalenka) ఆటతోనే కాదు.. డాన్స్‌తోనూ ఆకట్టుకోగలనని నిరూపించింది. ఆస్ట్రేలియా ఓపెన్‌(Australian Open)లో శుభారంభం చేసిన అనంతరం తనలోని మరో కోణాన్ని అభిమానులకు చూపించింది. 

వరస్ట్‌ డాన్సర్‌ని అంటూనే
‘నా డాన్స్‌ అస్సలు బాగోదు. ఇకనై నన్నో వరస్ట్‌ డాన్సర్‌గా అందరూ గుర్తు పెట్టుకుంటారేమో’ అంటూనే కాలు కదిపిన సబలెంకా.. క్యూట్‌ మూవ్స్‌తో ప్రేక్షకులను అలరించింది. దీంతో ఫిదా అయిన ఆడియన్స్‌ కరతాళ ధ్వనులతో సబలెంకాను ఉత్సాహపరుస్తూ స్టాండింగ్‌ ఓవియేషన్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా
కాగా ‘హ్యాట్రిక్‌’ టైటిల్‌ గెలవడమే లక్ష్యంగా సబలెంకా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే తొలి మ్యాచ్‌లో అదరగొట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సబలెంకా 6–3, 6–2తో 2017 యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా)పై అలవోకగా గెలిచి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది.

ఇక 2023, 2024లలో చాంపియన్‌గా నిలిచిన సబలెంకా ఈసారీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధిస్తే... మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌; 1997, 1998, 1999) తర్వాత ఈ టోర్నీలో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసిన ప్లేయర్‌గా గుర్తింపు పొందుతుంది.

శుభారంభం చేసి
ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. స్లోన్‌ స్టీఫెన్స్‌తో 71 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సబలెంకా రెండు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 20 విన్నర్స్‌ కొట్టిన ఈ బెలారస్‌ స్టార్‌ 21 అనవసర తప్పిదాలు చేసింది. 

నెట్‌ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు నెగ్గిన సబలెంకా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. గత ఏడాది రన్నరప్, పారిస్‌ ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత కిన్‌వెన్‌ జెంగ్‌ (చైనా), 11వ సీడ్‌ పౌలా బదోసా (స్పెయిన్‌) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు.

తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ కిన్‌వెన్‌ 7–6 (7/3), 6–1తో అంకా టొడోని (రొమేనియా)పై, బదోసా 6–3, 7–6 (7/5)తో జిన్‌యు వాంగ్‌ (చైనా)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో 14వ సీడ్‌ మిరా ఆంద్రీవా (రష్యా) 6–3, 6–3తో మేరీ బుజ్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, 18వ సీడ్‌ డొనా వెకిచ్‌ (క్రొయేషియా) 6–4, 6–4తో డియాన్‌ పారీ (ఫ్రాన్స్‌)పై, లేలా ఫెర్నాండెజ్‌ (కెనడా) 7–5, 6–4తో యులియా (ఉక్రెయిన్‌)పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.

జ్వెరెవ్‌ బోణీ 
మరోవైపు.. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (alexander zverev- జర్మనీ) సులువుగా రెండో రౌండ్‌కు చేరగా... ఆరో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే) ఐదు సెట్‌ల పోరులో గట్టెక్కాడు. జ్వెరెవ్‌ 6,4 6–4, 6–4తో లుకాస్‌ పౌలీ (ఫ్రాన్స్‌)పై నెగ్గగా... రూడ్‌ 6–3, 1–6, 7–5, 2–6, 6–1తో 3 గంటల 21 నిమిషాల్లో మునార్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. వర్షం కారణంగా తొలి రోజు చాలా మ్యాచ్‌లకు అంతరాయం కలిగింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement