హృదయం ముక్కలైందన్న టెన్నిస్ స్టార్ (PC: sabalenka_aryna))
బెలారస్ టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్ టూ సీడ్ అరీనా సబలెంక ఉద్వేగానికి లోనైంది. ఐస్ హాకీ మాజీ ఆటగాడు కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ అర్ధంతరంగా తనువు చాలించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అదే విధంగా.. కొన్ని రోజుల ముందే తామిద్దరం విడిపోయామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
కాగా బెలారస్‌కు చెందిన కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ హాకీ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2002- 2010 మధ్య దేశం తరఫున పలు టోర్నీల్లో పాల్గొన్న అతడు 2010 వింటర్ ఒలింపిక్స్‌లోనూ భాగమయ్యాడు. ఈ క్రమంలో 2016లో రిటైర్మెంట్ ప్రకటించిన కొల్త్సోవ్.. ఆ తర్వాత రష్యన్ క్లబ్ అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు.
గతంలో జులియా అనే మహిళను వివాహం చేసుకున్న కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్‌కు ఆమెతో ముగ్గురు సంతానం కలిగారు. అయితే, అభిప్రాయ భేదాలు తలెత్తడంతో 2020లో భార్యకు విడాకులు ఇచ్చిన 42 ఏళ్ల ఈ మాజీ హాకీ ప్లేయర్.. 25 ఏళ్ల టెన్నిస్ స్టార్ అరీనా సబలెంకతో ప్రేమలో పడ్డాడు.
గత మూడేళ్లుగా వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు ధ్రువీకరించే ఫొటోలను సబలెంక తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ కొల్త్సోవ్ మియామీలో మరణించినట్లు వార్తలు రాగా.. బెలారస్ హాకీ ఫెడరేషన్ మంగళవారం ఈ వార్తను ధ్రువీకరించింది.
ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా కొల్త్సోవ్‌ది ఆత్మహత్య అని స్థానిక పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. కొల్త్సోవ్ మృతి నేపథ్యంలో సబలెంకకు సానుభూతి తెలుపుతూ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు.
అప్పటికే విడిపోయాం
ఈ క్రమంలో బుధవారం ఈ విషయంపై స్పందించిన సబలెంక.. కొన్నాళ్ల క్రితమే కొల్త్సోవ్‌తో తాను విడిపోయినట్లు తెలిపింది. దయచేసి ఈ విషయంలో తన గోప్యతకు భంగం కలగకుండా వ్యవహరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీలో.. ‘‘గత కొన్నాళ్లుగా మేము విడిగా ఉంటున్నాం. ఏదేమైనా.. కొన్‌స్టాంటిన్ కొల్త్సోవ్ మరణం ఊహించలేని విషాదం. నా హృదయం ముక్కలైంది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు, నా కుటుంబ గోప్యతకు భంగం కలగకుండా చూసుకుంటారని భావిస్తున్నా’’ అని సబలెంక ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. కాగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన సబలెంక.. శుక్రవారం మియామీ ఓపెన్ బరిలో దిగేందుకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment