వాషింగ్టన్ : తన సోదరిని చంపిన హంతకుడి విడుదల వార్త తెలిసి వణికిపోయానని అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తెలిపారు. దీంతోనే సిలికాన్ వ్యాలీ క్లాసిక్ టోర్నీలో ఓటమి చెందానని 23 గ్రాండ్ స్లామ్‌ల విజేత చెప్పుకొచ్చారు. ఈ టోర్నీలో సెరెనా ఊహించని విధంగా తొలి రౌండ్‌లోనే అత్యంత దారుణంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. బ్రిటన్ క్రీడాకారిణి జొహన్నా కొంటా చేతిలో 6-1, 6-0తో పరాజయం చెందింది సెరెనా. ఇది ఆమె కెరీర్‌లోనే అత్యంత ఘోర పరాజయం.
ఇటీవల టైమ్స్ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఓటమిపై స్పందిస్తూ.. ‘నా సోదరిని చంపిన హంతకుడు పేరోల్ మీద విడుదలైనట్లు వచ్చిన స్క్రోల్స్‌ను ఆ మ్యాచ్‌కు పది నిమిషాల ముందే ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను. దీంతో భయాన్ని నా మనసు నుంచి తొలగించలేకపోయాను. అది నాకు చాలా కష్టం. నేనెప్పుడు నా సోదరి పిల్లల గురించే ఆలోచిస్తాను. వారంటే నాకంత ఇష్టం. ఆమె లేకపోవడం తట్టుకోలేకపోతున్నాను’ అని సెరెనా ఆవేదన వ్యక్తం చేశారు.
సెరెనా సోదరి ఎటుండే ప్రైస్(31)ని 2003లో హంతకుడు రొబెర్ట్ మ్యాక్స్‌ఫీల్డ్ లాస్ ఎంజెల్స్‌లో తుపాకీతో కాల్చి చంపాడు. దీంతో నిందితుడికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ప్రైస్ మరణించే సమయానికి ఆమెకు 11, 9, 5 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలున్నారు. అప్పటి నుంచి ఆ పిల్లలను సెరెనానే పెంచుతున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment