పారిస్: గతంలో మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లలో రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ సిమోనా హలెప్ ఈసారి మాత్రం టైటిల్ సాధించే దిశగా మరో అడుగు వేసింది. మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)తో బుధవారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ 6–7 (2/7), 6–3, 6–2తో విజయం సాధించింది. 2 గంటల 14 నిమిషాలపాటు జరిగిన ఈ పోరులో హలెప్ తొలి సెట్‌లో 0–4తో వెనుకబడింది. ఆ తర్వాత మూడుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి పుంజుకుంది. అయితే టైబ్రేక్‌లో 12వ సీడ్ కెర్బర్ పైచేయి సాధించింది. తొలి సెట్ కోల్పోయినా హలెప్ విజయంపై ఆశలు వదులుకోలేదు. లోపాలను సరిదిద్దుకొని రెండుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని రెండో సెట్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లోనూ హలెప్ ఏకాగ్రత కోల్పోకుండా ఆడి మూడుసార్లు కెర్బర్ సర్వీస్‌ను బ్రేక్ చేసి అదే ఊపులో సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ‘తొలి సెట్ చేజార్చుకున్నా పట్టువదలకుండా పోరాడాలని నిశ్చయించుకున్నాను. తొలి సెట్ ఆరంభంలో ఎక్కువ ప్రయోగాలు చేసి మూల్యం చెల్లించుకున్నాను. ఆ తర్వాత నా వ్యూహాల్లో మార్పు చేసి ఫలితాన్ని సాధించాను’ అని హలెప్ వ్యాఖ్యానించింది.
షరపోవా చిత్తు...
మరో క్వార్టర్ ఫైనల్లో 2016 చాంపియన్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) ధాటికి మాజీ విజేత, రష్యా స్టార్ షరపోవా హడలిపోయింది. ఆరేళ్ల కాలంలో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో ముగురుజా 6–2, 6–1తో 28వ సీడ్ షరపోవాను చిత్తుగా ఓడించి హలెప్‌తో సెమీస్ పోరుకు సిద్ధమైంది. 2012 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో 3–6, 0–6తో అజరెంకా (బెలారస్) చేతిలో ఓటమి తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీలో షరపోవా ఏకపక్ష ఓటమిని చవిచూడటం ఇదే తొలిసారి. సెమీస్‌లో ముగురుజాపై గెలిస్తే హలెప్ తన నంబర్‌వన్ ర్యాంక్‌ను పదిలం చేసుకుంటుంది. ఒకవేళ హలెప్ ఓడిపోతే ముగురుజాకు నంబర్‌వన్ ర్యాంక్ ఖాయమవుతుంది. ఇప్పటివరకు ఈ టోర్నీలో ముగురుజా ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. మరోవైపు హలెప్ రెండు సెట్‌లను చేజార్చుకుంది.
నాదల్ మ్యాచ్ నేటికి వాయిదా...
పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లకు వర్షం అడ్డంకిగా నిలవడంతో గురువారానికి వాయిదా వేశారు. డీగో ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా)తో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) తొలి సెట్‌ను 4–6తో కోల్పోయి... రెండో సెట్‌లో 5–3తో ఆధిక్యంలో ఉన్నాడు. మారిన్ సిలిచ్ (క్రొయేషియా), డెల్ పొట్రో (అర్జెంటీనా) మధ్య మ్యాచ్‌లో ఇద్దరూ తొలి సెట్‌లో 6–6 పాయింట్ల వద్ద... టైబ్రేక్‌లో 5–5తో సమంగా ఉన్నారు. ఈ దశలో వర్షం రావడంతో ఆటను నిలిపివేశారు.
హై హై హలెప్
Published Thu, Jun 7 2018 1:30 AM | Last Updated on Thu, Jun 7 2018 1:30 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment