హ‌లెప్ అలవోక‌గా.. | Australian Open: World No.1 Simona Halep ready to face Serena Williams | Sakshi
Sakshi News home page

హ‌లెప్ అలవోక‌గా..

Published Sun, Jan 20 2019 2:00 AM | Last Updated on Sun, Jan 20 2019 2:02 AM

Australian Open: World No.1 Simona Halep ready to face Serena Williams - Sakshi

గతేడాది ఆఖరి మెట్టుపై బోల్తా పడిన ప్రపంచ నంబర్‌వన్‌ క్రీడాకారిణి సిమోనా హలెప్‌ ఈసారి మాత్రం టైటిల్‌తో తిరిగి వెళ్లాలనే లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసింది. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈ రొమేనియా అమ్మాయి అమెరికా వెటరన్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌పై అలవోక విజయంతో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో చోటు కోసం వీనస్‌ సోదరి సెరెనాతో హలెప్‌ అమీతుమీ తేల్చుకోనుంది. హలెప్‌తోపాటు సెరెనా, ముగురుజా సునాయాసంగా ముందంజ వేయగా... ఇతర సీడెడ్‌ క్రీడాకారిణులు నయోమి ఒసాకా, కరోలినా ప్లిస్కోవా, ఎలీనా స్వితోలినా మాత్రం మూడో రౌండ్‌ దాటేందుకు కష్ట పడ్డారు.

మెల్‌బోర్న్‌: టాప్‌ సీడ్‌ హోదాకు తగ్గ ప్రదర్శన చేస్తూ ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సిమోనా హలెప్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మాజీ నంబర్‌వన్‌ వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా)తో శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో హలెప్‌ 6–2, 6–3తో విజయం సాధించింది. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గతేడాది ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన హలెప్‌నకు ఏ దశలోనూ పోటీ ఎదురుకాలేదు. 19వసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడుతున్న వీనస్‌ మ్యాచ్‌ మొత్తంలో నాలుగు డబుల్‌ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. హలెప్‌ సర్వీస్‌లో ఆరుసార్లు బ్రేక్‌ పాయింట్లు సాధించే అవకాశం వచ్చినా 38 ఏళ్ల వీనస్‌ ఒక్కసారి మాత్రమే సద్వినియోగం చేసుకుంది. మరోవైపు 27 ఏళ్ల హలెప్‌ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. సోమవారం సెరెనాతో జరిగే మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని హలెప్‌ వ్యాఖ్యానించింది. ‘నేను ఓ గొప్ప చాంపియన్‌తో తలపడబోతున్నా. ఈ సవాల్‌కు నేను సిద్ధంగా ఉన్నా. ఫలితం ఎలా వచ్చినా కోల్పోయేదేమీ లేదు’ అని తొలి రెండు రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడు సెట్‌లలో విజయాలను అందుకున్న హలెప్‌ తెలిపింది. మరోవైపు సెరెనా సునాయాస విజయం సాధించింది. 16వ సీడ్‌గా బరిలోకి దిగిన 37 ఏళ్ల సెరెనా 6–2, 6–1తో డయానా యెస్‌ట్రెంస్కా (ఉక్రెయిన్‌)పై గెలిచింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన సెరెనా ఎనిమిది ఏస్‌లు సంధించింది. ఓటమి తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న డయానాను నెట్‌ వద్దకు వచ్చి సెరెనా ఓదార్చింది. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో 17వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా) 6–3, 6–2తో 12వ సీడ్‌ ఎలీజ్‌ మెర్‌టెన్స్‌ (బెల్జియం)పై, 18వ సీడ్‌ గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌) 7–6 (7/5), 6–2తో తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్‌)పై, 13వ సీడ్‌ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) 6–3, 6–3తో 21వ సీడ్‌ కియాంగ్‌ వాంగ్‌ (చైనా)పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు.  

ఓటమి దిశ నుంచి... 
మరోవైపు నాలుగో సీడ్‌ నయోమి ఒసాకా (జపాన్‌), ఆరో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌), ఏడో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) మూడు సెట్‌లపాటు పోరాడి మూడో రౌండ్‌ను దాటారు. 28వ సీడ్‌ సు వె సెయి (చైనీస్‌ తైపీ)తో జరిగిన మ్యాచ్‌లో ఒసాకా 5–7, 6–4, 6–1తో గెలిచింది. గంటా 57 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఒసాకా తొలి సెట్‌ను కోల్పోయి రెండో సెట్‌లో 1–4తో వెనుకబడి ఓటమి దిశగా సాగింది. అయితే గత సంవత్సరం యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో సెరెనాపై గెలిచి పెను సంచలనం సృష్టించిన ఒసాకా పట్టుదలతో పోరాడింది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి రెండో సెట్‌ను 6–4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో మాత్రం ఒసాకా ధాటికి సు వె సెయి ఎదురునిలువలేకపోయింది. 2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన మరో మ్యాచ్‌లో స్వితోలినా 4–6, 6–4, 7–5తో షుయె జాంగ్‌ (చైనా)పై, 2 గంటల 11 నిమిషాల పోరులో ప్లిస్కోవా 6–4, 3–6, 6–2తో 27వ సీడ్‌ కామిల్లా జార్జి (ఇటలీ)పై గెలుపొందారు.  

జొకోవిచ్‌ ముందుకు... 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా), నాలుగో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఎనిమిదో సీడ్‌ నిషికోరి (జపాన్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి చేరారు. జొకోవిచ్‌ 6–3, 6–4, 4–6, 6–0తో 25వ సీడ్‌ షపవలోవ్‌ (కెనడా)పై, జ్వెరెవ్‌ 6–3, 6–3, 6–2తో అలెక్స్‌ బోల్ట్‌ (ఆస్ట్రేలియా)పై, నిషికోరి 7–6 (8/6), 6–1, 6–2తో జోవో సుసా (పోర్చుగల్‌)పై గెలిచారు. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో 11వ సీడ్‌ కొరిచ్‌ (క్రొయేషియా) 2–6, 6–3, 6–4, 6–3 తో క్రాజ్నోవిచ్‌ (సెర్బియా)పై, 23వ సీడ్‌ కరెనో బుస్టా (స్పెయిన్‌) 6–2, 6–4, 2–6, 6–4తో 12వ సీడ్‌ ఫాగ్‌నిని (ఇటలీ)పై, 15వ సీడ్‌ మెద్వె దెవ్‌ (రష్యా) 6–2, 7–6 (7/3), 6–3తో 21వ సీడ్‌ గాఫిన్‌ (బెల్జియం)పై, 16వ సీడ్‌  రావ్‌నిచ్‌ (కెనడా) 6–4, 6–4, 7–6 (8/6)తో హెర్బర్ట్‌ (ఫ్రాన్స్‌)పై, 28వ సీడ్‌ లుకాస్‌ పుయి (ఫ్రాన్స్‌) 7–6 (7/3), 6–3, 6–7 (10/12), 4–6, 6–3తో పాపిరిన్‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గారు.

పేస్‌ జంట శుభారంభం 
మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత స్టార్స్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొలి రౌండ్‌లో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–సమంత స్టోసుర్‌ (ఆస్ట్రేలియా) ద్వయం 6–4, 7–5తో క్వెటా పెశెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)–వెస్లీ కూలాఫ్‌ (నెదర్లాండ్స్‌) జంటను ఓడించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. అయితే రోహన్‌ బోపన్న (భారత్‌)–జావోజువాన్‌ యాంగ్‌ (చైనా) జోడీ 6–3, 3–6, 6–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో రాబర్ట్‌ ఫరా (కొలంబియా)–అనా లెనా గ్రోన్‌ఫెల్డ్‌ (జర్మనీ) జంట చేతిలో ఓడిపోయింది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement