పోయినచోటే వెతుక్కోవాలి. రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్ విషయంలో ఇది నిజమైంది. గత ఏడాది అన్‌సీడెడ్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెంకోతో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఒక దశలో విజయానికి చేరువై... ఆ తర్వాత తడబడి ఓటమిని మూటగట్టుకున్న ఆమె సంవత్సరం తిరిగేలోపు అదే వేదికపై విజయ గర్జన చేసింది. ఈసారి కూడా ఫైనల్లో హలెప్‌కు ఓటమి తప్పదా అనే పరిస్థితి నుంచి కోలుకొని అద్వితీయ పోరాటంతో విజయం వైపు అడుగు వేయడం విశేషం.
పారిస్: ఎర్రమట్టి కోటలో కొత్త రాణి కొలువైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా మూడో ఏడాది మహిళల సింగిల్స్ విభాగంలో నయా చాంపియన్ అవతరించింది. 2014, 2017లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ సిమోనా హలెప్ ముచ్చటగా మూడో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ హలెప్ 3–6, 6–4, 6–1తో పదో సీడ్, 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. విజేతగా నిలిచిన హలెప్‌కు 22 లక్షల యూరోలు (రూ. 17 కోట్ల 48 లక్షలు), రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్‌కు 11 లక్షల 20 వేల యూరోలు (రూ. 8 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
గత ఏడాది అన్‌సీడెడ్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)తో జరిగిన ఫైనల్లో హలెప్ తొలి సెట్‌ను గెలిచి, రెండో సెట్‌లో 3–0తో ఆధిక్యంలో నిలిచి విజయానికి చేరువైంది. కానీ ఒస్టాపెంకో ధాటికి తడబడి చివరకు ఓటమిపాలైంది. ఈసారి స్లోన్‌తో జరిగిన తుది పోరులో హలెప్ తొలి సెట్‌ను చేజార్చుకుంది. రెండో సెట్‌లో 0–2తో వెనుకబడింది. మళ్లీ గత ఏడాది దృశ్యమే పునరావృతమవుతుందా అని సందేహిస్తున్న తరుణంలో హలెప్ నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. మూడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, నాలుగో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. ఆ తర్వాత ఐదో గేమ్‌లో సర్వీస్ కాపాడుకొని, ఆరో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను మరోసారి బ్రేక్ చేసిన హలెప్ 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఏడో గేమ్‌లో హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్లోన్, ఎనిమిదో గేమ్‌లో సర్వీస్ కాపాడుకొని స్కోరును 4–4తో సమం చేసింది. కీలకమైన తొమ్మిదో గేమ్‌లో హలెప్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, పదో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండో సెట్‌ను 6–4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో హలెప్ తన విశ్వరూపం ప్రదర్శించింది. రెండుసార్లు స్లోన్ సర్వీస్‌లను బ్రేక్ చేసి, తన సర్వీస్‌లను నిలబెట్టుకొని 6–1తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది.
విశేషాలు
వర్జినియా రుజుసి (1978లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో రొమేనియా క్రీడాకారిణి హలెప్. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల,జూనియర్ బాలికల సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఎనిమిదో క్రీడాకారిణి హలెప్. 2008 లో హలెప్ జూనియర్ సింగిల్స్ టైటిల్ నెగ్గింది.
గత ఏడాది చేసిన పొరపాట్లు ఈసారి పునరావృతం చేయకూడదని అనుకున్నాను. ఈ విజయంతో నా కల నిజమైంది. రెండో సెట్‌లో 0–2తో వెనుకబడిన దశలో ఒత్తిడికి లోనుకావొద్దని, ఆటను ఆస్వాదించాలని భావించాను. అదే చేసి కోలుకున్నాను. మ్యాచ్ చివరి గేమ్‌లోనైతే నాకు ఊపిరి ఆడనంత పనైంది.
– సిమోనా హలెప్
Comments
Please login to add a commentAdd a comment