Sloane Stephens
-
Stefanos Tsitsipas: సిట్సి‘పాస్’ కాలేదు
లండన్: మట్టి కోర్టులపై అదరగొట్టే గ్రీస్ యువ టెన్నిస్ స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ స్టెఫనోస్ సిట్సిపాస్ పచ్చిక కోర్టులపై మాత్రం తడబడ్డాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సిట్సిపాస్ తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టాడు. ప్రపంచ 57వ ర్యాంకర్ ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా) వరుస సెట్లలో 6–4, 6–4, 6–3తో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్ సిట్సిపాస్‌ను ఓడించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లాడు. తన కెరీర్లో టాప్–5లోని ఆటగాడిపై నెగ్గడం టియాఫోకిదే తొలిసారి. రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో టియాఫో తన సర్వీస్‌ను ఒక్కసారి కూడా కోల్పోకుండా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. 15 ఏస్‌లు సంధించిన సిట్సిపాస్ 22 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) శుభారంభం చేశాడు. జేక్ డ్రేపర్ (బ్రిటన్)తో జరిగిన తొలి రౌండ్లో జొకోవిచ్ 4–6, 6–1, 6–2, 6–2తో గెలుపొందాడు. రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ ఏకంగా 25 ఏస్‌లు సంధించాడు. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) 4–6, 6–4, 6–1, 6–2తో డెల్బోనిస్ (అర్జెంటీనా)పై నెగ్గాడు. స్లోన్ స్టీఫెన్స్ సంచలనం మహిళల సింగిల్స్ విభాగంలో 2011, 2014 చాంపియన్, పదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ 73వ ర్యాంకర్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) 6–3, 6–4తో క్విటోవాను ఓడించింది. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–1, 6–4తో నికెలెస్కూ (రొమేనియా)పై, 11వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–0, 6–1తో ఫియోనా (ఫ్రాన్స్) పై, నాలుగో సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) 6–4, 6–2తో జిన్యు వాంగ్ (చైనా)పై, ఏడో సీడ్ స్వియాటెక్ (పోలాండ్) 6–4, 6–4తో సు వె సెయి (చైనీస్ తైపీ)పై, 23వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–3, 6–4తో స్వాన్ (బ్రిటన్)పై గెలిచారు. -
ఫెడరర్‌కు ‘వేడి’ దెబ్బ!
20 గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత, ఐదుసార్లు యూఎస్ ఓపెన్ చాంపియన్ రోజర్ ఫెడరర్‌కు పెద్ద షాక్. ఏనాడూ గ్రాండ్‌స్లామ్‌లో మూడో రౌండ్ దాటని అనామకుడి చేతిలో అనూహ్య పరాజయం. ప్రత్యర్థి బలంకంటే 10 డబుల్ ఫాల్ట్‌లు, 77 అనవసర తప్పిదాలతో ఫెడెక్స్ చేసుకున్న స్వయంకృతం ఇది. తీవ్రమైన వేడికి తట్టుకోలేకపోయానని, ఒక దశలో ఊపిరి కూడా ఆడనట్లుగా అనిపించిందంటూ వ్యాఖ్యానించిన స్విట్జర్లాండ్ దిగ్గజం ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 50కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాడి చేతిలో ఓడటం ఇదే తొలిసారి. స్విస్ స్టార్‌ను ఓడించి కెరీర్లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు మిల్మన్ క్వార్టర్ ఫైనల్లో మరో స్టార్ జొకోవిచ్‌ను సవాల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. న్యూయార్క్: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో అతి పెద్ద సంచలనం నమోదైంది. ప్రపంచ రెండో ర్యాంకర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలయ్యాడు. మంగళవారం జరిగిన ఈ పోరులో ప్రపంచ 55వ ర్యాంకర్ జాన్ మిల్మన్ (ఆస్ట్రేలియా) 3–6, 7–5, 7–6 (9/7), 7–6 (7/3) స్కోరుతో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 2013 యూఎస్ ఓపెన్‌లో రొబ్రెడో చేతిలో ఓటమి తర్వాత ఫెడరర్ ఇంత తొందరగా నిష్క్రమించడం ఇదే మొదటిసారి. తొలి సెట్‌ను సునాయాసంగానే నెగ్గిన ఫెడరర్... ఆ తర్వాత అన్‌సీడెడ్ ప్రత్యర్థి ముందు తేలిపోయాడు. తీవ్రమైన వేడి, ఉక్కపోత మధ్య ప్రతీ పాయింట్ కోసం శ్రమించిన 37 ఏళ్ల ఈ స్విస్ లెజెండ్ ఇక ఆడటం తన వల్ల కాదంటూ ప్రత్యర్థికి తలవంచాడు. మరో పాయింట్ గెలిస్తే రెండో సెట్ కూడా సొంతమయ్యే స్థితి నుంచి ఓటమి బాట పట్టాడు. రెండో సెట్లో 5–4తో ఆధిక్యంలో ఉండి 40–15 వద్ద ఫెడరర్ సర్వీస్ గతి తప్పింది. ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్న మిల్మన్ ఇక వెనుదిరిగి చూడలేదు. 3 గంటల 34 నిమిషాల్లో... గతంలో మిల్‌మన్‌తో తలపడిన ఒకే ఒక మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించిన ఫెడరర్ ఈ సారి కూడా శుభారంభం చేశాడు. రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసిన అతను 6–3తో తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి అతని పతనం మొదలైంది. పదో గేమ్‌లో సులువైన వ్యాలీని రిటర్న్ చేయలేక, ఆ తర్వాత డబుల్ ఫాల్ట్‌తో రెండు సార్లు సెట్ పాయింట్లు పోగొట్టుకొని మిల్మన్కు కోలుకునే అవకాశం ఇచ్చాడు. మూడో సెట్లో కూడా 6–5తో ఆధిక్యంలో ఉండి సర్వీస్ పొరపాట్లకు ఫలితం అనుభవించాడు. వరుసగా రెండు సెట్లు నెగ్గడంతో ఆధిపత్యం మిల్మన్ వైపు మళ్లింది. అయితే ఫెడరర్ మళ్లీ తన స్థాయి ఆటను ప్రదర్శిస్తూ 4–2తో దూసుకుపోయాడు. కానీ ఆస్ట్రేలియన్ పట్టు వదల్లేదు. ఫెడెక్స్ సర్వీస్‌ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో ఈ సెట్ కూడా టైబ్రేక్ వైపు మళ్లింది. ఈ కీలక దశలో రెండు డబుల్ ఫాల్ట్‌లు, నెట్‌పైకి బ్యాక్‌హ్యాండ్ షాట్, కోర్టుకు దూరంగా ఫోర్ హ్యాండ్ షాట్ కొట్టిన ఫెడెక్స్‌కు ఓటమి తప్పలేదు. జొకోవిచ్ ముందంజ... మరో ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెర్బియా స్టార్, ఆరో సీడ్ జొకోవిచ్ 6–3, 6–4, 6–4తో జొవా సుసా (పోర్చుగల్)ను చిత్తు చేశాడు. వేడికి మళ్లీ ఇబ్బంది పడిన జొకోవిచ్ ఈ మ్యాచ్‌లో కూడా విరామం తీసుకొని వైద్య చికిత్స పొందాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 7–6 (8/6), 6–2, 6–4తో పదో సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 3–6, 4–6తో కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో ఓడిపోయింది. స్లోన్ స్టీఫెన్స్ ఔట్... మహిళల సింగిల్స్‌లోనూ సంచలన ఫలితం నమోదైంది. క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) ఇంటిదారి పట్టింది. 19వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) 6–2, 6–3తో స్లోన్ స్టీఫెన్స్‌పై గెలిచి తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు మాజీ చాంపియన్ మరియా షరపోవా (రష్యా) ఆట ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. స్పెయిన్ క్రీడాకారిణి కార్లా స్వారెజ్ నవారో 6–4, 6–3తో షరపోవాను చిత్తు చేసింది. -
క్వార్టర్స్‌లో స్లోన్ స్టీఫెన్స్,సెరెనా
న్యూయార్క్: డిఫెండింగ్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ మరో అలవోక విజయంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్లోన్ 6–3, 6–3తో 15వ సీడ్ ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై గెలిచింది. 86 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో స్లోన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు ఆరుసార్లు చాంపియన్ సెరెనా విలియమ్స్ (అమెరికా), గతేడాది రన్నరప్, 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) కూడా క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టగా... ఏడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) ఇంటిదారి పట్టింది. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సెరెనా గంటా 37 నిమిషాల్లో 6–0, 4–6, 6–3తో కయి కనెపి (ఎస్తోనియా)పై, ప్లిస్కోవా 6–4, 6–4తో యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా)పై, మాడిసన్ కీస్ 6–1, 6–3తో 29వ సీడ్ సిబుల్కోవా (స్లొవేకియా)పై గెలిచారు. స్వితోలినా 3–6, 6–1, 0–6తో 19వ సీడ్ సెవస్తోవా (లాత్వియా) చేతిలో ఓటమి పాలైంది. నాదల్ ముందంజ... పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ డెల్‌పొట్రో (అర్జెంటీనా), తొమ్మిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), 11వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), మాజీ రన్నరప్ నిషికోరి (జపాన్) క్వార్టర్ ఫైనల్‌కు చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాదల్ 6–3, 6–3, 6–7 (6/8), 6–4తో బాసిలాష్విలి (జార్జియా)పై, డెల్ పొట్రో 6–4, 6–3, 6–1తో బొర్నా కొరిచ్ (క్రొయేషియా)పై, థీమ్ 7–5, 6–2, 7–6 (7/2)తో ఐదో సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)పై, ఇస్నెర్ 3–6, 6–3, 6–4, 3–6, 6–2తో రావ్‌నిచ్ (కెనడా)పై, నిషికోరి 6–3, 6–2, 7–5తో కోల్‌ష్రైబర్ (జర్మనీ)పై విజయం సాధించారు. పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట 7–6 (8/6), 4–6, 6–3తో జెరెమి చార్డీ–ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
‘ఫ్రెంచ్’ కోటలో కొత్త రాణి
పోయినచోటే వెతుక్కోవాలి. రొమేనియా టెన్నిస్ స్టార్ సిమోనా హలెప్ విషయంలో ఇది నిజమైంది. గత ఏడాది అన్‌సీడెడ్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెంకోతో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ఒక దశలో విజయానికి చేరువై... ఆ తర్వాత తడబడి ఓటమిని మూటగట్టుకున్న ఆమె సంవత్సరం తిరిగేలోపు అదే వేదికపై విజయ గర్జన చేసింది. ఈసారి కూడా ఫైనల్లో హలెప్‌కు ఓటమి తప్పదా అనే పరిస్థితి నుంచి కోలుకొని అద్వితీయ పోరాటంతో విజయం వైపు అడుగు వేయడం విశేషం. పారిస్: ఎర్రమట్టి కోటలో కొత్త రాణి కొలువైంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుసగా మూడో ఏడాది మహిళల సింగిల్స్ విభాగంలో నయా చాంపియన్ అవతరించింది. 2014, 2017లో ఫైనల్‌కు చేరి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్న రొమేనియా స్టార్ సిమోనా హలెప్ ముచ్చటగా మూడో ప్రయత్నంలో విజేతగా నిలిచింది. తన కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ హలెప్ 3–6, 6–4, 6–1తో పదో సీడ్, 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై గెలిచింది. విజేతగా నిలిచిన హలెప్‌కు 22 లక్షల యూరోలు (రూ. 17 కోట్ల 48 లక్షలు), రన్నరప్ స్లోన్ స్టీఫెన్స్కు 11 లక్షల 20 వేల యూరోలు (రూ. 8 కోట్ల 90 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. గత ఏడాది అన్‌సీడెడ్ క్రీడాకారిణి జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా)తో జరిగిన ఫైనల్లో హలెప్ తొలి సెట్‌ను గెలిచి, రెండో సెట్లో 3–0తో ఆధిక్యంలో నిలిచి విజయానికి చేరువైంది. కానీ ఒస్టాపెంకో ధాటికి తడబడి చివరకు ఓటమిపాలైంది. ఈసారి స్లోన్తో జరిగిన తుది పోరులో హలెప్ తొలి సెట్‌ను చేజార్చుకుంది. రెండో సెట్లో 0–2తో వెనుకబడింది. మళ్లీ గత ఏడాది దృశ్యమే పునరావృతమవుతుందా అని సందేహిస్తున్న తరుణంలో హలెప్ నేలకు కొట్టిన రబ్బరు బంతిలా ఎగిసింది. తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. మూడో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, నాలుగో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 2–2తో సమం చేసింది. ఆ తర్వాత ఐదో గేమ్‌లో సర్వీస్ కాపాడుకొని, ఆరో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను మరోసారి బ్రేక్ చేసిన హలెప్ 4–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ ఏడో గేమ్‌లో హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్లోన్, ఎనిమిదో గేమ్‌లో సర్వీస్ కాపాడుకొని స్కోరును 4–4తో సమం చేసింది. కీలకమైన తొమ్మిదో గేమ్‌లో హలెప్ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని, పదో గేమ్‌లో స్లోన్ సర్వీస్‌ను బ్రేక్ చేసి రెండో సెట్‌ను 6–4తో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లో హలెప్ తన విశ్వరూపం ప్రదర్శించింది. రెండుసార్లు స్లోన్ సర్వీస్‌లను బ్రేక్ చేసి, తన సర్వీస్‌లను నిలబెట్టుకొని 6–1తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. విశేషాలు వర్జినియా రుజుసి (1978లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన రెండో రొమేనియా క్రీడాకారిణి హలెప్. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల,జూనియర్ బాలికల సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఎనిమిదో క్రీడాకారిణి హలెప్. 2008 లో హలెప్ జూనియర్ సింగిల్స్ టైటిల్ నెగ్గింది. గత ఏడాది చేసిన పొరపాట్లు ఈసారి పునరావృతం చేయకూడదని అనుకున్నాను. ఈ విజయంతో నా కల నిజమైంది. రెండో సెట్లో 0–2తో వెనుకబడిన దశలో ఒత్తిడికి లోనుకావొద్దని, ఆటను ఆస్వాదించాలని భావించాను. అదే చేసి కోలుకున్నాను. మ్యాచ్ చివరి గేమ్‌లోనైతే నాకు ఊపిరి ఆడనంత పనైంది. – సిమోనా హలెప్ -
యూఎస్ ఓపెన్ టైటిల్ స్టీఫెన్స్దే..
-
యూఎస్ ఓపెన్:స్టీఫెన్స్ వర్సెస్ కీస్
-
కొత్త తారలు వచ్చారు
∙ తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో కీస్, స్టీఫెన్స్ ∙ సెమీస్‌లో ఓడిన వీనస్, వాండవె యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ వచ్చేందుకు రంగం సిద్ధమైంది. సెమీస్‌లో సత్తా చాటిన అన్‌సీడెడ్ స్లోన్ స్టీఫెన్స్, 15వసీడ్ మాడిసన్ కీస్ తొలిసారి గ్రాండ్‌స్లామ్ తుదిపోరుకు అర్హత సాధించారు. అద్భుతమైన పోరాటపటిమతో స్టీఫెన్స్ తొమ్మిదో సీడ్ వీనస్‌ను కంగు తినిపించగా... వాండవెపై కీస్ అలవోక విజయం సాధించింది. 15 ఏళ్ల తర్వాత ఇద్దరు అమెరికన్ల మధ్య టైటిల్ పోరు జరగనుండటం విశేషం. న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికాకు చెందిన మాడిసన్ కీస్, స్లోన్ స్టీఫెన్స్ టైటిల్ పోరుకు అర్హత సంపాదించారు. శుక్రవారం జరిగిన నలుగురు అమెరికన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ మ్యాచ్‌లలో ఏడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, 9వ సీడ్ వీనస్ విలియమ్స్, మరో అమెరికన్ కోకో వాండవె ఓటమి పాలయ్యారు. స్టీఫెన్స్ 6–1, 0–6, 7–5తో వీనస్‌ను కంగుతినిపించగా... కీస్ 6–1, 6–2తో కోకో వాండవెపై అలవోక విజయం సాధించింది. 2002 తర్వాత ఇద్దరు అమెరికా క్రీడాకారిణిల మధ్య టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ తుదిపోరులో సెరెనా విలియమ్స్... తన సోదరి వీనస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. స్టీఫెన్స్‌తో జరిగిన సెమీస్ మ్యాచ్‌లో వీనస్ 3 ఏస్‌లను సంధించి, 6 డబుల్ ఫాల్ట్‌లు చేసింది. అయితే ఏకంగా 51 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. మరోవైపు స్టీఫెన్ 2 ఏస్‌లు సంధించి 17 విన్నర్లు కొట్టింది. 27 అనవసర తప్పిదాలు చేసినా చివరకు టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. స్టీఫెన్స్ పోరాడిందిలా...: వీనస్ విలియమ్స్‌తో జరిగిన సెమీస్‌లో స్లోన్ విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డింది. తొలి గేమ్‌ను గెలుచుకొని శుభారంభం చేసింది. ఇదే జోరులో 24 నిమిషాల్లోనే తొలి సెట్‌ను 6–1తో ముగించింది. అయితే రెండో సెట్లో వీనస్ తన అనుభవాన్నంత రంగరించి ప్రత్యర్థిని మట్టికరిపించింది. గంటకు 100 మైళ్ల వేగంతో దూసుకొచ్చే సర్వ్‌లకు స్టీఫెన్స్ చేతులెత్తేసింది. దీంతో ఒక్కగేమైనా గెలవకుండానే 0–6తో సెట్‌ను చేజార్చుకుంది. 30 నిమిషాల్లో వీనస్ ఈ సెట్ గెలిచింది. ఇక నిర్ణాయక మూడో సెట్లో ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. గంట 13 నిమిషాల పాటు ఈ సెట్ సాగింది. తొలి గేమ్‌లో వీనస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన స్టీఫెన్స్, తర్వాతి గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెట్టుకుంది. దీంతో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం మూడో గేమ్ సర్వీస్‌కు దిగిన వీనస్ అనవసర తప్పిదాలతో పాయింట్లను కోల్పోయింది. అయితే తర్వాత మూడు గేమ్ పాయింట్లను సాధించి తొలిసారిగా పైచేయి సాధించింది వీనస్. ఫోర్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడిన వెటరన్ స్టార్ ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని చాటింది. అనంతరం తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో సెట్లో 3–2తో జోరు పెంచింది. వెంటనే తేరుకున్న 24 ఏళ్ల స్టీఫెన్స్ వరుసగా 6, 7 గేములను గెలుచుకుంది. దీటుగా బదులిచ్చిన వీనస్ 8, 9 గేమ్‌లను కైవసం చేసుకోవడంతో ఆధిక్యం చేతులు మారింది. కానీ తర్వాత వరుసగా మూడు గేముల్లో స్టీఫెన్స్ అద్భుతంగా పోరాడింది. రెండు సార్లు తన సర్వీస్‌ను కాపాడుకున్న ఆమె ఒక బ్రేక్ పాయింట్‌తో విజయాన్ని ఖాయం చేసుకుంది. అలవోకగా ముగించిన కీస్: మరో సెమీఫైనల్లో 15వ సీడ్ మాడిసన్ కీస్ ప్రత్యర్థికేమాత్రం అవకాశమివ్వకుండా ఏస్‌లతో చెలరేగింది. 6–1తో తొలి సెట్‌ను 23 నిమిషాల్లోనే ముగించింది. తర్వాత సెట్లో వాండవె కాస్త పోరాడే ప్రయత్నం చేసినా కీస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. 43 నిమిషాల్లో 6–2తో రెండో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో కీస్ 5 ఏస్‌లను సంధించి, 25 విన్నర్స్ కొట్టింది. ఒకసారి మాత్రమే డబుల్ ఫాల్ట్ చేసింది. మరో వైపు 22 అనవసర తప్పిదాలు చేసిన వాండవె కేవలం తొమ్మిదే విన్నర్స్ కొట్టింది. సానియా కథ ముగిసింది మహిళల డబుల్స్ సెమీఫైనల్లో నాలుగో సీడ్ సానియా మీర్జా–షుయ్ పెంగ్ (చైనా) జోడి 4–6, 4–6తో రెండో సీడ్ మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)– యంగ్ జన్ చాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో పరాజయం చవిచూసింది. -
యూఎస్ ఓపెన్:స్టీఫెన్స్ వర్సెస్ కీస్
న్యూయార్క్:యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ఈసారి ఇద్దరు అమెరికా అమ్మాయిలు స్లోన్ స్టీఫెన్స్ -మాడిన్సన్ కీస్‌లు తుది పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలి సెమీ ఫైనల్లో స్లోన్ స్టీఫెన్స్ 6-1, 0-6, 7-5 తేడాతో అమెరికాకే చెందిన తొమ్మిదో సీడ్ వీనస్ విలియమ్స్ పై విజయం సాధించి ఫైనల్లోకి చేరగా, రెండో సెమీ ఫైనల్లో మాడిన్ సన్ కీస్ 6-1,6-2 తేడాతో తన సహచర క్రీడాకారిణి వాండవేగేపై విజయం సాధించి తుది బెర్తును ఖాయం చేసుకున్నారు. దాంతో స్టీఫెన్-కీస్ ల మధ్య ఆదివారం తుది పోరు జరగనుంది. ఈ ఇద్దరి ముఖాముఖి పోరులో స్టెఫెన్స్ 1-0 ఆధిక్యంలో ఉన్నారు. వీరిద్దరూ ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. కాగా, ఇద్దరు అమెరికా టెన్నిస్ ప్లేయర్స్ యూఎస్ ఓపెన్ ఫైనల్లో తలపడటం దాదాపు 15 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. చివరిసారి 2002లో సెరెనా విలియమ్స్-వీనస్ విలియమ్స్ లు ఫైనల్లో తలపడ్డారు. ఆ పోరులో సెరెనా టైటిల్ ను సొంతం చేసుకున్నారు. -
యూఎస్ ఓపెన్: సెమీస్‌కు సానియా.. వీనస్ ఓటమి
సాక్షి, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్ టోర్నీలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో సంచలనం నెలకొల్పింది. మహిళల డబుల్స్ విభాగంలో తన భాగస్వామి, చైనాకు చెందిన షుయె పెంగ్‌తో కలిసి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. గురువారం రాత్రి జరగిన క్వార్టర్ ఫైనల్లో 7-6(5), 6-4 తేడాతో ఆండ్రియా హ్లావ్కోవా, టిమియా బాబోస్ జోడీపై విజయం సాధించింది. వరుసగా ఐదు యూస్ ఓపెన్లలో సానియా సెమీస్‌కు ప్రవేశించటం ఇది నాలుగోసారి. సెమీస్‌లో వీనస్ అవుట్... ఇక మహిళల సింగిల్స్‌లో మరో పెను సంచలనం చోటు చేసుకుంది. ప్రపంచ టెన్నిస్ మాజీ ఛాంపియన్ వీనస్ విలియమ్స్ టోర్నీ సెమీస్ లో ఓటమి పాలైంది. గురువారం రాత్రి జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో అమెరికాకు చెందిన స్లోనే స్టీఫెన్స్ చేతిలో 6-1, 0-6, 7-5 తేడాతో ఓడింది. 2002 నుంచి ఒక్క గ్రాండ స్లామ్ కూడా గెలుచుకోలేకపోయిన వీనస్ ను స్లోనే కోర్టులో ముప్పుతిప్పలు పెట్టింది. గత 11 నెలలుగా కాలి గాయంతో కోర్టుకు దూరమైన స్లోనే అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో టోర్నీ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక శనివారం ఫైనల్ లో అమెరికాకు చెందిన మాడిసన్ కీస్ తో స్లోనే స్టీఫెన్స్ తలపడనుంది.