ఫెడరర్‌కు ‘వేడి’ దెబ్బ!  | Roger Federer out of US Open | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌కు  ‘వేడి’ దెబ్బ! 

Published Wed, Sep 5 2018 1:16 AM | Last Updated on Wed, Sep 5 2018 5:17 AM

 Roger Federer out of US Open - Sakshi

20 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల విజేత, ఐదుసార్లు యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ రోజర్‌ ఫెడరర్‌కు పెద్ద షాక్‌. ఏనాడూ గ్రాండ్‌స్లామ్‌లో మూడో రౌండ్‌ దాటని అనామకుడి చేతిలో అనూహ్య పరాజయం. ప్రత్యర్థి బలంకంటే 10 డబుల్‌ ఫాల్ట్‌లు, 77 అనవసర తప్పిదాలతో ఫెడెక్స్‌ చేసుకున్న స్వయంకృతం ఇది. తీవ్రమైన వేడికి తట్టుకోలేకపోయానని, ఒక దశలో ఊపిరి కూడా ఆడనట్లుగా అనిపించిందంటూ వ్యాఖ్యానించిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 50కంటే ఎక్కువ ర్యాంక్‌ ఉన్న ఆటగాడి చేతిలో ఓడటం ఇదే తొలిసారి. స్విస్‌ స్టార్‌ను ఓడించి కెరీర్‌లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడు మిల్‌మన్‌ క్వార్టర్‌ ఫైనల్లో మరో స్టార్‌ జొకోవిచ్‌ను సవాల్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు.   

న్యూయార్క్‌: ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో అతి పెద్ద సంచలనం నమోదైంది. ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఓటమి పాలయ్యాడు. మంగళవారం జరిగిన ఈ పోరులో ప్రపంచ 55వ ర్యాంకర్‌ జాన్‌ మిల్‌మన్‌ (ఆస్ట్రేలియా) 3–6, 7–5, 7–6 (9/7), 7–6 (7/3) స్కోరుతో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. 2013 యూఎస్‌ ఓపెన్‌లో రొబ్రెడో చేతిలో ఓటమి తర్వాత ఫెడరర్‌ ఇంత తొందరగా నిష్క్రమించడం ఇదే మొదటిసారి. తొలి సెట్‌ను సునాయాసంగానే నెగ్గిన ఫెడరర్‌... ఆ తర్వాత అన్‌సీడెడ్‌ ప్రత్యర్థి ముందు తేలిపోయాడు.  తీవ్రమైన వేడి, ఉక్కపోత మధ్య ప్రతీ పాయింట్‌ కోసం శ్రమించిన 37 ఏళ్ల ఈ స్విస్‌ లెజెండ్‌ ఇక ఆడటం తన వల్ల కాదంటూ ప్రత్యర్థికి తలవంచాడు. మరో పాయింట్‌ గెలిస్తే రెండో సెట్‌ కూడా సొంతమయ్యే స్థితి నుంచి ఓటమి బాట పట్టాడు. రెండో సెట్‌లో 5–4తో ఆధిక్యంలో ఉండి 40–15 వద్ద ఫెడరర్‌ సర్వీస్‌ గతి తప్పింది. ఆ అవకాశాన్ని అంది పుచ్చుకున్న మిల్‌మన్‌ ఇక వెనుదిరిగి చూడలేదు.  

3 గంటల 34 నిమిషాల్లో... 
గతంలో మిల్‌మన్‌తో తలపడిన ఒకే ఒక మ్యాచ్‌లో సునాయాస విజయం సాధించిన ఫెడరర్‌ ఈ సారి కూడా శుభారంభం చేశాడు. రెండు సార్లు ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన అతను 6–3తో తొలి సెట్‌ను గెలుచుకున్నాడు. అయితే రెండో సెట్‌ నుంచి అతని పతనం మొదలైంది. పదో గేమ్‌లో సులువైన వ్యాలీని రిటర్న్‌ చేయలేక, ఆ తర్వాత డబుల్‌ ఫాల్ట్‌తో రెండు సార్లు సెట్‌ పాయింట్లు పోగొట్టుకొని మిల్‌మన్‌కు కోలుకునే అవకాశం ఇచ్చాడు. మూడో సెట్‌లో కూడా 6–5తో ఆధిక్యంలో ఉండి సర్వీస్‌ పొరపాట్లకు ఫలితం అనుభవించాడు. వరుసగా రెండు సెట్‌లు నెగ్గడంతో ఆధిపత్యం మిల్‌మన్‌ వైపు మళ్లింది. అయితే ఫెడరర్‌ మళ్లీ తన స్థాయి ఆటను ప్రదర్శిస్తూ 4–2తో దూసుకుపోయాడు. కానీ ఆస్ట్రేలియన్‌ పట్టు వదల్లేదు. ఫెడెక్స్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో ఈ సెట్‌ కూడా టైబ్రేక్‌ వైపు మళ్లింది. ఈ కీలక దశలో రెండు డబుల్‌ ఫాల్ట్‌లు, నెట్‌పైకి బ్యాక్‌హ్యాండ్‌ షాట్, కోర్టుకు దూరంగా ఫోర్‌ హ్యాండ్‌ షాట్‌ కొట్టిన ఫెడెక్స్‌కు ఓటమి తప్పలేదు.  

జొకోవిచ్‌ ముందంజ... 
మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సెర్బియా స్టార్, ఆరో సీడ్‌ జొకోవిచ్‌ 6–3, 6–4, 6–4తో జొవా సుసా (పోర్చుగల్‌)ను చిత్తు చేశాడు. వేడికి మళ్లీ ఇబ్బంది పడిన జొకోవిచ్‌ ఈ మ్యాచ్‌లో కూడా విరామం తీసుకొని వైద్య చికిత్స పొందాడు. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) 7–6 (8/6), 6–2, 6–4తో పదో సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం)ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు.  
పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రోహన్‌ బోపన్న (భారత్‌)–వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జంట 3–6, 4–6తో కబాల్‌–రాబర్ట్‌ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో ఓడిపోయింది.

స్లోన్‌ స్టీఫెన్స్‌ ఔట్‌... 
మహిళల సింగిల్స్‌లోనూ సంచలన ఫలితం నమోదైంది. క్వార్టర్‌ ఫైనల్లో మూడో సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) ఇంటిదారి పట్టింది. 19వ సీడ్‌ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) 6–2, 6–3తో స్లోన్‌ స్టీఫెన్స్‌పై గెలిచి తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. మరోవైపు మాజీ చాంపియన్‌ మరియా షరపోవా (రష్యా) ఆట ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. స్పెయిన్‌ క్రీడాకారిణి కార్లా స్వారెజ్‌ నవారో 6–4, 6–3తో షరపోవాను చిత్తు చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement