న్యూయార్క్: పిన్న వయసులోనే యూఎస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మెయిన్ డ్రాకు అర్హత సాధించి కొత్త చరిత్ర లిఖించిన భారత యువ సంచలనం సుమీత్ నాగల్.. ప్రపంచ మూడో ర్యాంకర్, స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కే చెమటలు పట్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ పోరులో నాగల్ పోరాడి ఓడాడు. ఇరువురి మధ్య రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో నాగల్ తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలోనే తొలి సెట్‌ను 6-4తో గెలిచి మంచి జోష్‌లో కనిపించాడు. అయితే టెన్నిస్ ప్రపంచంలో అసాధారణ ఆటగాడిగా పేరున్న ఫెడరర్ అనుభవం ముందు నాగల్ చివరకు తలవంచక తప్పలేదు.
రెండో సెట్‌లో నాగల్ 1-6 తేడాతో కోల్పోగా, మూడో సెట్‌లో 2-6తో వెనుకంజ వేశాడు. కాగా, నాల్గో సెట్‌లో తిరిగి పుంజుకున్న నాగల్.. ఫెడరర్‌కు అంత తేలిగ్గా లొంగలేదు. ఇరువురి మధ్య హోరాహోరీగా సాగిన నాల్గో సెట్‌లో నాగల్ 4-6 తేడాతో పోరాడి పరాజయం చవిచూశాడు. దాంతో యూఎస్ ఓపెన్ తొలి రౌండ్ నుంచే నాగల్ నిష్క్రమించాడు. కాగా, గత రెండు దశాబ్దాల కాలంలో ఒక గ్రాండ్ స్లామ్ మెయిన్ డ్రాలో కనీసం ఒక్క సెట్ గెలిచిన నాల్గో భారత ఆటగాడిగా నాగల్ గుర్తింపు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment